హరప్పాలో ఆర్యుల విజయం
ఒక సాంస్కృతిక మహా సంగ్రామం. హరప్పనుల గాథ. అధ్యాయం 16. మూలం: The Greatest Battle of Culture (The Story of Harappans) by Bethi Panigrahi. తెలుగు: ఆడెపు లక్ష్మీపతి
కొత్తగా సువ్యవస్థాపితమైన సమైక్యత, సాంస్కృతిక వినిమయం అట్లాగే కొనసాగి హరప్పన్-ఆర్యుల ఐక్యకూటమి ఒక దుర్భేద్య మైన శక్తిగా అవతరించింది. సరిహద్దులను విస్తరించుకుంటూ తమ ఆధిక్యతని చాటుకునే లక్ష్యంతో వారు పొరుగు రాజ్యాలపై కన్నేశారు.
“ మహారుద్ర మహారాజా, ముందుకు పోవడానికి మన సైన్యాలు సిద్ధంగా వున్నాయి,” అన్నాడు ఇంద్రసేనుడు, అతని మాటల్లో కృత నిశ్చయం వ్యక్తమైంది. “మనం ఐక్యంగా ముందుకు సాగి పొరుగు రాజ్యాలను జయించి మన ఏలుబడి లోకి తెచ్చుకుందాము.”
“ సరే ఇంద్రసేనా..” అన్నాడు మహారుద్ర మహారాజు. వ్యూహాత్మక ఆలోచనలతో అతని కళ్ళు మెరిశాయి.
“ కానీ మనం ఆ పని వివేకంతో, న్యాయ బద్ధతతో చేయాలి. మన పరిపాలన న్యాయ సమ్మతంగా, సంక్షేమకరంగా వుంటుంది అని ఆ రాజ్యాల ప్రజలకు తెలియజేయాలి”’
అలా వారు పొరుగు రాజ్యాలపై దాడులు చేసే క్రమంలో కొద్దో గొప్పో స్థాయుల్లో ప్రతిఘటన ఎదుర్కొన్నారు. కొన్ని రాజ్యాలు సునాయాసంగా దాసోహమన్నాయి, మరి కొన్ని భీకరంగా యుద్ధం చేశాయి.
“ మేము ఓటమిని అంగీకరించం..” అన్నాడు ధిక్కార స్వరంతో పొరుగు దేశాధిపతి కళింగరాజు.” చివరి సైనికుడు నేలకొరిగే దాకా మేము పోరాడతాం..!”
“ నువ్వు ధైర్యశాలివి కళింగరాజా..” అన్నాడు ఇంద్రసేనుడు. అతని స్వరంలో గౌరవ భావం ధ్వనించింది. “కానీ ధైర్యం, తెగువ ఉంటేనే సరిపోదు, కొంచెం వివేకం ప్రదర్శించు. వెంటనే లొంగిపో. నీ ప్రజల్ని రక్తపాతం నుంచి కాపాడుకో.”
హరప్పాన్ –ఆర్యుల ఐక్య సేనలు ముందుకు చొచ్చుకు పోయినై, వాళ్ళ జెండాలు గాలిలో రెపరెపలాడాయి. యుద్ధభేరీల మోత, ఇత్తడి బాకాల ధ్వనులు గాలి అంతటా నిండాయి. పరుగెత్తే గుర్రాల డెక్కలు, ఏనుగుల పద ఘట్టనల కింద నేల కంపించింది.
అలా వాళ్ళు కళింగరాజ్యాన్ని సమీపించగానే ప్రతిఘటన తీవ్రత పెరిగింది. తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు కృత నిశ్చయుడై వున్న కళింగరాజు తన సేనల్ని రణస్థలిలోకి ఉరికించాడు.
కత్తుల, ఈటెల తాకిడి శబ్దాలతో, కంచు ఆయుధాల ఘర్షణ చప్పుళ్ళతో, క్షతగాత్రుల ఆర్తనాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి. మెరుపు వేగంతో కదిలే ఇంద్రసేనుడి ఖడ్గం సూర్యకాంతిలో తళతళలాడుతూ కళింగరాజ్యంలోకి దూసుకు పోయేలా సేనకు ప్రేరణ నందించింది.
భీషణంగా ఘీంకరిస్తోన్న ఏనుగును అధిరోహించిన రాజు మహారుద్రుడు శత్రుసేనపై దృష్టి నిలిపి ముందుకు కదిలాడు. ఇంద్రసేనుడు యుద్ధరంగాన్ని వ్యూహాత్మకదృష్టితో నిశితంగా పరిశీలిస్తూ తన సేనకి తగిన ఆదేశాలిచ్చాడు.
భీకర యుద్ధం కొనసాగింది, రాజు మహారుద్రుడు కృత నిశ్చయంతో పోరాడి శత్రు సైనికులను చీల్చి చెండాడాడు. కానీ విధి వక్రించింది. ఒక కళింగ విలుకాడు వదిలిన బాణం సూటిగా వచ్చి మహారుద్రుని కవచాన్ని చీల్చి గుండెలో దిగబడింది. విపత్తు పసిగట్టిన ఏనుగు నెమ్మదిగా పక్కకు వాలి మహారాజును నేల దింపింది. సైనికులు తక్షణమే రాజును రాజప్రాసాదానికి తీసుకు వెళ్ళారు. రాజ వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు.
ఇంద్రసేనుడు, నాగశౌర్య్డ చాలా కలత చెందారు, కానీ వెంటనే తేరుకుని కర్తవ్యోన్ముఖులై సేనల్ని ముందు కురికించారు. మహారాజుని గాయపరచిన శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవాలనీ, విజయం సాధించాలనీ ప్రతిన పూనారు.
నాగశౌర్య మార్గ దర్శకత్వంలో ఇంద్రసేనుడు సేనకు నేతృత్వం వహించి కళింగులపై దాడి తీవ్రతరం చేశాడు. భీకర యుద్ధం దీర్ఘకాలం కొనసాగింది. ఇంద్రసేనుడి సాహసోపేత నిర్ణయాలతో, అనుభవపూర్వక వ్యూహంతో ఎట్టకేలకు వారిని విజయలక్ష్మి వరించింది.
రోజులు గడిచాయి, మహారుద్రుని గాయం విషమ స్థితికి చేరుకుంది. ఆరోగ్యం క్షీణించి అతని దృష్టి మసకబారింది. తీవ్ర విచారగ్రస్తుడై అతడు ఇంద్రసేనుడు, నాగషౌర్యల వేపు చూశాడు.
“ మిత్రులారా..మన ప్రజలను కాపాడండి. మన ఐక్యకూటమి విచ్చిన్నం కానీయవద్దు...” అంటూ సన్నగా గొణిగాడు. అవే అతని చివరి మాటలు, హరప్పా భవిష్యత్తుని ఇంద్రసేనుడు, నాగశౌర్య ల చేతుల్లో పెట్టి అంతిమశ్వాస వదిలాడు.
తమ ప్రియమైన మహారాజు మరణం పట్ల హరప్పా ప్రజలు చాలా దు:ఖించారు. సంతాపంతో వారి గొంతులు మూగవోయినై.
“ ఆయన ధర్మంగా, న్యాయబద్ధంగా పాలించిన రాజు..” అన్నాడొక హరప్పన్ కన్నీళ్లు ఆపుకుంటూ. “ఆయన మన నగరానికి శాంతి సౌభాగ్యాలను తీసుకొచ్చాడు.”
“ఆయన వ్యవహారజ్ఞాన సంపదని, మార్గదర్శకత్వాన్ని నేనెప్పుడూ మర్చి పోలేను..” అన్నాడు మరొకాయన బావురుమంటూ. “ఆయన నిజమైన నాయకుడు, అందరికీ మంచి స్నేహితుడు.”
మహారుద్ర మరణ వార్త తెలియగానే ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చి దివంగత నేతకి నివాళులు అర్పించారు.
“ మహారుద్ర మహారాజు వారసత్వాన్ని ఇంద్రసేనుడు కొనసాగించాలి, దాన్ని ఉన్నతశిఖరాలకు చేర్చాలి..” అన్నాడు నాగశౌర్య. “ రాజు మహారుద్ర జ్ఞాపకాలు మనకు ఆశీస్సులుగా ఉండుగాక..”
హరప్పా వాసులు కొన్ని రోజుల సంతాపం పాటించి, భవిష్యత్తు వేపు దృష్టి సారించారు. మున్ముందు ఎలాంటి సవాళ్లు ఎదురైనా సరే, ఇంద్రసేనుడి నేతృత్వంలో వాటిని ఎదుర్కోవాలని నిశ్చయించుకున్నారు.
బరువైన హృదయంతో ఇంద్రసేనుడు రాజమకుటం ధరించాడు. రాజు ఆయె యోగం అతనికి రాసి పెట్టి వుందని అతని తలిదండ్రులు భావించారు. ఇంద్రసేనుడి పట్టాభిషేకాన్ని హరప్పా ప్రజలు మిశ్రమ స్పందనలతో స్వాగతించారు. వీధులన్నీవివిధరంగుల కళాకృతులతో అందంగా అలంకరించారు. వీనుల విందైన సంగీతం, వాయిద్యాల మోత గాలిలో తేలియాడింది. పతాకాలు చేత బూని, కొత్త మహారాజుని కీర్తిస్తూ పాటలు పాడిన వీరులు నగర వీధుల్లో ఏనుగులు, గుర్రాలు, రథాల మీద తిరిగారు.
పవిత్ర తైలాలతో ఇంద్రసేనుడికి అభ్యంగన స్నానం చేయించి బంగారు కిరీటం ధరింప జేశారు. బంగారు జరీ అంచు దుస్తుల ప్రధాన పూజారి శాస్త్రోక్తంగా తంతు నిర్వహించాడు. ఇంద్రసేనుడు నూతన మహారాజు అని ప్రకటించగానే హరప్పా ప్రజలు ఆనందంగా చప్పట్లు కొడుతూ అనుకూల నినాదాలు చేశారు.
పట్టాభిషేక వేడుక జరుగుతుండగానే, ఒకప్పుడు ప్రసన్నంగా చిరునవ్వు చిందించిన ఇంద్రసేనుడి మోము ముడుచుకుంది, ఏవో ఆలోచనలతో అతడు దవడలు బిగించాడు. ఒకప్పుడు మిలమిలా మెరిసిన అతని కళ్ళలో నిగూఢభావాలు ప్రస్ఫుటమైనాయి. క్రమంగా అతని చుట్టూ భజనరాయుళ్ళు చేరారు; అతని ప్రతి పనినీ వాళ్ళు ప్రశంసించారు, అతని నిర్ణయాలకు కాదు కూడదు అని ఎవరూ ఎదురు చెప్పలేదు.
ఇంద్రసేనుడు అధికార పదవుల్లోకి ఎక్కువగా ఆర్యులను నియమించనారంభించాడు. క్రమంగా హరప్పనులు నాయకత్వ స్థానాల నుంచి పక్కకు త్రోసి వేయబడ్డారు. ఇంద్రసేనుడు హరప్పన్ సాంప్రదాయాలను సున్నితంగా తిరస్కరిస్తూ ఆర్యుల ఆచారాలకు, సంప్రదాయాలకు పెద్ద పీట వేయ నారంభించాడు.
అధికార లాలస, కీర్తి కండూతి ఇంద్రసేనుడిని పూర్తిగా లోబర్చుకున్నాయి. అందరి కన్నా గొప్ప రాజుగా గుర్తించబడాలన్నతృష్ణ అధికమై అతని పరిపాలన నియంతృత్వ పోకడలు పోయింది. ప్రజలపై అధిక పన్నులు విధించి, ఆ ధనాన్ని సైనిక పోషణకు, దండయాత్రలకు, అర్థం లేని పథకాలకు వెచ్చించాడు. ప్రతిపక్షం నోరు నొక్కాడు. రాజు ఎప్పుడు, ఎవరిపై కన్నెర్ర చేస్తాడోనన్న భయంతో ప్రజలు బతికారు.
తన మిత్రుడు అధికార మదంతో దిగజారి పోతూవుండటం గమనించి బుద్ధి కుశలుడూ, చక్కని వ్యూహకర్తా ఐన నాగశౌర్య చాలా కలవరపడ్డాడు.
“ ఒకప్పుడు నేనెరిగిన ఇంద్రసేనుడు యితడు కాదు.” మనసులో అనుకున్నాడు నాగశౌర్య. “ఒకప్పుడు అతడు ధైర్యశాలి, అందరినీ కలుపుకు పోయేవాడు, కానీ ఇప్పడు అధికార మదం, కీర్తి కండూతి అతని తలకెక్కింది. నా భయమల్లా మా ఐక్యసంఘటన ఏమవుతుంది, హరప్పా ప్రజల భవిష్యత్తు ఏమిటి అని.”
నాగశౌర్య నిస్సహాయుడైనాడు. సొంత ప్రయోజనాల కన్నా ప్రజల మేలే ముఖ్యమని తలచిన, పాలనా దక్షుడైన మహారుద్ర రాజు నాయకత్వం ఇప్పుడు లేదు. ఆ రాజు దయాగుణం, ధర్మబద్ధమైన పరిపాలన, ప్రజలందరినీ ఒక్క తాటిపైకి తేగలిగిన అతని సామర్థ్యం నాగశౌర్య జ్ఞాపకం చేసుకున్నాడు.
ఆ రోజులు గతించాయి, మహారుద్ర పాలనకు, ఇంద్రసేనుడి పాలనకు హస్తిమశాకాంతరం వుంది..నిరాశగా నిట్టూర్చాడు నాగశౌర్య. పతనం అంచు నుంచి బయట పడేయాలని ఇంద్రసేనుడికి హితబోధ చేసే ప్రయత్నం చేశాడు, కానీ అతడు వినలేదు.
“ మిత్రుడా ఇంద్రసేనా, నీవు ఏమి చేస్తున్నావో ఒకసారి పునరాలోచించు,” అన్నాడు నాగశౌర్య, వ్యాకులపాటు ధ్వనించే స్వరంతో. “నీ ప్రజలు అనేక బాధలు పడుతున్నారు, ఈ నేల మండుతున్నది. ఇలాంటి వారసత్వాన్నే నిజంగా నువ్వు తర్వాతి తరానికి ఇవ్వాలనుకుంటూన్నావా?”
“ ఇక చాలు, ఆపు..” అని నాగశౌర్య మాటల్ని మధ్యలోనే తుంచి వేశాడు ఇంద్రసేనుడు. అతని ముఖం కోపంతో ఎర్రబడింది. “నువ్వు దుర్బలుడివి. ఎప్పుడూ నన్ను వెనక్కి లాగుతావు. కానీ నేను వెనుకడుగు వేయను. ఇప్పటి వరకు ఈ దేశప్రజలకు తెలిసిన అతిగొప్ప రాజును నేనే. నా అదికారం నిలబెట్టుకునేందుకు నేనేమైనా చేస్తాను.”
నాగాశౌర్య నిట్టూర్చాడు, అతని ముఖంలో తీవ్రవిచారం కమ్ముకున్నది.”మన ఐక్య కూటమి గురించే నేను భయపడుతున్నాను. మనం ప్రజల పాలిట ఒక ఆశాజ్యోతిగా, సహకారయుత సహజీవనానికి గొప్ప ఉదాహరణగా ఇప్పటి వరకు వెలుగొందాము. కానీ ఇప్పుడు గత వైభవానికి ఉట్టి నీడ గా మిగిలిపోయాం. నువ్వు నిజంగా కోరుకుంటున్నది ఈ పరిష్టితినా ?”
ఇక మాటలేవీ వినదల్చుకోలేక ఇంద్రసేనుడు ముఖం తిప్పుకున్నాడు. “ఇక నీ అవసరం నాకు ఎంత మాత్రం లేదు నాగశౌర్యా, నీ సలహా నాకక్కరలేదు. ఇక ఇక్కన్నుంచి వెళ్ళిపో. నేను పిలిచేదాకా మళ్ళా రాకు.”
నాగశౌర్య పదవీ చ్యుతుడైనాడు. ఇంద్రసేనుడి దురాశ బరువు కింద ప్రజలు నలిగిపోతూ మొత్తం సామ్రాజ్యం ముక్కలవుతుండగా దూరం నుంచి నిస్సహాయుడిగా చూశాడు.
సామ్రాజ్యం విస్తరిస్తూపోయింది, కానీ ప్రజల్లో అసహనం, అభాద్రతాభావన పెరిగిపోసాగాయి. ఒకప్పుడు ఐక్యతకు, సహకారానికి సంకేతంగా రాణించిన హరప్పన్ –ఆర్య ఐక్య కూటమి బీటలు వారనారంభించింది. తమ సైనిక ఆధిక్యత ఆసరాతో ఆర్యులు హరప్పనులపై ఆధిపత్యం చెలాయించడం మొదలెట్టారు ; ఒకప్పటి సమాన భాగస్వామ్యం కుంచించుకు పోనారంభించింది.
ఆర్యులు వర్ణవ్యవస్థను అమలు చేయడం మొదలెట్టారు. ప్రజలను బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు వర్ణాలుగాలేదా కులాలుగా విభజించిన నిచ్చెన మెట్ల సామాజిక వ్యవస్థే వర్ణవ్యవస్థ. గతంలో ఎన్నడూ ఎరగని కులవ్యవస్థని తమ మీద రుద్దడాన్ని హరప్పావాసులు వ్యతిరేకించనారంభించారు.
“ ఈ కృత్రిమ విభజన కి మేమెందుకు కట్టుబడి వుండాలి ?” అని ప్రశ్నించాడొక యువ హరప్పన్. “ మనం ఒకప్పుడు అందరమూ సమానమే, ఇప్పుడేమో మనల్ని తక్కువ చేసి చూస్తున్నారు.”
“ వర్ణవ్యవస్థ ప్రకృతి సహజమైన సామాజిక విభజన..,” బదులిచ్చాడు ఒక ఆర్యపూజారి. “అది దేవతల శాసనం.”
అలా, ఒకప్పుడు హరప్పన్- ఆర్యుల ఐక్యత కోసం పోరాడిన రాజు ఇంద్రసేనుడు, సంయుక్త సైనిక దళాల నుంచి హరప్పనులను తొలగించడం మొదలెట్టాడు. ఆర్య క్షత్రియులతో హరప్పనులు సమానులు కారు కాబట్టి వారిలో యుద్ధవిద్యా కౌశలం తగినంతగా లేదు అని అతడు ప్రకటించాడు.
అయితే కొందరు హరప్పనులు దీనితో సమాదానపడలేదు. వర్ణవ్యవస్థ అణచివేతకు ఒక ఆయుధమనీ, తమ అధికారం, రాజ్యం మీద నియంత్రణ నిలుపుకునేందుకు ఆర్యులు ఎంచుకున్న మార్గం అనీ వారు భావించడం మొదలెట్టారు.
హరప్పనులు మెల్లగా గొంతు విప్పి ఇంద్రసేనుడి గురించి వ్యాఖ్యానించడం ప్రారంభించారు. “అతడొక నియంత ; నిలువెల్లా దురాశ, స్వార్థం నిండిన వ్యక్తి.”
“ మన ప్రజల బాగోగుల గురించి పట్టించుకోడు, తన అధికారం, కీర్తి పైనే అతని ధ్యాసంతా..”
“మునుపటి ఇంద్రసేనుడికి ఇతడొక నీడ మాత్రమె..” అని మరికొందరన్నారు.”ఒకప్పుడు అతడు ధైర్యవంతుడూ, అందరినీ కలుపుకు పోయే నాయకుడూనూ. కానీ ఇప్పుడు ఇతడు పాలక వర్గాల చేతుల్లో కేవలం పనిముట్టు.”
హరప్పా ప్రజల ఆశలు నీరు గారి పోసాగినై. వారి ధైర్య స్తైర్యాలు ఇంద్రసేనుడి నిరంకుశ పాలన కింద ఆవిరై పోయినై. రాజు మహారుద్రుని తరహా న్యాయబద్ధ పాలనకై తహతహ లాడారు, కానీ ఆయన పోయారు, ఇంద్రసేనుడి అన్యాయ, అక్రమ పాలనకి అంతం లేనట్టు కనపడింది.
హరప్పనుల గతి అనిశ్చితిలో, వారి భవిష్యత్తు అంధకారం లో పడింది. హరప్పనులు ఒకప్పుడు గర్వంగా, చలాకీగా తలెత్తుకు తిరిగారు, కానీ ఇప్పుడు నిరంకుశ పాలన కింద బతుకు లీడ్వడానికి తీవ్రంగా పెనుగులాడారు. (సశేషం)