హరప్పా వీధుల్లో వలపు పరిమళం...
x

హరప్పా వీధుల్లో వలపు పరిమళం...

సాంస్కృతిక మహా సంగ్రామం. హరప్పనుల గాథ. అధ్యాయం -4 (ఆర్యుల ఆకర్షణ) ఆంగ్లమూలం-The Greatest Battle of Culture (The Story of Harappans) by Bethi Panigrahi

హరప్పనులతో కలిసిపోవాలన్న తమ ప్రయత్నాన్ని ఆర్యులు కొనసాగిస్తుండగా ఒక అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. ముదురురంగు చర్మ సౌందర్యానికి, అందమైన రూపానికి పెట్టింది పేరైన ఎగువతరగతి హరప్పన్ స్త్రీ లు ఆర్యజాతి పురుషులను ఆసక్తిగా గమనించడం మొదలెట్టారు. ఆర్యుల మొరటైన మనోహర రూపం, వారి ఠీవి ఐన నడక, చురుకుగా చూసే నీలి కళ్ళు..స్త్రీలను ఆకర్షించాయి.

బాగుహర కూతురైన రాకుమారి ఆర్మిత తాను పునీతుడి స్ఫురద్రూపం, అతని భాషా చాతుర్యం పట్ల ఆకర్షితురాలైనట్టు గ్రహించింది. దంతపు బొమ్మ వంటి మృదువైన చర్మం, నల్లని ఆకాశం వంటి కురులు, చీకటి ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రాల వంటి కళ్ళు... చూపరులను కళ్ళు తిప్పుకోనీయలేని సౌందర్యం ఆమెది.

అయితే ఇతరులని ఆకర్షించేది ఆమె శారీరక సౌందర్యమే కాదు –ఆమె కరుణార్ద్ర హృదయం, దయాగుణం, సకల ప్రాణుల పట్ల ప్రేమ..-ఈ సద్గుణాలన్నింటికీ ఆమె చెరగని చిరునామా కూడా. రోజూ వాహ్యాళికి బయటికి వెళ్ళినప్పుడల్లా ఆమె పునీతుడి వేపు వాలు చూపులు విసురుతుంది, ఆ క్షణాల్లో ఆమె గుండె ఉద్వేగంతో వేగంగా కొట్టుకుంటుంది. మాతృ భాషలో మాత్రమే కాక అనేక భాషల్లో సంభాషించగలిగే అతని నేర్పు ఆమెని ప్రత్యేకించి ఆకట్టుకుంది.

ఒక దినం నగరం మధ్యనున్న కాలువ ఒడ్డున నడుస్తూన్న ఆర్మిత ఎదురుగా వస్తున్న పునీతుడిని చూసి అతనితో మాట్లాడేందుకు ధైర్యం కూడదీసుకుంది.

‘‘పునీతా మీ కథలు, గీతాలు నన్ను మంత్ర ముగ్దురాల్ని చేశాయంటే నమ్ము.. ’’ అంది మృదువైన స్వరంతో. రాకుమారి ఎంతో చొరవగా అలా మాట్లాడే సరికి పునీతుడు సమాధానమిచ్చేందుకు తడబడ్డాడు. ‘‘ కృతజ్ఞుడిని, రాకుమారీ. మీరు వాటిని నచ్చి ఆస్వాదించినందుకు చాలా సంతోషం. ’’

ఆర్మిత కళ్ళు అతని వేపు కొంటెగా చూస్తూ మెరిశాయి. ‘‘మీ కథల కన్నాఇంకా బాగా నచ్చినవి..నువ్వు మాట్లాడే తీరు, నీ కదిలే విధానం, నన్ను ఉల్లాసపరిచే నువ్వు..’’

పునీతుడి ముఖంలో ఆశ్చర్యం తాండవించింది. కానీ ఆర్మిత అంటే తనకూ ఆకర్షణ ఏర్పడిందన్న సంగతి కాదనలేక పోయాడు. ‘‘అర్మితా..ఏమి మాట్లాడాలో నాకు తోచడం లేదు. నువ్వొక రాకుమారివి, నేనేమో మీ నగరానికి ఒక అతిథిని మాత్రమె.. ’’

ఆర్మిత ముఖంలో చిరునవ్వు క్షణకాలం మాయమైంది. వెంటనే ప్రశాంత స్వరంతో అంది. ‘‘నువ్వనేది నిజమే కావొచ్చు. కానీ నేను కూడా ఒక స్త్రీనే. నాకేమి కావాలో నాకు తెలుసు. నీ గురించి మరింత తెలుకోవాలని, నిన్ను ఇంకా అర్థం చేసుకోవాలని వుంది పునీతా.. ’’

వాళ్ళు అలా జనసందోహం తో నిండిన హరప్పా వీధుల గుండా నడుస్తూంటే ఆర్మిత చప్పున పునీతుడి వేపు ముఖం తిప్పి కుతూహలంగా చూస్తూ, ‘‘పునీతా..ఇది చెప్పు..మీరు మా నగరం లోకి ప్రవేశించిన మొదట్లో మా సంస్కృతి గురించీ, మా ప్రజల గురించీ ఏమనుకున్నారు..? ’’ అని అడిగింది.

పునీతుడి కళ్ళల్లో ఉత్సాహం, ఉల్లాసం నిండాయి. ‘‘అర్మితా, హరప్పా నగర సౌందర్యం, అధునాతన హంగులు నన్ను కట్టిపడేశాయి. కళా ఖండాలనదగ్గ మృణ్మయ పాత్రలు, ఎప్పుడూ కడు సందడిగా వుండే విపణివీధులు, మనోహరమైన వాస్తుకళ..ఇక్కడి ప్రతీదీ నన్ను మైమరిపించాయి. ఇక మీ ప్రజలు..నన్ను హృదయపూర్వకంగా స్వాగతించారు. మీ హరప్పనుల దయార్ద్రగుణం, ఆతిథ్యం, సౌజన్యం నన్ను విస్మయుడిని చేసినై.. ’’

ఆర్మిత ముఖం గర్వంతో వెలిగిపోయింది. ‘‘అవి నాకు అత్యంత ప్రియ పాత్రమైనవి. మా నగరం, మా సంస్కృతి మాకు గర్వకారణం. కానీ మీ దృష్టి ని ఆకర్షించింది అంతకు మించినది మరేదో అని నేను పసిగట్టాను. అదే బహుశ మిమ్మల్ని బాగా ఆశ్చర్యపరిచి వుంటుంది .’’

పునీతుడు ఆలోచనల్లో పడ్డాడు. ‘‘నేనో విషయం ఒప్పుకుని తీరాలి. సువిశాల స్నానవాటిక శోభ నన్ను చకితుడిని చేసింది. దాని విస్తృతి. వైభవం చూస్తూ నేను ఊపిరి తీయడం మర్చిపోయాను. నైపుణ్యం తో కూడిన ఇటుక కట్టడాలు, ఎత్తైన, అందమైన ప్రవేశద్వారాలు, ఆకాశాన్నంటే కుడ్యాలు..ఈ నగర వాస్తుకళ యావత్తు నిజంగా నిర్మాణ పరమైన, రూపపరమైన మహాద్భుతం.’’

ఆర్మిత గలగలా నవ్వింది, అది సంగీతంలా వుంది. ‘‘ఆహ్.! మా హరప్పనులం నైపుణ్యానికి, చక్కని పనితనానికి ప్రసిద్ధి గాంచాం. నువ్వది గ్రహించినందుకు నాకు సంతోషంగా వుంది. మేము సొంతంగా ఆలోచించి మా విలక్షణ పద్ధతులలో మా సమాజానికి సేవలందిస్తాము.’’

కళ్ళల్లో ఆరాధనా భావం తొణికిసలాడగా పునీతుడు మందహాసం చేశాడు. ‘‘నా కళ్ళతో నేను అంతా స్వయంగా చూసినందుకు చాలా ఆనందంగా వుంది ఆర్మితా. మీ నగరం, మీ ప్రజలు నిజంగా నన్ను ఆకట్టుకున్నారు. ఇక మీ మహిళల విషయం..వాళ్ళ స్వేచ్చ, స్థైర్యం నన్ను అమితాశ్చర్యానికి గురి చేశాయి. మా సొంత సంస్కృతిలో స్త్రీల పాత్ర పరిమితమైనది..కానీ ఇక్కడ స్త్రీలు వ్యాపారులుగా, కళాకారులుగా, యోధులుగా సైతం రాణిస్తుండటం చూస్తున్నాను! చూడ్డానికి ఇదెంతో ఉల్లసకరంగానూ, స్ఫూర్తి దాయకంగానూ వుంది..’’

ఆర్మిత మనోహరంగా చిరునవ్వు చిందించింది. ‘‘మా హరప్పన్ స్త్రీలు సామర్థ్యానికి, స్థిర నిర్ణయానికి పెట్టింది పేరు. ఇది నువ్వు గమనించావు, నాకు సంతోషంగా వుంది. ’’

వాళ్ళు ముందుకు నడుస్తూ అందమైన మృణ్మయ పాత్రలు తయారు చేస్తోన్న ఒక వృత్తిపని బృందాన్ని సమీపించారు. పునీతుడి కళ్ళు విస్మయంతో విప్పారినాయి. ‘‘ఆర్మితా, ఈ మృణ్మయ పాత్రలు అద్భుతంగా వున్నాయి ! ఇలాంటి ఆకృతులు, రంగులు ఇంతకు మునుపెన్నడూ నేను చూడలేదు. ’’

ఆర్మిత సాలోచనగా తలవూపింది. ‘‘మా వృత్తిపని వారు నిజానికి ఎంతో నైపుణ్య వంతులు. తమ పనిలో పరిణతి సాధించేందుకు ఏళ్ళు తర్ఫీదు పొందుతారు.. వారి కఠిన శ్రమ వారు రూపొందించే ప్రతి వస్తువులో ప్రతిబింబిస్తుంది.’’

పునీతుడు తల పక్కకు తిప్పి ఆలోచనల్లో పడ్డాడు. ‘‘ఔను సుమా. ఈ ప్రదేశం శక్తి సామర్థ్యాలు, సామూహిక భావన, సమిష్టి ప్రయోజన స్పృహ నాకు పూర్తిగా అర్థమయినాయి.ఇది నిజంగా ప్రశంసనీయం. ఆర్యులమైన మేము పరస్పర సహకారం, సాంస్కృతిక వినిమయం ద్వారా ఇక్కడి గొప్ప వారసత్వంలో భాగస్థులం కావాలని కోరుకుంటున్నాం.’’

ఆర్మిత చిన్నగా నవ్వింది. ఆమె స్వరంలో ఆప్యాయత ధ్వనించింది. ‘‘మేము గర్వంగా తలెత్తుకు తిరిగే వాళ్ళం. మా నగరాన్ని, మా సంస్కృతిని ప్రశంసించే వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం.’’

వాళ్ళు అలాగే నడుస్తూ ముందుకు సాగారు, వారి నడుమ ఉద్వేగాలు వాళ్లకు లోలోన తెలుసు. సంగీతం లాంటి ఆర్మిత తీయని నవ్వుఎదుటి వాళ్ళను కట్టిపడేసేలా వుంది. ‘‘పునీతా, విజ్ఞానం వివేకవంతుల సొత్తు. హృదయ భాష వినే స్త్రీని నేను. మనమిరువురం ఒకటి కావాలని నా హృదయం చెబుతున్నది. ’’

ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైనదని పునీతుడు గ్రహించాడు ; అది తననూ, తన జాతి ప్రజల భవిష్యత్తునూ ప్రభావితం చేసేలా వుండాలి. హటాత్తుగా గతానికి సంబంధించిన జ్ఞాపకాలు అతని ఆలోచనలలో ఉవ్వెత్తున ఎగిశాయి. రాత్రి వేళల్లో చుక్కలు పొదిగిన విశాలాకాశం లోకి చూస్తూ తమ ఆదివాసి భూభాగాల కు అతీతంగా విశ్వంలో ఎన్నెన్ని రహస్యాలున్నాయో అని ఆశ్చర్య పోయేవాడు. విజ్ఞానం, వివేకం నదులలాగా ప్రవహించే ఒకానొక గొప్ప నాగరికత గురించి ఒక పెద్ద బండరాయి మీద చెక్కిన శిలాక్షరాలు అతడు గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆ అక్షరాలు అతనిలో జిజ్ఞాస జ్వాలను రగుల్కొలిపి ఆ కల్పిత ప్రదేశం అన్వేషణలో తల్లిదండ్రులను వదిలిపెట్టి సంచారం చేసేలా ప్రేరేపించాయి.

పునీతుడికి తన తలిదండ్రులు జ్ఞాపకానికొచ్చారు, వాళ్లకి కొన్ని అభ్యంతరాలున్నాకొడుకు కుతూహలాన్ని ప్రోత్సహించారు. తండ్రి చెప్పిన విలువైన మాటలు పునీతుడు గుర్తుకు తెచ్చుకున్నాడు: ‘విజ్ఞాన, వివేకాల సముపార్జనకు నాయకుడు అనేవాడు తెలియని విషయాల్లోకి సాహసించి దూకాలి.’ తమ పూర్వీకుల ధైర్య సాహసాల గురించి, దేవతల ఆశీస్సుల గురించి తల్లి చెప్పిన కథలు అతని మస్తిష్కంలో మెదిలాయి.

ఈ లోగా అశ్విన్ రాజకీయంగా లబ్ది పొందగల సరైన అవకాశం చూశాడు. ‘‘పునీతా, హరప్పా రాకుమారి మనసును దోచుకునే మహాత్తరావకాశం నీకు వుంది. మన ఆర్యుల ప్రయోజనం కోసం దీన్ని వినియోగించుకో. రాకుమారి ఆర్మిత ను పెళ్ళాడి రాచ కుటుంబం తో బంధుత్వం ఏర్పరుచుకో. ’’

ఆర్మిత గురించి ఆలోచిస్తూ పునీతుడు అటూఇటూ పచార్లు చేశాడు. ఆమె మాటలు అతని చెవుల్లో మార్మోగాయి. ‘‘పునీతా, విజ్ఞానం వివేకవంతుల సొత్తు. హృదయ భాష వినే స్త్రీని నేను. మనమిరువురం ఒకటి కావాలని నా హృదయం చెబుతున్నది. ’’

ఆర్మిత పట్ల తన ఆకర్షణని పురుష కాదనలేడు. ఆమె తెలివితేటలు, ఆమె సౌందర్యం, ఆమె హాస్యసంభాషణం...ఇవి మొదటి నుంచీ అతన్ని ఆకట్టుకున్నాయి. ఇది కేవలం ఆకర్షణని మించినది ; ఆమె సామర్థ్యాన్ని, ఆమె దయాగుణాన్ని, తన ప్రజల పట్ల ఆమె గాఢ అనురక్తిని అతడు అభిమానించాడు.

తన యాత్ర పూర్తయి గమ్యం చేరుకున్నదని ఆక్షణాన పునీతుడు గ్రహించాడు. అతడో ఎంపిక చేసుకోవాలి ; అది తన జీవితాన్ని మలుపు తిప్పుతుంది, తమ ఆర్యజాతి ప్రజల భావిని నిర్ణయిస్తుంది. హరప్పన్ రాకుమారి ఆకర్షణ, హస్తగతమవబోయే అధికారం అతన్ని ప్రలోభ పెట్టాయి. కానీ తన నిర్ణయం తన పూర్వీకులు నమ్మిన విలువలు, ఆరాధించే దేవుళ్ళ ఆజ్ఞకు అనుగుణంగా వుండాలని అతనికి తెలుసు.

అయితే విచక్షణాశీలి అయిన వరుణ్ అతని ఉద్దేశాన్ని పసిగట్టి సున్నితంగా హెచ్చరించాడు. ‘‘హరప్పనుల మనోభావాలు దెబ్బతినకుండా మనం చాలా జాగ్రత్తగా వుండాలి పునీతా. మనం ఈ నగరంలో అతిథులం, వాళ్ళ ఆతిథ్యాన్ని మనం దుర్వినియోగ పరచరాదు. ’’

కానీ అప్పటికే అశ్విన్ ఉద్బోధ పురుష మెదడులో దురాశ బీజాలు నాటింది. రాకుమారి ఆకర్షణ, అధికారపు హామీ అతన్ని రిస్క్ తీసుకొమ్మని ప్రేరేపించాయి.

‘‘ఏమి చేస్తావ్ పునీతా..?’’ ఆందోళనగా చూస్తూ వరుణ్ అడిగాడు. ‘‘నీ హృదయం చెప్పేది.. లేదా, నీ విధ్యుక్త ధర్మం..ఈ రెండింటిలో దేన్ని అనుసరిస్తావు ?’’ (సశేషసం)

Read More
Next Story