హరప్పాలోయలో  ఆర్యుల సాంస్కృతిక  విజృంభణ
x
A 1910 depiction of Aryans entering India, from Hutchinson's History of the Nations

హరప్పాలోయలో ఆర్యుల సాంస్కృతిక విజృంభణ

ఒక సాంస్కృతిక మహా సంగ్రామం. హరప్పనుల గాథ. అధ్యాయం 6. మూలం: The Greatest Battle of Culture (The Story of Harappans) by Bethi Panigrahi. తెలుగు: ఆడెపు లక్ష్మీపతి

(హరప్పా నాగరిక మీద వచ్చిన అనేక పరిశోధనల తేలిన అంశాల ఆధారంగా రాసిన చారిత్రక)

కాల చక్రం నెమ్మదిగా తిరిగింది. పునీతుడు లేని లోటు కలిగించిన దుఃఖభారం ఆమె మనసులో అలాగే వుంది. ఆమె అతన్ని మనః పూర్వకంగా ప్రేమించింది, అతని మరణం తన జీవితాన్ని మోడువారిన చెట్టును చేసినట్టుగా ఆమె భావించ సాగింది.

అతనితో సన్నిహితంగా గడిపిన క్షణాలు ఆమెలో చేదు తీపి జ్ఞాపకాలుగా మిగిలి ఆతను లేని వెలితిని నిరంతరం గుర్తు చేయసాగాయి.

అక్కడ వరుణ్ కూడా దుఃఖం నుంచి తేరుకోలేదు. అతడు పునీతుడిని సొంత సోదరుడిగా పరిగణించాడు. పునీతుడు లేని లోటు భరించరానిదిగా తోచి, జీవితం బుబ్బుద ప్రాయం, యుద్ధ పరిణామాలు నిజంగా చాలా భయంకరం అన్న భావన అతని హృదయాన్ని మెలి పెట్టింది.

గతంలో తామిరువురూ కలిసి పాల్గొన్న అనేక యుద్ధాలు, పంచుకొన్న పూర్వీకుల గాథలు, చలి మంటల చుట్టూ కూర్చుని ఒకరికొకరు చెప్పుకొన్న ఉల్లాస కబుర్లు..అతడిప్పుడు గుర్తుకు తెచ్చుకున్నాడు.

ఒకనాడు వరుణ్ తన సొంత దు :ఖాన్ని దిగమింగి, ప్రియుడిని కోల్పోయి పరితపిస్తున్న ఆర్మిత వద్దకు వెళ్లి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు.

ప్రశాంతమైన భవన ప్రాంగణంలో కూర్చుని వారిరువురు మర్యాద పూర్వకమైన పలకరింపులతో ప్రారంభించి లోగొంతుకలతో సంభాషణ సాగించారు. వాళ్ళ మాటల్లో ఇరువురి సంస్కృతుల ప్రత్యేకతలకు సంబంధించిన విషయాలు దొర్లాయి.

‘‘మా హరప్పా సంస్కృతి పట్ల నేను గర్వ పడుతున్నాను, ’’ మృదువుగా, స్థిరంగా అంది ఆర్మిత. ‘‘అధునాతన నీటి పారుదల వ్యవస్థ, అద్వితీయమైన వాస్తుకళ..ఇవి మా పూర్వీకుల ప్రతిభా పాటవాలకు సాక్ష్యాలు. కానీ మా సంస్కృతిని సుసంపన్నం చేస్తున్నవి భౌతిక నిర్మాణాలు మాత్రమె కాదు. గాథలు, ఐతిహ్యాలు, పురాణాలు మా జాతి ప్రజల విజ్ఞాన వివేకాలను, విలువలను ఒక తరం నుంచి మరోతరానికి అందిస్తూ వస్తున్నాయి.’’

‘‘మీ నగరాలు నిజంగా ఆకట్టుకునేలా వున్నాయి,’’ అన్నాడు వరుణ్ అభిమానం, ఆరాధన భావం ధ్వనించే స్వరంతో. ‘‘కానీ మా ఆర్య సంస్కృతిలో మాకే సొంతమైన కొన్ని విలక్షణత లున్నాయి. మా ఖగోళ, గణిత, తత్వ శాస్త్రాలు విజ్ఞానపరంగా మేము గొప్ప ముందంజ వేయడానికి తోడ్పడ్డాయి. అనాది విజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక మార్గ దర్శనాన్ని కలిగి వున్న ఋగ్వేదం..తదితర గ్రంథాలు, ఇతిహాసాలు మానవ జీవన పరమార్థాన్ని విడమరచి చెబుతూన్నాయి.’’

‘‘అవీ విలువైనవే, నాకు నచ్చాయి,’’ అంది ఆర్మిత మృదువైన స్వరంతో. ‘‘కొన్ని సార్లు మీ ఆర్యుల సంస్కృతీ, విధానాలు నన్ను బాగా ఆకర్షిస్తాయి. కానీ మీ సంస్కృతి మా సంస్కృతిని కబళిస్తుందనీ, ప్రస్తుత మా ప్రత్యేకతలకు కారణమైన మా విలక్షణ సంప్రదాయాలను, ఆచారాలను తుడిచిపెడుతుందేమోనని మా భయం. మా వృత్తినిపుణులు, కళాకారులు, వర్తకులు..వీరి వద్ద చెప్పడానికి ఎన్నో విశేషాలు, నైపుణ్యాలు, మా సంస్కృతికి రూపం దిద్దిన జీవితానుభవాలు వున్నాయి –మీవి మీకెంత విలువైనవో అవి మాకూ అంతే..’’

‘‘మీ భయం నాకు అర్థమైంది..’’ అన్నాడు వరుణ్ సహానుభూతిగా. ‘‘కానీ మన సంస్కృతులు-అద్భుతమైన మరింత అందమైన కలనేతలోని పడుగుపేకల్లాగా -ఒకదానికొకటి పరిపూరకంగా- వుండగలవు అని నా నమ్మకం.’’

ఊహలు, ఆలోచనలతో ఆర్మిత ముఖం వెలిగింది. ‘‘ఆ భావ చిత్రం నాకు నచ్చింది. నువ్వు చెప్పేది సబబే అనుకుంటాను. మనం ఒకరినుంచి ఒకరం ఇంకా నేర్చుకుని మునుపెన్నడూ సాధ్యపడుతుందని భావించని నూతన మార్గాల్లో కలిసి పురోగమిద్దాం. అయితే ఇది సంప్రదాయాలను, విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం మాత్రమె కాదు ;ఒకరి సంస్కృతి గుండెకాయను-విలువలు, విశ్వాసాలు, స్వప్నాలు, సంకోచాలు సహా –మరొకరు పూర్తిగా అర్థం చేసు కోవడం. ఇప్పుడు మనమున్న స్థితికి కారణం అవే కాబట్టి..ఇది అవగాహన చేసుకుంటేనే మన మైత్రి నిజంగా సార్థక మవుతుంది.’’

వరుణ్ నవ్వాడు. లోతైన ఆలోచనలతో అతని కళ్ళు మెరిశాయి. ‘‘సరిగ్గా చెప్పారు ! మనం కేవలం మన సంస్కృతుల గురించే మాట్లాడటం లేదు. మన ఆత్మల గురించి, మన వ్యక్తిత్వ అంతర్భాగాల వంటి సున్నిత అంశాల గురించి, మాట్లాడుకుంటున్నాం. ఒకరికొకరం మన ఆత్మలను ఇచ్చిపుచ్చుకున్నప్పుడు మాత్రమె అద్భుతం జరుగుతుంది – మనల్ని ఒకరికొకరికి కలిపేసే, ఒకరినొకరు అర్థం చేసుకునే, మనల్ని ఏకం చేసే మహాద్భుతం అది !’’

ఆర్మిత, వరుణ్ లు అలా తమ ఇరు సంస్కృతుల ప్రత్యేకతల గురించి చర్చిస్తుండగా, ఆర్య పూజారులు కొందరు, తమ యోధుల మరణం విషయం మరిచిపోయి, హరప్పనులను గెలిచేందుకు ఒక కొత్త వ్యూహం రచించారు. తమ ఖగోళ, తత్వశాస్త్రాల పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ తమ సంక్లిష్ట సంస్కృతిని నెమ్మదిగా ప్రవేశపెట్టనారంభించారు.

వైదిక దేవుళ్ళు, దేవతల వివరణాత్మక కథలు, వాళ్లకి సంబంధించిన సుదీర్ఘ పురాణాలు హరప్పనులను అమితంగా ఆకర్షించి వాళ్ళ ఆలోచనలను ప్రభావితం చేశాయి. రూపకాలు, అన్యార్థ ప్రతిపాదక కథనాలతో కూడిన ఆర్యుల కావ్య కళా సాంప్రదాయాలు హరప్పనుల కథాగాన ప్రేమను ఇతోధికం చేశాయి.

ఆర్మిత సలహా మేరకు వరుణ్ సాంస్కృతిక రాయబారిగా ఒక కొత్త భూమిక పోషించ నిర్ణయించాడు. అతడు హరప్పనులకు శ్వాస నియంత్రణ, ధ్యానం నేర్పిస్తూ ఆర్యుల యోగ కళ ను బోధించాడు.

యోగసాధన నేర్పించే క్రమంలో, ‘‘మన శ్వాస ఏకమవుగాక, మన మనసులు సింధు జలం లాగా స్ఫటిక స్పష్టమవుగాక..’’ అని వరుణ్ ప్రవచించాడు.

అదలా వుండగా, తెల్లని దేహ చ్చాయ, పట్టు లాంటి శిరోజాలు కలిగివున్న ఆర్య జాతి స్త్రీలు హరప్పన్ పురుషుల దృష్టి నాకర్షించారు. ఆర్య స్త్రీలు నృత్యాలు, కవిత్వం, వీణ, వేణువుల వినసొంపైన సంగీతం..మొదలైన తమ సాంప్రదాయిక కళా రూపాలను హరప్పనులకు పరిచయం చేశారు.

వాళ్ళ మధురమైన గానాలాపనకు మంత్ర ముగ్ధుడైన ఒక హరప్పన్ వీరుడు, ‘‘ఈ సంగీతం నా హృదంతరాళాలను స్పృశించింది,’’ అని ప్రశంసించాడు.

అప్పుడప్పుడే పరిచయమైన ఈ కొత్త సాంస్కృతిక రూపాలకు అమితంగా ఆకర్షితులైన హరప్పనులు ఆర్యులను నూతన దృక్కోణంలో చూడనారంభించారు. ఆర్యుల సంగీతం, కవిత్వం..తదితర కళలను తమ సొంత సాంప్రదాయిక కళారూపాలతో సమ్మేళవించి స్వాయత్తం చేసుకోవడం మొదలెట్టారు.

ఆర్యుల విజ్ఞానం, కళా వైదుష్యానికి ఎంతగానో ప్రసన్నుడైన హరప్పనుల రాజు బాగుహర వారితో శాంతి ఒప్పందానికి చేయి అందించాడు. ఇరు వర్గాల ప్రజా సమూహాలు తమ వారసత్వ సంపదను ఒకరితో ఒకరు పంచుకుని ఒక కొత్త మైత్రీ ఒప్పందానికి నాంది పలికేలా భారీ సాంస్కృతిక ఉత్సవం ఒకటి ఏర్పాటు చేసి ఆర్యజాతి ముఖ్యులను ఆహ్వానించాడు.

ఉత్సవానికి ఆర్యజాతి వీరులకు స్వాగతం పలుకుతూ, ‘‘మన సాంస్కృతిక వ్యత్యాసాలను అంగీకరిస్తూ వేడుక చేసుకుందాం.. మనుష్యులుగా కలిసి మెలసి జీవించే ఒక ఉమ్మడి క్షేత్రానికి బాటలు పరుద్దాం..’’ అని బాగుహర ప్రకటించాడు.

ధారాళమైన సూర్యకాంతిలో మెరుస్తోన్న సింధు నది తీరాల్లో నిర్వహించిన ఆ ఉత్సవం సకలవర్ణ శోభితంగా, సర్వ స్వర సమ్మేళనంగా భాసిల్లి అందరినీ అలరించింది. ఆర్య సంగీత కారులు వీణ, వేణువులపై వాద్య సంగీతం వినిపించారు; వారి రాగ మాలికలు హరప్పనుల లయబద్ధమైన మృదంగ నాదంతో, ఆర్య స్త్రీల మధుర గాన ఆలాపనలతో స్వర బద్ధంగా మమేకమైనాయి.

మల్లెపూలు, చందనాల సుగంధంతో గాలి దట్టంగా వీచింది. ఎరుపు, ఆకు పచ్చ, నీలం, కెంపు వర్ణాల గాలిపటాలతో, లాంతరులతో ఆకాశం ధగధగ లాడింది.

మసాలా వంటకాలు, తీపి పదార్థాల రుచిని ఆస్వాదిస్తూ ఉల్లాసంగా నవ్వుతూ కేరింతలు కొట్టే అశేష జన సమూహంతో ఉత్సవ స్థలి మందహాసాల మహా సంద్రంలా కనిపించింది. నవ్వులు, సంగీతం కరతాళ ధ్వనులతో కలిసి గాలిలో నిండాయి. ఆ ఆనందోత్సాహాల వేడుకలో వృత్తి కళాకారులు తమతమ కళా కృతుల్ని-తళుకులీనే రంగురాళ్ళు, అందమైన మృణ్మయ పాత్రలు, పురాణ గాథలు, ఇతిహాసాలు, కథల ఘట్టాలు పొందుపరచి నేసిన మేలిమి వస్త్రాలు ప్రదర్శించారు.

జనసందోహం సంగీతానికి మైమరచి ఊగుతుండగా ఒక హరప్పా వర్తకుడు ఒక ఆర్యజాతి సంగీతజ్ఞుడిని సమీపించాడు.

‘‘మీ సంగీతం నన్ను తన్మయుడిని చేస్తున్నది !’’ అన్నాడు వర్తకుడు, ‘‘మీ స్వర కల్పనలకి ప్రేరణ ఏమిటో..?’’

‘‘ప్రకృతి లయ బద్ధమైన క్రమం..,మా పూర్వీకుల పాటలు..’’ వీణ తీగలు సుతారంగా మీటుతూ చెప్పాడు సంగీత కారుడు. “విశ్వం తో సామరస్యత ని మేము కోరుకుంటాం..’’

‘‘మహాద్భుతం..!’’ ప్రశంసగా అన్నాడు వర్తకుడు. ‘‘హరప్పాలో మేము కూడా ప్రకృతితో గాఢంగా అనుసంధానమై ఉన్నాము, కానీ మా సంగీతం ధ్వని భరితం, అందులో మద్దెల మోత ఎక్కువ.’’

‘‘ఔను. నేను చూశాను..’’ అన్నాడు సంగీత కారుడు. ‘‘మీ మద్దెల ధ్వనులు కించిత్ కఠోరం. బహుశ మనిరువురి శైలులను మిశ్రమం చేసి ఒక కొత్త, శ్రావ్యమైన స్వరబాణీ సృజియించ వచ్చునేమో..’’

వాళ్ళు అలా మాట్లాడుకుంటూ వుండగా ఆర్య నాట్యకారుల బృందం ఒకటి వేదిక నెక్కింది. వాళ్ళ లయబద్ధమైన పాద విన్యాసం, విలాసవంతమైన శరీర భంగిమలు చూపరులను మంత్ర ముగ్ధులను చేశాయి.

‘‘మీ నాట్యం ఒక ప్రార్థన లాగా, దైవానికి అర్పణ లాగా వుంది..’’ అన్నాడు ఒక హరప్పన్ వృత్తి నిపుణుడు ఆరాధనా పూర్వకమైన అరమోడ్పు కన్నులతో.

‘‘నిజం. మా శరీరకదలికల ద్వారా మేము దైవానికి భక్తి ప్రపత్తులు ప్రకటిస్తాం..’’ చెప్పింది ఒక ఆర్య నృత్యకారిణి చేతులను అందంగా ముకుళించి. ‘‘కానీ ఒకటి చెప్పండి–మీ కళా నైపుణ్యానికి ప్రేరణ ఏమిటి ?’’

‘‘మా పూర్వీకుల గాథలు, మా నేల గురించిన ఐతిహ్యాలు మాకు ప్రేరణ,’’ బదులిచ్చాడు వృత్తి నిపుణుడు. ‘‘ప్రతి మృణ్మయ పాత్ర తయారీలో, ప్రతి చెక్కణ పనిలో మా సంస్కృతి అంతస్సారాన్ని నిక్షిప్త పరచాలనుకుంటాం.’’

‘‘అద్భుతం!’’ ఆశ్చర్యంగా అన్నది నృత్యకారిణి. ‘‘మాకూ మా పురాణాలు, వీరుల, దేవుళ్ళ గాథలు వున్నాయి. బహుశ మన గాథల్ని పరస్పరం పంచుకుని, ఇరువురి కళలకు కొత్త స్ఫూర్తి ని అందించ వచ్చునేమో..’’

సూర్యాస్తమయం కావస్తుండగా ఆకాశంలో గులాబి, నారింజ రంగులు పర్చుకున్నాయి. ఉత్సవం ముగింపు దశకు వచ్చింది; దానికి సంకేతంగా మద్దెల మోతలు, వాయిద్యాల ధ్వనులు మిన్ను ముట్టాయి, ప్రేక్షకులు విభ్రాంతి లో మునిగి కళ్ళార్పకుండా వేడుక తిలకించారు.

‘‘వరుణ్, ఇంతకు మునుపెన్నడూ ఎరగని సమైక్యతా భావన, ఒక కొత్త అనుభూతి నన్ను ఆవహిస్తున్నది..’’ అన్నది ఆర్మిత తన్మయంగా నవ్వుతూ.

‘‘మన సంస్కృతులు వేర్వేరు కాదనీ, అవి ఒకదానికొకటి అల్లుకు పోయిన దారప్పోగులు అని ఈ ఉత్సవం తెలియ జేసింది కదా..’’ అన్నాడు వరుణ్ తన ముఖం సంతోషంతో వెలిగిపోతుండగా. ‘‘మనం అడ్డంకులను బద్దలు కొడుతున్నాం ఆర్మితా.’’

‘‘ప్రతి నృత్యంలో, ప్రతి పాటలో, ఇచ్చిపుచ్చుకున్న ప్రతి కథలో మన ఇరుజాతుల ప్రజలు సమైక్యం అయ్యే భవిష్యత్తును చూస్తున్నాను..’’ అన్నది ఆర్మిత సంతోషాతిరేకంతో చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంటూ.

వరుణ్ హుషారుగా తల ఊపాడు. ‘‘మన వ్యత్యాసాలను గుర్తించి ఆమోదించే, మన సారూప్యతలు మనల్ని దరి జేర్చే .. భవిష్యత్తు అది.’’

‘‘ఇది ఒక కొత్త శకానికి ఆరంభం.. ’’ అంటూ ఒక ఆర్యజాతి కవి ప్రస్తుతించాడు. హరప్పా రాజ్య వైభవాన్ని కీర్తిస్తూ అతడొక సంస్కృత శ్లోకం చదివాడు:

‘‘సింధు సంగమే మహానగరం

(సింధు నది సంగమ స్థానంలో ఒక గొప్ప నగరం)

హరప్పా జనః సుసంస్క్రుతః

(హరప్పా నగరవాసులు మంచి సంస్కార వంతులు )

తేసం నగరం సువిభక్తం

(వారి నగరం ప్రణాళికా బద్ధంగా నిర్మితం)

రాజ్నా తేసం ప్రియ తమేన సశితం

(వారి ప్రియమైన రాజు చే అది పాలించ బడుతున్నది)

విజ్ఞానం తేసం సువిస్తారం

(వారి విజ్ఞానం బహు విస్త్రుతమైనది)

సంస్కృతీ తేసం సువిరాజితః

(వారి సంస్కృతి చాలా తెజోవంతమైనది)

తేసం లిపిహ్ రత్నం సుదీప్తం

(వారి లిపి రత్నంలా తళుకు లీనుతుంది)

రాజనా తేసం హృది సుధ్రుఢమ్

(రాజు హృదయంలో అది పదిలంగా స్థాపితమైంది)

వాయమర్యః తేసం దర్శనేన ప్రాప్తః

(అర్యులమైన మేము ఆయన దర్శన భాగ్యం పొందాము)

తేసం ప్రజా అంతర్నిర్జివలంతి

(వారి ప్రజలు అంతర్గతంగా ప్రకాశిస్తున్నారు)

రాజనా తేసం ధర్మపాలకో హస్తః

(రాజు హస్తం వారి ధర్మాన్ని / న్యాయాన్ని రక్షిస్తుంది)

ప్రజా తేసం సుముఖి సంపద ప్రాప్తః

(వారి ప్రజలు సకల సంపదలు సముపార్జించారు)

కానీ, ఈ సాంస్కృతిక పునరుజ్జీవన దశలో ఒక కొత్త సవాలు ఎదురైంది. హరప్పన్ మతోన్మాదుల బృందం ఒకటి ఆర్యుల ప్రభావాన్ని వ్యతిరేకిస్తూ ఆర్యుల నాయకుడిని మట్టు పెట్టె రహస్య కుట్రకు ప్రణాళిక వేసింది.

‘‘ఈ విదేశీయుల కారణంగా మన సంప్రదాయాలను తుడిచి పెట్టుకు పోనీయం..’’ అన్నాడొక మతోన్మాది కోపంగా. ’’ఎంత మూల్యం చెల్లించయినా మన జీవనవిధానాన్ని సంరక్షించుకోవాలి.’’

‘‘కానీ ఇంత అభివృద్ధి సాధించాం కదా,, ఏమి చేద్దాం?’’ అంటూ మరొక మతోన్మాది వాదనకు దిగాడు. ‘‘ఆర్యులు కొత్త ఆలోచనలు తీసుకు వచ్చారు, ఒక కొత్త జీవన విధానాన్ని పరిచయం చేశారు. వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకున్నాం.’’

‘‘అభివృద్ధి..?’’ వెక్కిరింతగా అన్నాడు మొదటి మతోన్మాది. ‘‘మన దేవుళ్ళను, మన ఆచారాలను విస్మరించడం నువ్వు అభివృద్ధి అంటావా ?వాళ్ళలాగా దుర్బలులం, ఐకమత్యం లేనివాళ్ళం కావాలా ? లేదు. ఆలస్యం కాకముందే మనం ప్రతిఘటించాలి. ’’

‘‘మనం వేగిరం చర్యకు పూనుకోవాలి. మనం నిర్మించుకున్న సర్వస్వాన్ని వాళ్ళు నాశనం చేస్తుంటే మనం వూరుకోలేము.’’ బిగ్గరగా అన్నాడు మొదటి మతోన్మాది.

‘‘కానీ మనమిప్పుడు ఏమి చేయగలం ? వాళ్ళు తెలివిగా వ్యవహరిస్తున్నారు, విరుచుకు పడే అవకాశం కొరకు కాచుకుని కూర్చున్నారు..’’ అన్నాడు రెండో వ్యక్తి.

‘‘మనం వాళ్ళకొక విషయం తెలియజేసే మార్గం ఆలోచించాలి, వాళ్లకు హాని తలపెట్టము అని వాళ్ళు అర్థం చేసుకునేట్టు చెప్పాలి..’’ సలహా ఇస్తున్నట్టుగా అన్నాడు రెండో మతోన్మాది.

‘‘అర్థం చేసుకోవడమా ?వాళ్ళు అర్థం చేసుకోవాలనుకోవడం లేదు. విధ్వంసం గావించాలన్నదే వారి కోరిక.’’ అన్నాడు మొదటి మతోన్మాది.

‘‘అలా అయితే..ఇంకే మాత్రం జాప్యం చేయకుండా వాళ్ళను నిరోధించే మార్గం మనం ఆలోచించాలి. ’’ అన్నాడు రెండో వ్యక్తి.

‘‘కానీ.. ఎలా ?’’

‘‘మనం ఏదో ఒకటి చేద్దాం. మనం ఎప్పుడూ చేస్తాం కూడా. మనం సింధునది పుత్రులం..మనం సులువుగా ఓటమి పాలు కాము.’’ అన్నాడు రెండో వ్యక్తి.

‘‘ఏదేమైనా మనం జాగ్రత్తగా వుండాలి. స్వీయ రక్షణ విషయంలో అలక్ష్యం కూడదు. వాళ్ళు తెలివి మీరిన వారు. ఊహకందని రీతిలో వాళ్ళు దాడి చేస్తారు. ’’ హెచ్చరికగా అన్నాడు మొదటి వ్యక్తి.

‘‘నువ్వు సరిగా చెప్పావు. మనం అప్రమత్తంగా వుండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన జనాన్ని, మన సంస్కృతిని రక్షించుకుని తీరాలి.’’ ఏకీభావం ప్రకటిస్తూ అన్నాడు రెండో వ్యక్తి. ఆ ఇద్దరు మతోన్మాదుల సంభాషణ కొనసాగింది ; రకరకాల వ్యూహాలు, వాటి ఫలితాలు మదిలో మెదులుతుండగా వాళ్ళు లోగొంతుకలతో కొన్ని పథకాలు చర్చించారు.

ఈ పరిణామాలు హరప్పనులు, ఆర్యుల నడుమ నెలకొన్న సున్నితమైన శాంతికి, సాంస్కృతిక మారకానికి విఘాతం కలిగించే ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయి. అప్పుడే రూపం దిద్దుకుంటున్న ఇరు వర్గాల సంబంధ యవనిక ఒక్కొక్క పోగుగా చిరిగిపోయేటట్టు కనపడింది.

రాజు బాగుహర, ఆర్యజాతి ముఖ్య నాయకులు ఈ నూతన సవాళ్ళను అధిగమించి తమ ఇరువర్గాల ప్రజల నడుమ సామరస్యాన్ని కాపాడుకోగలరా? లేక. రాగ ద్వేషాలతో కూడిన సణుగుళ్ళు, గొణుగుళ్ళ కారణంగా వారు ఒకరికొకరు దూరం అవుతారా ? స్నేహ బంధం, పరస్పర గౌరవం..భయ ద్వేషాల బలిమిని తట్టుకుని నిలదోక్కుకోగలవా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. (సశేషం)

ఈ సీరియల్ ఐదో భాగం ఇక్కడ చదవండి

Read More
Next Story