హరప్పాలో నిగూఢ సత్యం కోసం వెతుకులాట
x

హరప్పాలో నిగూఢ సత్యం కోసం వెతుకులాట

ఒక సాంస్కృతిక మహా సంగ్రామం. హరప్పనుల గాథ. అధ్యాయం 9. మూలం: The Greatest Battle of Culture (The Story of Harappans) by Bethi Panigrahi. తెలుగు: ఆడెపు లక్ష్మీపతి

హరప్పనులు సాంస్కృతిక సమున్నతి కోసం ఆరాటపడుతూంటే, వాళ్ళలో కొందరు దృష్టిని అంతరావలోకన వేపు మళ్ళించి తత్వశాస్త్రం లో, ఆధ్యాత్మిక చింతనలో ఉపశమనం వెతికారు. తమ సందేహాలకు సమాధానాలు అన్వేషించే క్రమంలో వాళ్ళు మనిషి స్థితిగతుల నిగూఢతలలోకి వెళ్ళిపోయారు.

‘‘సత్యం కోసం మనం మనలోకి తొంగి చూడాలి..’’ అరమోడ్పు కన్నులతో ఒకాయన అన్నాడు.

‘‘బాహ్య ప్రపంచమంతా ఒక భ్రమ,’’ స్థిరమైన గొంతుతో మరొకాయన అన్నాడు. భౌతిక వస్తుసంపత్తి, అధికారాల బుద్బుద స్వభావాన్ని గుర్తించి వాళ్ళు మనిషి వాంఛ గురించి లోతుగా ఆలోచించారు. తమ సొంత మనస్సుల్లో, మస్తిష్కాల్లో విజ్ఞానాన్ని వెతికారు.

‘‘ఈ ప్రపంచం మన మనసుల్ని ప్రతిబింబిస్తుంది..’’ అన్నాడొక హరప్పన్ ఋషి. ‘‘సత్యం కనుక్కోవాలంటే మన ఆలోచనల్ని పరిశుద్ధం చేసుకోవాలి.’’

ఐహిక వాంచల్ని, బంధనాల్ని పరిత్యజించి హరప్పనులు మునులుగా మారారు. నిత్య సంచారం చేస్తూ వినేవాళ్ళ దగ్గర ఆగి విజ్ఞానాన్ని బోధనల రూపంలో అందించారు.

‘‘విజ్ఞానానికి తాళాలు హరప్పన్ పునరుజ్జీవనంలో వున్నాయి,’’ కరుణా భరితమైన చూపులతో ఒక ముని అన్నాడు.

వాళ్ళ తాత్వికచింతన ఐక్యత, చరాచర వస్తు అనుసందానత, జీవితం యొక్క చక్రీయ స్వభావాలను నొక్కి చెప్పింది. ‘‘జీవన్మరణాలు ఒకే నాణెపు రెండు ముఖాలు,’’ ప్రవచించాడు ఒక రుషి. ‘‘శాంతి పొందాలంటే మనం ఆ రెండింటినీ ఆలింగనం చేసుకోవాలి.’’

ఆధ్యాత్మిక ఆచరణల్లోకి వాళ్ళు లోతుగా వెళ్ళిన కొద్దీ, నిగూఢ సత్యాలను బహిర్గతపరిచే ప్రగాఢ చేతనా స్థితిని అనుభవం లోకి తెచ్చుకున్నారు.

‘‘అస్తిత్వ మహాసంద్రంలో మనం నీటి బిందువులం,’’ ప్రకటించాడు ఒక హరప్పన్ ముని. ‘‘విజ్ఞానాన్ని కనుగొనేందుకు మనం దైవంతో లీనమవ్వాలి..’’

కానీ, ఆధ్యాత్మిక అన్వేషణలో వాళ్ళు లోలోతులకు వెళ్ళినా కొద్దీ తమ బాధ్యతల్ని విస్మరించనారంభించారు. క్రమంగా కుటుంబాలు విచ్చిన్నం కావడంతో జనాభా కూడా తగ్గింది. ఇళ్ళు ఖాళీ అయి శిథిలావస్థ కి చేరుకున్నాయి, అలా ఒకప్పటి తేజోవంతమైన నాగరికత కాలగమనంలో నేలమట్టమైంది. హరప్పనులు తమ చుట్టూ వున్న ప్రపంచం నుంచి ఇంకా ఇంకా దూరం జరిగారు.

‘‘భర్తలు, భార్యల నడుమ మునుపటి ప్రేమలు, బాధ్యతలు లేవు..’’ అని ఒక హరప్పన్ వృద్దుడు బాధ పడ్డాడు. ‘‘మన కుటుంబాలు క్రమంగా అదృశ్యమవుతున్నాయి. మన సమాజం మనం ఎన్నడూ కోరుకొని విధంగా పరివర్తన చెందుతున్నది. ఒకప్పుడు నవ్వులతో కేరింతలతో కళకళ లాడిన మన ఇళ్ళు ఇప్పుడు నిశ్శబ్దంలో కూరుకుపోయి బోసి పోయినాయి.’’

హరప్పనుల ఆధ్యాత్మిక జ్ఞానోదయ వ్యామోహం వారిని సర్వ సంగ పరిత్యాగులను చేసింది, వాళ్ళ సమాజం క్రమంగా చైతన్యం కోల్పోయి ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు.

తమ విధ్వంసకర పథకం నెరవేరడం చూసిన ఆర్యులు ఇక చర్యకు పూనుకునే సమయం ఆసన్నమైనదని గ్రహించారు. కానీ ఎక్కడనుంచి మొదలు పెట్టాలో వారికి అర్థం కాలేదు. అంత పెద్ద ఎత్తున మార్పు వస్తుందని ఎవరూ అనుకోలేదు ; హరప్పనుల విధినీ, సింధులోయ భవిష్యత్తునూ తిరగరాసిన ఆ గొప్ప మార్పు ఎవరూ ఊహించలేదు.

Read More
Next Story