తెలంగాణ రాజకీయాల్లో ఊహకందని పరిణామాలు కొనసాగుతాయా?
x

తెలంగాణ రాజకీయాల్లో ఊహకందని పరిణామాలు కొనసాగుతాయా?

రమణాచారి విశ్లేషణ: రాజకీయ గ్లామర్ తగ్గని, రాజకీయ చతురుడిగా పేరొందిన కెసిఆర్ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారో, ఎలా చక్కదిద్దుతారోనని అంతా అసక్తిగా గమనిస్తున్నారు.


-రమణాచారి


తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ మార్పులు పరిశీలిస్తుంటే రాజకీయ విశ్లేషకులకు, మేధావులకు సైతం అంతు చిక్కడం లేదని స్పష్టమవుతోంది. ఏ రాజకీయ పార్టీ గెలుస్తుందో.., ఏ పార్టీ ఓడిపోతుందో.., ఎవరు అధికారంలోకి వస్తారో... అనే అంశాలపై వాస్తవాలను అంచనా వేయడంలో సఫలం కాలేకపోతున్నారని చెప్పవచ్చు. కారణాలు ఏమైనా ఉండవచ్చు గానీ చర్చనీయ అంశాలు మాత్రం అవగతం కావడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కేంద్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు లోతుగా అర్థం కావడం లేదు.

దేశ, రాష్ట్ర చరిత్రలో ఇంతలా తికమక పెట్టే కీలక పరిణామాలు ఎప్పుడూ చోటు చేసుకోలేదనే చెప్పాలి. తెలంగాణ ఉద్యమకారుడిగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించినవాడిగా పేరుపడిన కెసిఆర్ పరాజయం పొందడం. తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు సన్నిహితుడుగా మెలిగిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేరి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి కావడం. ఈసారి శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో తన అభ్యర్థులను పోటీకి నిలబెట్టక పోవడం. సుదీర్ఘ ఉద్యమ చరిత్ర గల ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో మిణుగురు పురుగుల వెలుతురు స్థాయికి పరిమితం కావడం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం హవా తగ్గిపోయి, సంకీర్ణ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం.

తెలంగాణా రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేతగా కెసిఆర్ ను గుర్తించి టిఆర్ఎస్ కు పట్టం కట్టారు. రెండవసారి అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అధికారం ఇచ్చారు. మూడోసారి వచ్చేసరికి ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి ఎందుకిలా జరిగింది? తదుపరి అధికారంలోకి రావడం వెనుక ఉపయోగపడింది కాంగ్రెస్ బలమా? అసలు విషయం అది కాదు. ప్రధానంగా ఉద్యోగులకు నెలలో మొదటి రోజున జీతాలు అందించాలి అనే డిమాండ్. గ్రూప్ పరీక్షలు సకాలంలో నిర్వహించ లేకపోవడంతో నిరుద్యోగులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. ప్రభుత్వంపై బహుళంగా వ్యతిరేక ప్రచారం చేశారు. నియంతృత్వం, నిరంకుశత్వం అన్న భావన ప్రజలలోకి బలంగా వెళ్ళింది. బిజెపితో అంతర్గతం ఒప్పందం జరిగిందనే ప్రచారంకూడా కొంత వ్యతిరేక ఓటుకు కారణమయ్యింది. పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు, మిత్రులను దూరం చేసుకున్న విధానం, ఒంటెత్తు పోకడలతో అధికారం చేజారిపోయింది. కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతో అధికారం చేజారిపోయింది. ఉద్యోగులు, మేధావులు 2 శాతం మించి ఉండరు కాబట్టి, వీరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటే అదే పెద్ద ముప్పుగా మారింది. కెసిఆర్ ఇంతలా పరాభవం పాలవుతాడని ఎవరూ ఊహించలేదు. అభ్యర్థులపై ఉన్న తీవ్ర వ్యతిరేకత టిఆర్ఎస్ ఓటమిలో కీలక భూమిక పోషించింది.

రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం కూడా మరో ఆశ్చర్యకరమైన విషయం. ఎంతో సెంటిమెంట్ గల తెలంగాణలో, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంపై కన్నెర్ర చేసిన తెలుగుదేశం పార్టీ నుండి అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వ్యక్తికి పట్టం కట్టారు. తెలంగాణ ఉద్యమ క్రమంలో, ఉద్యమకారులపై గన్నెత్తిన, ఓటుకు నోటు కేసులో బహిరంగంగా చిక్కిన వ్యక్తికే అధికారం దక్కింది. నిజానికి ఇది ఊహించని పరిణామం. వందేళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం మరింత ఆశ్చర్యం కలిగించే విషయం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఉద్దండ పిండాలు ఉండే పార్టీగా గుర్తింపు ఉంది. సీనియర్లను కాదని, పలు రకాల విమర్శలను పక్కకు నెట్టి రేవంత్ రెడ్డిని సీఎం చేశారు. తెలంగాణ ప్రజలు మిన్నకుండిపోయారు. ఇది మరీ ఆశ్చర్యం.

ఈ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల ప్రాభవం మసక బారి పోయింది. సాయుధ పోరాట చరిత్ర, ఒకప్పుడు ఉద్దండ పిండాలైన పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వర్ రావు లు నాయకత్వం వహించిన పార్టీలు ఇలా చతికిల పడిపోవడం మరీ విడ్డూరం. 1983 కి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా కమ్యూనిస్టుల ఐక్య సంఘటన ఉండేది. ఆ తర్వాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ అనుసంధాన పార్టీలుగా మారిపోయాయి. ఎన్నికల సమయంలో బేరసారాలాడి అభ్యర్థులను నిలబెట్టుకుని గెలిపించుకునే దుస్థితికి నెట్టి వేయబడ్డాయి. ఇక ఆ వెనుకబాటు అలాగే కొనసాగుతూ వచ్చింది. ప్రజా ఉద్యమాలకు పూర్తిగా దూరమైనట్టు స్పష్టమవుతుంది. ఇదే అసలు కారణం. ఇటీవలి తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం పార్టీలు చివరి వరకు టిఆర్ఎస్ తో పొత్తుకు ప్రయత్నాలు చేశాయి. అది బెడిసి కొట్టడంతో సిపిఐ, కాంగ్రెస్ పార్టీని అభ్యర్థించి కేవలం ఒక సీటులో పోటీ చేసి గెలిచింది. ముందుగా చేసుకున్న ఒప్పంద అంగీకారం కొనసాగుతుంది. మొదట్లో ఒంటరిగా పోటీ చేసిన సిపిఎం చావుతప్పి కన్నులొట్ట పోయిన చందంగా కొద్ది ఓట్లకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి భేషరతుగా మద్దతు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కూడా ఆ పార్టీల ఊసే లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీల దీనస్థితిని ఎవరూ ఊహించి ఉండరు. వామపక్ష ఎంఎల్ పార్టీలు సైతం మొక్కుబడిగా అభ్యర్థులను నిలిపారనే చెప్పాలి. గతంలో ఆ పార్టీలకు కంచుకోటగా ఉన్న ఇల్లందు, ఒకసారి చేజిక్కిన సిరిసిల్ల కనుమరుగయ్యాయి. కేంద్ర విషయానికొస్తే బిజెపి చార్ సౌ పార్ ఆశించి, దో సౌ పార్ కే పరిమితం అయింది. రాజ్యాంగ మార్పు చేస్తారనే అంశం , ముస్లిం వ్యతిరేక ప్రచార అంశాలు బిజెపిని ఇరుకున పెట్టాయి. చిన్నాచితకా పార్టీల సహకారంతోపాటు ( ఎన్డీఏ కూటమి పక్షాలు) చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ల సహకారంతో అధికారంలోకి రాగలిగింది. అది మోడీ ప్రభావానికి, బిజెపి పార్టీకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఏక వ్యక్తి, ఏక పార్టీ పాలన నుండి ఎన్డీఏ కూటమిగా మాత్రమే అధికారంలోకి రాగలిగింది. ఇండియా కూటమి తీవ్రంగా కృషిచేసినా, అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. బలమైన ప్రతిపక్షం స్థానంతో సరిపెట్టుకుంది. ఒక రకంగా ఇది శుభ పరిణామమే.

పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం 8 స్థానాలకే పరిమితం కాగా, బి జె పి అభ్యర్థులు అనూహ్యంగా ఎనిమిది స్థానాల్లో విజయం సాధించదం ఊహలకందని మరో విశేషం . ఒంటరిగా 12 లేదా 14 సీట్లు గెలుస్తామన్న కెసిఆర్ మాటలు, ఫలితాల్లో చావు దెబ్బ తీశాయి. కనీసం ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోవడం విచారకరం. పైగా గతంలో కంటే ఓట్ల శాతం బాగా పడిపోయింది. దీనికి తోడు కాంగ్రెస్ ను నిరోధించేందుకు బిజెపి అభ్యర్థుల గెలుపుకు సహకరించారన్న అపవాదు మూటగట్టుకున్నారు. ఈ పరిణామాలు బిఆర్ఎస్ లో అంతర్గత సంక్షోభానికి తెర లేపాయి. త్వరలో ప్రభుత్వం కూలిపోతుంది, అధికార పగ్గాలు చేపడతాం అని గంభీరాలు పలికిన బిఆర్ఎస్ నాయకుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారింది. గెలిచిన ఎమ్మెల్యేలు, నాయకులు నెమ్మదిగా పక్క చూపులు మొదలుపెట్టారు. కొంతమంది అధికార పార్టీ బాట పట్టారు. ఇంకా రాజకీయ గ్లామర్ తగ్గని, అపర చాణక్యుడిగా, రాజకీయ చతురుడిగా పేరొందిన కెసిఆర్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారో, ఎలా చక్కదిద్దుతారో వేచిచూడాలి. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పలేం. గత కాంగ్రెస్ పార్టీ చరిత్రే ఇందుకు నిదర్శనం. ఉభయ రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వం మునుముందు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతున్నదో చెప్పడం కష్టం. ఊహకందని ఇలాంటి పరిణామాలతో రాష్ట్ర, దేశ రాజకీయాలు రంజుగా మారనున్నాయి.

ఇన్ని చిత్ర విచిత్ర రాజకీయ పరిణామాల మధ్య కూడా ప్రైవేటీకరణ, కార్పోరేటీకరణ సజావుగా సాగుతూనే ఉన్నది. ప్రజాస్వామికీకరణ ఎండమావి గానే మిగిలిపోతున్నది. పౌర ప్రజాస్వామిక ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. కార్మికులు, రైతాంగం, నిరుద్యోగులు, విద్యార్థులు పరిస్థితులు ఆందోళన కారంగానే ఉన్నది . పోటీ పరీక్షల లీకేజీలు ఆగడం లేదు. ఉచిత విద్యా, ఉచిత వైద్యం ఎన్నికల వాగ్దానాలుగానే మిగులుతున్నాయి. జీవించే హక్కుకు భద్రత కానరావడం లేదు. చట్టాలు మరింతగా పదునెక్కుతున్నాయి. కేవలం కార్పొరేట్ శక్తుల రక్షణ కోసం కొత్త క్రిమినల్ చట్టాలు మరింత కఠినంగా అమలు కాబోతున్నాయి. ప్రజలకు, పాలకుల విధానాలకు మధ్య అంతరాలు నానాటికి పెరుగుతున్నాయి.హక్కుల సాధనకు ఉద్యమాలే శరణ్యం అన్న భావన స్థిరపడి, బలపడుతున్నది. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో వేచి చూడవలసిందే. ప్రజలే చరిత్ర నిర్మాతలన్నది నిత్య సత్యం!


(ఇవన్నీ రచయిత వ్యక్తి గత అభిప్రాయాలు)


(రమణాచారి, సామాజిక విశ్లేషకుడు, తెలంగాణ)

Read More
Next Story