తుమ్మేటి రఘోత్తమ రెడ్డి ‘గుడ్ మార్నింగ్’ చెప్పిన కథలెన్నో
x
తన సొంత లైబ్రరీలో తుమ్మోటి రఘోత్తం రెడ్డి

తుమ్మేటి రఘోత్తమ రెడ్డి ‘గుడ్ మార్నింగ్’ చెప్పిన కథలెన్నో

1840 రోజులుగా ప్రతిరోజు మనకి "గుడ్ మార్నింగ్ " అంటూ ఆయన ఎంతో జ్ఞానం అందిస్తూనే ఉన్నారు.


అందరికీ శుభోదయం... ఈ ముక్క మనకు చాలామంది చెప్పరు.మనం కూడా ఆఫీసులోనో, మరోచోటనో, అలవాటయిన మన మనుషులకు తప్ప అంత ఎక్కువగా చెప్పము.అయితే ఫేస్బుక్,వాట్సప్ లు

అందుబాటులోకి వచ్చాక గుడ్ మార్నింగ్ చెప్పే అలవాటు పెరిగింది.

ఈ నేపథ్యంలోనే ఒక పెద్ద మనిషి ఈ గుడ్ మార్నింగ్ ను మరింత ఫలవంతంగా వాడుతూ వస్తున్నారు. ఆయన పేరు తుమ్మేటి రఘోత్తమ రెడ్డి. ఆయన రచయితగా తెలుగు నాట చాలామందికి తెలుసు. కథా రచయితగా.. చావువిందు, పనిపిల్ల ,లాంటి కథలూ.. నల్లవజ్రం లాంటి నవల రాసి రచయితగా ప్రసిద్ధి పొందారు. తర్వాత ఆయన మిద్దెతోటను, పెరటితోటను స్వయంగా సాగుచేస్తూ, మిద్దెతోట, పెరటితోటపై ,విస్తృతంగా సదస్సులు నిర్వహిస్తూ, ప్రచారం చేస్తూ ,తెలుగు నాట ఒక కొత్త ఒరవడికి ఆద్యులు అయ్యారు. తరువాత ఆయనే వండని వంటలు అనే శీర్షికతో "అమృతాహారం" అనే కాన్సెప్ట్ తో వండకుండా మంచి పోషక విలువలతో, ఆరోగ్యానికి దోహదపడే లాంటి ఆహారం ఎలా అందించాలి అని వ్యాసాలు రాయించి, ఆయన కూడా రాసి తన ఫేస్బుక్ వాల్ మీద ప్రకటించి పుస్తకాలుగా వేయిస్తూ వస్తున్నారు. ఈ విషయం చాలామంది పాఠకులకు తెలుసు.



ఇప్పుడు ఈ ప్రస్తావన దేనికంటే....

తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గత ఐదుసంవత్సరాలుగా ఫేస్బుక్లో ఆయన వాల్ మీద "గుడ్ మార్నింగ్" అనే శీర్షికతో ప్రతిరోజు ఉదయం ఆరుగంటలకల్లా ఏదో ఒక విషయం మీద "సామాజికవ్యాఖ్యానం" చేస్తూ ఉన్నారు. ఆ వ్యాఖ్యానం దేని మీదైనా ఉండొచ్చు .ప్రస్తుత రాజకీయం మీద కావచ్చు, మానవ సంబంధాల మీద కావచ్చు, రైలు యాత్రలపై కావచ్చు, రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలపై కావచ్చు, లేదా మనుషులు ఎలా ఉన్నారు ? ఎలా ఉండాలి ? అనే విషయం మీద ఒక తాత్విక చర్చ లేపవచ్చు.

పురుగుల మందు వాడకం వల్ల జరిగే నష్టాలు,తాగుడుగురించి జీవితసత్యాలు, ప్రభుత్వాల చేతగానితనాలు ,వారి నిర్లిప్త ధోరణులు, ఇంకా ప్రస్తుత రాజకీయల గురించి ,ప్రజల గురించి,ప్రజలప్రవర్తన గురించి, మొక్కల నుండి అడవులవరకు,నదుల నుండి సముద్రం వరకు, ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య మీద తనదైన స్పష్టతతో, చాలా నిబద్ధతతో, చాలా ధైర్యంతో రాస్తూ వస్తున్నారు.

ఇలాంటి ఒక పని చేయడానికి చాలా ఓపిక ఉండాలి, శ్రద్ధ ఉండాలి ,బాధ్యత ఉండాలి. "దమ్మిడీ కలిసిరాని వ్యవహారం రా"... అని మా చిన్నతనంలో ఒమాట మా పెద్దలు అంటూ ఉండేవారు. అది ఈ పనికి వర్తిస్తుంది .ఈ పని చేస్తే డబ్బులు రావు. పేరు...? ఆయనకు ఎంతో కొంత ఉంది. కొత్తగా వచ్చేదేముంది . పైగా ఈ "గుడ్ మార్నింగ్" ఆర్డికల్స్ ని పుస్తకాలుగా ప్రచురిస్తున్నారు.దాన్లో కూడా డబ్బు రాదు, మరెందుకు చేస్తున్నారు అంటే... పుట్టినందుకు. జ్ఞానాన్ని సంపాదించినందుకు. ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలని తాపత్రయం తప్ప మరోటి కాదు,అది కూడా ఆయన తన రుణం తీర్చుకునే ప్రయత్నం మాత్రమే అని వినమ్రంగా చెబుతున్నారు.

ఇది ఇలా ఉంచితే..! అసలు ’ఐదు’ సంవత్సరాలు (ఇంకా ఆపలేదు) ప్రతిరోజు తెల్లవారుజామున లేచి వానొచ్చినా,వరదొచ్చినా, వ్యక్తిగతమైన ఈతి బాధలను, అనారోగ్యాలను, తట్టుకుంటూ... ఇలా వ్రాయడమంటే ఎంతో రాక్షస తపస్సు చేయాలి. ఇది ఎంత కష్టమో రచయితలైన వారికి అర్థమవుతుంది. చాలాకాలం క్రితం ఎవరో స్వర్గీయ ఎన్టీఆర్ గురించి చెబుతూ ...ఆయన క్రమశిక్షణ గురించి చెబుతూ, జీవితంలో తెల్లవారుజామున 2: 30 కి లేచి 6 గంటలకు కల్లా షూటింగ్ కి బయలుదేరుతారంటే, ముక్కు మీద వేలేసుకున్నాం, అసలు మనుషులు ఇంత పద్ధతిగా ఎలా బ్రతుకుతారా అని విస్తుపోతా0. ఇలాంటి మహానుభావులు రెండు జన్మలకు సరిపడా పనిచేస్తారు.

రఘోత్తమరెడ్డి "గుడ్ మార్నింగ్" శీర్షిక ద్వారా జనాలకు తను చెప్పాలనుకున్నది చెప్తున్నారు. విన్నా, వినకపోయినా ఆయన వ్యాఖ్యాన ప్రవాహం సాగూతూనే ఉంటుంది. కొడవటి కుటుంబరావు ఎక్కడో రాశారు... "దుడ్డు కర్ర పట్టుకొని సంఘానికి కాపలా కాయడం అంత కష్టమైన పని మరొకటి లేదు" అని. అవును నిజం.ఇలాంటి జీత0,భత్యం లేని ఉద్యోగం చాలా కష్టం.ఇలాంటి ఉద్యోగం చేసే వాళ్ళని... గిట్టని వాళ్లు.. "చ్యాదస్తపుమనుషులు" అని పిలుచుకుంటున్నారు. అయితే ఈ చాదస్తం ఏదో ఓమేరకి సమాజానికి మంచి చేస్తుంది. వ్యక్తిగత జీవితాన్ని బాధిస్తుంది, ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది, అయినా అలుపు లేకుండా ఆగకుండా ఆయన రాస్తూ నే ఉన్నారు. సమాజ హితం కోసం ఇలాంటి చాదస్తపు మనుషులని కాపాడుకోవాలి. అరుదైన మొక్కల లాగా.. అరుదైన పక్షుల లాగా.. అరుదైన పులుల లాగా... పట్టించుకోవాలి, ఇలాంటి వాళ్లు అరుదైపోతున్నారు. ఇవాల్టికి 1840 రోజులుగా ప్రతిరోజు మనకి "గుడ్ మార్నింగ్ "చెబుతూనే ఉన్నారు. మూగజీవుల పట్ల, ప్రకృతి పట్ల, సమాజం పట్ల ఆర్తిని మనతో పంచుకుంటున్నారు. తిరిగి మనo ఏమిఇవ్వగలం వీలైతే చదవడం, ఇంకా వీలైతే నచ్చిన విషయాలు ఆచరించడం, లేదా కనీసం ఆలోచించడం చేద్దాం. ఈ కొత్త సంవత్సరం కూడా కొత్తగా మనం ఆయనతో పాత ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇదే ఆయనకు మనం చెప్తున్న "గుడ్ మార్నింగ్"

గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది చెంబుతో తీసుకుంటే చెంబెడు, బిందెతో తీసుకుంటే బిందెడు, కానీ ప్రవాహం తగ్గదు,ఆగదు ఆయన జవసత్వాలతో ఇలాగే ఆరోగ్యంగా మరిన్ని విషయాలు మనతో పంచుకోవాలని, యాదాద్రిలో నివసిస్తున్న ఆయనకి ఆ యాదగిరి నరసింహస్వామి ఆరోగ్య, ఐశ్వర్యాలను అనుగ్రహించాలని ఆశిస్తూ.... రఘోత్తమ రెడ్డి మరింత ఉత్సాహంతో ముందుకుసాగాలని కోరుకుందాం...

-చైతన్య పిన్నమరాజు

సినీరచయిత

Read More
Next Story