ఎంత చూసినా తనివి నీరని అందం ‘తారాబు జలపాతం’ !
x

ఎంత చూసినా తనివి నీరని అందం ‘తారాబు జలపాతం’ !

ఇటీవల వెలుగులోకి వచ్చిన జలపాతం


పెదబయలు మండలం, పిట్టల బొర్ర గ్రామం దరి ఓ ఏడాది క్రితం ఒక కొత్త జలపాతాన్ని కనుగొన్నారు. స్థానిక గిరిజనులు తారాబు జలపాతం అని దీని పేరు. తారాబు అనేది జలపాతానికి అటు వైపు ఉన్న ఒక గిరి గ్రామం. ఈ మధ్యన ఇలాంటి కొత్త జలపాతాలు అందమైన కొండ శిఖరాలు ఇక్కడ అల్లూరి మన్యం జిల్లాలో వెలుగులోకి వస్తున్నాయి. కొత్తపల్లి జలపాతం, వంజంగి బోలింగమ్మ పర్వతం అలా ఇటీవల వెలుగులోకి వచ్చినవే. ఆ కోవలోదే ఈ తారాబు జలపాతం. ఒక నాటి నా డిగ్రీ విద్యార్థి చిన్నారావు బండి మీద ఈ వేళ ఉదయం తారాబు జలపాత సందర్శనానికి వెళ్ళాను. చోడవరంలో ఉంటున్న నేను పాడేరు మీదుగా గంగరాజుమాడుగుల గ్రామానికి చేరుకున్నాను.

అక్కడ నా కోసం చిన్నారావు ఎదురుచూస్తున్నాడు. చలి విపరీతంగా ఉంది. పైగా శీతాకాలం. స్వెట్టర్ వేసుకున్నాను కాని, ఇది సరిపోదని చిన్నారావు అనడంతో జి.మాడుగులలో ఒక మంకీ కాప్ కొని పెట్టుకున్నాను. అలాగే కొన్ని బిస్కెట్ పాకెట్స్, వాటర్ బాటిల్స్ కొనుక్కొని ఇద్దరం బండి మీద బయలుదేరాము. అందమైన గిరుల నడుమ బండి సాగిపోతున్నది, అద్భుతమైన నున్నని తారురోడ్లపై. మైదాన ప్రాంతాలలో ప్రస్తుతం ఉన్న దరిద్రగొట్టు రోడ్డు కంటే ఈ రోడ్లు చాలా బాగున్నాయి. అంత ఎండలో కూడా చలి పుడుతున్నది. ఒక వింతైన వెచ్చలి అనుభూతి. సింగర్భ లాంటి కొన్ని గ్రామాలు దాటాక ఒక మలుపులో ఒక విశాల క్షేత్రంలో 'వలిసెపూల' పాన్పు! తన పసుపు వర్ణపు మోముతో తల ఊపుతూ రమ్మని పిలుస్తుంది. చిన్నారావు తెచ్చిన కెమేరా పట్టుకొని పొలంలో దిగాము.

పసుపుపచ్చని కాశ్మీరి పట్టు శాలువలా కనిపిస్తున్న వలిసె చేనులో కెమేరా క్లిక్ మన్నది. ఒక వీడియో కూడా తీసుకొని ఈ సువర్ణ జ్ఞాపకాన్ని పదిలపరుచుకున్నాము. వలిసె గింజలతో గిరిజనులు నూనె తయారుచేస్తారట, దీనిని ఇక్కడ అలసనూనె అంటున్నారు. కూరల్లో వేసుకుంటే కమ్మగా ఉంటాయట. చకినాలు అనే పేరుతో వలిసె గింజలతో తియ్యని బెల్లం ఉండలు కూడా ఇక్కడివారు తయారుచేసుకొని తింటున్నారు. వలిసెపూల సువాసనని ఒళ్ళంతా పట్టించుకొని బండి ఎక్కాము. బండి నుర్మతి అనే పెద్ద ఊరు గుండా సాగిపోతున్నది. ఇక్కడ ఒక కొండ మీద పెద్ద పోలీస్ స్టేషన్ ఒకటి నిర్మించారు. ఎక్కడ చూసిన సి.ఆర్.పి. పోలీస్ దళాలే. ఈ ప్రాంతం ప్రధానంగా మావోయిస్ట్లు నడయాడే ప్రాంతం.

అరకులో వలిశ పూల సోయగం

ఇంచుమించు ఇక్కడ ప్రతి ఊరులో ఒకరిద్దరు వ్యక్తులు మావోయిస్టు పార్టీలో పనిచేస్తుంటారట. అందుకు తగ్గట్టుగానే ఈ ప్రాంతంలో అక్కడక్కడ మృత వీరుల స్మారక స్తూపాలు కూడా కనిపిస్తున్నాయి. అన్నట్టు ఇంకొక విషయం ఏమిటంటే ఈ నుర్మతి దాటాక వచ్చే అందమైన లోయలో ఒక కొండ వాలులో గుడ్లలను పొదుగుతున్న అడివి పక్షిలా తారసపడింది 'వాతపల్లి' గ్రామం. కొన్నేళ్ళ క్రితం పోలీసులు ఆ ఊళ్ళో మావోయిస్టులు వున్నారనే సమాచారంతో దాడి చేసి ఆ ఊరు గిరిమహిళలపై అత్యాచారం చేసారనే వార్త పత్రికల పతాకశీర్షికలకెత్తింది. అది రాష్ట్ర స్థాయిలో సంచలనాత్మకం కావడం, పౌర హక్కుల రక్షణ మహిళా బృందాలు, అలాగే అప్పటి తెలుగుదేశం నాయకురాలైన సినీనటి రోజా కూడా సంఘీభావం తెలుపుతూ ఇక్కడి కి రావడం, పోలీసులపై హైకోర్టులో కేసు కూడా నడుస్తుండడం జరిగింది. చిన్నారావు ఒక కొత్త విషయాన్ని చెప్పాడు మరి అది ఎంతవరకు నిజమో తెలియదు గాని, మావోయిస్టులే పోలీసులను ఇబ్బంది పెట్టడానికి గిరిమహిళలపై అత్యాచారం జరిగినట్టు సృష్టించి సంచలనం రేపేరని.

దూరాన మంచుతెరల వెనక ఉన్న వాకపల్లి గిరిజన గ్రామం

ఈ సంభాషణలో మునిగి ఉండగానే మద్దిగరువు గ్రామం వచ్చేసింది. నుర్మతి పోలీసులు నుర్మతి నుండి జి.మాడుగుల, జి.మాడుగుల నుండి నుర్మతి రోజుకు మూడు ట్రిప్పులు గిరిప్రజలకోసం టిక్కెట్టు లేకుండా, ఉచితంగా, ఆర్.టి.సి. బస్సుని తిప్పుతున్నారు. రవాణా సౌకర్యాలు అసలే లేని ఈ మారుమూల పేద గిరిప్రాంతంలో గిరిజనుల సౌకర్యార్థం పోలీసులు ఇలాంటి ఒక సేవా కార్యక్రమం చేస్తుండడం బహుదా ప్రశంసనీయం. ప్రజా పోలీసు అనే పదానికి సరైన అర్థం నాకిక్కడ కనిపించింది. అయితే ఉచిత బస్సు పోలీసుల వ్యూహమని ఇది మావోయిస్టు ప్రాంతం అయినందున ఇక్కడ నుంచి ఎవరు వెళ్తున్నారో ఎవరు వస్తున్నారో తెలుసుకోవడానికి ఈ బస్సుని నడుపుతున్నారని తెలిసింది. ఇంతవరకు చేసిన ప్రయాణంతో ఒక కొత్త వింతైన అనుభూతి రెక్కలల్లార్చుకొని వాలింది నామదిలో.

మద్దిగరువు ఒక సంత గ్రామము. మావోయిస్టులకు, గంజాయి రవాణాకు ఒక అడ్డాగా పేరుంది ఈ ఊరికి. ఈ ఊరి మీదుగానే బొయితిలి, కిల్లంకోట గ్రామాలకు పోవాలి. కిల్లంకోట గంజాయి మొక్కల పెంపకానికి రాష్ట్రస్థాయిలో పేరుపడింది. సరే, ఇక మేము వెళ్తున్నది పెదబయలు మండలం వైపు కదా! మద్దిగరువు దాటి “బొంగరం” అనే జంక్షన్కి చేరుకున్నాము. ఇక్కడ నుంచి ఆరంభమౌతుంది పెదబయలు మండలం ఇంతవరకు మేము ప్రయాణించినది గంగరాజుమాడుగుల మండలం గ్రామాలలో. బొంగరం జంక్షన్ నుండి తారాబు జలపాతానికి పోవు మార్గం పూర్తిగా కొండ అంచుల నుంచి పోయే మట్టి బాట. ఈబాట బొంగరం నుండి పుట్టకోట వరకు మొదటి భాగం. ఈ భాగంలో ఎత్తైన విశాలమైన కొండలు-కొండలన్ని విచిత్రంగా సన్నని గడ్డిపరకలతో నునుపుదేరి ఉన్నాయి.

వాటిపై ఒక్క చెట్టు కూడా మొలవలేదు. బౌద్ధ స్థూపాల్లా కనిపిస్తున్న ఈ నున్నని కొండలను చూస్తున్నప్పుడు ఒక సంభ్రమం ఒళ్ళంతా ప్రాకి గిలిగింతలు పెట్టింది. ఇట్లాంటి కొండలను నేను ఇంత వరకు జీవితంలో ఎరుగను. ఈ విషయాన్ని చిన్నారావుతో ఆశ్చర్యపడి చెపుతుంటే తను నవ్వుతూ “నేను ఈ ప్రాంతం వాడినే అయినా నాకే ఆశ్చర్యంగా ఉంది సార్! ఇక్కడ ఏమీ పండవు, పంట ఫలసాయము ఉండదు. పొయ్యి కిందికి కట్టెలు కూడా దొరకవు. అక్కడక్కడ ఈ కొండలపై ఏపుగా పెరిగిన ఆ పొడవాటి గడ్డిని చూసారుసారూ, దానిని 'జుమ్మగడ్డి' అంటారండీ, ఆ గడ్డినే కోసుకొని వంటచెరకుగా ఉపయోగించుకుంటారు, ఇంటి పైకప్పు నేతకు కూడా ఈ గడ్డినే వాడుతారు” అని అన్నాడు. నేను ఒకపక్క కదులుతూ పోతున్న మన్యం దృశ్యాలను చూస్తూనే మరోపక్క చిన్నారావు చెపుతున్న కబుర్లను ఆసక్తిగా వింటున్నాను. “ఇక్కడివాళ్ళకి ప్రభుత్వం సరఫరా చేస్తున్న గ్యాస్ దిమ్మలే వంటకు ఆధారం సార్.

నక్కతోట గడ్డి

మరి ఈ గ్యాస్ బండలు నిండుకుంటే కొనుక్కోవడానికి ఉండాలికదా సార్! పంట ఫలసాయము ఉండదు అందుకని వీరు డబ్బుల కోసం గంజాయిని అమ్ముకుంటూ బతుకుతుంటారండీ. వారికి మరివేరే త్రోవలేదు” చిన్నారావు తన విశ్లేషనను బండి నడుపుతూనే చెప్పుకుపోతున్నాడు. సభ్య సమాజానికి ఏ గంజాయి నిషిద్దమో అది ఇక్కడి వారికీ ఒక జీవిత అవసరము అన్నది చిన్నారావు లాజిక్. “పోలీసులకు కూడా ఈ విషయము తెలుసు సార్, అందుకని ఒక్కోసారి చూసి చూడనట్టు వదిలేస్తుంటారు” అంటూ చిన్నారావు ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. ఈ మహా దుర్గమ పర్వతాలని, వాటి అంచుల వెంబడి పోతున్న మట్టి బాటని, కొండ వంచులను చూస్తున్నప్పుడు చరిత్ర లో చదువుకున్న కైబర్, బోలాన్ పాస్ ఇలానే వుంటాయేమో అనిపించింది.

ఈ కొండలపై చెట్టు మొలవకుండా కేవలము గడ్డి మాత్రమే మొలవడం ఏమిటా అని ఆలోచనలో పడ్డాను. అక్కడక్కడ పశువులు, మేకలు గడ్డిని మేస్తున్న దృశ్యాలు కూడా కళ్ళలో పడ్డాయి. ఇంకొక విషయం-ఇక్కడ గిరిజనులు నేటికి గుర్రాలను వాడుతున్నారు. సామానులు మోసుకు పోవడానికి, ప్రయాణాలకు ఇక్కడ గుర్రాలే సహాయపడుతున్నాయి. అయితే, ఇటీవల ప్రతి గ్రామానికి రోడ్లు పడడం ద్విచక్ర వాహనాలు కూడా అందుబాటులోకి రావడంతో గుర్రాల వాడకం తగ్గిందనే చెప్పాలి. తిండి తిప్పలు లేకపోయిన ఇక్కడ మన్యంలో ప్రతి ఇంటికి ఒక మోటారు సైకిల్ తప్పనిసరిగా ఉంటుంది అన్నాడు చిన్నారావు. సెల్ టవర్స్ అక్కడక్కడ కనిపిస్తున్నా ఈ మన్యం చాలావరకు ఇంకా నోకవరేజ్ ఏరియా గానే ఉన్నది. సిగ్నల్స్ అసలు పడటం లేదు.

పుట్టకోట జంక్షన్ నుండి గిల్లి గేడ్డవరకు ఈ మట్టి దారిలో రెండవ భాగము. గిల్లి గెడ్డ దాటి అవతలకు పొతే గిన్నెల కోట గ్రామం వస్తుంది. ఈ గెడ్డ నుండి తారాబు జలపాతం ఉన్న పిట్టల బొర్ర ఊరు వరకు ఉన్నది చివరి భాగము. అసలు సిసలైన సాహస యాత్ర ఈ భాగంలోనే ఉంటుంది. ఇది పూర్తిగా అడివి. అక్కడక్కడ ఊళ్ళు, దారంతా మట్టి, ధూళి, గులకరాళ్ళు, కొన్ని కిలోమీటర్ ల వరకు అయితే పూర్తిగా కోసుదేరిన పెద్ద పెద్ద రాళ్ళతో నిండి ఉంటుంది ఈ బాట. బండి గుర్రంలగా ఎగురుతుండేది. చిన్నారావు అంటున్నాడు “డ్రైవింగ్ సరిగా వచ్చినోల్లె గాని అండీ, లేకపోతే బండి తిరగాబదిపోతుంది సార్”. అంత భయంకరంగా ఉంది తోవ. ఊపిరి బిగబట్టి ఇద్దరం పయనించాం. స్థానికుడిన చిన్నారావు కూడా గాబరా పడిపోయాడు. ఆఖరికి ఒక దగ్గర మా బండి తూలి స్లిప్ అయ్యి, బండితో పాటు మేము కూడా కింద పడిపోయాము. బండి కాస్త నెమ్మదిగా వెళుతున్నది కానీ లేకపోతే ఆ మొనదేలిన రాళ్ళ పై పడి మా బుర్రలు బద్దలయ్యేవి.


నిజమైన సాహసం చేసాం ఈవేళ మేము పిట్టల బొర్రా చేరుకునే సరికి మిట్ట మధ్యానం ఒంటిగంట నలభై నిముషాలు అయింది. జి.మడుగుల నుండి ఇక్కడికి ప్రయాణం రెండుగంటల పైనే పడింది. బాగా చెమట పట్టి అలిసి పోయాము పైగా ఆకలి ఒకటి! కొన్ని బిస్కెట్స్ తిని, నీళ్ళు తాగి పిట్టల బొర్రా గరువు చెట్ల నీడలో బండిని నిలిపి నడుస్తూ తారాబు జలపాతం వైపుగా అడుగులు వెయ్యసాగాము. పిట్టల బొర్ర నుండి జలపాతానికి నడిచి పోవలిసినదే. వాహనాలు నేరుగా పోవు. ఆ మిట్టమధ్యానం వేళ భయంకరమైన దారి లో పయనించి వచ్చి అలిసిపోయి, డస్సిపోయి ఉన్న మేము ఆ క్షణాన మరో కిలోమీటరున్నర నడిచి వెళ్ళాలంటే అయ్యేపనేనా!? అయినను పోయి రావలె. ప్రాణాలకు తెగించి వేల్తున్నట్టే నాకైతే అనిపించింది.

పిట్టల బొర్రా ఊరు సమీపిస్తున్నదనగా దారి పక్కన ఒక దగ్గర బొడ్డ చెట్లు తోపు కనిపించింది. ఈ చెట్లు కింద కర్రలతో పందిరి వేసి, పందిరి లోపల రాళ్ళను ఒకదాని మీద ఒకటి పేర్చి ఉంచారు. అక్కడ వేరే వారిని అడిగితే ఇది పోతురాజు గుడి అని చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అక్కడ కనీసం ఒక విగ్రహమైనా లేదు కొన్ని రాళ్ళు పేర్చి వాటిని పోతురాజు అంటున్నారు. ప్రతి గిరిగ్రమంలో కూడా ఇదే తంతు. పోతురాజు, శంకు దేవుడు, జాంకరమ్మ ఇట్లాంటి దేవతలను ఆరాదించే సంప్రదాయం ఈ మన్నెంలో కనిపిస్తుంది. ఈ పోతురాజు గుడి ఎదురుగా రోడ్డుకి అటువైపున ఉన్న తుప్పలు డొంకలలో ఒక పాడుబడిన ఇటుకల నిర్మాణం కనిపిస్తున్నది. ఇది మృతి చెందిన “అన్న” కోసం నిర్మించిన స్థూపమని తెలిసింది.

పిట్టల బొర్రా వద్ద గరువులో నడుచుకుంటూ తారాబు జలపాతం వైపు పోతున్నాము. అక్కడ రాగులు, సామలు మొదలైన పంట చేలను దాటుకుంటూ కొంత దూరం వెళ్లేసరికి ఒక ఎత్తైన కొండ ఆ కొండ కిందికి పోతున్న ఒక ఇరుకైన దారి కనిపించింది. ఒక మనిషి వెనుక మరో మనిషి వెళ్ళాల్సిన ఇరుకు దారి ఇది. కొద్ది దూరం దిగామో లేదో దారి మరీ కోసుగా తొంబై డిగ్రీల కోణంలో కిందికి పోతుంటే నేను తూగుతూ బాలన్స్ చేసుకోలేక పడిపోవడం ఖాయం అనిపించింది. గుండెలు గుభేల్ మన్నాయి. కిందికి చూస్తె దారి ఆ కొండ చెట్ల నడుమ ఇంకా లోతులోకి సాగి పోతున్నది. కనుచూపు మేరలో జలపాతపు జాడ కనిపించడమే లేదు. నా ఒంట్లో చమటలు గుండెలో భయం.

నా ముందు త్వరగా పోతున్న చిన్నరావుని ఆగమని చెప్పి అతని చెయ్యిని గట్టిగా పట్టుకొని నేను వెనకాల అడుగులో అడుగు వేసుకుంటూ నడిచాను. కాళ్ళు విలవిల లాడిపోతున్నాయి, ముడుకులు పట్టు వదిలేసాయి. ఎంత దిగుతున్నా తోవ తరగదే ఇదేమిటిరా భగవంతుడా ఈ శిక్ష, అనవరసంగా సాహసించానా అనిపించింది. రాను రానూ తోవ మరీ దుర్గమమైపోయింది. ఎంత దిగుతున్నా ఇంకా క్రిందికి పోతున్నది. నేను చిన్నారావు చేతిని వదలలేదు. కాళ్ళు విలవిలలాడిపోతున్నాయి. నేల మీద అసలు నిలవడం లేదు. పైగా దారిలో చెట్ల వేర్లు, పగిలిన రాళ్ళ ముక్కలు, వాటి మీద నుంచి జాగ్రత్తగా అడుగులు వేసుకొని వెళ్ళాల్సిన క్లిష్ట పరిస్తితి దాపరించింది. అలానే దిగుతున్నాం, ఒక దగ్గరికి వచ్చేటప్పటికి ఇక దిగలేనని నిల్చుండిపోయాను.

అక్కడికి మరికొంత దూరం దిగితే సరిపోతుంది కాని, ఇదే అత్యంత క్లిష్టమైన భాగము. ఇది దాటేస్తే జలపాతం సన్నిధికి చేరుకున్నట్టే చిన్నారావు నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు, ధైర్యం చెబుతున్నాడు, చెయ్యి సాయం యిస్తున్నాడు. మొత్తానికి ఎలాగో సాహసం చేసి ఆ నాలుగడుగులు దిగిపోయాను. అదిగో... అల్లదిగో... చెట్ల కొమ్మల సందులోంచి, గుబురు పొదల మాటు నుంచి ఆకాశం మీద నుంచి ఎదో ధవళ వర్ణపు కాంతి దుముకు తున్న దృశ్యం, దివ్య సంగీతం ఒక దాని తరువాత ఒకటి ఒకే సారి కలిసి ఎదురుగా ప్రత్యక్షం. నా కళ్ళను నా చెవులను నేను నమ్మలేకపోయాను. అయితే నేను నిల్చున్న ఆ దిగుడు వాలు నుంచి కనిపిస్తున్నది పూర్తి జలపాతం దృశ్యం కాదు. అక్కడ నుండి మరో మూడు అడుగులు ఇంకా కిందికి దిగాలి.

తోవ పూర్తిగా తడిచి వుంది. కాళ్ళు జారుతున్నాయి. భయం వేస్తుంది. అయినా దిగక తప్పదు. చిన్నారావు చేతిని మరింత గట్టిగా పట్టుకొని ఎట్టకేలకు దిగాల్సిన స్థలంలోకి అడుగులు వేయగలిగాను. ఎదురుగా పూర్తి జలపాతం కనువిందు చేస్తున్నది. మూడు నాలుగు పాయలు గా చీలి అత్యంత ఎత్తునుంచి పడుతున్న జలపాతాన్ని చూడగానే ఒక్కసారి నా రెండు చేతులు నాకు తెలియకుండానే పైకి లేచి నా నేత్రాలు రెండు రెప్పలు దించుకొని వినమ్రంగా జలపాతాన్ని నమస్కరించుకున్నాయి. ఇదొక అసంకల్పిత చర్య. నాకెప్పుడూ అనుభావములోకి రాని వింత అనుభూతి. జలపాతాన్ని చూడగానే వడలు పులకించి పోయాయి, కళ్ళ నిండా కాంతులు, అంతవరకూ పడ్డ శ్రమ ఆవిరి అయిపోయి ఆనందం దివ్యలోకపుటంచులకు ఎగసింది.

జలపాతం నుంచి వస్తున్న నీటి తుంపరలు అక్కడే వున్న మా మేనులు, తలలు పూర్తిగా తడిసిపోతున్నాయి అయినా లెక్కచేయక ఆ దివ్య సౌందర్యంలో మునిగిపోయి ఉన్నాము. ఇంకా కిందికి దిగి జలపాతం పడుతున్న దగ్గరికి వెళ్ళవచ్చు కూడా చిన్నారావు వెళ్ళాడు కాని నేను మరి సాహసం చెయ్యలేదు. అక్కడే నిలబడి పరిసారాలన్నిటిని నా కళ్ళల్లో నిక్షిప్తం చేసుకున్నాను. ఒక జీవితకాల అనుభూతిని మూట కట్టుకున్నాను. అసలు నాకు ఆ స్థలాన్ని విడిచి రాబుద్ది కాలేదు. ప్రత్యక్షంగా అనుభవించే వాళ్ళదే ఆ దివ్యానుభూతి. అది నాకు ఈ వేళ లభించింది. ప్రకృతే భగవంతుడు. ఆ వైభవాన్ని చూసి తరిచాల్సిందే. తిరుగు ప్రయాణంలో కొండ ఎలా ఎక్కనో నాకే తెలియదు. ఎక్కి పిట్టల బొర్రా గరువు చేరే టప్పటికి నా దేహమంతా చెమట బిందువుల జలపాతం అయిపొయింది. ఎన్నో అనుభూతులను తలకెత్తుకొని నేను ఒక కొత్త మానవునిగా తిరిగొచ్చాను.

Read More
Next Story