
Sorce :X post/Amrabad Tiger Reserve:అమ్రాబాద్ అభయారణ్యంలో సంచరిస్తున్న పులి
పులుల పునరుజ్జీవం: తెలంగాణ అడవుల్లో పెరుగుతున్న టైగర్ జనాభా
పది నుంచి నలభై రెండుకు… అమ్రాబాద్ అడవిలో పులుల అద్భుత ప్రయాణం...
తెలంగాణ అడవుల్లో మళ్లీ పులుల గర్జన వినిపిస్తోంది. తాజా అఖిల భారత పులుల గణనలో రాష్ట్రంలోని అడవుల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు వెల్లడైంది. ముఖ్యంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య 42కు చేరుకోవడం అటవీ సంరక్షణ చర్యల విజయానికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఒకప్పుడు నిశ్శబ్దంగా మారిన అడవులు… ఇప్పుడు పులుల పాదముద్రలతో కళకళలాడుతున్నాయి. అగ్నిప్రమాదాల నియంత్రణ నుంచి గడ్డి భూముల అభివృద్ధి వరకు చేపట్టిన సంరక్షణ చర్యల ఫలితంగా తెలంగాణ అడవుల్లో పులుల సంఖ్య ఆశాజనకంగా పెరుగుతోంది.దీంతో నల్లమల అడవుల్లో మళ్లీ రాజసం కనిపిస్తోంది. తాజా పులుల గణన రాష్ట్ర జీవవైవిధ్యానికి శుభవార్తగా మారింది.
ముగిసిన పులుల గణన
తెలంగాణ రాష్ట్రంలోని అడవుల్లో పులుల సంఖ్య పెరిగిందని తాజాగా జరిగిన పులుల గణనలో వెల్లడైంది.ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (AITE)-2026 కార్యక్రమంలో భాగంగా జనవరి 19 నుంచి 25వతేదీ వరకు ఆరు రోజులపాటు అడవుల్లో పులులు, వన్యప్రాణుల సమగ్ర శాస్త్రీయ సర్వే జరిగింది.తెలంగాణలోని పులుల గణన సమాచారాన్ని అటవీశాఖకు చెందిన సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారులైన అమ్రాబాద్, కవాల్ ఫారెస్టుల ఫీల్డ్ డైరెక్టర్లు ఎస్ సునీల్ హీరేమత్.శాంతారామ్ లు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు పంపించారు.
పెరిగిన పులుల సంఖ్య
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో గతంలో 36 పులులుండగా, తాజా గణనలో వీటి సంఖ్య 42కు పెరిగింది. మరో వైపు కవాల్ పులుల అభయారణ్యంలోకి పొరుగున ఉన్న మహారాష్ట్ర అభయారణ్యాల నుంచి పులులు వలస రావడంతో ఇక్కడ కూడా అయిదు పులులు గణనలో వెలుగుచూశాయి. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అటవీశాఖ అధికారులు, వాలంటీర్లు చేసిన సర్వేలో 32 జిల్లాల్లోని అటవీ బీట్‌లలో 994 పులులు, వన్యప్రాణులు,మాంసాహార జంతువులున్నాయని తేలింది.అడవుల్లో శాకాహార జంతువులు 552 ఉన్నట్లు గణనలో వెల్లడైంది. పులులతోపాటు ఇతర వన్యప్రాణులు, గడ్డి భూములు, అడవుల్లో నీటి వనరులు పెరగడం, 200 మంది చెంచులను అవుట్ సోర్సింగ్ యాంటీ పోచింగ్ స్క్వాడ్ లోకి తీసుకోవడం, వేటగాళ్లకు చెక్ పెట్టడం, గడ్డి భూములు పెరగడంతో జింకల సంఖ్య పెరగడంతో పులుల సంఖ్య పెరిగిందని తేలింది. వన్యప్రాణుల సంఖ్య పెరగడం, అటవీ సంరక్షణ చర్యలతో తెలంగాణలో జీవవైవిధ్యం ఉట్టిపడుతుంది.
పర్యాటకులకు 50 పులుల సైటింగ్స్ రికార్డు
తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో పులుల సంఖ్య ఏ యేటి కా ఏడు పెరుగుతూనే ఉన్నాయని తాజాగా పులుల గణనలో పాల్గొన్న వాలంటీర్ వెంకట్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ నిర్వహించిన సఫారీ యాత్రల్లో పర్యాటకులకు అమ్రాబాద్ అడవిలో 50 పులులు దర్శనమిచ్చాయి. పులుల గర్జనలు, వాటి సంచారం చూసిన పర్యాటకులు సంతోషం వ్యక్తం చేశారు. 512 మంది అటవీ శాఖ సిబ్బంది,1,677 మంది వాలంటీర్లు జాతీయ అఖిల భారత పులుల గణనలో పాల్గొని విజయవంతంగా అడవిలో పులులు, వన్యప్రాణులను గణించారని అమ్రాబాద్ అభయారణ్యం ఫీల్డ్ డైరెక్టర్ ఎస్ సునీల్ హీరేమత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ గణనలో అటవీశాఖ వాచర్ ఒకరు గుండెపోటుతో మృతి , ఎలుగుబంటి దాడిలో ఇద్దరు గాయపడ్డారు.
అమ్రాబాద్ లో 10 నుంచి పెరిగిన వైనం...
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో 2017 వ సంవత్సరంలో జరిగిన పులుల గణనలో కేవలం పది పులులే ఉన్నాయని వెల్లడైంది. అలా ఏటేటా పెరుగుతూ ప్రస్థుతం 42కు పైగా పులులున్నాయని తేలింది. 2018వ సంవత్సంరలో అమ్రాబాద్ లో ఏడు పులులే కనిపించాయి. 2019లో 12 పులులు దర్శనమిచ్చాయి. 2020లో 12 పులులుండగా, 2021లో వీటి సంఖ్య 14కు పెరిగింది. 2022లో 21 పులులుండగా 2024వ సంవత్సరానికల్లా వీటి సంఖ్య 33కు పెరిగాయి. 2025వ సంవత్సరంలో 36 పులులుండగా తాజా గణనలో వీటి సంఖ్య 42కు పెరిగాయని అనధికార అంచనా.
ఆడపులి కోసం మగపులి సుదూర ప్రయాణం
మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యానికి చెందిన ఒక మగ పులి ఐదు జిల్లాల మీదుగా 400 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. మహారాష్ట్ర పులి యాదాద్రి భువనగిరి జిల్లాలోకి ప్రవేశించి భయాందోళనలు సృష్టిస్తుంది.ఆడపులిని ఆకర్షించడానికి,మగపులి మూత్రం చల్లడం, చెట్లకు ఒంటిని రుద్దడం, కాండాలను గోకడం, అడవిలోని వివిధ భాగాల్లో మలవిసర్జన చేయడం వంటి వివిధ సంకేతాలను ఉపయోగిస్తుంది.యాదాద్రి ప్రాంతంలో సంచరిస్తున్న మగ పులి జత కోసం వెతుకుతోందని అటవీ అధికారులు ధృవీకరించారు.
పులుల కదలికలపై ప్రత్యేక బృందాల ఆరా
మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యంలో పులుల సంఖ్య పెరగడంతో టెరిటరీ కోసం అక్కడి నుంచి పులులు తెలంగాణ కవాల్ అడవి వైపు వస్తున్నాయని వెల్లడవడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలంగాణ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ క్షితిజ చెప్పారు. పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో పులుల కదలిక ఉన్నట్లు అటవీశాఖ టైగర్ సెల్ కు సమాచారం అందింది. కవాల్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ల నుంచి టైగర్ ట్రాకర్‌లను కూడా అప్రమత్తం చేశామని కవాల్ ఫారెస్ట్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారామ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు తెలిపారు.
కవాల్ అభయారణ్యం నుంచి ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి సలీం షేక్
టైగర్ ట్రాకర్ల మోహరింపు
తెలంగాాణలోని పలు జిల్లాల్లో పులుల సంచారంపై నివేదికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి అటవీశాఖ నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. ట్రాప్ బోన్లు, టైగర్ ట్రాకర్ల మోహరింపుతో సహా పలు చర్యలను అటవీ శాఖ ముమ్మరం చేసింది.అటవీ అధికారులు, పశువైద్య అధికారులు, ప్రభుత్వేతర సంస్థలు, వన్యప్రాణుల నిపుణులు,పంచాయతీ రాజ్ సిబ్బందితో కూడిన ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేశారు.డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీతో కూడిన రాష్ట్ర స్థాయి సాంకేతిక బృందాన్ని రెండు రోజుల్లో రప్పిస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు.పులుల కదలికలను గుర్తించేందుకు వీలుగా కోయ, చెంచు గిరిజనుల ట్రాకర్స్, థర్మల్ డ్రోన్లు, ట్రాంక్విలిజింగ్ టీంలను రంగంలోకి దించామని అటవీశాఖ సీనియర్ అధికారి ఆంజనేయులు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
Sorce:Amrabad Tiger Reserve:అమ్రాబాద్ అభయారణ్యంలో పులుల గణనలో పాల్గొన్న అటవీశాఖ అధికారులు
అమ్రాబాద్ పులుల సంఖ్య ఎలా పెరిగిందంటే...
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో పులుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం అడవిలో అగ్నిప్రమాదాలను నివారించి గడ్డి భూములను అభివృద్ధి చేశారు. అడవిలో చెక్ డ్యాములతోపాటు 40కి పైగా సోలార్ బోర్లను ఏర్పాటు చేసి కుంటల ద్వారా వన్యప్రాణులకు నీటిని అందుబాటులో ఉంచారు. గడ్డిభూములు పెరగడంతో జింకలు, దుప్పుల సంఖ్య విపరీతంగా పెరిగిందని అమ్రాబాద్ అభయారణ్యం ఫీల్డ్ డైరెక్టర్ ఎస్ సునీల్ హీరేమత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ఆహారంగా కావాల్సిన జింకలు,చీతల్, సాంబార్, నీలుగాయి, అడవి పందులు, ఇతర వన్యప్రాణుల సంఖ్య విపరీతంగా పెరగడంతో పులుల సంఖ్య పెరిగిందని ఆయన తెలిపారు. అడవిలో ఆక్రమణలను తొలగించి ప్లాంటేషన్ చేపట్టారు. అచ్చంపేట, అమ్రాబాద్ అడవిలో వట్టిముక్కల కుంట, దాడోని బండ, పెద్ద జాలు, దిల్లార్ తిప్ప, పోతురాజ్ తిప్ప ప్రాంతాల్లో 5,539 హెక్టార్లలో ప్లాంటేషన్ కార్యక్రమం కింద మొక్కలు నాటారు.
అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం
నల్లమల అటవీ ప్రాంతంలో భాగమైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పలు రకాల వృక్ష, జంతు జాతులతో కూడిన గొప్ప జీవవైవిధ్యం ఉంది.ఈ అటవీ ప్రాంతం తెలంగాణలోనే అత్యధిక సంఖ్యలో పులులకు నిలయంగా ఉంది. లోతైన లోయలు, కొండచరియలతో కూడిన ఈ టైగర్ రిజర్వ్ కొండ ప్రాంతం కృష్ణా నదికి పరీవాహక ప్రాంతంగా ఉంది.ఈ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) భారతదేశంలోని అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రాల్లో ఒకటి. ఇది తెలంగాణలోని నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాల్లో 2611.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, తూర్పు కనుమల శ్రేణిలో భాగమైన నల్లమల కొండల్లో ప్రసిద్ధ, సురక్షితమైన ప్రకృతి సంరక్షణ కేంద్రంగా నిలిచింది.
అడవులను కాపాడితే పులులు తిరిగి వస్తాయని తెలంగాణ మరోసారి నిరూపించింది. గడ్డి భూముల అభివృద్ధి, నీటి వనరుల పెంపు, వేట నిరోధక చర్యలతో అడవుల్లో జీవవైవిధ్యం పుంజుకుంటోంది. ఈ విజయాన్ని కొనసాగించగలిగితే తెలంగాణ అడవులు భవిష్యత్తులో మరింత పులుల గర్జనతో మారుమోగడం ఖాయం.పులులు పెరిగాయి… అడవులు బతికాయి… ఇప్పుడు వాటిని కాపాడాల్సిన బాధ్యత మనదే.
Next Story

