
సాయుధ ఉద్యమం నుండి సేంద్రియ సాగు వైపు..
గిరిజన గ్రామమే అయినా ఉద్యమాల గడ్డ.. ఆరు దశాబ్దాల క్రితం ఒకసారి మళ్ళీ ఇప్పుడు..
ఆరు దశాబ్దాల క్రితం ఈ ఈ సవర గిరిజన గ్రామంలో వెంపటాపు సత్యం అనే బడిపంతులు భూమికోసం, భుక్తి కోసం ఉద్యమిస్తూ, ప్రజలకు సాయుధ విప్లవపాఠాలు బోధించాడు. నేడు అదే చోట మరో కొత్త ఉద్యమం పుట్టింది. రసాయన ఎరువుల నుండి భూమిని కాపాడడానికి మరో ఉపాధ్యాయుడు సేంద్రియ విప్లవం సృష్టించాడు. ఆయన పేరు పారినాయుడు.
ఆంధ్రా, ఒడిశా సరిహద్దుకు దగ్గరలో ఒక మారుమూల ఆది వాసీ పల్లె అది. అక్కడి పొలాల్లో అడుగుపెడితే, గోరింకలు,పాలపిట్టలు,పిచ్చుకల రెక్కలు రెపరెప కొట్టుకుంటూ గాలిలోకి లేస్తుంటాయి. రసాయన ఎరువులు లేని ఈ మట్టిపరిమళం ఈ జీవాలకు నీడైంది. ఇక్కడి ప్రజలు ఐక్యతా, ఆలోచనా తీరే ఆ నేలను స్వచ్ఛంగా మార్చింది. భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి గ్రామ సంఘాలుగా ఏర్పడి, సేంద్రియ సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. పురుగుమందులను తమ దరిదాపుల్లోకైనా రానివ్వకుండా, తొలి సేంద్రియ గ్రామంగా గుర్తింపు తెచ్చారు.
కొండబారిడి గ్రామం
మూడు కొండల మధ్య ఊరు
విజయనగం జిల్లా, కురుపాం మండలం లో పెదకొండ,తోటకొండ,తివ్వకొండల మధ్య ఉన్నది కొండబారిడిలో వ్యవసాయం తప్ప మరో జీవనాధారం లేదు. 70 కుటుంబాలున్నాయి. 2017లో 90 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టారు.
ఒకపుడు సంప్రదాయ పద్ధతులతో వ్యవసాయం చేసే ఈ కొండ ప్రజలు పెట్టుబడి తగ్గించి నేలకు హాని లేని ప్రకృతి పంటలు అభివృద్ధి చేసుకోవాలనుకొని సంఘాలుగా ఏర్పడి ‘జట్టు ట్రస్టు’ తో జతకట్టి, శిక్షణ తీసుకున్నారు. పశువుల పేడా, గోమూత్రం, పప్పుదినుసుల పిండీ, బెల్లం, పుట్టమట్టిని కలిపి ఈ మిశ్రమంతో ఘన, జీవామృతం తయారు చేశారు.
ఊరుని మార్చిన టీచరు పారినాయుడు
ముందుగా కొంత భూమిలో ప్రయోగాత్మకంగా, వారు తయారు చేసిన సేంద్రియ ఎరువులను ఉపయోగించి, సాగు చేశారు. మంచి ఫలితాలు రావడంతో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు కూడా ప్రకృతి వ్యవసాయంలో పాలుపంచుకున్నారు. గ్రామంలో 30 మంది మహిళలు సేంద్రియ ఎరువులను తమ పొలాల కోసం తయారు చేసుకుంటున్నారు. గోవు పేడలో గోమూత్రం కలిపి ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు. ఈ ఘనామృతాన్ని చివరి దుక్కిలో, పంట కాపు దశలో వినియోగిస్తారు. అలాగే గోమూత్రం, ఆవుపేడా, బెల్లం, పప్పుదినుసుల పిండీ, పుట్ట మట్టిని కలిపి రెండు రోజులపాటు నిల్వ చేస్తారు.
కషాయాలు తయారీలో రైతమ్మలు
‘‘ ఈ జీవామృతం తోపాటు, పుల్లని మజ్జిగను చీడపీడల్ని నివారించేందుకు పంటలకు పిచికారి చేస్తాం మొదట్లో దీన్ని శ్రీవరికి మాత్రమే ఉపయోగించినా ఇపుడు అన్ని పంటలకు వేస్తున్నాం.. మాకు ఎనిమిది మహిళా సంఘాలున్నాయి. సాగుకు ముందు, మేమంతా బీజామృతం తయారు చేసి విత్తన శుద్ధి చేస్తాం. ప్రతీ పొలం దగ్గర జీవామృతం నింపిన డ్రమ్ములుంటాయి.’’ అంటారు ఊరి సర్పంచ్ మంజువాణి.
కొండబారిడి సర్పంచ్ మంజువాణి.
వరితో పాటు జీడి,కంది,వంటి పంటల సాగులో వీరు సేంద్రియ వ్యవసాయ విధానాలే అనుసరిస్తున్నారు. పూత,కాపు దశల్లో పుల్లని మజ్జిగ, లేదా పంచగవ్యను పిచికారీ చేస్తూ, పంటలు పండిస్తున్నారు.
పోషకాహార లోపాలు తగ్గాయి
ఈ గ్రామస్తులు చేస్తోన్న ప్రకృతి వ్యవసాయం వారికి మంచి ఫలితాలను ఇస్తోంది.ఈ విధానాలతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే కాకుండా నేల కాలుష్యానీ తగ్గిస్తూ పర్యావరణాన్ని కాపాడుతున్నారు. సేంద్రియ ఎరువుల తయారీకి కావాల్సిన పశు వ్యర్ధాల కోసం ప్రతి ఇంట్లో ఆవులో,గేదెలో తప్పకుండా పెంచుకుంటున్నారు. వీడర్లతో కలుపును తీసి, మట్టిలో కలిపేసి ఎరువుగా తయారు చేస్తున్నారు,ఇది పంటకు బలాన్నిస్తుంది.
ప్రతీ ఇంట దంపుడు బియ్యం తయారీ
‘ ప్రతీ ఇంట్లో దంపుడు బియ్యం తయారు చేస్తారు. అలా 30 మందికి ఉపాధి కలిగింది. ఎవరికివారు దంచుకుంటే శరీరానికి ,ఆరోగ్యానికి మంచిది ’’ అంటారు గ్రామస్తులు. భూమిలేని పేదలకు ఉపాధి కోసం, దంపుడు బియ్యం తయారీ కేంద్రం పెట్టాలని ఊరంతా నిర్ణయించారు. నీమాస్త్రం,బ్రహ్మాస్త్రం వంటి కషాయాలు నామమాత్రపు ధరకు విక్రయించడానికి ఒక షాపును ఏర్పాటు చేశారు.
రసాయనాలు వాడకుండా పండిరచిన కూరగాయలు
స్వయం సమృద్ధి
వెనుకబడిన ప్రాంతమనీ, అక్షరాస్యత లేదనీ, అవకాశాలు తక్కువనీ నిరుత్సాహపడకుండా తమకాళ్లపై తాము నిలబడి వ్వవసాయ రంగానికి కొత్త దారిని చూపిస్తున్నారు ఈ కొండబారిడి ప్రజలు.
పారినాయుడు గారితో జర్నలిస్టు శ్యాంమోహన్
‘మా ఊళ్లో సేంద్రియ ఎరువులతో పంటలు పండిరచుకుంటూ, వాటిని మిల్లులకు పంప కుండా సొంతంగానే దంపుడు బియ్యం చేసుకుంటున్నాం, మహిళా పొదుపు సంఘాలను రైతు సంఘంగా అభివృద్ధిపరిచాము. రైతులకు అండగా నిలవాలి, వారు పండిరచే పంటకు గిట్టుబాటు అందించాలి. విత్తనాల ఉత్పత్తి, సాగు పద్ధతిలో అన్ని విషయాల్లో వారికి అవగాహన కల్పించాలి. మా ప్రధాన ఉద్దేశాలు ఇవే. ఎలాంటి లాభాపేక్ష లేకుండా.. తమ ఊరిని మార్చడానికి, గిరిజన రైతులే ముందుకొచ్చి ఏర్పాటు చేసుకున్న సంస్థ ఇది. పది మందితో మొదలైన వందమంది సభ్యులున్నారు. ఒక గ్రామంతో మొదలై రెండు వందల సేంద్రియ గ్రామాలు రూపొందుతున్నాయి.’’ అంటారు ఈ ఊరి మార్పు వెనుక కీలకపాత్ర పోషించిన జట్టు ట్రస్టు వ్వవస్దాపకుడు, రిటైర్డు టీచర్ పారినాయుడు.
రైతు సాధికార సంస్ధ, అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ వీరికి సహకరిస్తున్నారు.
ఒక్క ఈ గ్రామమే కాదు.. చుట్టుపక్కల మరిన్ని గ్రామాలు జట్టుట్రస్టు సేవలు అందుకుంటున్నాయి. సాగుబడిలో అడుగడుగునా సంస్థ సహకారం తీసుకుంటూ ముందుకుసాగుతున్నారు. దేశానికి వెన్నెముకలాంటి రైతన్నకు వెన్నుదన్నుగా నిలుస్తూ జట్టు ట్రస్టు ముందుక సాగుతోంది.

