
కవాల అభయారణ్యంలో అరుదైన పక్షి పెరిగ్రైన్ ఫాల్కన్ ప్రత్యక్షం (ఫొటో కర్టసీ : డాక్టర్ వెంకట్)
320 కిలోమీటర్ల వేగంతో తెలంగాణ అడివిలోకి దూసుకొచ్చిన అరుదైన పక్షి
ప్రపంచంలో అత్యంత వేగంగా ఎగిరే పక్షి ఇది...
ప్రపంచంలోనే అత్యంత వేగంతో దూసుకెళ్లే అరుదైన పెరిగ్రైన్ ఫాల్కన్ పక్షి అయిదేళ్ల తర్వాత తెలంగాణ అడవుల్లో మళ్లీ ప్రత్యక్షమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవాల్ అభయారణ్యంలో ఈ అరుదైన వలస పక్షి కనిపించడం ప్రకృతి ప్రేమికులను ఆనందానికి గురిచేసింది. గంటకు 320 కిలోమీటర్లకు పైగా వేగంతో వేటాడే ఈ అద్భుత పక్షి జన్నారం అటవీ ప్రాంతంలో దర్శనమివ్వడం అడవుల ఆరోగ్యానికి సానుకూల సంకేతంగా భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవాల్ అభయారణ్యంలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అరుదైన పెరిగ్రైన్ ఫాల్కన్ పక్షి కనిపించింది. కవాల్ అభయారణ్యంలో హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సమన్వయకర్త, వన్యప్రాణి పరిశోధకుడు డాక్టర్ వెంకట్ అనగంధుల తాజాగా జరిపిన ఆసియన్ వాటర్ బర్డ్ సర్వేలో ఈ అరుదైన వేగవంతమైన పక్షి దర్శనమిచ్చింది. జన్నారం అడవిలోని కిష్టాపూర్ సరస్సు వద్ద మొబైల్ టవరుపై అరుదైన పక్షి కనిపించడంతో వన్యప్రాణి పరిశోధకుడు డాక్టర్ వెంకట్ దాన్ని తన కెమెరాలో బంధించారు.
అయిదేళ్ల తర్వాత ప్రత్యక్షమైన అరుదైన పక్షి
పెరిగ్రైన్ ఫాల్కన్ పక్షి అయిదేళ్ల తర్వాత కవాల అభయారణ్యంలో మళ్లీ ప్రత్యక్షమైంది. అయిదేళ్ల తర్వాత కవాల్ టైగర్ రిజర్వ్‌లో పెరెగ్రైన్ ఫాల్కన్‌ను చూడటం సానుకూల సంకేతంగా, భవిష్యత్ తరాలకు సహజ ఆవాసాలను రక్షించాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. సరస్సు వద్ద ఉన్న ఈ పక్షిని బైనాక్యులర్స్ ద్వారా గుర్తించి దాని చిత్రాన్ని కెమెరాలో బంధించారు. 2021వ సంవత్సరంలో జన్నారం పట్టణ శివారు అటవీ ప్రాంతంలో ఈ పక్షిని గుర్తించారు.
వలస వచ్చిన అరుదైన పక్షి
విదేశాల నుంచి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి పెరెగ్రైన్ ఫాల్కన్లు చలికాలంలో తెలంగాణకు వలస వచ్చాయని వన్యప్రాణి పరిశోధకుడు డాక్టర్ వెంకట్ ఎ చెప్పారు. ప్రపంచంలోని ఉత్తర ప్రాంతాల నుంచి తెలంగాణకు ఈ పక్షులు వచ్చాయని తెలిపారు. అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఈ పక్షులు భారతదేశంతోపాటు పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక దేశాలకు వలస వచ్చాయని ఆయన వెల్లడించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో అవి తిరిగి వాటి స్వస్థలాలకు వెళతాయని డాక్టర్ వెంకట్ చెప్పారు.
పెరిగ్రైన్ ఫాల్కన్ పక్షులు మధ్య తరహా పక్షులనే కాకుండా చిన్న జంతువులను కూడా తింటాయి. ఈ పక్షి బలమైన పంజాలు పదునైన ముక్కుతో ఎరను పట్టుకొని చంపడానికి సహాయపడతాయి. ప్రపంచవ్యాప్తంగా పెరెగ్రైన్ ఫాల్కన్ పక్షులకు పలు ఉపజాతులు ఉన్నాయి. భారతదేశంలో ఈ ఉపజాతిని షాహీన్ ఫాల్కన్ అని పిలుస్తారు. ఇతర ఉపజాతులతో పోలిస్తే ఇది ముదురు రంగులో ఉంటుంది.
అంతరించిపోతున్న అరుదైన పక్షులు
పెరెగ్రైన్ ఫాల్కన్ పక్షులు అత్యంత వేగంగా అంతరించి పోతున్నట్లు పక్షి శాస్త్రవేత్తల సర్వేలో వెల్లడైంది.2024, 2026 మధ్య నిర్వహించిన పక్షుల సర్వేల ప్రకారం ఈ పక్షుల సంఖ్యలో తీవ్రమైన క్షీణతను చూడవచ్చు. ఈ పక్షులు పలు ముప్పులను ఎదుర్కొంటున్నాయి. పర్యావరణ కాలుష్యం, హానికరమైన రసాయనాల వల్ల కలిగే కాలుష్యం వల్ల ఈ పక్షుల ఆరోగ్యం, సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఎత్తైన భవనాలు, విండ్ టర్బైన్లు, ఇతర ఎత్తైన మానవ నిర్మిత నిర్మాణాలతో ఢీకొనడం వల్ల ఈ పక్షుల సంఖ్య తగ్గుతుందని తేలింది. కొన్ని ప్రదేశాలల్లో వేట వల్ల వీటికి ముప్పు ఏర్పడుతుంది. ఈ అద్భుతమైన పక్షిని రక్షించడానికి నిరంతర పర్యవేక్షణ , పరిరక్షణ ప్రయత్నాలు చాలా ముఖ్యమైనవని డాక్టర్ వెంకట్ అనగంధుల నొక్కి చెప్పారు.
320 కిలోమీటర్ల వేగంతో వెళ్లే పక్షి
పెరిగ్రైన్ ఫాల్కన్ పక్షిని ఫాల్కో పెరెగ్రినస్ అని కూడా పిలుస్తారు. ఈ పక్షి అత్యంత అందమైన, శక్తివంతమైన పక్షుల్లో ఒకటిగా నిలిచింది. బలమైన రెక్కలు, కండరాల కాళ్లు దీని ప్రత్యేకత. అంటార్కికా ఖండం మినహా మిగతా ఖండాల్లో ఈ పక్షులు కనిపిస్తున్నాయి. ఈ పక్షి వేటాడేటపుడు గంటకు 320 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయని డాక్టర్ వెంకట్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. క్షిపణి ఆకారంలో ఉన్న ఈ పక్షి ఎత్తు నుంచి ఎరను చూసి కిందకు దూకుతుందని, కిలోమీటరున్నర ఎత్తులో నుంచి ఎరను గుర్తించి వేగంగా వస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఈ అరుదైన పక్షి మళ్లీ కవాల్ అభయారణ్యంలో ప్రత్యక్షమవడం అడవుల జీవ వైవిధ్యానికి సానుకూల సూచనగా నిపుణులు భావిస్తున్నారు.
Next Story

