
విషపుపాలిచ్చిన పూతనకు శ్రీకృష్ణుడు మోక్షం ఎందుకిచ్చాడు?
తిరుప్పావై పాశురం: 6 కుఫ్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ వ్యాఖ్యానం
పొద్దున్నే కిలకిలారావాలతో తెల్లవారిందని సూచిస్తూ పక్షులు (లేదా) జీవరాశిని లేపుతున్నాయి. అని ఆంఢాళ్ ‘‘మునులూ, యోగులూ మెల్లగా లేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను తలుస్తూ హరి-హరి-హరి అంటున్నారు అదీ వినిపించడం లేదా? ’’ నిద్రలేపుతున్నారు.
వర్షం భగవంతుడి దయతోనే వస్తుంది. ఆయనే ఉపాయం - సర్వేశ్వరుడే అని మొదటి పాశురంలో చెప్పారు. ప్రేమతో చేస్తే సాధ్యమే అని రెండో పాశురం వివరించింది. ఉపకార స్మృతి ఉండి ఒకరినొకరు సహకరించుకుంటూ కృతజ్ఞతతో వ్రతం చేయాలని మూడో పాశురం చెప్పింది. భగవానుడినే ఆశ్రయించాలని నాలుగో పాశురం, ప్రతిబంధకాలు రాకుండా ఆపేశక్తి కూడా భగవానుడే అని అయిదో పాశురం చెప్పింది. ఆరునుంచి 15 పద్యం వరకు పదిమంది గోపికలను, ఆళ్వారుల ప్రతీకలుగా భావించి మేలుకొలుపుతున్నారు. ఆళ్వారులు అంటే తీవ్రమైన భక్తిత్వం నిండిన భగవత్ గాఢమైన అభిమాని.
కీచుకీచు పక్షుల కిలకిలల కలకలల తెల తెల్లవారు
గోపురశిఖరాల శంఖారావములు జనుల పిలుచు
మాయమాత పూతన స్తనవిషప్రాణముల పీల్చినాడు
కాలుజాడించి తన్ని శకటాసురుని లీల గూల్చినాడు
క్షీరసాగరశయను యోగనిద్రలో లోకాల కల్పించినాడు
యోగిహృధ్యానగమ్యు మునుల మనములమనెడువాడు
ఎక్కడకదులునోనయని ఎడదపట్టి రుషులు లేచినారు
భక్తితాపసుల హరిహరి ధ్వనులు వినుడు మేలుకొనుడు
పూతన స్తనాలకు అంటి ఉన్న విషాన్ని చిన్నారి క్రిష్ణయ్య తాగేసాడు. ప్రకృతి మనకు ఇచ్చే "అహం-మన" అనే విషాలను హరించే హరీ.. అని జ్ఞానులు తలుస్తున్నారు. పూతన తల్లి రూపంలోపాలిచ్చే నెపంతో వచ్చింది. శ్రీ కృష్ణునికి ప్రేమతో పాలివ్వాలని కాదు, చంపడానికి పాలు ఇస్తున్నట్టు నటిస్తున్నది. ఆమెకు అంతఃశుద్ధి లేదు. బాహ్యవేషం ఉంది. నటన కోసం నివేదించినా శ్రీ కృష్ణుడు స్వీకరిస్తాడట. భగవంతుడి యందు ప్రీతి ఉన్నట్టు నటించినా ఆయనకు సంతోషమే. అందుకే పూతన స్తన్యంలో విషపూరిత పాలను స్వీకరిస్తాడు. అమృతత్వాన్ని ఇస్తాడు.
కంసుడుపంపితే శ్రీ కృష్ణుని సంహరించాలని ఒక అసురుడు బండిపై ఆవహించాడు. ఆ పిల్లవాడు కాలు చాచినంత మాత్రంచేత బండి ఎగిరిపోయింది. పాపపుణ్యాల చక్రాల మీద నడిచే బండి మన శరీరం. శ అంటే సుఖము, కటముఅంటే పోడగొట్టేది. సుఖం అంటే పరమాత్మానుభవం. దానికి ఆటంకం కలిగించేది శరీరం. కృష్ణుడి కాలుతగిలేతే ఈ శకటం విరిగిపోతుంది. లేకుంటే సుఖదుఃఖాల కలిగించే సుకృత దుష్కృతాలనేరెండు చక్రాల బండి తిరుగుతూనే ఉంటుంది.
ప్రహ్లాదుడిని పర్వతం నుంచి కిందికి తోసినప్పుడు తన హృదయంలో ఉన్న హరికి ఏమవుతుందోనని హృదయాన్ని గట్టిగా పట్టుకుని దెబ్బతగలకుండా కాపాడుకుంటూ ఆయన జాగ్రత్తగా కింద పడిపోయాడట. తమను రక్షించే పరమాత్ముడిని తాము రక్షించాలనుకునే వెఱ్ఱి ప్రేమ వారిది.
12 మంది పరమ భక్తులు (ఆళ్వార్లు)
ఆరోరోజునుంచి గోదమ్మ వరసగా రోజుకొకరుచొప్పున పదిమంది గోపికలను నిద్రలేపుతున్నారు.
ఈ పాశురంతో ప్రారంభమైంది. ఆళ్వారుల పేర్లు.
1. పోయిగై (పోయ్గై )ఆళ్వారు, (సరోయోగి)
2. పూదత్త ఆళ్వారు, (భూతయోగి)
3 పేయాళ్వారు, (మహాయోగి)
4. తిరుమశిశై ఆళ్వారు (భక్తిసారులు)
5. నమ్మాళ్వారు, శఠగోపులు
6. కులశేఖర ఆళ్వారు
7. పెరియాళ్వారు (భట్టనాథులు, విష్ణు చిత్తులు)
8. తొండర్అడిప్పొడి (భక్తాంఘ్రిరేణువు, శ్రీపాదరేణువు, విప్రనారాయణ)
9. తిరుప్పాణి యాళ్వార్ (యోగి వాహనులు)
10. తిరుమంగైఆళ్వారు (పరకాల)
ఆ తరువాత గోదాదేవిని మధురకవిని చేర్చి 12 మంది ఆళ్వారులు అంటారు. అంతటి గొప్పవారు శ్రీమద్ రామానుజులు. (కాని వారిని 12 మందిలో రామానుజుని చేర్చలేదు.
వారిలో విష్ణు చిత్తులు అందరినీ మించి పెరియ (పెద్ద) ఆళ్వారు అయినారు. ఆయనకు తులసీ వనంలో దొరికిన బిడ్డ గోదాదేవి. నాన్నగారిని పిలుపుతున్నారు గోద.
ఓ కథ చదవండి.
జానశ్రుతి అనే ఒక రాజు, ధార్మికుడు, దాన శీలి. ఇద్దరు బ్రహ్మజ్ఞానులుహంసల రూపంలో ఆకాశంలో విహరిస్తూ ఆయన రాజ భవనం మీదుగా వెళ్తున్నపుడు, ఆయన బ్రహ్మజ్ఞానం లో శ్రద్ధ లేని వాడు అని ఇద్దరు అనుకున్నారట.అతని గొప్పదనం గురించి వారు ఇలా మాట్లాడుకుంటూ... ‘‘జానశృతి పడుకున్నాడు కదా మన నీడ పడేట్టు ఆయన భవనం మీదుగా పోవడం ఉచితం కాదు పక్కనుండి పోదాం’’ అని ఒక హంస అంటే, ‘‘ఆయనేమయినా రైక్వుడా భయపడడానికి’’, అని మరో హంస జవాబిచ్చింది. ఈ సంభాషణ విన్నాడు జానశృతి. ఆ భాష తెలిసిన జానశృతి ఈ రైక్వుడెవరో తెలుసుకోవాలని రాజు దూతలను పంపాడు. అన్వేషించాడు. అడవిలో సంసార వాసనలకు పూర్తిగా దూరంగా ఓ బండి కింద పిచ్చివాడిలా గోక్కుంటూ కనిపించాడట రైక్వుడు. రాజు వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్లిపోయాడు. అతన్ని దర్శించి జ్ఞానోపదేశం చేయమని కోరుకున్నాడు. సర్వస్వం దక్షిణగా సమర్పించుకున్నాడు. బ్రహ్మజ్ఞానం సంపాదించాడు. ధార్మికుడైన భక్తుడికి బ్రహ్మజ్ఞానం తెలుసుకునే ప్రేరణను కల్పించే మహాత్ములు పరమహంసలు. ఇది ఉపనిషత్తులోని ఒకకథ. తెల్లవారుతున్నదని చెప్పిభగవదనుగ్రహం పొందే సమయం అయిందని హెచ్చరిస్తున్నాయి పక్షులు. ఆ విషయాన్ని సంకేతమాత్రంగా ప్రతిపాదించారు గోదా దేవి విశాఖ పట్నం పరమ భక్తుడు కీర్తిశేషులు శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు.
(6వ తిరుప్పావై. శ్రీ వ్రతం లేదా సిరినోము, లేదా శ్రీ నోము. తమిళ పాశురం (పద్యం) ఇవ్వడం లేదు. ఎందుకుంటే అర్థం కాకపోవచ్చు కనుక. తెలుగులో భావార్థ గీతాన్ని ఇస్తున్నాను.)