చూసి రమ్మంటే కాల్చి వెళ్తున్నావు, అది తప్పు కాదా?
x
శ్రీవిల్లిపుత్తూరులో గోదమ్మ లభించిన పూలతోట, తులసీవనం

చూసి రమ్మంటే కాల్చి వెళ్తున్నావు, అది తప్పు కాదా?

తిరుప్పావై 2వ పద్యం విశేషాలు: ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్


సిరినోము లేదా శ్రీవ్రతం లేదా తిరు నోము అని అంటూ ఉంటారు. ప్రముఖులు, పండితులు ఎందరో అనువదించిన తిరుప్పావై పాశురాలను అనువదించారు.

వినుడు సౌభాగ్యసుదతులార, ఇది ఇడుముల బెట్టువ్రతముకాదు

పరమానందబ్రహ్మము చేర్చునోము నియమాలు తెలియరండి

పాలకడలి నాథుడి పాలు మనము, వేరు పాలు మనకేలమగువలార

కృష్ణయ్య నెయ్యము సాధింప నెయ్యి మానుదాము పూబోడులార

తెల్లారి స్నానాలు కద్దు, పూలు కాటుకల సొబగులొద్దు

చేయరాని పనులు వద్దన్న చేయకుండుటె మేలు, చాడీలు,

మనసు నొప్పించు విరుపులొద్దు, హితవులు వినడమే మనకు మంచి

దానధర్మాలతో నడచి దామోదరుని చేరుటే మన తిరునోము దారి. (ఇది నా అనువాదం)

తిరుప్పావై కథలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇవి రామాయణం లో, భాగవతంలో ముఖ్యంగా కొన్ని భాగాలు కనిపిస్తూఉంటాయి. మహాభారత పురాణంలో కూడా కథలు ఉంటాయి. కథల ద్వారా గోదాదేవి తిరుప్పావై 30 పాశురాలు (పద్యాలు) అందంగా రాసారు.

వర్షంకోసమో మరే ఫలం కోసమో కాదీ వ్రతం. నారాయణుని సాన్నిధ్యమే మన లక్ష్యం. ఆ పరమాత్మను చేరడానికి ఆయనే మార్గం. తిరుప్పావైలో నాం పావై... అని రెండో పాశురంలో చెప్పిన అంశం ఇది. ఇంద్రజిత్ రాముడి విజయం కోసం వేదమంత్రాలతో ఒక యజ్ఞం చేసినాడు. కాని మన యజ్ఞాలూ వ్రతాలూ అన్నీ భగవంతుని చేరుకోవడానికి, ఆ వైభవాన్ని పరమానందాన్ని అందుకోవడానికి.

తెల తెలవారు ఝామున లేద్దాం. చల్లని నీట స్నానం చేద్దాం. ఈ వ్రతం పూర్తయ్యే వరకూ కళ్లకు కాటుకా వద్దు, జడలో పూలూ వద్దు అంటున్నారు గోదమ్మ. శ్రీవైష్ణవులకు ఈ అలంకారాలతో పనిలేదు. పూలు పాలూ అలంకరణలన్నీ శ్రీకృష్ణునితో కలిసి ఉండడానికే గాని మరే ప్రయోజనమూ లేదు. మన పెద్దలు ఆచరించిన మంచి మనమూ ఆచరిద్దాం. వారు చేయని పనులు మనం చేయడం ఎందుకు?

ఎందరు చెప్పినా రాముడు వినడం లేదు, ఎందుకు?

నిజానికి తండ్రి తనకు రాజ్యం ఇచ్చినా, అన్న రాముడు ఏలుకొమ్మని ఆదేశించినా, రుషులు తల్లులు పెద్దలు పరిపాలించమని కోరినా, గురువు తప్పులేదని చెప్పినా, భరతుడు రాముని పాదాలనే ఆశ్రయించాడు, ఆయన ధరించినపాదుకలనే కోరుకున్నాడు. ఎందుకంటే సూర్యవంశంలో సింహాసనం ఎప్పుడూ పెద్దకొడుకుకే గాని చిన్నవాడు అధిరోహించరాదు. అన్న సజీవుడై ఉండగా తమ్ముడు రాజ్యాన్ని పాలించడం జరగదు. ఆ శిష్టాచారమే ధర్మమని పెద్దలు నుడివిన మాట నడిచిన బాటను భరతుడు పాటించాడు. మనసా వచసా రామపాదాన్ని రాజ్యవైభవాలకన్న మిన్నగా భావించిన భాగవతోత్తముడు, పరమ భక్తుడు భరతుడు.

అంతరంగ మందు అపరాథములు చేసి, మంచివాని వలెను మనుజుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన అన్నాడు. కాని మనసులో కూడా తప్పు చేయలేదు రాముడు.

చూసి రమ్మంటే కాల్చివేస్తావా? - సీతమ్మ

సీతాదేవి నిజమైన వైష్ణవ సతీమణి. తనను బాధించిన రాక్షసులకు హాని ఎప్పుడూ తలపెట్టలేదు. రామునికి ఒక్క చాడీ కూడా వారిపై చెప్పలేదు. హనుమంతుడు అక్కడ రాక్షసులు బాధించిన విషయం కళ్లారా చూసి బాధపడి, అనుజ్ఞ ఇస్తే వారిని చంపేస్తానంటాడు. అప్పుడు సీత, వారు స్వయంగా ఆ పనులు చేయలేదు, రావణాసురుడి ఆజ్ఞకు బద్ధులైన సేవకులు కదా. కొంత అతి చేసి ఉండవచ్చు. అది ఈ ధరిత్రిమీద ఉన్నవారందరు పాల్పడే పనే. తప్పు చేయని వాడెవడు నాయనా అంటుంది. నీవూ కాస్త ఆజ్ఞను అతిక్రమించావు కదా. నిన్ను రాముడు చూసి రమ్మని కదా ఆదేశించింది. కాని నీవు కాల్చి పడేశావు కదా’’ అని వివరిస్తుంది. ఈ ధరిత్రిలో అందరూ తప్పులు చేసేవారనంటావా తల్లీ, అయితే రాముడు కూడా...’’ సీత సమాధానం ఇది. ‘‘అవును రాముడు కూడా.. శూర్పణఖ వలచి వచ్చినపుడు నేను ఏకపత్నీవ్రతుడనడం వరకు సరిపోయేది. కాని లక్ష్మణుడి దగ్గరికి పంపి, వేళాకోళమాడి అవమానించడం అతి కాదా. ఇప్పుడు ఈ దుష్పరిణామాలన్నీ వాటి పర్యవసానమే కదా హనుమా’’. వారే కాదు తానూ తప్పు చేసానని మరో సందర్భంలో ఆమె అంటారు. బంగారు లేడి ఉండదని తెలిసి కూడా కావాలని కోరడం, లక్ష్మణుడిని పరుషంగా నిందించి పంపడం తన తప్పులే అంటారామే. ఎవరో తప్పు చేశారని శిక్షించడానికి అందరూ సిద్ధ పడడం సరికాదు. దయాగుణ సంపన్నుడై ఉండాలి, భగవద్విషయాలను జనులకుచెబుతూ ఉండాలి, ఇవే వైష్ణవ లక్షణాలు. నిత్యమూ ఆనందంగా ప్రశాంతంగా ఉంటూ సర్వజనుల సముద్ధరణే జీవిత ధ్యేయంగా చరించడం విద్యుక్త ధర్మం.

భగవంతుడే రాముడై వస్తే భూమిమీద తామసగుణ ప్రభావానికి లోనైనాడు. హనుమతో సీత ఈ విధంగా అన్నారట. ఈ భూమి మీద ఉండగా తప్పు చేయడం సహజం, నీవు చూసి రమ్మంటే కాల్చి వెళ్తున్నావు అది తప్పు కాదా. నేనంటే తప్పు చేసానేమో మరి రాముడు కూడా తప్పు చేసాడా తల్లీ అని ప్రశ్నించాడు హనుమ. కాదా మరి.. శూర్పణఖ వచ్చినపుడు వలచినానని చెప్పినప్పుడు నేను ఏకపత్నీ వ్రతుడనని అని నిరాకరిస్తే సరిపోయేది కదా, కాని తమ్ముడిని చూపడం వేళాకోళంచేయడం అవసరం లేనిపనే కదా. అనేక పరిణామాలకు ఆనాటి ఘటనలే కారణం కాదా?

ఈ వ్రతం కష్టపెట్టడానికి కాదు, ఏంచేద్దామో వినండి.. ఆ పాలకడలి లో సుకుమారంగా పయనించి, తన పాదం తొలి అడుగు అక్కడ వేసి ఉన్న ఆ వైకుంఠ నాథుడి పాదాలను పట్టుకుందాం, ఆయన్ను మించిన వారు లేరుకనుకనే పరమన్ అంటున్నారు. శిశువు తన తల్లి స్తన్యాన్ని గుర్తించినవిధంగానే భక్తుడు భగవంతుడి పాదాలను గుర్తించగలగాలి. పాలకడలిలో పరమాత్ముడు మొదట పాదం మోపినాడు. భగవంతుడిని చేరడానికి భగవంతుడే మార్గం అని చెప్పే మార్గశీర్ష పాశురం ఇది.కొన్ని అల్పమైన పదాలలో అనల్పమైన అర్థాన్ని గుది గూర్చిచెప్పిన అద్భుత కవిత ఇది.

Read More
Next Story