తిరుపతి-ఢిల్లీ మార్గంలో పరుగులు పెట్టిన జ్ఞాపకాల రైలు !
x

తిరుపతి-ఢిల్లీ మార్గంలో పరుగులు పెట్టిన జ్ఞాపకాల రైలు !

తిరుపతి - ఢిల్లీ యాత్ర- 3


మా రైలు పరుగులు పెడుతోంది. రైలుతోపాటు మా జ్ఞాపకాలూ పరుగులు పెడుతున్నాయి. సరస్వతీ బాయ్ పూలే చదువు చెప్పడం మొదలు పెట్టిన పూనే.. గాంధీజీ తొలి సారిగా నూలు ఒడికిన సేవాగ్రాం.. వేలాది ప్రాణాలను హరించిన భోపాల్ గ్యాస్ లీక్.. ఇలా దారి పొడవునా జ్ఞాపకాలే..! ఆ జ్ఞాప కాల న్నీ చరిత్రలో సంతోష విషాదాల మైలు రాళ్ళుగా నిలిచిపోయాయి.


జర్నలిస్ట్ సుధాకర్ రామగుండంలో దిగిపోయాడు. మరో ఇద్దరు మా ముందు సీట్లోకొచ్చి కూర్చున్నారు. ఆలస్యాన్ని అధిగమిస్తూ, రైలు పరుగులు తీస్తూ, మహారాష్ట్ర లోకి ప్రవేశించింది. బలార్షా స్టేషన్ లో ఆగింది. బలార్షా టేకుకు ప్రసిద్ధి. మా బావ తమ్ముడు,మా అక్క మరిది జయ బలార్షాలో పనిచేస్తున్నప్పుడు, టేకు చవకగా దొరుకుతుందని చెప్పాడు. బలార్షా కొస్తే వేలంలో టేకు చవకగా ఇప్పిస్తానన్నాడు. ఇల్లు కడుతున్నప్పుడు టేకు అవసరం అవుతుంది కానీ, చవకగా టేకు దొరుకుతోందని ఇల్లు కట్టలేం కదా!

మా ఎదురు సీట్లో కూర్చున్న ఇద్దరినీ వాకా ప్రసాద్ పలకరించారు. నాగ్ పూర్ లో సివిల్ కాంట్రాక్టులు చేస్తున్నామని చెప్పారు. వాళ్ళ వాలకం చూస్తుంటే పెద్ద స్థాయి కాంట్రాక్టర్లు కాదనిపిస్తోంది. బలార్షా తరువాత వచ్చేది సేవాగ్రాం జంక్షన్. గాంధీజీ తొలిసారిగా చరఖాతిప్పి నూలు ఒడికిన ప్రాంతం అది. ఇది మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో ఉంది.

‘‘గాంధీజీపై గౌరవం కొద్ది వార్దా జిల్లాలో సంపూర్ణ మద్య నిషేధం విధించారు. కానీ, అమలు మాత్రం జరగడం లేదు. మద్యం ఎక్కడపడితే అక్కడ దొరుకుతుంది.’’ అని ఆ ఇద్దరు కాంట్రాక్టర్లు నవ్వుతూ చెప్పారు. ‘‘గుజరాత్ లో కూడా సంపూర్ణ మద్య నిషేధం ఉన్నప్పటికీ, మద్యం ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతుంది.’’ అన్నారా ఇద్దరూ.

మా రైలు సేవాగ్రాం తరువాత నాగ్ పూర్ జంక్షన్ లో ఆగింది. ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కేంద్ర కార్యాలయం ఉన్న నగరం అది. హిందుత్వ వాదులకు అక్కడినుంచే ఆదేశాలూ జారీ అవుతుంటాయి. కేంద్రంలో ఉన్నది కూడా వారే కనుక, నాగ్ పూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘నాగ్ పూర్ లోని గంగా జమునా ప్రాంతంలో వ్యభిచారం యథేచ్ఛగా సాగుతుంటుంది.’’ అని ఆ ఇద్దరు కాంట్రాక్టర్లు గుర్తు చేశారు. నాగ్ పూర్ హల్దీరాం స్వీట్లకు ప్రసిద్ధి అని పరమేశ్వరరావు అన్నారు. హల్దీరాం స్వీట్లకు కేంద్రకార్యాలయం కూడా నాగ్ పూర్ లోనే ఉన్నదని చెప్పారు. మహిళల విద్య కోసం సావిత్రీబాయ్ పూలే ఉద్యమాన్ని ప్రారంభించింది ఇక్కడికి సమీపంలోని పూనేలోనే.

నాగ్ పూర్ దాటగానే నలుగురమూ బెర్త్ ల పై వాలిపోయి, నిద్రలోకి జారుకున్నాం. తెల్లవారు జామున ఎప్పుడో ఝాన్సీ స్టేషన్ వచ్చింది. అది దాటిన తరువాత తెల్లవార క మునుపే లేచి చూసే సరికి మా రైలు ఏదో స్టేషన్ లో ఆగింది. బైట చూస్తే భోపాల్ స్టేషన్ అని ఉంది. భోపాల్ పేరు వినగానే గుండెల్లో బాధ మెదిలింది. ఒక విషాదం కళ్ళ ముందు కదలాడింది.


కచ్చితంగా నాలుగు దశాబ్దాల క్రితం నాటి విషాదం. భోపాల్ లోని యూనియన్ కార్బైట్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో ట్యాంకుల నుంచి మిథైల్ ఐసో సైనైడ్ అనే గ్యాస్ లీకైంది. దీంతో అధికారిక లెక్కల ప్రకారం 3,787 మంది మృతి చెందారు. అనధికారిక లెక్కల ప్రకారం ఎనిమిది వేల మంది మృతి చెందారు. గ్యాస్ బారిన పడి వచ్చిన వ్యాధుల వలన మరో ఎనిమిది వేల మంది మృతి చెందినట్టు అంచనా. ప్రపంచంలోనే అతి పెద్ద పారిశ్రామిక విషాదం. కాల గమనంలో ఇలాంటి విషాదాలన్నీ మెల్లగా చరిత్ర పుటల్లోకి జారుకుంటాయి. అన్నీ మర్చిపోతుంటాం.
రైలు పరుగులు పెడుతోంది. ఆ పరుగుల్లోనే నిద్ర లేచాం. ఝాన్సీ స్టేష న్ దాటింది. ఆకలేస్తోంది. చిరుతిళ్ళతో కాలం వెళ్ళదీస్తామంటే, మనసు అంగీకరించడం లేదు. టిఫిన్ తినాలని నోరు మారాం చేస్తోంది. రైలు తిండి తప్పడంలేదు. రైల్లోనే అమ్మకానికి వచ్చిన పూరీలు తిన్నాం. ఎప్పుడు చేశారో తెలియదు కానీ, అవి సీతాపతి చెపాతీల్లా ఉన్నాయి.


టికెట్టు ఢిల్లీ వరకుతీసుకున్నా, తాజ్ మహల్ చూడాలంటే మళ్ళీ వెనక్కి ఆగ్రా రావాలి. శనివారం ఉదయం పదింబావుకు మా రైలు ఆగ్రా స్టేషన్ లో ఆగింది. ఆగ్రా స్టేషన్ లో దిగేశాం. ఆగ్రా చాలా పురాతన పట్టణం. ఇంకా గుర్రపు బండీలు కనిపిస్తున్నాయి. ఎంత అందంగా అలంకరించారో జట్కాలని. ఆగ్రాలో ఇంకా మనుషులు తొక్కే రిక్షాలు కూడా కనిపించాయి. చారిత్రక ప్రాధాన్యత కల పట్టణం ఇది. ఆగ్రా అనగానే తాజ్ మహల్ గుర్తుకు వస్తుంది. షాజహాన్ నివసించిన ఆగ్రా కోట గుర్తుకు వస్తుంది. ఢిల్లీకి వెళుతూ అవి చూడకుండా ఎలా ఉంటాం!



ఆగ్రా రైల్వే స్టేషన్ బయటకు రాగానే మా కోసం కారు సిద్ధంగా ఉంది. వాకాప్రసాద్ బాల్య స్నేహితులు, సహ విద్యార్థులు చంద్ర ఓబుల్ రెడ్డి, కెజియా కల్పలత దంపతులు వాళ్ళ కున్న రెండు కార్లలో ఒకటి మా కోసం కేటాయించారు. డ్రైవర్ కిషన్ మా కోసం ఎదురుచూస్తున్నాడు. రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్నఒక హోటల్ లో దిగాం స్నానాల కోసం. ఆ హోటల్ లో మంచి నీళ్ళ కోసం తమాషా అయిన రెండు మంచి నీళ్ళ సీసాలు పెట్టారు. ఆ సీసాలకు బిరడాలు కూడా ఉన్నాయి. ఇవి చాలా పాతకాలపు సీసాలు.


iస్నానం చేసి, గది ఖాళీ చేసి బయటకు వచ్చాం కదా మామూలు ఆటోలతో పాటు కొత్త రకం ఆటోలు కనిపించాయి. వాటిని ఈరిక్షాలంటారు. రోడ్డు సాఫీగా ఉంటే సరి, చిన్న గుంత వచ్చినా ఈ రిక్షాలో కూర్చున్న వాళ్ళకు అదిరిపోతుంది. నగరంలో భవనాలన్నీ చాలా పురాతనమైనవి. భవనాలన్నిటికీ ముదురు ఎరుపు రంగు పెయింట్ వేసి ఉన్నాయి.


తాజ్ మహల్ చూట్టానికి బయలు దేరుతున్నాం. వాహ..తాజ్ ..
(ఇంకా ఉంది)


Read More
Next Story