లైబ్రరీలు విరబూస్తున్న ఒక చిన్న గ్రామం కథ వింటారా
x
Source: Twitter

లైబ్రరీలు విరబూస్తున్న ఒక చిన్న గ్రామం కథ వింటారా

గ్రంథాలయ విప్లవం అన్న భావనను మొదటిసారిగా ఇక్కడే చూస్తాం. ఒక కొండ ప్రాంత గ్రామంలోని 35 ఇళ్లలో లైబ్రరీలు ఏర్పాటయ్యి. ఆ వింత ఏమిటో చూద్దాం.


(బి. గోపాల కృష్ణమ్మ)
మహారాష్ట్ర సతారా జిల్లాలోని మహాబలేశ్వర్ సమీపంలో ఈ పుస్తకాంచ్ గావ్ (పుస్తకాల గ్రామం) ఉంది. ఆ గ్రామం పేరు భిలార్. ఇదొక కొండప్రాంత గ్రామం, ఈ ఊరి ప్రజలు తమ ఇళ్లలోనే ఉచిత లైబ్రరీలను నిర్వహిస్తున్నారు. ఈ ఊరి జనాభా 15,000 మంది. ఇక్కడ 35 కుటుంబాలు తమ ఇళ్లలో ఒక భాగాన్ని పుస్తకాలకు కేటాయించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల దాకా తమ ఇళ్లలోని లైబ్రరీలలోకి రా రమ్మని ప్రజలు సంతోషంగా ఆహ్వానిస్తుంటారు. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్న వేలాది పుస్తకాలు అన్నీ పైసా ఖర్చు లేకుండా ఉచితంగా చదువుకోవచ్చు.
చూడ్డానికి లైబ్రరీలుగా కనిపించని ఈ గృహ గ్రంథాలయాల్లోకి అడుగుపెడితే చాలు, స్టీలు, గ్లాసుతో చేసిన రెండు కప్ బోర్డులో అమర్చిన పుస్తకాలు కనబడతాయి. ఈ పుస్తకాల గ్రామంలోని లైబ్రరీల్లో ఉండే పుస్తకాలు చదవడానికే తప్ప అమ్మకానికి కాదనే ఒక నోటీసు కూడా మనకు కనబడుతుంది. అక్కడ ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చుని రౌండ్ టేబుల్‌పై పుస్తకాలు ఉంచి చదువుకోవచ్చు.

కొలువైన పుస్తకాలు 35 వేలు
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మరాఠీ భాషా విభాగం ఈ పుస్తకాంచ్ గావ్ ప్రాజెక్టును ప్రారంభించడమే. ఈ పుస్తకాల గ్రామం ప్రాజెక్టు అసిస్టెంట్ బాలాజీ హాల్డే దీని విశేషాలు తెలిపారు. ఈ ప్రాజెక్టులో 35 వేల మరాఠీ పుస్తకాలు ఉన్నాయి. క్రీడలు, సైన్స్, చరిత్ర వంటి వివిధ విభాగాల పుస్తకాలను ఈ ప్రాజెక్టులో భాగం చేశామని చెప్పారు. తమ ఇళ్లలో పుస్తకాల లైబ్రరీలను పెట్టడానికి అంగీకారం తెలిపిన గృహ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం పుస్తకాలు ఉంచుకోవడానికి కప్ బోర్డులను, బుక్ షెల్వ్‌లను అందించింది.
మరాఠీ భాషా, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మాజీ మంత్రి వినోద్ తవడే ఆలోచనల్లోంచి ఈ పుస్తకాల గ్రామం రూపు దిద్దుకుంది. 2017 మే 4న మహారాష్ట్ర నాటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దీన్ని ప్రారంభించారని హాల్డే చెప్పారు. తమ ఇళ్లలో పుస్తకాలు పెట్టుకునే చోటును ఎవరైనా ఇవ్వగలరా అని కోరుతూ గ్రామ ప్రధాన్‌ని మేం ఉత్తరాలు పంపాం. ఆయన వాటిని గ్రామ ప్రజలకు అందించారు. దానికి వెల్లువలా దరఖాస్తులు వచ్చాయి. మొదట 25 ఇళ్లను ఎంపిక చేసుకున్నాం. 25 లైబ్రరీలు ఏర్పాటయ్యాయి అని హాల్డే చెప్పారు.
ఇళ్లలో స్టోర్లలో, హోటల్లలో పుస్తకాలు
ఈ గృహ లైబ్రరీల పుణ్యమా అని సుందరమైన మా ఊరిని చాలామంది ప్రజలు సందర్శిస్తున్నారు, వారికి ఇవ్వడానికి మా వద్ద బోలెడు పుస్తకాలు ఉన్నాయని సునీతా శశికాంత్ భిలారే చెప్పారు. ఆమె గ్రామ డిప్యూటీ సర్పంచ్. మావద్ద ఇప్పుడు విస్తృతమైన పుస్తకాల కలెక్షన్ ఉంది. కొన్ని ఇళ్లలో మహిళా సాహిత్యానికి చెందిన పుస్తకాలు కూడా ఉన్నాయని ఆమె గర్వంగా చెప్పారు. సునీత, ఆమె భర్త శశికాంత్ భిలారేకి వ్యవసాయ స్టోర్ ఉంది. వీరు తమ ఇంటిని కూడా పాఠకులకోసం తెరిచి ఉంచారు. 'మా లైబ్రరీలో స్ఫూర్తిదాయకమైన జీవిత చరిత్రలు, స్వీయ జీవిత చరిత్రలు ఎన్నో ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటలకు సందర్శకుల కోసం మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాం. ఊరిలో లైబ్రరీలు తెరిచినప్పటినుంచి నేను స్వయంగా 350పైగా పుస్తకాలు చదివేశాను' అని శశికాంత్ భిలారే చెప్పారు.

తొలుత 25 లైబ్రరీలు ఉండగా ఇప్పుడు భిలారే గ్రామంలో 35 లైబ్రరీలు ఉన్నాయి. ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడు 15 వేల పుస్తకాలు ఉండేవి ఇప్పుడు అవి రెట్టింపై 35 వేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. వీటన్నింటినీ ఉంచడానికి అవసరమైన కప్ బోర్డులను, రొటేటింగ్ బుక్ షెల్వ్స్‌ని ప్రభుత్వమే అందజేసింది. రాహుల్ రాజేంద్ర భిలారేకి 38 సంవత్సరాలు. 12 సంవత్సరాలుగా ఆతిథ్య పరిశ్రమలో ఉంటున్నారు. భిలారేలో అన్‌మోల్ ఇన్ అనే హోటల్ నడుపుతున్నారు. తన హోటల్‌లో కూడా మరాఠీ భాష, చరిత్ర, సంస్కృతికి చెందిన 700 పుస్తకాలను పాఠకుల కోసం ఉంచానని చెప్పారు. 'మొదట్లో చాలా తక్కువమంది మాత్రమే మా గ్రామాన్ని సందర్శించేవారు.ఇప్పుడు మా గ్రామం పుస్తకాల కోసం గమ్యస్థానంగా మారిపోయింది. పుస్తకాల కోసం శోధించే రచయితులు, ప్రచురణ కర్తలు, స్కాలర్లు సంవత్సరం పొడవునా మా ఊరికి వస్తున్నారు. పాఠశాలలు, కాలేజి ఎక్స్‌కర్షన్లు కూడా మా ఊరికి రావడం సాధారణమైపోయింద'ని రాహుల్ చెప్పారు.
ఇంట్లోకి దఢీలుమని వస్తే ఇబ్బందిగా ఉండేది
'మొదట్లో ఎలాంటి ముఖపరిచయం కూడా లేని వారు చెప్పా పెట్టకుండానే ఇంట్లోకి వచ్చేవారు, ఇలా అపరిచితులు ఇంటిలోపలికి దూరి ఠకీమని కుర్చీ లాగి కూర్చుని పుస్తకాలు చదువుకోవడం ప్రారంభంలో చాలా వింతగా అనిపించేది. రానురానూ మాకు అది అలవాటైపోయింది. ఇప్పుడు వారికోసం మేం ఎదురుచూస్తున్నాం' అని శశికాంత్ నవ్వేశారు. 'సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిన అనేకమంది మా ఇళ్లను సందర్శంచడం మా అదృష్టం. దీనివల్ల వారితో ఆసక్తికరమైన సంభాషణలు చేస్తూ కప్పు కాపీ వారితో కలిసి సేవిస్తూ గడిపే అవకాశం మాకు వచ్చింది' అని సంతోషం వ్యక్తం చేశారు.

శివాజీపై 1200 పుస్తకాలు
43 సంవత్సరాల వయసున్న ప్రశాంత్ దీపక్ భిలారే ఒక సివిల్ ఇంజనీర్. ఆయన ఇంట్లో ఒక్క ఛత్రపతి శివాజీపైనే 1200 పుస్తకాలు ఉన్నాయి. 'మా ఊరు ఇప్పుడు అతిథి దేవోభవ అని చెబుతూ జీవిస్తోంది. మేం అతిధులకు సదా ఆహ్వానం పలుకుతుంటాం' అన్నారాయన. వలస కార్మికులు అనేకమంది మా ఊరి లైబ్రరీలను తరచుగా సందర్శిస్తుంటారు. పుస్తకాలు మంచి స్నేహితులైపోయాయి. చాలామంది ఊరి ప్రజలు పుస్తకాలతో వీలైనంత కాలం సాహచర్యం చేయాలని భావిస్తున్నారని హాల్డే నవ్వుతూ చెప్పారు.
పుస్తకాలతో సెలబ్రేట్ చేసుకునే ఈ గ్రామాన్ని ఆధారంగా చేసుకుని అనేక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్సే రైటింగ్ పోటీలు, స్టోరీ టెల్లింగ్ సెషన్లు, కవితా పఠనం వంటివి ఎక్కడో ఒక ఇంటి లైబ్రరీలో జరిగేవి. 2018 డిసెంబరులో భిలార్‌ని సందర్శించిన రచయితులు, ప్రచురణకర్తలతో రెండు రోజులపాటు ఈవెంట్ నిర్వహించారు. పుస్తక ప్రపంచం గురించిన సమాచారాన్ని షేర్ చేసుకుని చర్చించారు. మరాఠీలో 50 మంది ప్రముఖ రచయితలపై ఎగ్జిబిషన్ కూడా జరిగింది. ఆరు బయట యాంఫీ థియేటర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి.
Read More
Next Story