
Image source: thelostlander.com
మూడు ముచ్చటైన ‘ఆదివారం కవిత’లు
ఉన్నట్లుండి వెనక నుంచి ఎవరో తటాలున భుజం తట్టి ‘హేయ్, నువ్వెవరో నీకు తెలుసా, ’ అంటు నిన్ను నీకు పరిచయం చేసే నేటి మూడు కవితల మేటి కవి: రాజేశ్వరరావు లేదాళ్ళ
1
మనుషుల్లాంటి మనుషుల్లోకి
ఓ మాదిరి సంతోషం ముఖాల మీద పరుచుకుంటుంది
ఎంత సందర్భోచితంగా కలిసిపోతాను వర్తమానంలోకి
గతాలేమో జారుడుబండ లాంటివి.
అప్పటికింకా నేను కల నుంచి కలలోకి కదలిపోతుండేవాడిని.
ఏమైతే నేం గానీ,
పాత చోట
ఇంకా మారని అసంపూర్తి చోట
యుగాలుగా నువ్వు దుఃఖంతో పాడే చోట
గాలిగంటనై మోగుతూనే ఉంటాను.
వేకువన విరిసే పొడవాటి నీడలాగో,
మధ్యాహ్నపు మల్లెపువ్వు రంగు కాంతిలాగో,
మౌనాలద్దిన చోట
మహామహా దుఃఖాలు మొలిచే నిశ్శబ్దపుచోట
ఇంకా నేను అలజడిగా వెతుకుతాను.
అలసట, అసౌకర్యము,కాంక్ష, మరెంతో ఆత్రుత
మనుషుల్లాంటి మనుషుల్లోకి పరకాయ ప్రవేశం చేస్తుంటాను.
కొంత ఆర్ద్రత,
కాసింత మాధుర్యం.
అచ్చంగా మనుషులు ఆకాశంలోంచి రాలి పడ్డ అమృత బిందువులు.
2
పొడవాటి కథలో నేనో పొట్టివాక్యాన్ని
ఈ కథ ఎప్పటికైనా సంతృప్తినివ్వకపోదు
ఏదో ఒక రోజులాగే.
కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది.
ఇంకా
అవాంఛిత వాక్యాల్లాంటి పాత్రలు కొన్ని
ఒక్కొక్కటిగా కథనిండా
కమ్ముకుంటాయి.
ఊహకందని ఉక్కిరిబిక్కిరి
మధ్యాహ్నాలు,
మెత్తని చిరు చీకటి సాయంత్రాంతాలు,
ఉల్లిపువ్వు రంగు ఉదయారంభాలు.
నా చుట్టూతా ముసురుకుంటాయి.
నేను వర్తమానాన్నైనందుకు,
రోజులు పాతను సుతారమూ ఇష్టపడనందుకు,
రోజులు రేపటినేమాత్రమూ
విప్పిచెప్పనందుకు,
ఇంకా నేను సంకల్పితంగా
ఇక్కడ కదులుతున్నందుకు.
ముగింపు లేని కథలో
నేనో పొట్టి వాక్యాన్నైనందుకు,
అనూహ్య కథలాంటి
ఈ కాలానికెంతో ఋణపడి ఉంటాను.
3
నేనూ, ఇంకొంచెం పాట లాంటి నువ్వు
పాడటం మాత్రమే తెలుసు నాకు.
నాకు నేను నీడలతో కలిసి పయనించాక,
కొంత నిశ్చలత కుదురుకున్నాక,
ఇంకా కొంత నిశ్చింత లాంటి రోజులని తలుచుకుంటాను
నన్ను గూర్చి నేను ఉపక్రమించిన చోటల్లా విప్పి చెప్పను.
విడివిడి దుఃఖాల్లాంటి సమయాల్ని గురించి,
రోజులవారీ నడకల గురించి, సంచిత పౌనఃపున్యాల్లాంటి మాటల్ని
నీ చెవిలో మాత్రం ముచ్చటిస్తాను.
ఓ మసక వేళ,
రంగులు మారే మునిమాపు వేళ,
నీతో కలిసి నేను మాటల
కాలమవుతాను.
నా పొడవాటి సమయాల్ని
నీ చూపులు కొంచెం కొంచెం
నమిలి మింగుతాయి.
ఉదయపు అందమూ
పడమటి మారందమూ
కళ్ళారా ఆరగించాక
మనసును ముద్దాడే యవ్వన దారుల వెంట పరుగెడతాను.
అవశేషాల్లాంటి నిన్నలను మరచిపోలేను కదా!
తరాల దుఃఖాన్ని ఒలిచి
ముందేసుక్కూర్చుంటాను.
ధూళిదీపం లాంటి శీతాకాలపు సూర్యుణ్ణి
కొంచెం కొంచెం నిండుగా నవ్వే
శుక్లపక్షపు చంద్రున్ని గూర్చి
సన్నని సుకుమారపు పాటనొకటి పాడుతాను కూడా.
-- రాజేశ్వరరావు లేదాళ్ళ, లక్షెట్టిపేట, తెలంగాణ
Next Story

