
మహారాష్ట్ర అడవిలో పులి మృత్యువాత
టెరిటరీ కోసం పులుల సంచారం: ప్రాణాల కోసం మనుషుల పోరాటం
మహారాష్ట్రలో 15 ఏళ్లలో 41 పులుల మృత్యువాత, వన్యప్రాణుల దాడుల్లో 420 మంది మనుషుల మృతి
మహారాష్ట్రలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, వాటికి సరిపడా ఆవాసం లేకపోవడంతో మానవ–వన్యప్రాణుల సంఘర్షణ ఉధృతమవుతోంది. టెరిటరీ కోసం అడవి అంచులు దాటి గ్రామాల వైపు అడుగులు వేస్తున్న పులులు ఒకవైపు సంరక్షణ విజయాన్ని సూచిస్తే, మరో వైపు మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ప్రపంచ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా ఈ పరిస్థితులపై విశ్లేషణాత్మక కథనం.
తెలంగాణ రాష్ట్రానికి పొరుగున ఉన్న మహారాష్ట్రలోని అభయారణ్యాల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది.తక్కువ అటవీ విస్తీర్ణం ఉండటంతో పులులు సురక్షితమైన ఆవాసం, టెరీటరీ కోసం అక్కడి నుంచి పులులు తెలంగాణలోకి వలస బాట పడుతున్నాయి.పులుల సంఖ్య పెరగడంతో పాటు వాటి రక్షణ చర్యలు కొరవడటంతో గడచిన 15 ఏళ్లలో మహారాష్ట్రలో 41 పులులు మరణించాయని మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో వెల్లడించింది.ఈ ఘటనలు వన్యప్రాణుల పరిరక్షకులు, అటవీశాఖ అధికారులలో కొత్త ఆందోళనలను రేకెత్తిస్తోంది.బలార్షా-గోండియా రైల్వే లైన్ లో 2011 నుంచి 2025 మధ్య ఐదు పులులు ప్రాణాలు కోల్పోయాయి.ప్రమాదాలు, విద్యుత్ షాక్, వేట కారణంగా పులుల మరణాలను అరికట్టడానికి మహా ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.ప్రపంచవ్యాప్తంగా టైగర్ రిజర్వ్‌లకు ప్రసిద్ధి చెందిన తాడోబా అంథేరి టైగర్ రిజర్వ్ (TATR) మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలోనే ఉంది. ఇక్కడ పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే, అడవి విస్తీర్ణం మాత్రం అంతే ఉండటంతో అసలు సమస్య మొదలైంది.41 పులులలో 28 సహజ కారణాల వల్ల, ఎనిమిది ప్రమాదాల వల్ల, నాలుగు విద్యుదాఘాతం వల్ల, ఒకటి వేటాడటం వల్ల మరణించాయి.
మనుషులు, పులుల మధ్య సంఘర్షణ
మరో వైపు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని చంద్రాపూర్, గడ్చిరోలి, వార్ధా జిల్లాల్లో మనుషులు, పులుల మధ్య జరుగుతున్న సంఘర్షణకు కేంద్ర బిందువుగా మారాయి. కేవలం నాలుగు రోజుల క్రితం ఇద్దరు మహిళలను పులులు చంపేశాయి. గత ఐదు సంవత్సరాల్లో మహారాష్ట్రలో వన్యప్రాణుల దాడుల్లో 420 మంది మరణించారని సాక్షాత్తూ మహారాష్ట్ర అటవీశాఖ మంత్రి గణేష్ నాయక్ 2026 మహారాష్ట్ర బడ్జెట్ సెషన్ లో తాజాగా రాష్ట్ర శాసన మండలిలో వెల్లడించారు.
పులి దాడి ఘటనలు
- పొరుగున ఉన్న మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో శనివారం పులి దాడిలో ఇద్దరు మహిళలు మరణించారు. మూల్ తాలూకాలోని సోమనాత్ గ్రామంలో సునీతా షాంరావు బోహిర్ పత్తి ఏరుతుండగా పులి దాడి చేసింది. ఈ దాడిలో మహిళ మరణించడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
- సౌత్ బ్రహ్మపురి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని పద్మాపూర్ వద్ద 88 ఏళ్ల యమునాబాయి బాజీరావు మడివి పులి దాడిలో మృత్యువాత పడ్డారు. వంట చేసేందుకు అడవిలో కట్టెలు తీసుకొని వస్తుండగా పులి దాడి చేసి, చంపింది. ఈ రెండు పులి దాడి ఘటనలతో మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఘర్షణలకు ప్రధాన కారణాలు
తాడోబా అడవుల్లో ప్రాజెక్ట్ టైగర్ విజయవంతం కావడంతో పులుల సంఖ్య కెపాసిటీకి మించి పెరిగింది. ఒక మగ పులికి తనకంటూ సొంతంగా కనీసం 25 నుంచి 40 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం (Territory) అవసరం. కోర్ ఏరియాలో స్థలం లేక, కొత్తగా పుట్టిన లేదా పులి కూనలు రెండేళ్ల వయసు వచ్చాక తమ సామ్రాజ్యాన్ని వెతుక్కుంటూ అడవి అంచులకి, బఫర్ జోన్లకి, అక్కడి నుంచి రెవెన్యూ భూములైన పొలాల్లోకి వస్తున్నాయి.చంద్రాపూర్, గడ్చిరోలి అటవీ ప్రాంతాల్లోని గిరిజనులు, పేదలు తమ జీవనాధారం కోసం అడవిపైనే ఆధారపడతారు.అటవీగ్రామాల గిరిజనులు వంటచెరకు, బీడీ ఆకులు, ఇప్ప పూలు (Mahua flowers) సేకరించడానికి తెల్లవారుజామునే అడవిలోకి వెళుతుంటారు.దీంతో పొదల్లో నక్కి ఉన్న పులులకు గిరిజనులు సులువుగా ఆహారంగా మారుతున్నారు.అడవి పందులు, కోతులు, ఇతర జంతువుల నుంచి పంటలను కాపాడుకోవడానికి రైతులు రాత్రిపూట పొలాలకు వెళ్లినప్పుడు కూడా ఊహించని విధంగా పులులు ఎదురుపడి దాడులు చేస్తున్నాయి.
భయం గుప్పిట్లో గ్రామాలు
గత కొన్నేళ్లుగా మహారాష్ట్రలో ప్రతీ ఏడాది సగటున 40 నుంచి 50 మంది పులుల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా పత్తి, కంది పంటలు ఎదిగిన సమయంలో పొలాలు దట్టమైన అడవిలా మారిపోతాయి.ఆ సమయంలో పొలాల్లో పనులు చేయడం రైతుల పాలిట మృత్యుశాపంగా మారుతున్నాయి.
పులుల దాడుల నియంత్రణకు...
పులుల దాడులను నియంత్రించడానికి మహారాష్ట్ర అటవీ శాఖ పలు చర్యలు చేపడుతున్నా మనుషుల మరణాలకు తెర పడటం లేదు. ప్రజలు వంటచెరకు కోసం అడవిలోకి వెళ్లకుండా నిరోధించడానికి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జన్ వన్ వికాస్ యోజన పథకం కింద అటవీ సమీప గ్రామాల్లోని ప్రజలకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. ఏదైనా గ్రామం సమీపంలో పులి సంచరిస్తున్నట్లు సమాచారం రాగానే, వెంటనే స్పందించి పులిని అడవిలోకి తరిమికొట్టేందుకు లేదా బంధించేందుకు ప్రత్యేక బృందాలు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ (RRT) ఏర్పాటు చేశారు.సమస్యాత్మక పులులను గుర్తించి వాటికి రేడియో కాలర్లు అమర్చి వాటి కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు. మనుషులపై పదేపదే దాడులు చేసే 'మ్యాన్-ఈటర్' (నరభక్షక) పులులను బంధించి జంతుప్రదర్శనశాలలకు తరలిస్తున్నారు.అడవి జంతువులు పొలాల్లోకి రాకుండా రైతుల పొలాల చుట్టూ సోలార్ కంచెలు ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీలను సర్కారు ఇస్తుంది.
కాగితాల్లోనే ప్రతిపాదనలు
మహారాష్ట్రలో రైళ్ల కింద పడి పులులు మరణించకుండా నివారించేందుకు రైల్వే లైన్లలో అండర్‌పాస్‌లు, ఓవర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టాలని అటవీశాఖ మంత్రి ప్రతిపాదించారు. అటవీ ప్రాంతాల గుండా వెళ్ళే రైళ్లకు గంటకు 40 కిలోమీటర్ల మేర వేగ పరిమితిని అమలు చేయడం, జంతువులు పట్టాల వైపు రాకుండా చూసుకోవడానికి రైలు ప్రయాణికులు ఆహార వ్యర్థాలను దూరంగా పారవేయాలని ప్రతిపాదించారు.కానీ ఈ ప్రతిపాదనలు ఆచరణ రూపం దాల్చలేదు. విదర్భ ప్రాంతంలోని చంద్రపూర్ జిల్లాలో మాత్రమే 2025లో 47 మంది మరణించారని, బాధితుల కుటుంబాలకు పరిహారంగా రూ. 8.27 కోట్లు చెల్లించామని మంత్రి పేర్కొన్నారు.
మాకు పులులివ్వండి : తెలంగాణ
మహారాష్ట్ర అభయారణ్యాల్లో అధిక సంఖ్యలో ఉన్న పులులను పొరుగున ఉన్న తెలంగాణకు పంపించాలని తెలంగాణ వన్యప్రాణుల విభాగం ప్రతిపాదించినా దీనికి ఇంకా ఆ రాష్ట్ర అటవీశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. పులుల సంఖ్య పెరగడం వల్ల భూభాగాన్ని వెతుక్కుంటూ అవి తిరుగుతున్నాయి. దీంతో మానవ-వన్యప్రాణుల సంఘర్షణ ప్రమాదాన్ని పెరిగింది. విద్యుదాఘాతంతో పులుల మరణాలను నివారించడానికి, కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేయడం, చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినా ప్రమాదాలకు తెర పడటం లేదు.
ప్రపంచ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా ఈ సమస్యపై లోతైన చర్చ, సమగ్ర పరిష్కారాల అమలు కాలానుగుణ అవసరం.పులుల సంఖ్య పెరగడం వన్యప్రాణుల సంరక్షణ విజయానికి సూచిక. కానీ అదే సమయంలో సరైన ఆవాస విస్తరణ, శాస్త్రీయ ప్రణాళిక, స్థానిక ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఈ విజయం విషాదంగా మారే ప్రమాదం ఉంది. అడవులను కాపాడటం ఎంత అవసరమో, అడవి అంచున బతికే మనుషుల ప్రాణాలను రక్షించడం అంతే కీలకం. మానవ–వన్యప్రాణుల సహజీవనం కేవలం నినాదంగా కాకుండా ఆచరణలోకి రావాలంటే ప్రభుత్వాలు, అటవీశాఖ, స్థానిక సమాజం సమన్వయంతో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచ వైల్డ్ లైఫ్ డే మనకు ఇచ్చే అసలు సందేశం ఇదే.
Next Story

