
అమ్రాబాద్ అడవిలో పులి సంచారం (ఫొటో : అటవీశాఖ కెమెరాట్రాప్ చిత్రం)
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల గర్జన: 42కు చేరిన సంఖ్య
ఆహారం సమృద్ధి, కట్టుదిట్టమైన సంరక్షణ… అమ్రాబాద్‌లో పులుల పెరుగుదల
అటవీ జీవవ్యవస్థ సక్రమంగా పనిచేస్తే ఎలా ఫలితాలు వస్తాయో అమ్రాబాద్ మరోసారి నిరూపిస్తోంది. ఒకప్పుడు కొద్ది సంఖ్యలోనే ఉన్న పులులు, ఇప్పుడు గణనీయంగా పెరిగి 42కు చేరడం సంచలనంగా మారింది. సమృద్ధిగా లభిస్తున్న ఆహారం, మెరుగైన సంరక్షణ చర్యలు, వన్యప్రాణులకు అనుకూలమైన వాతావరణం కలిసివచ్చి అమ్రాబాద్ అడవులను పులుల స్వర్గధామంగా మార్చాయి.
అమ్రాబాద్ అడవిలో పెరిగిన పులుల సంఖ్య
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సామాజిక గణాంక నివేదికలో అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో పులుల సంఖ్య 42కు పెరిగాయని వెల్లడైంది. అమ్రాబాద్ అడవిలో గడ్డిక్షేత్రాల విస్తీర్ణం పెరగడంతో జింకలు, చుక్కల దుప్పులు, సాంబార్, నీల్గాయిల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.పులులకు కావాల్సిన ఆహారం అడవిలో పుష్కలంగా లభిస్తుండటంతో పులుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అడవుల్లో సోలార్ పంపుసెట్లు, నీటికుంటల ఏర్పాటు వన్యప్రాణుల దాహం తీరడంతో అన్ని రకాల వన్యప్రాణులు పెరిగాయి.
పులుల పరిరక్షణ కోసం 750 కెమెరా ట్రాప్ లు
అరణ్యంలో కెమెరా ట్రాప్ ల ఏర్పాటుతో అటవీశాఖ అధికారులు పులుల పరిరక్షణ చర్యలు చేపట్టడంతో వేటగాళ్లకు చెక్ పడింది.అడవిలో 30 యాంటీ పోచింగ్ అటవీ బృందాలు పెట్రోలింగ్ చేస్తున్నాయి.పులుల పరిరక్షణ కోసం 750 కెమెరా ట్రాప్ లు ఏర్పాటు చేశారు. 2018వ సంవత్సరంలో అమ్రాబాద్ లో 12 ఉన్న పులుల సంఖ్య 2022 నాటికి 22 కు పెరిగాయి. 2024-25 నాటికి 36 పులులు అయ్యాయి.అమ్రాబాద్ లో 20 పులి కూనలకు జన్మనిచ్చాయి.అమ్రాబాద్ లో పులుల నివాసానికి, సంచారానికి అనువైన అటవీ ప్రాంతం ఉండటంతో 100 పులుల వరకు జాగా ఉందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
తాజా గణనలో పులుల సంఖ్య 42కు పెరిగాయని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సునీల్ హీరేమత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
పులుల సంతానోత్పత్తి
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో పలు ఆడ పులులు కూనలకు జన్మనివ్వడంతో పులుల సంఖ్య పెరిగింది. ఏటీఆర్- ఎఫ్ 3 నాలుగు కూనలకు జన్మనిచ్చింది. ఏటీఆర్ - ఫర్హాబాద్ 7 పులి రెండు పులి పిల్లలకు జన్మనిచ్చింది. 2017వ సంవత్సరంలో అమ్రాబాద్ అడవిలో 10 పులులుండగా, 2026 నాటికి సంతానోత్పత్తి వల్ల వీటి సంఖ్య 42కు పెరిగాయి. అచ్చంపేట, అమ్రాబాద్ అటవీ డివిజన్లలోని అడవుల్లో పులులు సంచరిస్తున్నాయని వెల్లడైంది.
ఎఫ్ 7, ఎఫ్ 18, ఎఫ్ 6, ఎఫ్ 53, ఎఫ్ 11, ఎఫ్ 12, ఎఫ్ 24, ఎఫ్ 26 ఆడ పులులు పలు కూనలకు జన్మనివ్వడంతో పులుల సంఖ్య 42కు పెరిగిందని అటవీశాఖ అధికారి, టైగర్ అవార్డు గ్రహీత ఎండీ ఖాదర్ పాషా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఆవిర్భావం
1978వ సంవత్సరంలో శ్రీశైలం వైల్డ్ లైఫ్ అరణ్యం ఏర్పాటైంది. 1983వ సంవత్సరంలో అమ్రాబాద్ లో ప్రాజెక్టు టైగర్ పథకాన్ని అమలు చేశారు. 1992వ సంవత్సరంలో శ్రీశైలం వన్యప్రాణుల అభయారణ్యాన్ని రాజీవ్ గాంధీ అభయారణ్యంగా పేరు మార్చారు. 2015వ సంవత్సరంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏర్పాటైంది.
పెరిగిన వన్యప్రాణులు
అమ్రాబాద్ అడవుల్లో వన్యప్రాణుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. 2017వ సంవత్సరంలో అడవుల్లో ఉన్న చీతల్, సాంబార్, లంగూర్,అడవి పందులు, జింకలు, నీలుగాయిల సంఖ్య రెట్టింపు అయిందని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సునీల్ హీరేమత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
కవాల పులుల అభయారణ్యంలో 7 పులులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల పరిధలో 892.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కవాల్ పులుల అభయారణ్యం విస్తరించి ఉంది. మహారాస్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోని తాడోబా, అంధేరి, ఇంద్రావతి టైగర్ రిజర్వు నుంచి పులులు కవాల అభయారణ్యంలోకి వలస వస్తున్నాయని తాజా నివేదిక వెల్లడించింది. కవాల్ అభయారణ్యంలో పులులతోపాటు ఇతర వన్యప్రాణుల సంఖ్య కూడా పెరిగిందని తేలింది. కవాల్ అభయారణ్యంలో 7 పులులు, 41 చిరుతపులులున్నాయని తాజా నివేదికలో తేలింది.
తెలంగాణలో 24.69 శాతం అడవులే...
తెలంగాణ రాష్ట్రంలో 27,688 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. జాతీయ అటవీ విస్తీర్ణ సగటు కంటే అధికంగా 24.69 శాతం అడవులతో తెలంగాణ అలరారుతుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సామాజిక గణాంక నివేదిక వెల్లడించింది. 9 వన్యప్రాణుల అభయారణ్యాలు, మూడు జాతీయ పార్కులతో పర్యావరణం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించేలా అటవీశాఖ చర్యలు చేపట్టింది. తెలంగాణలో 2,939 రకాల చెట్లు, 365 జాతుల పక్షులు, వాటి కిలకిల రావాలు, చెంగుచెంగున దూకే జింకలు, 103 రకాల వన్యప్రాణులు, పాములతో జీవవైవిధ్యంతో తెలంగాణ అడవులు పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుతున్నాయి. అటవీ విస్తీర్ణంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.కవాల టైగర్ రిజర్వ్, ప్రాణహిత, శివారం, ఏటూర్ నాగారం, పాఖాల, కిన్నెరసాని, మంజీరా, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కు, మృగవని నేషనల్ పార్కు, మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కుల్లో జింకలు, పక్షులతో అలరారుతున్నాయి.
టాప్ టెన్ అటవీ జిల్లాలు
తెలంగాణలో టాప్ టెన్ అటవీ జిల్లాలు అధిక అటవీ ప్రాంత విస్తీర్ణంతో ఉన్నాయి. ములుగు జిల్లాలో 64.64 శాతం అడవులున్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 42.38శాతం, జయశంకర్ భూపాలపల్లిలో 41.15 శాతం అటవీ ప్రాంతం ఉందని తాజా నివేదిక తేటతెల్లం చేసింది. కొమురం భీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, నిర్మల్, ఆదిలాబాద్, మహబూబాబాద్, జగిత్యాల జిల్లాల్లో అటవీ విస్తీర్ణం 25.14 శాతం కంటే అధికంగా ఉందని తేలింది.
అమ్రాబాద్ అడవుల్లో పులుల సంఖ్య పెరగడం కేవలం గణాంక పరిమితి కాదు… ఇది పర్యావరణ పరిరక్షణలో సాధించిన గొప్ప విజయానికి నిదర్శనం. అటవీశాఖ చేపట్టిన కట్టుదిట్టమైన చర్యలు, సహజ వనరుల సంరక్షణ, వన్యప్రాణులకు అనుకూల వాతావరణం కలిసి జీవవైవిధ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. ఇదే దిశలో ప్రయత్నాలు కొనసాగితే, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ దేశంలోనే ఉత్తమ అభయారణ్యాల్లో ఒకటిగా నిలవడం ఖాయం.
Next Story

