
ఏప్రిల్ 30 నుంచి తిరుచానూరు అమ్మవారి వసంతోత్సవాలు
ఏప్రిల్ 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు ఏప్రిల్ 30 నుండి మే 02వ తేదీ వరకు భక్తి, వైభవాలతో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు ముందు ఏప్రిల్ 29న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ కార్యక్రమం జరగనుంది. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవ సేవలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు.
ఉత్సవాల్లో భాగంగా మే 1వ తేదీ ఉదయం 9.30 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారు విహరించి భక్తులకు దర్శనమిస్తూ కటాక్షిస్తారు.
ఏప్రిల్ 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
వసంతోత్సవాలను పురస్కరించుకుని ఏప్రిల్ 28వ తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం విశేషంగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం చేపడతారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి మొదలైనవన్నీ పవిత్రజలంతో శుద్ధి చేయబడతాయి.
నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 9 గంటల నుండి భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తారు.
ఈ ఉత్సవాల నిర్వహణ కారణంగా ఏప్రిల్ 28 మరియు ఏప్రిల్ 30 నుండి మే 02వ తేదీ వరకు కళ్యాణోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

