ఒక నాడు తిరుపతి గుండెకాయ నాలుగుకాళ్ల  మండపం
x

ఒక నాడు తిరుపతి గుండెకాయ నాలుగుకాళ్ల మండపం

భూమన్: తిరుపతి కేంద్ర బిందువు నాలుగుకాళ్ల మండపం గాలిలోనే ఏదో మాయ ఉంది. ఈ వీధుల పేర్లు కూడా పురాతన వాసన వస్తూనే ఉంటాయి. వీటి వైభవం ఎంత చెప్పుకున్నా తక్కువే.


ప్రతి ఊరికి ఏదో ఒక కేంద్ర బిందువు ఉన్నట్టే మా తిరుపతికి ఒక కేంద్ర బిందువు ఉంది. అదే నాలుగుకాళ్ల మండపం. తిరుపతి అంటే నాకు వల్లమాలిన ఇష్టం. ఎన్ని ఊళ్లు తిరిగొచ్చినా తిరుపతి గాలి పీలిస్తే అదొక గొప్ప సంతృప్తి. మా వీధుల పేర్లు కూడా పురాతన వాసన వస్తూ ఉంటాయి. మాడ వీధులు, పరసాల వీధి, గిడ్డంగి వీధి, పొర్ల వీధి, పట్నూలు వీధి, బండ్ల వీధి, కాపు వీధి, బేరి వీధి, ఇట్లా చాలా పేర్లు ఆకర్షణీయంగా పలుకుతుంటాయి.

నా కాలేజీ చదువులప్పటి నుండి నాలుగుకాళ్ల మండపం, కోనేటి కట్ట వైభవాన్ని చూస్తున్నా. ఇది బండ్ల వీధి మొదట్లో ఉంటుంది. ఎదురుగా రాజ వీధి. దాన్నే ప్రస్తుతం గాంధీ వీధి అని పిలుస్తున్నారు. గాంధీ ఈ వీధిలో బహిరంగ సభ నిర్వహించడం వల్ల స్వాతంత్ర్యం తర్వాత మున్సిపాలిటీ వాళ్లు దీనికి గాంధీ రోడ్డు అని నామకరణం చేశారు. దానికి ముందు ఈ వీధినే పెద్ద అంగడి వీధి, పెద్ద బజారు వీధి అని పిలిచేవారు. పక్కకు తేరు వీధి ఉంది. గోవిందరాజస్వామి గోపురం ఠీవిగా కనబడుతూంటుంది. సుప్రసిద్ధ రచయిత తిరుమల రామచంద్ర ఈ గోవిందరాజస్వామి శిఖర మెక్కి స్వాతంత్య్రోద్యమ కాలంలో మూడురంగుల జెండా పాతిపెట్టిన ఘటన ఇప్పటికే విద్యార్థులను ఆవేశపరుస్తూంటుంది. 1930లో సంస్కృత కళాశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు తిరుమల రామచంద్రగారు ఈ సాహసం చేసి విద్యార్థులకు పోరాట పటిమను నేర్పినారు.

తిరుపతి వీధుల చరిత్ర, గంగమ్మ చరిత్ర మీద అథారిటీ పేటశ్రీ తిరుపతికి సంబంధించిన ఏ విషయాన్నయినా అలవోకగా చెబుతాడు, రాస్తాడు. స్థానిక చరిత్ర రాయటంలో అగ్రగణ్యుడు. అంతకు ముందు అదే బండ్ల వీధిలో ఉండే పులికంటి కృష్ణారెడ్డిగారు నాలుగుకాళ్ల మండపమంటే విపరీతమైన మక్కువ చూపేవారు. మధురాంతకం నరేంద్రకు కొత్తూరుతో పాటు నాలుగుకాళ్ల మంటపమంటే ఇష్టం.

వెయ్యి సంవత్సరాలకు పూర్వం రామానుజాచార్యులు కొండ కింద కపిలతీర్థం కాడ ఉండే కొత్తూరును తీసుకొచ్చి గోవిందరాజస్వామి గుడి చుట్టూ గరుడాకారంలో తిరుపతి కట్టించినాడు. ఆ కట్టడాల్లో భాగంగానే ఈ నాలుగుకాళ్ల మంటపం కూడ కట్టినట్టున్నారు. ఇది గ్రామ చావిడిగా ఉండేది.

అప్పటి నుండి ఈ నాలుగుకాళ్ల మంటపం తిరుపతికి కేంద్రం. గుండెకాయ. అన్ని కార్యక్రమాలు ఇక్కడనుండే. కొన్నేళ్ళుగా పొద్దుపొద్దున్నే కొన్ని పదుల మంది కూలీలు ఇక్కడే జతకూడేవారు. ఇళ్లు కట్టే వాళ్లు, మేస్త్రీలు, పాకీ పనివారు, సున్నం పూసేవారు, ఇటికెత్తేవారు, పెయింటు పూసేవారు, కాసిరాయ మలిచేవారు, చెక్కపని చేసేవారు వొకటనేమిటి అన్నీ రకాల పనులు చేసేవారు ఇక్కడే దొరికేవారు.

తమిళనాడు, కర్ణాటక, అనంతపురం జిల్లాల నుండే కాక కడుపాత్రం కోసం ఎందరో అభాగ్యులు ఇక్కడికి చేరేవారు. ఇప్పుడయితే వారెవరూ ఇక్కడలేరు. ట్రాఫిక్ సమస్య మూలాన వారికి ఇందిరా మైదానంలో స్థావరం చూపించినారు. వైకుంఠం ఆర్చి దగ్గర కూడా పొట్ట చేత బట్టుకుని గుంపులు, గుంపులుగా ఉంటారు. పాత రోజుల్లో అయితే మునియాండి విలాస్ దగ్గర నుండి, రుద్రయ్య సెకండ్ హ్యాండ్ బుక్ షాపు, మాలికూ ప్రింటింగ్ ప్రెస్ , వసంత కాఫీ పౌడర్ వరకు వీరి జాడలే. ఇప్పటికీ ఉడ్డా పిచ్చా మంది ఈ నాలుగుకాళ్ల మంటపం అంటి పెట్టుకునే ఉండటం విశేషం.

ఈ నాలుగుకాళ్ల మంటపం దగ్గరనే నాకు అనంతశయనం అయ్యంగార్, శంకరం బాడి సుందరాచారి గార్లు పరిచయం. అన్నదానం చేస్తూ పరిచయమయిన అనంతశయనంగారు గంగుండ్రమంటపం వీధిలో ఉండేవారు. అప్పటికి మేము వసంత మేఘ గర్జన ప్రభావంలో ఉన్నాము. వారి ఇంటికి పోతే చెయ్యి విప్పి వేళ్లను చూపిస్తూ ఏమయ్యా ఇవేవీ సమానంగా లేనప్పుడు మీరు ఎట్లా సమానత్వం సాధిస్తారయ్యా అని ప్రశ్నించటం నాకిప్పటికీ జ్ఞాపకం. అభిప్రాయాలు వేరయినా పిల్ల వాళ్లను కూడా గౌరవించే అపురూపమయిన సింప్లిసిటీ ఉన్న వ్యక్తి. శంకరంబాడి గారైతే నన్ను, త్రిపురనేని మధుసూదన్ రావును చాలా ఇష్టంగా చూసేవారు. మా కవిత్వమే చదవమని అల్లరల్లరి చేసేవారు. మేము కోనేటికట్టలో ఉపన్యాసాలు చేసేటప్పుడు ఇష్టంగా వచ్చి వినిపోయే మహానుభావుడు శంకరంబాడిగారు.

పులికంటి కృష్ణారెడ్డి గారినయితే కొన్ని పదుల సార్లు ఈ నాలుగుకాళ్ల మంటపంలోనే కలుసుకుని అనేక సాహితీ మాటలు మాట్లాడేది. ఈ నాలుగుకాళ్ల మంటపం నుండే మేం ఐదుగురం త్రిపురనేని, సాకం, గోపి, వీరయ్య, మురళి, బాల కలసి కన్యాశుల్కం నూరేళ్ల పండగ మొదలు పెట్టినాము మా రాజకీయ కార్యక్రమాలు మొదలుగావటం. ముగియటం ఇక్కడే. ఆ రోజుల్లో ఏ కార్యక్రమానికయినా నాలుగుకాళ్ల మంటపమే తొలిమెట్టు. మాకు ఊపిరయితే కూలీలకు ఊపిరితిత్తుల్లాంటిది ఈ నాలుగుకాళ్ల మంటపం.

ఈ నాలుగుకాళ్ల మంటపంలోనే సంవత్సరానికి వొక్కసారి స్వామి తన దేవేరులతో కలిసి ఆసీనులయి పూజలందుకుంటారు. ఉట్ల పండగ కూడా ఇక్కడే జరిగేది. అదొక కోలాహలం. బండ్ల వీధికి వాయవ్య దిక్కున ఉండే నాలుగుకాళ్ల మంటపం పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉండేది. ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా నాలుగుకాళ్ల మంటపంను పక్కకు జరిపి ఆంజనేయ విగ్రహాన్ని చావిడిలో ఉంచినారు. ఈ చావిడి, మంటపం గొప్ప శిల్పకళతో ఉండేది. రాతి స్తంభాలకు సున్నం కొట్టి వాటి రూపాన్ని తారుమారు చేసి పారేసినారు. వెనకాతల గుడి దానికి ముందుగా నాలుగుకాళ్ల మంటపం, పైన చిన్న గోపురంతో అలనాటి నాలుగుకాళ్ల మంటపు వైభవం రాను రాను మసిబారిపోతున్నది.

ఇప్పుడు ఆ కూలీలు లేరు, కార్యకలాపాలూ లేవు, కోనేటి కట్ట మీటింగులూ లేవు. కాలగమనంలో ఇదొక పెద్ద మార్పు. మాలాంటి వారికి చారిత్రాత్మక జ్ఞాపకం. ఇప్పటికీ ఆ నాలుగుకాళ్ల మంటపం, కోనేటికట్టకు వచ్చిన రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులను జ్ఞప్తికి తెచ్చుకుని పదుమంది పది రకాలుగా చర్చించుకుంటూనే ఉన్నాము. ఊరు ఊరిపట్ల ఇష్టం, ప్రేమ ఉండే ఎవరినైనా ఇట్టాంటి ఊరి గుండెకాయలు, ఊపిరితిత్తులు ప్రాణ వాయువును పోస్తూనే ఉంటాయి.

Read More
Next Story