ప్రేమ ప్రకటనా పత్రం
x

ప్రేమ ప్రకటనా పత్రం

నేటి మేటి కవిత : - వనజ తాతినేని


నా ఏకాంత యోగాన్ని భస్మీపటలం చేసి

ఏళ్ళ తరబడి నా కలలోకి వస్తున్న గ్రీకు శిల్ప సుందరి నీవు.

నీ కోసం జీవితాంతం నిరీక్షించగలను.

ఈ ఎదురుచూపులో నన్ను నేను సంభాళించుకోవడం మరిచాను.

ఓ జవరాలా! కూరిమి వరాలిచ్చే దేవత ముందు దోసిలి పట్టి

ఇంతగా ఎదురు చూడాలా!?

దయచేసి నా ముందుకు రాకూడదూ!

ఒక్కసారి నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడనీ

కిరణాల జడి వానలో నన్ను నిలువెల్లా తడిసిపోనీ..

దయచేసి నువ్వు వస్తావని మాటిచ్చావంటే చాలు

నా పొదరిల్లు చుట్టూ వసంతాన్ని సమావేశపరుస్తాను.

నా పాటకు తోడుగా స్వరాల్ని జతచేయమని

గండు కోయిలను వేడుకుంటాను.

పూల తీగెలను తోరణాలుగా వ్రేలాడదీస్తాను.

నీకు విసుగు లేకుండా ముచ్చట్లు చెప్పడానికి

మైనా పక్షులను బహుమానంగా ఇస్తాను

మనోహరంగా వుండే సీతాకోక చిలుకలు నీ చుట్టూ

నిత్యం సంచరించేలా పూలతోటను వేస్తాను

పన్నీరు పూలతో శయ్య ను అలంకరిస్తాను.

వేసవిలో విరబూసే జాజులు మల్లెలతో పాటు

నా మమతను మాలలుగా మార్చి నిన్ను అలంకరిస్తాను.

పూట పూటకి వలపు హరిచందనాలతో సత్కరిస్తాను

మధుర ఫలాలను పలహారం పెడతాను

చీకటెరుగని రాత్రుల్లో గూటి పడవలో విహారం చేద్దాం

నువ్వు చలం ఊర్వశి వా! అయితే నేను పురూరువుడినౌతా!

తేనెలో పడి ఈగ మరణించడానికి సిద్దపడినట్లు

నీ విరహంతో అలమటించటం కూడా నాకు సమ్మతమే.

నాలో రసమయ భావాలకు ద్వారాలు తెరిచిన

నీ పరువాల కొమ్మపై రోజూ కాసేపు నన్ను ఊగనివ్వు

సొగసుకాడిని నేను, దేదీప్య మానసి వి నీవు.

మనమిద్దరం కలిసి మన అందమైన సంతానమౌవుదాం, సరేనా!?

విధి లిఖితం కాకపోతే నువ్వు నాకెందుకు తారసపడినట్లు !?

ఇంకా అనేక జన్మలు యెందుకు చెప్పు?

ఈ జన్మలోనే మనని భగవంతుడు తప్పక ఆశీర్వదిస్తాడు.

ఆశీర్వదించబడేవి అందమైన జీవితాలు

వారి హృదయాల్లో ఆనందం నిశ్శబ్ద నదులుగా ప్రవహిస్తాయి.

మహల్ విడిచి రా చిలకా! నా మనస్సరస్సులో దాగిన ఆరాధన

నీటిబుగ్గలా ఉబికి నిన్ను నిలువెల్లా అభిషేకిస్తుంది.

నాది పేద హృదయమని తృణీకరించకు,

నా స్నేహానికి రంగులు హంగులూ లేవు

నాలో వేళ్ళూనుకుని పోయిన ప్రేమకి సమాధి కట్టకు.

తర్వాత విలపించినా ఆ సమాధి బద్దలు కొట్టుకుని రాలేను.

ఈ ప్రకటనా పత్రాన్ని స్వీకరించు. నా విన్నపం మన్నించి

ఆమోదం తెలుపు ప్రియా! ఒంటి స్తంభం మేడలో వున్న రాకుమారి కోసం

ఉద్విగ్నత తో వేసారిపోతున్న పోతుటీగ లాంటి తోటరాముడు

సాహోసేపేతంగా నిచ్చెన వేస్తున్నాడు. సముద్రాలు ఈది వస్తున్నాడు.

నీ మనస్సనే సముద్రం లోతు తెలుసు కనుక.

వచ్చేయ్ ప్రియా! ఈ అనామకుడి సాంగత్యం కొరకు వచ్చేయ్

మదిలో ముద్ర వేసిన నీ సత్యం నిన్ను వెతుక్కుంటూ వచ్చాక

ఒంటరిగా దిగులు రాగాలాపన యెందుకు?

జనులేం అనుకుంటే మనకెందుకు?

ఏక కంఠంతో ప్రణయ గీతాలాపన చేద్దాం.

వచ్చేయ్! రాజు పేద ప్రేమకు పట్టాభిషేకం చేసుకుందాం

ప్రియా, వచ్చేయ్!! పొదరిల్లు స్వాగతం పలుకుతుంది.


Read More
Next Story