
అలా ఉండిపోయే వాళ్లు!
నేటి మేటి కవిత
ఎన్నటికీ, ఎవరినీ వీడలేక వాళ్ళు అలా ఉండి పోతుంటారు!
*
ఆ కొందరు,
ఎవరో గుచ్చిన ముళ్ళను
చేతులతో సహా గుండెల్లోనే దాచుకుంటారు.
నొప్పికి అలవాటు పడ్డ నవ్వులు
నవ్వేస్తూ అలా ఉండి పోతారు.
*
ఆ కొందరు తమను చేరుకోనివ్వని దూరాలని
రహస్యంగా కార్చే కన్నీళ్లలో చెరిపేస్తూ ఉంటారు.
నమ్మకాలని ద్రోహం చేసే నిజాలని
చేదుగా మింగేస్తూ ఉంటారు.
వెన్ను దిగిన కత్తులను గుర్తు పట్టి
తామే పెకిలించుకుంటూ ఉంటారు.
*
కొందరు అడవుల్లా ఉంటారు.
కొందరు నగరాల్లా ఉంటారు.
ఇంకొందరు సముద్రాల్లా ఉంటారు.
మరి కొందరు ఆకాశాల్లా ఉంటారు.
కొందరు పక్షుల్లా , పువ్వుల్లా ఉంటారు.
**
ఇంకొందరు పగళ్లుగా,
వెన్నెల రాత్రుళ్ళు గానూ ఉంటారు!
కొందరు నదీ తీరాల్లా ఆగిపోయిన
పడవలను వొడి నింపుకుని
కల్లోల, కల్లోలంగా ఉంటారు.
ముఖాలను మార్చుకుంటూ...
మారుస్తూ దొంగల్లాగా తిరగేస్తూ ఉంటారు.
ఆపుకోలేని దుఃఖాలతో అర చేతుల్లో
ముఖాల్ని దాచుకుంటూ, తప్పుకుపోతూ ఉంటారు.
ఇంకొందరు అమృతంలా ఉంటారు.
వాళ్ళు తోటల్ని మొలిపించుకునే భూమిలా ఉంటారు.
పరుగులు పెట్టించే
ఋతువులలా కూడా ఉంటారు
వాళ్ళలానే ఉంటారు!
*
కొందరుంటారు,
దగ్గరికి రాని మనుషుల్ని అస్సలు
మళ్ళీ వెనక్కి పిలవరు.
అద్దం ముందుకెళ్ళి తమని తామే
పలకరించుకుంటూ ఉంటారు
వాళ్ళని వాళ్ళే దగ్గరకి తీసుకుంటూ ఉంటారు.
వాళ్ల తల వాళ్ళే నిమురుకుంటూ ఉంటారు
తమని తామే నిద్ర పుచ్చు కుంటూ ఉంటారు
తమ అరచేతులను తామే ముద్దు పెట్టుకుంటూ ఉంటారు.
తమ కన్నీళ్ల కళ్ళని తామే తుడుచుకుంటూ ఉంటారు.
**
చెప్పాల్సినవి ఎన్నో ఉన్నా
వాళ్ళలా మౌనం అయి పోతూ ఉంటారు.
ప్రశ్నల్ని పూరించే కలాలను వేళ్ళ మధ్య
ఆడిస్తూ జనం మధ్య ముఖాలు
వెతుకుతూ తిరుగుతూ ఉంటారు!
**
రాలబోయే పండులా తనువు వడలి పోతూ ఉన్నప్పుడు,
ఆశలు, ఎండుటాకుల్లా చితికిన శబ్దం చేస్తున్నప్పుడు,
వాళ్ళలా సర్దుకు పోతూ ఉంటారు!
వాళ్ళేవ్వరి మీదా ఏమీ చెప్పరు, అలగరు కూడా!
అన్నీ ఇలా జరగాల్సినవే, జరిగినవే కదా అనిపిస్తుంటాయి.
డేజావు చలిజ్వరం
అలవాటైనట్లే వొణుకుతూ ఉంటారు!
**
వాళ్ళు మధ్య మధ్యలో
హడావుడిగా వీధుల్లో తారస పడే
గత జన్మ పరిచయస్తులని పలకరిస్తూ ఉంటారు.
వాళ్ల కి జీవితాన్ని కర్కశంగా రాసిన
కాఫ్కా లోలోపల కలి తిరుగుతుంటాడు.
ఎన్నో చూపించాల్సినవి, చూడాల్సినవి ఉంటాయి.
అయినా సరే కనురెప్పల దుప్పట్లు కప్పేసుకుని
కొత్త గుడ్డితనాన్ని సాధన చేస్తుంటారు.
లేదా గాజు కళ్ళ పరదాలనుంచి
నిర్నిమేషంగ చూడ్డం అలవాటు చేసుకుంటారు
చుట్టూ ఉన్న రంగుల్ని కలిపేస్తూ
నలుపు తెలుపుల్లో విడదీసుకుంటూ ఉంటారు.
**
ప్రేమ దొరకక నదిలో మునిగిన వర్జీనియా వూల్ఫ్,
మండే వోవెన్ లో తల ముంచిన
సిల్వియా ఫ్లాత్ ల్లా గా ,పోనీ పాబ్లో నెరుడా లాగో
వాళ్ళలా విషాదపు వెర్రి ముఖ కవళికలతో
ప్రియుళ్ళనో, ప్రియురాళ్ళ నో
సామూహికంగా వెతుకుతూ పరిగెడుతుంటారు!
బహుశా వాళ్ళనో మైకం కమ్మే
పిచ్చి రాగమేదో వెన్నాడుతూ ఉంటుంది!
**
వాళ్ళకి ఏవో రాగాలు వినిపిస్తూ ఉంటాయి.
బహుశా అమ్మ పాడిన శైశవ రాగమో,
ప్రియురాలు పాడిన వియోగ గీతమో ?
అయినా వినిపించనట్లే ఉంటారు.
ఏవో పాటలు పాడాలనీ ఉంటుంది.
పాటలను మూగవి చేసుకుని
దిగులు పడుతూ ఉంటారు.
*
అసలు కొందరుంటారు.
వాళ్ళు చాలా సార్లు మరణించి ఉంటారు!
ఎన్ని సార్లంటే, దేహం మట్టిని
పూర్తిగా పీల్చి పూలు పూసే దాకా!
అప్పుడప్పుడూ, ఎవరో పిలిచినట్లే మళ్ళీ
సమాధుల నుంచి బతికి వస్తూ ఉంటారు.
జీవశ్చవాల వంటి మనుషుల
మధ్య కలిసిపోయి కొత్త శ్వాశ ఇస్తూ ఉంటారు!
ప్రేమ దాహంగొన్న వాళ్ళని కౌగలించుకుని
జీవన స్పర్శని అంటిస్తూ ఉంటారు!
మృత్యు-జీవితాలు రెండూ
ఉచ్చ్వాస నిశ్వాసలు మాత్రమే వాళ్ళకి.
**
ప్రేమలో ఉండడం జీవితం వాళ్ళకి!
వాళ్ళందుకే ఉంటారలా
ప్రేమలో ఉన్నామని చెప్పడానికే అన్నట్లుగా!
**
కొంత మంది ఉంటారు చూడండి!
ఎప్పుడూ తలుపులు తట్టేవాళ్ళు!
వాకిలి తెరిచి ఇంట్లోకి రమ్మనే వాళ్ళు.
కిటికీ రెక్కలు తోసి పాటను పంపే వాళ్ళు!
కంచంలో అన్నం వడ్డించేవాళ్ళు!
కమ్మని నిద్రతో పాటు,
కళ్ళల్లోకి కాసిన్ని కలల్ని వొంపే వాళ్ళు!
వణికించే చలిలో ఇంత ఎండని,
కాల్చేసే ఎండలో ఇంత దాహాన్ని తీర్చేవాళ్లు!
నీ నొప్పిని కంటి చూపుతోనే తగ్గించేవాళ్ళు!
**
సంధ్యా కాలపు దీపం వెలిగించి
నిశబ్దంగా ఎదురు చూసేవాళ్ళు!
ఇక నటించలేక ఏడ్చేసే వాళ్ళు!
ప్రేమని ఎదురు చూపుల్లో కొలిచే వాళ్ళు!
ప్రేమ విషమై రోజూ చంపడాన్ని
తియ్యని నొప్పి తో మధువుగా
మార్చుకుని ఊపిరి పోసుకునే వాళ్ళు !
తమని తాము బతికించుకునే వాళ్ళు!
**
అవును ఎన్నటికీ,
ఎవరినీ వీడలేక వాళ్ళు అలా ఉండి పోతుంటారు.
బహుశా వాళ్ళలా మిగిలిపోయిన వాళ్లు!
జీవితాన్ని మిగుల్చుకున్న వాళ్ళు!
జీవితం మిగిల్చిన వాళ్ళు!
మరణించని వాళ్ళు!
వాళ్ళు కదా కావలసింది?
**
Next Story