అవిటి నత్త
x

అవిటి నత్త

నేటి మేటి కవిత


-రహీమొద్దీన్



చినుకు తడి కోసం
కరువు నేల కండ్లు ఎడారులవుతున్నా
మనసు కరుగని రాతి మేఘాలు

ఒక్కచోటునే పగబట్టి చుట్టుముట్టి
ముంచేసింది నల్ల మబ్బుల దండు
బుసగొడుతూ ఉరికొచ్చింది
వేల తలల వరద నాగు

ధైర్యపు కొండ సెరియలు విరిగి
నిబ్బరమంతా కూకటివేళ్లతో కూలినట్టు
సారంగల్ల మట్టి గుండెను
నీటికత్తితోని కోతగోసినట్టు
కుండపోతగా వాన దాడి

ఆయిటి చినుకులుగా
మట్టి దోసిట్లో దయగా కురిసే వాన
ఆకాశం నుండి కురిసే అమృతమయితే
అమాంతం నింగి కూలి నేల మీదపడినట్టు
ఏరును ఊరును ఏకం జేసిన వాన
భూమిని మింగే భూతం

బువ్వకుండ అసువంటి
నిండు చెరువు‌ని
వాన గొడ్డలి నిలువునా నరికిపోతే
దిక్కుతోచని కన్నీరు పొంగిన ఈ మున్నేరు

గొంతు తెగిపోయిన చెరువు
గిలాగిలా కొట్టుకుంటుంటే
ఊరి గుండె పగిలి
కండ్ల దాకా పొంగింది దుఃఖ సముద్రం

తల్లి దూరమైన పిల్లలు పాలకేడ్సినట్టు
ముక్కు పచ్చలారని పొలాలు నీళ్ళకోసం
గుక్కపట్టిన ఏడుపు ఏ చెవినా పడదు !

కాళ్ళు చేతులాడని రైతులు
బిడ్డను బతికించుకోలేని
పేద తండ్రులై తండ్లాడుతుంటే
ఏ కన్ను దయతోని చూడదు!

కోరుకున్న చోట
ఉన్న పళాన కోటల్ని నిర్మించే యంత్రాంగం
కట్టతెగిన చెరువుల్ని పట్టించుకునే
చూపును కోల్పోయి అవిటి నత్త అయిపోయింది

నిర్లక్ష్యం కుర్చీలో కూసోని
ఉట్టి మాటల్ని మూటలు కడతుంటే
పంటకు ప్రాణం పోసే నీళ్ళు ఏటి పాలైపోతే
అసువులుబాసిన పొలాలన్నీ
ఎండిన అస్థిపంజరాలు

ఎవడో ఆత్యాస బలిసినోడు చేసిన పాపానికి
గరీబోళ్ళ బతుకులు గంగపాలు
ఆకలి పేగులకు పట్టెడన్నం పెట్టే తల్లి
మనసున్న మాగాణి
ఇంకా
పుట్టెడు ఇసుక రాసుల కిందే!




Read More
Next Story