
తల్లి తనమే ప్రపంచ పరిణామానికి ఆయువు
‘రక్తపాతం సృష్టించేవాడు ఆ రక్తపు మడుగులోనే గతిస్తాడు’ నేటి మేటి కవిత: డాక్టర్ కత్తి పద్మారావు
హిమాలయ పర్వతాల్లో నిద్రిస్తున్న
సూర్యుడు నిద్ర లేచాడు
మంచులో విచ్చుకున్న మందారంలా ఉన్నాడు
ప్రతీ ఉదయాన కడలి అంచుల్లో
గులాబీ వనాలు పూస్తున్నాయి
ప్రకృతిలో ఆంతరంగిక
చలనాలు పెరుగుతున్నాయి
మండుటెండలకు తాటికాయ
ఒట్టి బుర్రగానే మిగులుతుంది
కొబ్బరి కాయలో లోనలోననే
నీళ్ళు యింకుతున్నాయి
ఆ చేపపిల్ల నీళ్ళు తాగుతున్నప్పుడు
సరిగమల శబ్దం
నిజమే! జ్ఞానంపై ద్వేషం
జ్ఞానార్జపై గొడ్డలి వేటు
అక్షరం పుట్టుకలో ధ్వనులున్నాయి
పక్షుల కుహూ రావాలను
మనుషులు అనుకరించారు
పక్షులు, జంతువులు
సమూహాలుగా జీవిస్తున్నాయి
మనిషి కూడా గుంపు నుండే వచ్చాడు
సమూహం నుండే
సంఘధర్మం పుట్టింది
ఆ తథాగతుడు ధర్మం కోసం నడిచి నడిచి
ఆ చండాలుర ఆవాసాలకు చేరాడు
అక్కడ మానవ ధర్మాన్ని వీక్షించాడు
సంపదను సమూహం సమానంగా
పంచుకోవడంలోనే ధర్మముందని తెలుసుకున్నాడు
దుఃఖం కలిగేది కాదు
కలిగించేది అని అర్థం అయింది
ప్రేమ సహజాతం అని గుర్తించాడు
ఆయుధ ధారుడు అదే ఆయుధంతో
అంతమౌతాడని తెలుసుకున్నాడు
క్షాత్రం, క్షత్రియత్వం వధ నుండే
పుట్టాయని అర్థం చేసుకున్నాడు
రక్తపాతం సృష్టించేవాడు ఆ
రక్తపు మడుగులోనే గతిస్తాడని వివేచించాడు
ప్రేమ ఎక్కడ నుండి జనిస్తుంది?
ప్రేమ తల్లి ఒడిలో పుట్టింది
పిల్లకు పాలిస్తూ తల నిమురుతున్నప్పుడు
ఆ కళ్ళలో కలిగే అనుభూతిలో
సూర్యచంద్రులు ఉదయిస్తారు
జీవుల అనుబంధాల్లో తల్లితనం
ఒక జీవన మాధుర్యం
తల్లి పలక మీద రాసిన అక్షరం
ఆకాశ నక్షత్రం అయింది
తల్లి బెల్లపుబువ్వలో నెయ్యి కలిపి
పెట్టిన అనుభూతి తరగనిది
ఆమె మజ్జిగ చిలుకుతూ ఒక్కొక్క
పొర వెన్నను వేలికి తీసి నాలుక కొసల
నాకిస్తున్నప్పుడు సూర్యచంద్రులు
ఆమెకు పాదాభివందనం చేశాయి
ఆ తల్లికి కన్నీరు కలిగించడమే
దుఃఖానికి మూలం
కలిగించిన వాడెవడు? పాలకుడా?
పితృడా? పురుషుడా? ఎవరు?
అనే ప్రశ్న అనంత తత్త్వ శాస్త్రానికి మూలం
ఆ మేధావులు అక్షర సంపన్నులు
చక్రవర్తి పాదాల దగ్గర బతుకుతున్నారు
ఆ ప్రభువులు తమ తల్లులకు
దుఃఖం కలిగిస్తున్నా వీరు అతన్ని నుతిస్తున్నారు
ఊరిలో తన తల్లి సమాధిని
నేలమట్టంలో కట్టాడు
తన యిల్లు మూడంతస్తుల్లో కట్టుకున్నాడు
క్రీస్తును శిలువేసిన రోజు
మొక్కుబడిగా నాలుగు పూలు చల్లి వచ్చాడు
అతని భార్యా, పిల్లలు ఎండగా ఉందని
కారు దిగలేదు
వీడు కోటీశ్వరుడయ్యాడు
తన తల్లి పేర ఊరిలో ఏకట్టడమూ కట్టలేదు
అతని చదువు కోసం తన తల్లి
కన్నీరు కార్చింది, నాట్లేసింది, కోతలుకోసింది,
కలుపులు తీసింది, కాళ్ళు నెర్లిచ్చాయి
పాదాల్లో నెత్తుటి చారలతో మరణించింది
తాను చివరి వరకూ
బిడ్డ కోసం పలవరించింది
ఆమె కళ్ళు తెరిచే మరణించింది
ఆ తెరిచిన కళ్ళను ఎవరో మూశారు
ఆ దుఃఖం యింకా సమాజంలో
పరివర్తితం అవుతూనే వుంది
ఈనాడు ఆమె కొడుకును
తాగుబోతును చేశారు
అతడు తల్లిని నిందిస్తున్నాడు
ఆ తల్లి ముందే ఆ కొడుకు మరణించాడు
‘‘దేవుడిచ్చాడు, తీసుకున్నాడని’’ నిట్టూర్చింది
ఆ తల్లికి కన్నీరు రాలేదు
అతడు అప్రయోజకుడు అయ్యాడు
నేల సారవంతమైనదే
పంటకు తెగులు వచ్చింది
ఈనాడు కొందరు పిల్లలకు
స్థన్యం యివ్వడం లేదు
పిల్లకి, తల్లికి మధ్య అనుబంధం లేదు
యిద్దరూ రెండు పార్శ్వాలుగా జీవిస్తున్నారు
తల్లితనం తగ్గేకొలది
సమాజం కుంచించుకు పోతుందా?
కన్నీరు ఎండిపోతుందా?
యింకి పోతుందా?
ఆ ‘‘అంబేడ్కరుడు విద్యావంతులు కండి’’
అని పిలుపునిచ్చాడు
వీరు సేవకులుగా బతుకుతున్నారు
తమ్ము తాము అమ్ముకుంటున్నారు
‘‘ఏదో సుఖపడుతున్నాం’’ అనుకుంటున్నారు
కానీ అసంతృప్తిలోనే బతుకుతున్నారు
అభద్రతలోనూ ఉన్నారు
రూపాయి వారిని మింగేసింది
ఆ చర్చి ఒకనాడు పవిత్రమైన
గాన మాధుర్యంలో తేలేది
ఇప్పుడు ఆడంబరాలతో, విద్యుద్దీపాలతో
వెలుగొందుతుంది
పట్టు వస్త్రాల ప్రదర్శనలు,
బంగారు నగల ధగ ధగలేకానీ
ఒక హాస్పిటల్‌కెళ్ళి పండ్లు పంచిన
చేతులు అక్కడ కరువయ్యాయి
వృద్ధాశ్రమంలోని వృద్ధులు
గాజు కళ్ళతో ఎదురు చూస్తున్నారు
అర్థరాత్రిళ్ళు మందు పార్టీలు
గొర్రెలు మందలు మందలు వధ అవుతున్నాయి
ఆ గొర్రెల కాపరికి కన్నీళ్ళు
లేలేత గొర్రె పిల్లలు తలలు తెగుతున్నాయి
దుఃఖాన్ని ప్రవక్తలు తొలగించారు
మీరు దుఃఖాన్ని సృష్టిస్తున్నారు
సంఘధర్మం, తల్లితనం, మానవ దర్శనం
ఆ ప్రబోధకుల బోధనల్లో వెల్లి విరిశాయి
నిజమే! అనేక చీకటి యుగాల్లో
వెలుగు రేఖలు పొటమరిస్తూనే వచ్చాయి
మనుషులు తప్పక తమను తాము తెలుసుకుంటారు
‘‘ఎరుక’’ మరణించదు,
జ్ఞానానికి అంతం లేదు
నవ్వు, కన్నీరు, కరుణ, ఆత్మీయత
ఆ కొండ చరియల్లోని చిన్న గూడేల్లో
ఇంకా బతికే ఉన్నాయి
ఆ తల్లి ఇంకా ఆ బిడ్డకు చనుబాలు ఇస్తూనే వుంది
మళ్ళీ పునరుజ్జీవనం కోసం పోరాడుదాం
పరిణామమే చారిత్రక సత్యం
నియంతలు అంతరిస్తారు
ఆ నవయాన బుద్ధుని జీవన మార్గం
మానవాళికే దిక్సూచి
ఆ మార్గంలో నడుద్దాం.
(డాక్టర్ కత్తి పద్మారావు, అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్, అంబేద్కర్ కాలనీ, పొన్నూరు పోస్ట్,
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్)
Next Story