వారి విశ్వజనీన ప్రేమే వారి సౌందర్యం
x

వారి విశ్వజనీన ప్రేమే వారి సౌందర్యం

నేటి మేటి కవిత


అస్సామ్‌ టీ ఆకు తోటల్లో

చినుకులు ఆకులపై
మంచు ముత్యాలవుతున్నాయి
ఆ బెస్త స్త్రీ ముక్కెరలో సూర్యుడు
అద్దం చూసుకొంటున్నాడు
ఆ సింధూ నాగరికతలోని కుండ
సౌందర్యంలో మూలవాసుల
శిల్ప రహస్యాలు దాగున్నాయి
ఆ అందాల పోటీల్లో
చిన్న దేశాల స్త్రీలు
నల్లజాతి స్త్రీలు విజయ కిరీటాలు సాధిస్తున్నారు
సౌందర్యం ఒకరి సొంతం కాదని
రుజువవుతూ వుంది
సంపన్నులు సౌందర్యాన్ని
కొనుక్కుంటున్నారు
శ్రమజీవుల శిరస్సులకు
సూర్యుడే కిరీటాలను
కిరణాలతో అల్లి
పెడుతున్నాడు
ఎవరు సౌందర్యవతులో
తూనికరాళ్ళెక్కడున్నాయి
కొలతలు, రంగులు
భాషా నైపుణ్యాలు
ప్రశ్నలకు ఆన్సర్లను బట్టే సౌందర్యం
మరి అడవిలో వసంతానికి పూసే
పూల సౌందర్యానికి ఎవరు
మార్కులు వేస్తున్నారు?
ఆ విల్లంబు ఎక్కుపెట్టి గురి చూసి
కొడుతున్న నల్ల బాలుని
ఏకాగ్రతలోని
శిల్ప సౌందర్యం చూశారా!
అక్షరాలు పుట్టకముందే
చిత్రలిపిలోని సౌందర్యం
చక్రవర్తులకే సంకేతమయ్యింది
ప్రతి తల్లికి
తమ బిడ్డ అందగత్తే
ప్రతి అన్నకి తన చెల్లి అందగత్తే
అందుకే గద్దర్‌ ‘నీ పాదం మీద
పుట్టమచ్చనవుతా చెల్లెమ్మా’ అన్నాడు
సౌందర్యమనేది
ప్రేమతో చూసే చూపులో వుంటుంది
ప్రతి నాయకుడు
ఆ జాతికి సౌందర్యంగానే కనబడతాడు
అంబేడ్కర్‌, లూథర్‌కింగ్‌, మండేలా
సౌందర్యవంతులుగానే
వెలుగొందుతున్నారు
ఒకనాడు నల్లవారిని నిషేధించి
బానిసలుగా చేసినా
అమెరికా అధ్యక్షునిగా
అబ్రహాం లింకన్‌, ఒబామా
తెల్ల భవనానికి అధిపతులు కాలేదా?
లక్షల కెమెరాలు వారిని
బహుముఖంగా దృశ్యాలుగా తీయలేదా!
ఐదు కోట్ల ఆంధ్రులు
నడి బొడ్డులో
నూట ఇరవై అడుగుల
అంబేడ్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్టించారు
అతడు అస్తమించని సూర్యునిలా
వెలుగొందడం లేదా?
ఆ కళ్ళలోని వెలుగులకు కొలతలేవి?
శ్రీలంకలో
బుద్ధుని బంగారు విగ్రహాలు వెలిశాయి
వాటి సందర్శనకు
ప్రపంచ దేశాల నుండి
పర్యాటకులు బారులు తీరుతున్నారు కదా?
సౌందర్యం ఎక్కడుంది?
ఆయన ప్రవచించిన పంచశీల
ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించింది
ఆ కోయ భామ
తలనిండా నెమలీకలను ధరించి
బిడ్డను సంకనేసుకొని
అడవిలో నడుస్తుంటే
పులులు వెనుకకు నడుస్తున్నాయి
నెమళ్ళు నృత్యం చేస్తున్నాయి
గిరిజనులు ప్రకృతి భామలేగా?
పశు పక్ష్యాదులకు వారితో చెలిమి
పెను బాములు కూడా వారి నుండి
తప్పుకెళుతున్నాయి
రాత్రి పబ్బుల్లో డ్రగ్స్‌ తీసుకొని
కిక్కు చాలక పాము కాటు వేయించుకొనే
భామల కళ్ళల్లో విష దుందుభులు
సౌందర్యం ఎక్కడుంది?
గలగలపారే సెలయేరులో లేదా?
ఆ చెట్టు సివారులో
నిలబడ్డ వడ్రంగి పిట్టలో లేదా?
నాటు వేస్తూ పాట పాడుతూ
తలలేపి, సూర్యుని వేపు
చూస్తున్న దళిత తల్లిలో
ఎనలేని సౌందర్యం వుంది కదా!
చూసే చూపు మార్చుకోండి
మనం ఎందుకు
భారత స్వాతంత్య్రోద్యమం నాడు
అస్సామ్‌, మణిపూర్‌
గిరిజన కాంతల నృత్యాలు చేయిస్తున్నాము
ఇతర దేశాల ప్రతినిధులు
వారి నృత్యాలకు లేచి చప్పట్లు
ఎందుకు కొడుతున్నారు?
వారి అద్దాల పావడాలు తలపాగాలు
వారి నృత్యాలు ప్రతిబింబాలు
సౌందర్యవంతమైనవి కావా!
వారు మబ్బులను రథాలు చేసుకుని పయనిస్తారు
ఆకాశ పక్షులుగా విహరిస్తారు
వారి కళ్ళల్లో రంగుల వలయాలున్నాయి
వారి పాటలో తేనె ఊటలున్నాయి
వారి మాటలో జున్ను ముక్కలున్నాయి
వారు కను రెప్పల నుండి బాణాలు విసురుతారు
వారు కన్నుగిటితే రాజ్యాలే కూలిపోయాయి
నిజమే!
వారు భారత దేశ సౌందర్యానికి ప్రతీకలు
దళిత స్త్రీలు కృషీవలురు,
త్యాగమూర్తులు, శ్రమ జీవులు
తమ పిల్లలకు తామే పాలిచ్చి పెంచుతారు
వారిలో చెరకగడల తీపి వుంది
తేను తుట్టె నుండి కారుతున్న
తేనెల తియ్యదనముంది
దళిత స్త్రీలకు ద్వేషం లేదు
క్రోదం లేదు,
వారి విశ్వజనీన ప్రేమే వారి సౌందర్యం
మన జీవిత సౌందర్యం అంతా
సానుకూలమైన దర్శనంలో వుంది
వ్యక్తి శిల్పం సానుకూలం
సామరస్యం
సముత్తేజం
సమసమాజ నిర్మాణం
ఆ ప్రబోధకుడు అదే బోధిస్తున్నాడు
ఏది నిషేధించబడిరదో
అందులో ఔషధ గుణాలు వున్నాయి
ఏది నిరాకరించబడిరదో
అది అపురూప సౌందర్యమైంది
సమ్యక్‌ దృష్టే మానవాభ్యుదయానికి మార్గం

- డాక్టర్‌ కత్తి పద్మారావు
(లుంబిని వనం,అంబేద్కర్‌ రీసెర్చ్‌ సెంటర్‌, అంబేద్కర్‌ కాలనీ, పొన్నూరు పోస్ట్‌, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌)


Read More
Next Story