
ఇక చాలు!
నేటి మేటి కవిత: డాక్టర్ గోపాలకృష్ణ కొవ్వలి
బాపు ఇక చాలు
నీ పేరు చెబితే ఓట్లు రావు
నీ పేర పెట్టిన పథకాలకు గుర్తింపు రా
వికటాట్టహాసపు నవ్వుల ముందు నీ బోసినవ్వులు వెలవెలబోతున్నాయి
ఇక చాలు బాపు, నీకిక సెలవు
నీ పేరుకి విలువలేదు, నీత్యాగానికి గుర్తింపులేదు
నీ ఆదర్శాలకి ఆదరణ లేదు
ఖరీదైన సూట్లు మార్చే నాయకుల ముందు నీ కొల్లాయికి గతకాలపు ఘనత లేదు
మానవత్వం, సమానత్వం పదాలు సైతం కిట్టని
నాయకగణం నీ దేశానికి రామరాజ్యం తెచ్చే పనిలో ఉన్నారు
స్వేచ్ఛకి సంకెళ్లు, భావప్రకటనకి తాళాలు
రాగ, తాళ సహిత స్తుతులకి అందలాలు
మతాలమధ్య చిచ్చు రాజేసి రాజ్యం,
మత మౌఢ్యం ప్రవచించే మేధావుల మైదానం నీ దేశం
కోతులు మారాయి
'మంచి వినకు, మంచి మాట్లాడకు, మంచి చూడకు' అని
నీ స్మృతికి గోరి కడతాం, నీ ఉనికిని సమాధి చేస్తాం
స్వయం సేవకి పట్టం కడతాం, స్వరాజ్యానికి నివాళులు ఇస్తాం
ఇక చాలు బాపు, నీ మాటల, పాటల, ఆదర్శాల కీర్తనలు
పాడనీ నేతల స్వయంకృతులు,
మరుగున పడనీ వినపడని జన ఘోషలు

