కవిత్వ జాల
x

కవిత్వ జాల

తానూ మంచి చెడులను వేరు చేసే జాల ను అయితే ఎంతబాగుంటుందనే ఆకాంక్ష ఇందులో కనిపిస్తుంది



-పేర్ల రాము

అమ్మ నల్లనీళ్ళు పడుతూ

నలుసులు రాకుండా జాల పడుతుంది

నాయిన సన్న ఇసుక దొడ్డు ఇసుక వేరు చేస్తూ

ఇనుప జాల అడ్డం పెడతాడు

రోజు చాయిని చాపత్తను వేరు చేయడానికి

జాల మధ్యలో కూర్చుని నవ్వుతుంటుంది

కందిపప్పును, పెసరు పప్పును

శెరిగి జల్లెడ బడితే రాళ్ళన్నీ పారిపోయి

ఎంత తేటగవుతుందో..?

ఎప్పుడన్నా ఒకసారి పిండిజల్లడగానైనా మారిపోవాలి ఈ పురుగు పడుతున్న సమాజాన్ని వడబోయాలి.

ఇంతెత్తు పెరిగిన నన్ను

ఎప్పుడన్న వడబోసుకుందామన్న

ఏమి దొరకక పోయేది!.

ఇంత మందిలో నన్ను జల్లెడ పట్టుకుందామన్న

ఏ పరికరం కనపడక పోయేది!.

వెతుకుతూ వెతుకుతూ వెళ్తుంటే

బియ్యంలో మెరిగెలు ఏరుకున్నట్టు

నాలో మెరిగెలు ఏరుకోవాలని తెలిసింది

మంచిని చెడును చాటలో వేసి

చెరుగుకోవాలని అర్థమయ్యింది.

కదులుతూ కదులుతూ ఉంటే

నాలో ఎట్లా చేరిందో ఏమో ఈ కవిత్వ జాల

అప్పటి నుండి లోపలిమనిషిని

కొంచెం కొంచెంగా వడబోసుకుంటున్నా

కొద్ది కొద్దిగా తేట ఊటనవుతున్నా..


(కవి పేర్ల రాము, తెలంగాణ మహబూబాబాద్ కు చెందినచె వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చారు. తొందరో తొలి కవితా సంకలనం ‘మనుషుల మధ్య’ తెస్తున్నాడు)

Read More
Next Story