
సిద్ధంగా ఉండండి!
నేటి మేటి కవిత: ఆకెపోగు నాగరాజు
మేము మట్టివాళ్లమే కావచ్చు
కన్నీళ్ళతో తడిసిన వాళ్లమే కావచ్చు
మా దేహాలు బురదమయం కావచ్చు
మట్టి మనుషుల స్వేదాశ్రువులే
మీరు అనుభవిస్తున్న రాజసం
మీ వామనపాదం
మోపిన ప్రతిసారి
తిరిగి తిరిగి మొలకెత్తుతాం
మీ కమల వికాసం
మీ వికసిత భారతం
మోసానికి ప్రతిబింబం
మా చెమట చుక్కల మా మట్టి వాసనలసారాన్ని
ఉగ్గుపట్టి త్రాగినందుకే
మీ మనువాద దేవుళ్ళలో నవ్వులు.
ఆ నవ్వుల వెనుక
మాశ్రమాయువు దాగుంది
మమ్మల్ని
మా బతుకుల్ని దురాక్రమించి
మా జంబూద్వీపాన్ని
వశం చేసుకున్నది మీరు కాదా?
ఎవరు దురాక్రమణదారులు.
ఎవడిది ఈ భూమి?
ఎవడు మీరు?
మీరు ఆర్యులు
మనువాదులు
ఒళ్లంతా హూనమై బ్రతుకంతా ఆవిరై
చితికిపోయి చిక్కిపోయి
మా బతుకులు చిద్రమయ్యాము.
మీ దురాలోచన చితిమంటలలో సమిధలమై
ఇల్లాలు నుదుట
చెరిగిపోయిన సింధూరమై
బ్రతుకంతా అంధకారమైంది.
బరువెక్కిన గుండెలతో
ఎరుపెక్కిన కన్నులతో
మా కన్నుల కాంతులను
ఎగరేసిన బావుటాల పై మేం ఉదయిస్తాం
మళ్ళీ ఉదయిస్తాం వికసించే కమలాలకైతే
జాలి ఉంటుంది
మీరు వాడిపోయి కార్పోరేట్లకు అమ్ముడుబోయిన కమల ఉన్మాద పుష్పాలు
నెత్తుటి చరిత్రను రాస్తూ
జాలిలేని నావికుడి పాలనకు దశాబ్దం దాటింది.
మోడైనా చేతుల్తో
దారిద్ర్య తీరాలకు విసిరివేయబడ్డవాళ్ళం మనం
యుగ యుగాలుగా దగాపడ్డ జీవులం మనం
త్యాగాలకు శిలారూపమై శిధిలమైపోయాం
మతోన్మాదానికి
బలైతున్న వాళ్ళం
కన్నీళ్ల కాసారం భాస్వరమై మండితే
కాషాయం బూడిదవ్వదా?
మట్టి మనిషి
గట్టిగా గొంతు తెరిస్తే
మీ అధికారం అంతం కాదా?
లౌకిక భూమిపై పుట్టిన విష కమలపుష్పమా!
మట్టిలో కలుపుతాం జాగ్రత్త!!
వేల మంది మనువుల్ని
మా భూమిలో కలిపిన వాళ్ళం మీరొక లెక్క కాదు
అణచబడ్డ మా పాదాలతోనే తొక్కి పాతేస్తాం..పాతరేస్తాం
-ఆకెపోగు నాగరాజు
Next Story

