అతనలా వెళ్ళిపోయి ఉండొచ్చు!
x

అతనలా వెళ్ళిపోయి ఉండొచ్చు!

నేటి మేటి కవిత



ఎవరికి ఏమని లేఖ
రాద్దా మనుకున్నాడో అతగాడు?
రాశాడో లేదో
కుదిరిందో లేదో
రాయలేక , సగం రాసి వదిలేశాడో ఏమో?
**
పూర్తి చేయలేని, రాయలేని
లేఖని నిస్సహాయంగా ముక్కలు చేసి
పడేసాక దుఃఖించే ఉంటాడు!
అలజడితో మనసు చెదిరే ఉంటాడు!
*
ఏ అపరాహ్నం వేళ బెదిరి వచ్చి ఉంటాడో,
పార్కులో ఖాళీ బెంచీ చివర దారి తప్పి,
కొమ్మ దొరకని పక్షిలా కన్నీటి తడిలో
ముడుచుకు కూర్చుని ఉంటాడు.
మౌనంగా దేన్ని సమీక్షించుకున్నాడో కానీ
సంధ్యవేళ లేఖ రాయలేక
చింపిన కాగితం ముక్కలని
తన వైఫల్యపు నిషానీలుగా
అక్కడే వదిలి
దుఃఖపడుతూ వెళ్ళిపోయి ఉంటాడు.
*
పార్కులో బెంచీ చుట్టూ
కాగితమ్ముక్కలు వదిలి
వెళ్ళిపోయిన మనిషి ఎవరై ఉంటాడు?
కవి అయితే కవితా వాక్యాలు అంది ఉండవు.
దొరకని పదాల కోసం అల్లాడి అల్లాడి
సగం రాసిన కవితని
గుండెలో దాచుకుని వెళ్ళిపోయి ఉంటాడు.
*
పోనీ నిరుద్యోగి అయితే
ఆత్మహత్య ముందరి చివరి లేఖ రాసి ఉంటాడా?
బతుకు మీద ఆశ చావక,
మరణ వాంగ్మూలపు అక్షరాలను రద్దు చేసి
జీవించే క్షణాలను
అలా దక్కించుకుని
గాభరాగా వెళ్ళిపోయి ఉంటాడా ?
*
బహుశా అతగాడు
భగ్న ప్రేమికుడై ఉండవచ్చు.
లేదా ప్రేయసికి తొలి ప్రేమ లేఖ
రాయాలనుకునే కొత్త ప్రేమికుడై కూడా ఉండొచ్చు.
కుదరని ప్రేమలేఖ చింపేసి,
వియోగ దుఃఖాక్షరాలను
అలా బెంచీ చుట్టూ వెదజల్లి వెళ్ళిపోయి ఉండొచ్చు .
*
అతనొక చిత్రకారుడు కూడా కావచ్చు!
వేయాలనుకున్న బొమ్మని
కన్నీళ్ళు మసకబార్చి ఉంటాయి!
కళ్ళూ, బొమ్మా రెండూ తుడిచేసుకుని
రంగుల్ని వంపేసి,
నిశబ్దంగా నడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు!
**
అతను
అప్పు తీర్చలేని,
పంట పొలాన్ని కోల్పోలేని
బీద రైతు కావచ్చు!
ఆఖరి వడ్ల గింజలను కూడా
పోగొట్టుకున్న పాలమూరు
వలస కార్మికుడు కూడా అయివుండవచ్చు.
భూమ్మీద ఇంకా ఆశ చావక
సజీవంగా మిగిలిన భార్య గుండెలపై
జీవితపు భారాన్ని మోపి,
పురుగుల మందుని మధువులా తాగేసి
లోకానికి, తన ప్రియమైన పొలానికి
చివరి అల్విదా చెప్పి, మృత్యువు లోకి
పారి పోవాలనుకున్నాడా,ఏమో?
*
అతనెవరైతేనేం?
ఎవరికైనా క్షమాపణ చెప్పాలనుకున్నాడేమో.
ప్రేయసికో, భార్యకో,
వృద్ధాశ్రమంలో వదిలేసిన అమ్మ నాన్నలకో?
ఎవరికైతేనేం,
మనసు రాక
కాగితాలు చింపేసి
దిగులుతో వెళ్ళిపోయి ఉండొచ్చు.
*
అతడు నిరాశ పరిచిన జీవితాన్ని విసుక్కుని,
మరణించే ముందరి
ముగింపు వాక్యాల కోసం
ఆ బెంచీ దగ్గరే,తచ్చాడుతూ
తడుముకుంటూ వెతుక్కుని ఉండొచ్చు.
బహుశా బతుకుని అదాటున
ముగించడం ఇష్టం లేని అతను
లేఖని సశేషంగా ఆపేసి,
పిడికిట్లో నలిపి పడేసి
కాసింత విసుగ్గా వెళ్ళిపోయి ఉండొచ్చు!
**
అవునతడలాగే వెళ్ళిపోయి ఉండొచ్చు!
కవిత్వాన్ని, గజల్స్ నీ,
పాటలని, ఏవో బొమ్మలను
ప్రేమలను,వియోగాన్ని,
కలల్ని మరణించాలనిపించడాన్నీ
బతకాలనిపించడాన్ని,
తన సమస్తమైన ఆశనిరాశలను,
సశేషాలుగా చింపిన ఆ కాగితమ్ముక్కలలో
సగం రాసి పూర్తి చేయలేక
బెంచీ చుట్టూ వదిలేసి అతను
ఉన్నపాటున లేచి వెళ్ళిపోయి ఉండొచ్చు!


Read More
Next Story