హరప్పాలో రామాయణం ఆనవాళ్లు
x

హరప్పాలో రామాయణం ఆనవాళ్లు

ఒక సాంస్కృతిక మహా సంగ్రామం. హరప్పనుల గాథ. అధ్యాయం 14. మూలం: The Greatest Battle of Culture (The Story of Harappans) by Bethi Panigrahi. తెలుగు: ఆడెపు లక్ష్మీపతి

స్వర్ణయుగంలా సాగిన రాజు మహారుద్ర పరిపాలనలో కళలు, సాహిత్యం వర్ధిల్లాయి ; హరప్పన్ నేల అంతటా మధుర సంగీత ధ్వనులు, కవితా కథాగానాలు మార్మోగాయి. ఆ కాలంలోనే గొప్ప ఇతిహాసమైన రామాయణం ఉద్భవించింది. వాల్మీకి రుషి రాసిన ఈ గాథ అసమాన సత్ప్రవర్తన, ధైర్యసాహసాలకు మారుపేరైన శ్రీరాముని గురించినది.

“వాల్మీకీ, మీ పదాలు రామునికి జీవం పోశాయి !”అన్నాడు ఇంద్రసేనుడు అబ్బురపాటు ధ్వనించే స్వరంతో. “కానీ రాముని కథ ఇప్పుడే చెప్పాలని ఎందుకు సంకల్పించారు ?”

వాల్మీకి ఇలా సమాధాన మిచ్చాడు: “ఎందుకంటే.. రాముని కథ ధైర్యసాహసాల గురించి చెప్పే గాథ మాత్రమె కాదు –సర్వమానవ సౌభ్రాతృత్వాన్నిమనకి గుర్తు చేసే కథ. అతని పోరాటాలు, విజయాలు ఇవాళ మనం ఎదుర్కొంటున్న సవాళ్లు, సాఫల్యాలకు ప్రతిబింబాలు. రాముని మొక్కవోని కర్తవ్య నిబద్ధత, అచంచలమైన సచ్చీలత, అనంతమైన దయాగుణం..మనందరికీ స్ఫూర్తి దాయకం. ప్రజల పట్ల అతని శ్రద్ధాసక్తులు, వారిని కాపాడాలన్న అతని సంకల్పం..ఈ సద్గుణాలు మనం అలవర్చుకోవాల్సినవి.”

“ మరి ఆయన సతీమణి సీత గురించి..?” కుతూహలంతో అడిగాడు నాగశౌర్య. “ ఆమె ధైర్యం, వినయం నిజంగా హరప్పన్ ఆత్మస్థైర్యానికి ప్రతీక కదా.!.”

“ఔను.” అన్నాడు వాల్మీకి. “ సీత త్యాగశీలగుణం మన సమాజంలో మహిళల సామర్థ్యానికి, మనో నిబ్బరానికి చక్కని నిదర్శనం. రాముని పట్ల ఆమె చూపిన పతిభక్తి ప్రేమ, అంకితభావాల గొప్పదనాన్ని గుర్తుకు తెస్తాయి.”

రామాయణం నేల నలుచెరగులా వ్యాపించి, ఐక్యతకు, ఆర్యుల –హరప్పనుల ఉమ్మడి వారసత్వానికి సంకేతంగా నిలిచింది. ఇరు సంస్కృతులు రాముడిని సొంతం చేసుకుని ఉమ్మడి కార్య క్షేత్రాన్ని గుర్తించాయి.

హరప్పనులు రామునిలో తాము నమ్మిన విలువలు –ధైర్యం, ప్రతిష్ట, వినయాల ప్రతిఫలనాన్ని చూశారు. తమ పోరాటాల, విజయాల సంకేతంగా ఆర్యులు రాముడిని గుర్తించారు. స్త్రీ సాహసానికి, స్వాభిమానానికి సీత చక్కని ఉదాహరణ అని భావించారు.

“రాముడు ప్రజల పట్ల చూపిన శ్రద్ధాసక్తులు నిజంగా మనకు స్ఫూర్తి దాయకం..” అన్నాడు ఇంద్రసేనుడు. “ప్రజల క్షేమం కోరి అతడు ఎన్నో త్యాగాలు చేశాడు, ప్రతిఫలం ఏమీ ఆశించలేదు కూడా.”

“ ఔను,” అన్నాడు వాల్మీకి. “రాముడి నిస్వార్థ గుణం మనమంతా ఆచరించదగినది. తన సొంత మేలు కన్నా ప్రజల మేలు ముఖ్యమని భావించాడు; అలా చేయడం వల్ల అతడు నిజమైన ధీరోదాత్తుడైనాడు.”

“ఈ కథ విన్నందులకు చాలా కృతజ్ఞుడిని..” అన్నాడు నాగశౌర్య. “ పరసేవా పరాయణత్వం, దయాగుణం ఎంత గొప్పవో నాకు తెలిసి వచ్చాయి.”

రాముడి పేర కట్టించిన గుళ్ళు, ప్రార్థనా స్థలాలు దేశమంతటా వెలిశాయి. అతడి స్వరూపం దైనందిన జీవితంలో సర్వత్రా కానవచ్చింది. మార్గదర్శనం, రక్షణ కోరుతూ ప్రజలు రాముడి పేరున పూజలు, వ్రతాలు చేయనారంభించారు.

రాముడిని పూజించడం ఉమ్మడి సంస్కృతి యొక్క సహజ విస్తరణగా, ఇరు వర్గాలను కలిపి ఒక్కటి చేసిన విలువలు, సిద్ధాంతాల ఆచరణ మార్గంగా గుర్తింపుని పొందింది. రాముని సకలగుణ సంపన్న మూర్తిమత్వం వారి ఐక్యతకి రక్షక కవచ మైనట్టుగా, ధైర్య, దయాగుణాల, కర్తవ్య నిష్టల శక్తికి ప్రతిరూపమైనట్టుగా అందరూ భావించారు.

రామాయణం వారిని ఒక్కటి చేసి ఇరువురి గాథల నడుమ తారతమ్యాలేవీ లేవని గుర్తు చేసింది. అది గ్రహించాక ఇరు వర్గాలవారు కలకాలం నిలిచి వుండే శాంతిపథానికి గట్టి పునాది వేశారు.

Read More
Next Story