సంక్రాంతి ముగ్గుల వెనకున్న సాంప్రదాయ సూత్రాలు
x

సంక్రాంతి ముగ్గుల వెనకున్న సాంప్రదాయ సూత్రాలు

వాకిళ్లను అందంగా అలంకరిస్తే ఇంటికి శ్రేయస్సు కలుగుతుందని పెద్దల నమ్మకం.


సంక్రాంతి అంటే మహిళలకు ముందుగా గుర్తొచ్చే అంశం ముగ్గులు వేయడం. చాలా ఊళ్లలో ప్రత్యేక ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తారు. సాధారణంగా ఇంటి ముందు ప్రతి రోజూ ఇంటి ముందు ముగ్గు వేయడం సాంప్రదాయం. పండగల వేళల్లో అయితే ఈ ముగ్గులు రంగులతో పాటు ప్రాణం పోసుకున్నట్లు కనిపిస్తాయి. ఈ ముగ్గులు కనిపించడానికి గీతలు, చుక్కలు, మంచి డిజైన్లుగా కనిపించినా వీటి వెనక ఉన్న సంప్రదాయం, సంస్కృతి, శాస్త్రం చాలా లోతైనది.

‘సంక్రాంతి వచ్చింది తుమ్మెద’ అన్న పాటలోని ఉత్సాహంలాగే ఈ పండుగను తెలుగు ప్రజలు హృదయపూర్వకంగా జరుపుకుంటారు. పండుగ కోసం ఎక్కడెక్కడో ఉన్నవారు కష్టపడి సొంత ఊర్లకు చేరుకుంటారు. ఖర్చు ఎంతైనా సరే ఊరికి వెళ్లాలనే ఆత్రం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. కోడిపందాలు పిండి వంటలు పల్లె సందడి ఈ పండుగకు ప్రత్యేకత. ఈ సంబరాల్లో మరో ప్రధాన ఆకర్షణ ముగ్గులు. అనుభవం ఉన్నవారే కాదు తొలిసారి వేసేవారు కూడా శభాష్ అనిపించుకోవాలనే తపనతో రంగురంగుల ముగ్గులు వేస్తారు. నాలుగు రోజుల పండుగలో ఇంటింటా వాకిళ్లు కళకళలాడుతాయి.

ముగ్గుల వెనుకున్న విశ్వాసం

సాధారణ రోజుల్లోనూ ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. వాకిళ్లను అందంగా అలంకరిస్తే ఇంటికి శ్రేయస్సు కలుగుతుందని పెద్దల నమ్మకం. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పురాణ విశ్వాసం. అందుకే దేవతల చిహ్నాలు లక్ష్మీదేవి పాదముద్రలు తరచూ ముగ్గుల్లో కనిపిస్తాయి.

సంప్రదాయ ప్రాముఖ్యత

హిందూ సంప్రదాయంలో ముగ్గులకు విశేష స్థానం ఉంది. తామర పువ్వులు నెమళ్లు మామిడి పండ్లు చేపల ఆకృతులు తరచూ కనిపిస్తాయి. ఇవి శుభ సూచకాలుగా భావిస్తారు. చరిత్ర ప్రకారం చెడును అరికట్టి మేలు చేకూరాలనే భావనతో తెల్లటి బియ్యపిండితో ముగ్గులు వేసే ఆచారం ఏర్పడింది.

భోగి రోజు ప్రత్యేకత

భోగి నాడు వేసే ముగ్గు ప్రత్యేకం. సాధారణంగా అదే చోట భోగి మంటలు వేయడం వల్ల ముందుగా శుభ్రం చేసి ముగ్గు వేయాల్సి వస్తుంది. కష్టమే అయినా ఇష్టమైన పని కావడంతో మహిళలు ఆనందంగా చేస్తారు. ఆ రోజున రంగవల్లులతో మరింత అందంగా అలంకరిస్తారు.

శాస్త్రీయ కోణం

చుక్కలను కలిపే వక్ర నమూనాలు విశ్వంలోని అనంతత్వాన్ని సూచిస్తాయి. ఇవి ధ్వని వేవ్ హార్మోనిక్స్‌ను పోలి ఉంటాయని నిపుణులు చెబుతారు. రంగవల్లులతో కూడిన ఈ నమూనాలు మనసుకు ప్రశాంతతనిస్తాయి. ఒత్తిడి డిప్రెషన్ వంటి మానసిక సమస్యల నుంచి దూరంగా ఉంచే శక్తి కూడా ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ధనుర్మాసంలో భూమి సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల ఉదయపు కిరణాల్లో విటమిన్ డీ మోతాదు ఎక్కువగా లభిస్తుంది. పెద్ద ముగ్గులు వేయడం ద్వారా మహిళలు ఉదయపు ఎండలో కొంత సమయం గడిపే అవకాశం ఏర్పడుతుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని పెద్దలు చెబుతారు.

వ్యాయామం లాంటి కళ

ముగ్గు వేయడం ఓ కళ. చుక్కలు పెట్టడం గీతలు గీయడం వంగి లేవడం ఈ ప్రక్రియ మొత్తం శరీరానికి మంచి వ్యాయామం. గంటసేపు ట్రెడ్‌మిల్ మీద నడిచినంత శ్రమ కలుగుతుందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. ఇది శరీరానికి మాత్రమే కాదు మనసుకు కూడా ఓ మానసికోల్లాసం.

పర్యావరణానికి తోడ్పాటు

పూర్వం బియ్యం పిండి గోధుమ పిండితో ముగ్గులు వేయడం వల్ల చీమలు పక్షులు వంటి చిన్న జీవులకు ఆహారం లభించేది. ఇది ప్రకృతి పట్ల మన బాధ్యతను చాటే సంప్రదాయం.

జాతీయ స్థాయిలో గుర్తింపు

ముగ్గులు దక్షిణాదికే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో ఈ కళ కొనసాగుతోంది. బెంగాల్‌లో అల్పన మిథిలాలో అరిపన్ మహారాష్ట్రలో రంగోలి పేర్లతో ప్రసిద్ధి. రవీంద్రనాథ్ ఠాగోర్ 1919లో రాసిన రచనల్లో అల్పన ప్రస్తావన కనిపిస్తుంది. కామశాస్త్రంలో చెప్పిన 64 కళల్లో కూడా ముగ్గులు వేయడం ఒక కళగా పేర్కొనడం విశేషం.

సంప్రదాయం నుంచి తరతరాలకు

పెద్దలను చూసి పిల్లలు ముగ్గులు వేయడం నేర్చుకుంటారు. ఇలా ఈ కళ ఒక తరం నుంచి మరో తరానికి చేరుతోంది. ఇది కేవలం అలంకరణ కాదు సంస్కృతి ప్రకృతి పట్ల మన ప్రేమకు ప్రతీక. తాజాగా ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ముగ్గులు వేస్తూ.. ఆ ముగ్గుతో మెసేజ్‌లు కూడా ఇస్తున్నారు కొందరు. ఒక యువతి తన ముగ్గులో చీరకు ఉన్న ప్రాముఖ్యత గురించి వివరించిన తీరు నెట్టింట వైరల్‌గా మారుతోంది.

‘‘కాలం మారుతుంది కానీ చీరలోని అందం మారదు. చీర అంటే కేవలం వస్త్రం కాదు.. ఆత్మ విశ్వాసం. అమ్మతనం, అమ్మాయి తనం, ఆడవారి గౌరవానికి అందం. ఆడవారి గౌరవానికి చీరే అసలైన గుర్తు’’ అని రాశారు.

సంక్రాంతి పండుగ అంటేనే రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసుల సందడి గుర్తుకొస్తాయి. ఇంటి ముందు వేసే ప్రతి ముగ్గు ఒక శుభారంభానికి సంకేతం. సంపద శాంతి శుభాన్ని ఆహ్వానించే ఈ సంప్రదాయం మన పండుగలకు అసలైన అందాన్ని చేకూరుస్తుంది. ఈ సంక్రాంతికి రంగవల్లులతో ముగ్గులు వేస్తూ మన సంస్కృతిని గర్వంగా ముందుకు తీసుకెళ్లుదాం.

Read More
Next Story