అమ్మల జ్ఞాపకంగా నిమ్మ చెట్టు
x
మరొక చోటికి తరలించాక చిగురించిన నిమ్మ చెట్టు

'అమ్మ'ల జ్ఞాపకంగా నిమ్మ చెట్టు

స్థలం మారినా చిగురించి ఆనందాలు పంచిన 15 సంవత్సరాల నిమ్మచెట్టు


-వాకా ప్రసాద్


మా ఇంటి ముంగిట నిమ్మ చెట్టు చిగురించింది.
ఓ అమ్మ అపురూపంగా పెంచిన నిమ్మ చెట్టు.
ఆ చెట్టు పూత పూసి, పిందెలు
వేసి వేల కాయలు కాసింది. చూడడానికి రెండు కళ్ళు చాలవన్నంత సొగసైన ఆ చెట్టును ఉన్నపళాన కొట్టి వేయవలసి వచ్చింది. చచ్చి పోవలసిన ఆ నిమ్మ చెట్టును జాగ్రత్తగా అనుభవజ్ఞులతో తవ్వి తీయించి, పురిటి బిడ్డను తీసుకు వచ్చినట్టుగ మా ఇంటికి తెచ్చుకున్నాను. లోతైన గుంత తీసి అన్ని జాగ్రత్తలతో నాటించాను.
కళ్ళల్లో వత్తులు వేసుకుని రోజూ చెట్టును చూడడమే నా పని. అమ్మయ్య వారం తరువాత చెట్టు చిగురించింది. దాని వెనుక కథే ఇది.
తిరుపతిలో మా మిత్రులు రాఘవ శర్మ గారిల్లు ముత్యాల రెడ్డి పల్లి మెయిన్ రోడ్డులో, వైకుంఠ పురం కాలనీ దారిలో కుడివైపు సులభంగా గుర్తుపట్టేలా ఉంటుంది. ఎంతో దూరంనుంచి కనపడే ఎత్తైన టెంకాయచెట్టు, నీవేనా పొడవుండేది నేనేం తక్కువ తిన్నానా అని దానితో పోటీపడి పెరిగిన బాదం చెట్టు, వారి ఇంటి ద్వారపాలకుల్లా మనల్ని ఆహ్వానిస్తూ చిరునామా ఇట్టే పట్టిస్తాయి. ఎప్పుడు రాఘవ శర్మ గారి ఇంటికి వెళ్లినా, ఎన్నిసార్లు వాళ్ల చెట్లు చూసినా మనసుకు ప్రశాంతంగానే ఉంటుంది. మా మాటలు చెట్ల ప్రస్తావన లేకుండా ముగియవు.
అలా ఓ రోజు మాట్లాడుతుంటే మా పెరట్లో నిమ్మచెట్టు కొట్టేయాలంటున్నాడండీ మా తమ్ముడు అది వాడి స్థలం అక్కడ ఇల్లు కట్టాలంటున్నాడు. చాలా బాధగా ఉందండి నిమ్మచెట్టు కొట్టేయాలంటే, ఎందుకంటే అది మా అమ్మ అపురూపంగా పెంచుకున్న చెట్టు. నాకూ మా చెల్లికి కూడా ఎంతో ఇష్టమైన చెట్టు అని ప్రస్తావించారు.

రాఘవ గారింట్లో విరగ్గాసిన నిమ్మచెట్టు

నాకు వెంటనే ఓ ఆలోచన వచ్చింది. మా ఇంటికి రెండు వైపులా అడవి ఉంది. మేము ఇల్లు కట్టిన కొత్తలో మా అమ్మ ఓ నిమ్మ చెట్టు నాటింది. అది పెరిగి పెద్దదై ఎన్నో వేల నిమ్మకాయలు కాసేది. అది అడవిలో ఫెన్సింగ్ లోపలికి నలభై భాగం, మా ఇంటి వైపు అరవై భాగం ఉండేది. ఎన్నో నిమ్మకాయలు అడవిలో రాలిపోయేవి. ఒక్కొక్కసారి తెచ్చుకునే వాళ్ళం, కొన్నిసార్లు వదిలేసే వాళ్ళం. మా కాలనీ వాళ్ళకు, మా బంధువులకు, మిత్రులకు అందరికీ నిమ్మకాయలు పంచేవాళ్ళం. ఇప్పుడా చెట్టు లేదు, చనిపోయింది.
దాని స్థానంలో నేను ఓ నిమ్మచెట్టు నాటాను. కానీ అది ఓ నాలుగేళ్లుగా పెద్దగా పెరగట్లేదు, అలా అని చనిపోలేదు. దానికి కారణం మా మామిడి చెట్టు, కానుగా చెట్టు, సీతాఫలం చెట్టు, అడవిలోని చెట్ల కొమ్మలు. వాటి నీడన ఆ నిమ్మచెట్టు ఎండ తగలకుండా ఉండటం వల్ల అది పెరగలేదు. ఆ కొమ్మలు కొట్టాలంటే పచ్చదనం పాడైపోతుంది అని అలాగే ఉండిపోయాను.

ఎండకు తళతళ మెరుస్తున్న మా ఇంటనాటిన నిమ్మచెట్టు.

రాఘవ శర్మ గారి నిమ్మచెట్టు కాయలు మేము కూడా వాడాం. మా ఆవిడ చెప్పిన ప్రకారం అవి అన్ని నిమ్మకాయల కంటే ఎక్కువ పులుపు, ఎక్కువ రోజులు నిలువ ఉండే గుణం కలిగి ఉన్నాయి . నేను ఆ చెట్టును వృధా పోనీకూడదని నిర్ణయించుకుని రాఘవ శర్మ గారితో ఆ చెట్టును నేను తీసుకెళ్లి మా ఇంటి దగ్గర నాటుకుంటాను సార్ అని అడిగాను. ఆయన సంతోషంతో అంతకంటే భాగ్యమా అన్నారు.
నేను తీసుకెళ్లడంలో కొంచెం జాప్యం చేశాను. వాళ్ల తమ్ముడు ఆ చెట్టు తీస్తే ఆ స్థలంలో ఇల్లు కట్టాలని తొందరపడుతూ ఓ రోజు మామూలు కూలీలను మాట్లాడి రేపు చెట్టు తవ్వించేస్తున్నాను సార్, మీరు తీసుకెళ్లండి అన్నాడు. అనుభవం లేని వాళ్ళు చెట్టు తవ్వితీస్తే అది బతికే అవకాశం ఉండదు అందువల్ల నేను ఆ పనిని ఆపమని చెప్పి వెంటనే 30ఏళ్లు అనుభవం ఉన్న నాకు తెలిసిన గార్డెన్ వర్కర్స్ ఇద్దరినీ పంపాను. కావాలనే నేను చెట్టు తవ్వి తీసేటప్పుడు వారింటికి వెళ్లలేదు. ఎందుకంటే ఆ చెట్టు తవ్వి అక్కడ నుంచి తీసుకెళ్లేటప్పుడు రాఘవశర్మ గారు, వారి చెల్లెలు గాయత్రి గారు ఎంత బాధ పడతారో నాకు తెలుసు . ఆ సమయంలో వారి ముఖం చూడలేను అందువల్ల వెళ్లలేదు.

రాఘవగారింట్లో తవ్వితీసిన నిమ్మచెట్టు.

ఆ చెట్టును తవ్వించి ఓ లగేజ్ ఆటోలో జాగ్రత్తగా ఎక్కించి వాళ్ళు చెప్పిన ప్రకారం మా ఇంటి దగ్గర మా పాత నిమ్మచెట్టు ఉన్నచోటే గుంత తవ్వించి, ఏపుగా పెరిగిన కొమ్మలు, వాటిని అల్లుకున్న అడవి తీగలను తొలగించి నిమ్మ చెట్టుకు ఎండ నేరుగా తగిలేలా ఏర్పాటు చేసి పెట్టాను.

మా ఇంటిముందు నాటిన నిమ్మచెట్టు.

వాళ్లు చెట్టు తవ్వి తీసిన విధానం చూస్తుంటే ఓ బిడ్డను కాన్పు చేసిన తర్వాత వెచ్చదనం కోసం ఓ గుడ్డలో చుడతారు. అలా వారు జాగ్రత్తగా ఆ చెట్టును తవ్వి, తల్లి వేరు దాని చుట్టూ ఉన్న వేర్లను జాగ్రత్తగా మట్టిగడ్డతోపాటు తొలగించి, వెంటనే ముందే తెప్పించి పెట్టిన గోనె పట్టలో చుట్టేశారు. వెంటనే మా ఇంటికి తీసుకొచ్చి సిద్ధంగా ఉన్న గుంతలోకి వొడుపుగా దించి నాటారు. మా ఇంటి దగ్గర గుంత తవ్వితే మట్టితో పాటు గుండ్రని రాళ్లు కూడా వస్తాయి. చెట్టు నాటి గుంత పూడ్చేటప్పుడు ఆ రాళ్ళను అలాగే గుంతలో వేసి పూడుస్తున్నారు. నేను ఆ రాళ్ళను తీసేయండి, మట్టి మాత్రమే వేయండి అని అడిగాను. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం రాళ్లు ఉంటే వేర్లు భూమిలోకి బాగా వెళతాయి, వాటిని అలాగే ఉంచండి అని.
మేము చెట్టు నాటిన వేళా విశేషమో, ఆ చెట్టును బ్రతికించాలన్న మా తపనకు ఆ ప్రకృతి అనుగ్రహమోగాని ఆ రోజు నుంచి వరుసగా ఐదు రోజులు వర్షాలే, వారం తర్వాత చెట్టు చిగురించింది. అది చూసిన నా మది పులకించింది.
మా నాన్నకు గుర్తుగా ఈ మధ్య నేను నాటిన బాదం మొక్క ఎంచక్కా చిగురించింది. దాని పక్కనే మా అమ్మ స్వహస్తాలతో నాటిన మామిడి మొక్క పెద్ద చెట్టు అయింది, దాని కింద చక్కని అరుగు కూడా కట్టించాం. దాని పక్కన ఏపుగా పెరిగిన సీతాఫలం చెట్టు, దానిపక్క ఇప్పుడు ఈ చిగురించిన నిమ్మచెట్టు. విచిత్రం ఏమంటే దాని పక్క ఇంతకు ముందే వున్న చిన్న నిమ్మ చెట్టు నేను కూడా ఇంకా పెరుగుతాను అన్నట్టుగా ఈ వర్షాలకు నవనవ లాడుతోంది.

మా ఇంటి ముందు కంచె కవతల జింక

ఇరవై అయిదేళ్ల నాటి మా ఇల్లు, రెండువైపులా అడవి, మేము నాటిన మొక్కలు పెద్ద వృక్షాలై పోయాయి. ఉదయం లేస్తే ఎదురుగా కన్నులకింపుగా పచ్చని ప్రకృతి, వీనుల విందుగా పక్షుల కిలకిలారావాలు, కోకిలమ్మల పాటలు, నెమళ్ల అరుపులు . రోజూ విడతలు విడతలుగా కంచె అవతలికి వచ్చి చెట్ల ఆకులు తింటూ మమ్మల్ని పలకరించి వెళ్లే జింకలు.ఆహా ఏమి మా వైభోగం!
(వాకా ప్రసాద్, రచయిత, తిరుపతి)


Read More
Next Story