ఉజ్బెకిస్తాన్ సిల్క్ రోడ్ మీద ప్రయాణం... (Sunday Special)
x
బుఖారాలో హెరిటేజ్ సైట్

ఉజ్బెకిస్తాన్ సిల్క్ రోడ్ మీద ప్రయాణం... (Sunday Special)

ఉజ్బెకిస్తాన్ సెంట్రల్ ఏసియన్ దేశం. మసీదుల, మౌసోలియాల, మదరసాలదేశం. ఒకపుడు సోవియట్ యూనియన్ లో భాగం. ఇపుడు స్వతంత్ర దేశం. గిరిజ పైడిమర్రి ఉజ్బెక్ యాత్రా విశేషాలు



అనుకోకుండా ఉజ్బెకిస్తాన్ వెళ్లే అవకాశం వచ్చింది. సిల్క్ రోడ్ మీద ఉన్నసెంట్రల్ ఏసియన్ దేశం. మసీదులకు, మౌసోలియంలకు, మదరసాలకు ఉజ్జెకిస్తాన్ పేట్టింది పేరు. ఒకపుడు సోవియట్ యూనియన్ (యుఎస్ ఎస్ఆర్)లో భాగం. సోవియట్ యూనియన్ పతనం తర్వాత స్వతంత్ర దేశంగా మారింది.



ఆ మధ్య నేపాల్ ప్రయాణం.... 25 రోజుల అంతరంతో చార్ ధామ్ ప్రయాణం ... ఈమధ్యలో ఉజ్బెకిస్తాన్ వెళ్లి రాగలనా? అనే సందేహం. కానీ సిల్క్ రూట్ లో ప్రయాణించాలన్న కోరిక ఇప్పటిదా? ఒక వారపత్రికలో పరవస్తు లోకేశ్వర్ రాసిన సిల్క్ రూట్లో సాహస యాత్ర చదివినప్పటినుంచి అంతర్గతంగా ఉన్న కోరిక. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఉజ్బెకిస్తాన్ వెళ్లాలని నిర్ణయించుకున్నాను.మేక్ మై ట్రిప్ ద్వారా విమాన టికెట్ల బుకింగ్, వీసా పనులు చకచకా జరిగిపోయాయి.

ప్రయాణపు తేదీ మే ఆరు రానే వచ్చింది. హైదరాబాదు నుంచి ఢిల్లీ వెళ్లి, అక్కడినుంచి మరో విమానంలో మూడున్నర గంటలు ప్రయాణం చేసి తాష్కెంట్లో దిగాము. విమానాశ్రయం చాలా రద్దీగా ఉన్నది. అందమైన పూల గుత్తులతో వారి వారి ఆప్తులకు స్వాగతం పలకడానికి చాలా మంది వచ్చారు. అది వారి సాంప్రదాయమట. అన్ని ఫార్మాలిటీస్ ముగించి హోటలు గదికి చేరేసరికి రాత్రి ఏడు అయింది. హోటల్ ఉజ్బెకిస్తాన్ లో మా బస ఏర్పాటు చేశారు. ఇది ఉజ్బెకిస్తాన్ లోనే పెద్ద హోటల్ అట. మరుసటి రోజు పన్నెండు గంటలకు వస్తానని చెప్పి డ్రైవర్ వెళ్లి పోయాడు.


మరునాడు ఉదయం అల్పాహారం ముగించి, అందమైన హోటలు పరిసర ప్రాంతాలను చుట్టబెట్టి కొన్ని ఫోటోలు తీసుకున్నాము. హోటలులోనే అందుబాటులో ఉన్న కౌంటర్లో డబ్బు మార్పిడి చేసుకున్నాము. ఈ సదుపాయం ఉజ్బెకిస్తాన్ హోటలులో మాత్రమే ఉన్నది. ఇతర హోటళ్లలో లేదు. డబ్బు మార్పిడి కొరకు బ్యాంకుకు వెళ్లాల్సిందే... వంద డాలర్లకు 1260500 ఉజ్బెక్ కరెన్సీ వచ్చింది. సూమ్ అని ఉజ్బెక్ భాషలో, సోమ్ అని ఇంగ్లీషు రష్యన్ భాషలలో పిలస్తారుట. సూమ్స్ 1000=7 ₹ అన్నమాట. మేము ఖర్చు చేసిన ప్రతి చోటా చాలా జాగ్రత్తగా లెక్క చేసుకోవలసి వచ్చింది. ఇంతలో డ్రైవర్ గైడుతోపాటు వచ్చి సిద్ధంగా ఉన్నాడు.

మా గైడు పేరు గులియో. గులీ అని పిలవమన్నది. ఆమె వయసు 29 ఏళ్లు.

పరిచయాల తరువాత తాష్కెంట్ పాత నగరం వైపు వెళుతూ అక్కడి ప్రత్యేకతను చెప్పడం మొదలు పెట్టింది. 94% ఇస్లాం మతస్థులు ఉన్నారట. కానీ ఇక్కడ ఉన్నటువంటి నల్లటి బురఖాలు ఎక్కడా కనిపించలేదు. ఉజ్బెకిస్తాన్ దేశం ఆసియా ఖండంలో ఉన్నది. ఆ దేశానికి తూర్పు దిక్కులో కిరిజ్ స్తాన్, దక్షిణ దిక్కులో ఆఫ్ఘనిస్తాన్, పడమర ఉత్తర దిక్కులలో కజకిస్తాన్ దేశాలలున్నాయి. ప్రస్తుత రాజధాని తాష్కెంట్ కానీ పూర్వ కాలంలో సమర్ ఖండ్ రాజధానిగా ఉండేదట. అక్కడ 80% ఉజ్బెక్ భాష మాట్లాడుతారట. అధికార భాష ఉజ్బెక్. 20% రష్యన్, టర్కీ, ఇంగ్లీషు భాషలు మాట్లాడుతారట. విద్యా విధానం ఉజ్బెక్ భాషలోనే ఉందట. ఇప్పుడిప్పుడే ఇంగ్లీషు మీడియం పాఠశాలలు వస్తున్నా వాటిలో చదువు చాలా ఖరీదైనదట. తాష్కెంట్ మొత్తంలో పది ఇంగ్లీషు మీడియం పాఠశాలలు కూడా లేవట. ప్రభుత్వ పాఠశాలలన్నీ అధికార భాషలోనే ఉన్నాయని గులీ చెప్పింది.


ఆర్మీడే, సమర్ఖండ్


ఉజ్బెకిస్తాన్ ఒకప్పుడు USSR ( యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రి పబ్లిక్ )లో భాగం . సోవియట్ యూనియన్ విచ్ఛిన్నత తరువాత 1991 ఆగస్టు 31 న . ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ గా ప్రకటించ బడింది . సెప్టెంబరు ఒకటిన వాళ్లు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకున్నారుట. మే 9. వాళ్ల జాతీయ ఆర్మీ దినం .




మాటల్లోనే మేము లాల్ బహుద్దుర్ శాస్త్రి స్మారక స్థలానికి చేరుకున్నాము. ఆయన ఇండో పాక్ యుద్ధ సమయంలో భారత ప్రధానిగా ఉన్నారు. ఆయన ఇచ్చిన " జై జవాన్, జై కిసాన్ " నినాదం ఇప్పటికీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నది. 1966 లో తాష్కెంట్ ఒప్పందం వలన యుద్ధం ముగిసింది. కానీ మరునాడే శాస్త్రిగారు తాష్కెంట్ లోనే గుండెపోటుతో మరణించాడట. కానీ అది పథకం ప్రకారం జరిగిన విషప్రయోగపు హత్య అని మేము వాదించాము. గులీ మాత్రం . ... అది గుండెపోటుతో సంభవించిన మరణమని తమ దేశస్థులు నమ్ముతారని చెప్పింది.

ఉజ్జెక్ పింగాణి కళ

అక్కడ కొద్ది సేపు గడిపి ఫోటోలు తీసుకొని మేము భూకంప స్మారక స్థలానికి చేరుకున్నాము.




1966 లో సంభవించిన భూకంప నష్టానికి గుర్తుగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ భూకంపంలో దాదాపు పదివేల మంది చనిపోయారట. తాష్కెంట్ పాతనగరం నేల మట్టమయిందట. చాలా ఆస్తులు ధ్వంసమయ్యాయట. అక్కడ నుంచి మేము మినార్ మసీదుకు వెళ్లాము.







మసీదు పైన నీలం రంగు మెరుస్తూ దూరం నుంచే కనువిందు చేస్తుంది. వేల మంది నమాజ్ చేయడానికి వీలుగా చాలా పెద్దగా ఉంది. పురుషులు విడిగా మహిళలు విడిగా నమాజ్ చేస్తారు. తల పైన వస్త్రం లేకుండా నమాజ్ చేయడం మహిళలకు నిషిద్ధం. నేను గులీ ఇద్దరం బయట ఉన్న స్కార్ఫ్స్ తీసుకొని లోపలికి వెళ్లాము. నేను రెండు నిమిషాలు కళ్లు మూసుకొని ప్రశాంతంగా మోకాళ్ల మీద కూచున్నాను.




తరువాత మేము హజరత్ ఇమామ్ కు వెళ్లాము. అక్కడి అద్భుతమైన నిర్మాణ కౌశలాన్ని చూసి, అమీర్ తైమూర్ స్క్వెర్ చూసుకొని, చూర్స్ బజార్ లోకి దూరిపొయాము. ఇది పెద్ద షాపింగ్ కాంప్లెక్సు. అక్కడి నుంచి తాష్కెంట్ టవర్ మీదుగా కాకల్ దాస్ మదర్సాకు వెళ్లాము. ఒకప్పుడు ఇక్కడ ఇస్లాం మత బోధన మాత్రమే జరిగేది. కానీ ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్సుగా మారిపోయింది. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న మదర్సాలలో ఇస్లాం బోధనతోపాటు ఇతర పాఠశాలల్లోలాగా అన్ని సబ్జెక్టులు బోధిస్తున్నారు. ఇవి ఇక్కడ ఇంటర్ విద్య స్థాయి వరకు ఉన్నాయి. తాష్కెంట్ టవర్ పైకి ఎక్కితే నగరం మొత్తం కనిపిస్తుందట. టికెట్ ధర 15000/ సోమ్స్. కానీ మేము చారిత్రక ప్రదేశాలకే ప్రాధాన్యత ఇచ్చాము. దానికి దగ్గరలోనే ఉన్న ఫిలాప్ బజార్ ఆహారానికి ప్రసిద్ధి. పెద్ద పెద్ద పాత్రలలో . ... కట్టెల పొయ్యిల మీద రకరకాల మాంసాహారపు పదార్థాలు వండుతున్నారు.



ఫిలాప్ బజార్ లో చికెన్ కబాబ్ లు


అక్కడ లంచ్ చేయాలని మా బృంద సభ్యులు ప్రయత్నించారు కానీ లభించలేదు. తిరుగు ప్రయాణంలో సమయానుకూలంగా అక్కడికి వెళ్లి పలావ్ లాంటివి ఆరగించారు. అక్కడి నుంచి మ్యూజియం చూడడానికి వెళ్లాము. ప్రవేశ రుసుము 25000 సోమ్స్. లోనికి వెళ్లి రెండంతస్తులలో ఉన్న వివిధ కళా ఖండాలను, ఖురాన్ చూసాము. అక్కడ ఉన్న శాండిలియర్ (కింది ఫోటో) ప్రపంచ ప్రసిద్ధి పొందిందని గైడు చెప్పాడు.




సాయంత్రం 6.30. వరకు నగర పర్యటన ముగించుకొని మ్యూజికల్ ఫౌంటెన్ వద్దకు చేరాము. షో 6.45 లకు మొదలైంది. ఆ నీటి జల్లులో తడిసి ముద్దయి హోటలు గదికి చేరుకున్నాము.

ఉదయమే అల్పాహారం ముగించుకొని రైలులో సముర్ ఖండ్ కు ప్రయాణమయ్యాము. దాదాపు 330 కిమీ దూరం. మేము రైలు దిగే సరికి డ్రైవర్ గైడు సిద్ధంగా ఉన్నారు. ముందుగా హోటలు గదికి వెళ్లి, మేము వండి తెచ్చుకున్న పదార్థాలతో భోజనం ముగించి సమర్ ఖండ్ నగర పర్యటనకు బయలుదేరాము. మా గైడు పేరు దుర్గని. తన వయసు కూడా 29. సంవత్సరాలే .... చూడడానికి చిన్నపిల్లలాగా ఉంది కానీ తనకు ముగ్గురు పిల్లలట. ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు. వాళ్ల బాబు ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడట. అంటే తన సంపాదన బాగానే ఉందని అర్థం. అక్కడ ఇంగ్లీషు మీడియంలో చదివించడం ఖర్చుతో కూడుకున్న పని. పరిచయాల అనంతరం దాదాపు మూడు గంటలకు మా నగర పర్యటన మొదలైంది. ముందుగా కరిమోవా స్క్వేర్ కు వెళ్లాము. కరిమోవా రిపబ్లిక్ ఉజ్బెకిస్తాన్ కు మొదటి ప్రసిడెంట్.



ఆ వెనక ఉన్న విగ్రహం, ఉజ్బెకిస్తాన్ మొదటి అధ్యక్షుడు ఇస్లామ్ కరిమోవ్


ఈ నగరం చైనా ఐరోపా మధ్య ఉన్న సిల్క్ రోడ్డులో ఉండడం వల్ల వ్యాపార రంగంలో అభివృద్ధి చెందింది. మా పర్యటన పాత నగరం వైపు సాగింది. ముందుగా మేము మూడు మదర్సాల కూడలికి వెళ్లాము. 16-18 శ. ల. నిర్మాణాలు అవి. ప్రస్తుతం అన్నీ షాపింగ్ మాల్స్ గానే ఉన్నాయి. ఆ షాపుల గుండానే మనం వాటిని చూడాలి. తైమూర్ పాలనలోని ( 1370 - 1405 ) షాఖి జిందా సమాధులు చూసాము.



తైమూర్ విగ్రహం


లోపల బంగారు రంగు చిత్రకళ చూపరులను దృష్టి మళ్లనిఇవ్వదు. ఆ ప్రాంగణంలో తైమూర్ సుగంధ ద్రవ్యాలతో స్నానం చేసే రాతి టబ్ ఉంది. తైమూర్ కుటుంబ సభ్యుల సమాధులు చూడడాన్ని నిషేధించారట. అలాంటివే పై అంతస్తులో సందర్శకుల కొరకు ఏర్పాటు చేశారు. ఆ పక్కనే శిథిలావస్థలో పాత భవనాలు ఉన్నాయి. తరువాత రేగిస్థాన్ స్క్వేర్ లో ఉన్న షిల్లార్ మదర్సాకు వెళ్లాము. పింగాణి ముక్కల తాపడంతో ఉన్న గోడలు మెరసిపోతున్నాయి. ఇక్కడ పలావ్ చాలా ప్రసిద్ధి. ముందుగా ఆర్డరు చేస్తే ప్రత్యేకంగా అప్పటికప్పుడు వండిపెడతారు. ప్లేటు 25 డాలర్లు. ఖరీదు ఎక్కువని మా బృందం రాత్రి భోజనానికి ఒయాసిస్ హోటలుకు వెళ్లాము. మధువు, మాంసం, ఆటా పాట తో డిన్నరు ముగిసింది. వాళ్ల సాంస్కృతిక కళా నైపుణ్యాలు కొట్టొచ్చినట్టుగా కనిపించాయి.


బుఖారాలో ఒక హెరిటైజ్ సైట్


బుఖార వెళ్లే రైలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉండడం వల్ల ఉదయమే అల్పాహారం ముగించి తైమూర్ స్క్వేర్ కు వెళ్లాము. ఎత్తైన తైమూర్ విగ్రహం పరిసర ప్రాంతాలన్ని అంతా పూల వనాలతో ఫౌంటెన్స్ తో అందంగా అమర్చ బడి ఉన్నాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. మేము వెళ్లిన రోజు మే తొమ్మిదో తారీఖు వాళ్ల ఆర్మీ జాతీయ దినం కావడం వల్ల దానికి సంబంధించిన వేడుకలు కూడా అక్కడ జరుగుతున్నాయి.

బుఖార చేరేసరికి దాదాపు మూడైంది. గైడు ఉమీద రెడీగా ఉంది. సమయం లేనందువల్ల హోటల్ గదికి వెళ్ళకుండా వెంటనే బుఖార నగర పర్యటన మొదలు పెట్టాము. ఉజ్బెకిస్తాన్ లో బుఖార మరో పెద్ద నగరం. చాలా ప్రాచీన నగరం. చారిత్రాత్మకంగా యునెస్కో గుర్తించిన నగరం. మేము ఎప్పటిలాగే పాత నగరం వైపు నడక సాగించాము. సిల్క్ రోడ్డులో ఉన్నందు వల్ల చాలా కాలంగా వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు బాగా అభి వృద్ధి చెందాయి. ప్రాచీన సంస్కృతి, హస్తకళలు, సాహిత్యం, సంగీతం సజీవంగా ఉండి పూర్వ వైభవాన్ని కళ్లముందు ఉంచుతుంది.


ముల్లా నస్రుద్దీన్ విగ్రహం, బుఖార


అలెగ్జాండర్, చెంఘిజ్ ఖాన్ మొదలైన వాళ్లు పరిపాలించిన ప్రాంతం. చెంఘిజ్ ఖాన్ తరువాత అతని వారసుడు కాకపోయినప్పటికీ తైమూర్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించి పరిపాలన సాగించాడు. అతడు మంగోలియా జాతి మహిళనే వివాహం చేసుకున్నాడట. అతని హయాం లోనే ఉజ్బెకిస్తాన్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది అంటారు. అందుకే వాళ్లకు తైమూర్ దేవుడిలాంటి వాడట. ఇక్కడ చాలా చోట్ల తైమూర్ విగ్రహాలు కనిపిస్తాయి. దేవుడు కాదు నరహంతకుడని మాలో మేము అనుకొని నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం...... శ్రీశ్రీ కవితను గుర్తు చేసుకున్నాము.

తాష్కెంట్, సమర్ ఖండ్, బుఖార ఈ మూడు నగరాలలో నాకు బుఖార చాలా చాలా నచ్చింది. కారణం ప్రాచీన స్థానికత, సంస్కృతి ఇప్పటికీ అలాగే ఉంది. ఆ సిల్క్ రోడ్డులో తిరుగుతుంటే మనసు గతంలోకి ప్రయాణం చేసినట్లు అనిపించింది. పింగాణి, సిల్కు, పత్తి , నూలు, ఊలు, సుగంధ ద్రవ్యాలు, మసాలాలు, బంగారాల వ్యాపారం జరుగుతోంది. చేతితో పెయింట్ చేసిన సిల్కు దుప్పట్టా నేను, ఊలు దుప్పట్టాలు నా స్నేహితులు కొన్నారు. ఊలు కంటే సిల్క్ ఖరీదు ఎక్కువ. సిల్కు దుప్పట్టా 35 డాలర్లు. ఊలు దుపట్టా 25 డాలర్లు. అక్కడ మాత్రమే కొన్ని షాపులలో మహిళలు ఉన్నారు. మరెక్కడా షాపులలో మహిళలు కనిపించ లేదు. స్థానికంగా కొంత మంది చిత్రకళ ( Hand Painting) వేస్తున్నారు. ఎవరి పనిలో వాళ్లు నిమగ్నమై ఉన్నారు. ఎక్కడా హడావుడి లేదు. ఒకచోట కచేరి జరుగుతోంది. దారిలో ముల్లా నసీరుద్దీన్ పార్క్, 16 శ. నాటి ఒక తటాకం (కింది ఫోటో) చూసుకొని అలా నడుస్తూనే మేము చారిత్రక సైటులోకి వచ్చాము.





12 వ. శ. లో నిర్మించిన మినార్, 15,16 శ. లలో నిర్మించిన మసీదులు, మదర్సాలు ఎన్నో ఉన్నాయి. అప్పటికి మ్యూజియం మూసివేయడం వలన మేము వెళ్లలేక పోయాము. అందువల్ల దానికి దగ్గరలో ఉన్న రాజభవనాన్ని కూడా చూడలేక పోయాము. బుఖార చూసాకనే నాకు ఉజ్బెకిస్తాన్ గొప్పతనం ఏమిటో బోధపడింది. సిల్కు రోడ్డులో తిరగాలన్న కోరిక తీరి ఆ అనుభూతిని హృదయంలో నింపుకున్నాను.

ఉజ్బెకిస్తాన్ లో ఎక్కువ శాతం మాంసాహారమే .... విభిన్న మాంసాలతో వండిన పలావ్ లు, బిర్యానీలు, కూరలు లభిస్తాయి. శాకాహారం కూడా దొరుకుతుంది. బ్రెడ్డులలో పలు రకాలు ... చాలా మృదువుగా తినడానికి సుఖంగా ఉంటాయి. ముఖ్యంగా వివిధ రకాల పళ్లు దొరుకుతాయి. నేను ఇప్పటివరకు నలుపు మల్బరీ పళ్లనే చూసాను.





కానీ అక్కడ నల్ల వాటితోపాటు తెలుపు మల్బరీ పళ్లు ఉంటాయి. చాలా రుచిగా ఉంటాయి. ఒకరోజు డిన్నర్ నేను వాటితోనే ముగించాను. పలురకాల కాఫీ దొరుకుతుంది . టీలలో గ్రీన్ టీ మాత్రమే దొరుకుతుంది. టీ కన్నా కాఫీ ఖరీదు ఎక్కువ . మేము ఎక్కువగా క్యాపిచినో కాఫీ తాగాము. కప్పు ధర 35000 సొమ్స్ . మేము రైస్ కుక్ అండ్ క్యారియర్, బియ్యం, పప్పు మొదలైన వాటితోపాటు రకరకాల పచ్చళ్లు, పొడులు, నెయ్యి తీసుక వెళ్లాము. కాబట్టి మధ్యాహ్న, రాత్రి భోజనాలు హోటలు గదిలోనే వండుకుని తిన్నాము. అందువల్ల నాకు భోజనానికి ఎక్కువగా ఖర్చు కాలేదు. ఉదయం హోటలు లో పళ్లు, బ్రెడ్డు, పెరుగుతో అల్పాహారం తినేవాళ్లము. మా బృంద సభ్యులు అక్కడి ప్రత్యేక మాంసాహారాన్ని రుచి చూడడానికి హోటలుకు వెళ్లినప్పుడు నేను మాత్రం రూంలో వండిన ఆహారాన్ని బాక్సులో పట్టుకు వెళ్లి వాళ్ళతో కలిసి తినేదాన్ని.

నేను గమనించినంతవరకు... ఉజ్బెక్ ప్రజలు చాలా సౌమ్యులు. భారతీ యులంటే వాళ్లకు విపరీతమైన ఆదరాభిమానాలు. భారతీయులమని మాతో అడిగి మరి చాలా చోట్ల ఫోటోలు తీసుకున్నారు. బుఖారాలో కొంత టర్కీ భాష మాట్లాడినా దేశం మొత్తంలో ఎక్కువగా ఉజ్బెక్ భాషనే మాట్లాడుతారు. అక్కడక్కడా రష్యన్ భాష కూడా వాడుకలో ఉంది. ఉజ్బెక్ భాషలో ట, డ అనే అక్షరాల ధ్వనులు లేవు. ట ను ...త గా, డ ను..... ద గా ఉచ్చరిస్తారు. ఉదాహరణకు... మెట్రోను మెత్రో గా పలుకుతారు. బురఖాలు వేసుకున్న మహిళలు ఎక్కడా కనిపించలేదు. మహిళలు ఉద్యోగం చేయడం కూడా బాగా పెరిగిందట. ఉద్యోగ రీత్యా భార్యాభర్తలు వేరు వేరు చోట్ల ఉండడం పరిపాటేనట. ముస్లింలలో ఉన్న బహు భార్యా వ్యవస్థ గురించి వాకబు చేసినప్పుడు.... ఇప్పుడు అలాంటిది లేదట. ఒకవేళ రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నా మొదటి భార్య అనుమతి తప్పనిసరి అట. అది కూడా అనివార్య పరిస్థితులలో మాత్రమే జరుగుతుందట. ముస్లిం దేశమే అయినా అక్కడ FGM ( Female genital mutilation ) లేదని తెలిసి చాలా సంతోషించాను. రోజు వారీ ప్యాంటు షర్టు వేసుకుంటారు. వేడుకలలో మాత్రమే సంప్రదాయ దుస్తులు ధరిస్తారట. బుఖారలో మాత్రం షాపులలో కొంత మంది సంప్రదాయ దుస్తులలో కనిపించారు. అది ప్రత్యేకంగా వాళ్ల సంస్కృతీ సాంప్రదాయాలను టూరిస్టులకు తెలపడానికి కాబోలు. ఉజ్బెకిస్తాన్ లో నన్ను ఆశ్చర్యానికి గురిచేసిన మరో అంశం పరిశుభ్రత... రోడ్లమీద ఎక్కడా చిన్న ప్లాస్టిక్ కవర్, పేపర్, చెత్తాచెదారం కనిపించలేదు. తాష్కెంట్ లోని ఫిలాపా బజారులో అతి పెద్ద ఫుడ్ కోర్టులో కానీ దానికి సంబంధించిన కిచెన్ లో కానీ చెత్త ఏమీ లేకుండా శుభ్రంగా ఉంచడం గొప్ప విషయమే... ఇది ఆ దేశస్థులకు పరిశుభ్రత పట్ల ఉన్న శ్రద్ధకు తార్కాణం.





మతరాజకీయాలను రెచ్చగొడుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో నేను ఉజ్బెకిస్తాన్ వెళ్లిరావడం ప్రాసంగికతను సంతరించుకుంది. మతాలకు అతీతంగా మనుషులు స్నేహశీలురు అనే విషయం ప్రత్యక్షంగా గమనించి ఆ అనుభవాలను ఇక్కడ పంచుకున్నాను.



Read More
Next Story