చాన్నాళ్ల తర్వాత తిరుమల శిలాతోరణం సందర్శన
x

చాన్నాళ్ల తర్వాత తిరుమల శిలాతోరణం సందర్శన

చూసినప్పుడల్లా తొలిసారి చేసినట్లు అనిపించే ప్రకృతి వింత


శేషాచలపు అడవుల్లోకి అడుగుపెట్టడం నేడు దుర్భేద్యమైంది. ఏం తిరిగినాము ఎన్నెన్ని ప్రకృతి అందాలను తడిమినాము. ప్రకృతి ఒడిలో ఒదిగిపోవటం ఎంత హాయిగా ఉండేది. ప్రకృతి,అడవి,మనిషి జీవించడం అనుబంధాన్ని అనుభూతించటం.ప్రస్తుతానికి మా శేషాచలపు అడవుల్లో బందైపోయింది. ఎన్నో ఏళ్లుగా పోతూ వస్తున్న రామకృష్ణ తీర్ధం, కుమారతీర్ధం, తుంబుర కొనలకు పోవటం కూడా కొందరికి మాత్రమే పరిమితమైంది. ఇంకేం చేస్తాం. చిన్నా చితకల్లోనే ప్రకృతి సౌందర్యాలను వెదుక్కోవడం మామూలైంది.

తిరుమలలోని చూడదగ్గ ప్రదేశాలు కొన్ని వందల్లోనే ఉంటాయి. దాదాపు అన్నింటినీ చూడటం మాకు దక్కిన ప్రకృతి చింత.తిరుమలకు ఏ పని మీద పోయినా కాకుల కొండ,నాగ తీర్థం,వైకుంఠ తీర్థం,పాప నాశనం,ఆకాశగంగ,ధృవ తీర్థం,జాపాలి తీర్థం,పాదాలు,బెట్టుదతల సందర్శనం నా ప్రయాణంలో తప్పనిసరి.

ఈ దఫా ఇంకొక్కసారి శిలాతోరణంలో గడిపిరావటం హాయిగా ఉంది. శిలాతోరణంలో అడుగుపెడితేనే నా విద్యార్ధి చంద్ర,అభిమాని గంగరాజు,ఫోటోగ్రాఫర్ గిరి పరిగెత్తుకువస్తారు.అడుగడుగు తిప్పుతారు.చక్రతీర్థం చూసి రమ్మంటారు.ఎన్నేళ్ళుగా చూస్తూ వస్తున్నా ఈ శిలాతోరణపు అద్భుతాన్ని ప్రతిసారీ అప్పుడే చూస్తున్నట్టుగానే ఉంటుంది.అసలు ఆ రాళ్ల సౌందర్యపు చమత్కృతి వాల్మికిపురం,మదనపల్లె -పుంగనూరు రస్తాలో,అనంతపురం దోవన,రాయచోటి,గుర్రం కొండలావుల్లో చూడాలి.

రాతి మీద రాయి.బండ మీద బండ గుండు మీద గుండు.గుట్టలు గుట్టలుగా ఆ రాళ్ళు ఎన్ని పాఠాలు చెబుతూంటాయో చూసే వారికే అర్థమవుతుంది.ప్రకృతిలో ఈ రాళ్ల సౌందర్యం నదులు,సముద్రాలకే మాత్రం తీసిపోదు. వేటికవి ప్రత్యేకపు అందపు మచ్చు తునకలు.హైదరాబాదులో మా చిన్నప్పుడు బంజారా కొండలు తదితర ప్రాంతాల్లో ఎన్నెన్ని గుట్టల్ని చూడలేదు.కోకాపేట గుట్టలు మన కళ్ళముందే కరిగించి పారేయలేదు మనం ఎన్నుకున్న పాలకవర్గాలు.ప్రకృతి సమతుల్యం గురించి ఏం మాట్లాడతాం .ఏం మాట్లాడాలి.

సరే! తిరుమల శిలాతోరణం అక్కడ ఎప్పటి నుంచి వుందో లెక్క తెలియదు.ఎవరికీ తోచిన విధంలో వారికి లెక్కలు ఉన్నాయి.కోట్ల సంవత్సరాల వెనుకటిదని అంటారు.అయితే ఇది 1979 లోనే శాస్త్రవేత్తల కంటపడింది.UNITED NEWS OF INDIA వాడు శిలాతోరణం గురించి ఒక వ్యాసాన్ని THE HINDU పత్రికలో వెలువరించటంతో శిలాతోరణపు ప్రాధాన్యత నలుదిశలకు పాకింది.

తిరుమల కొండల్లో చాలా కాలం నివసించిన యానాదులు మాతో అంటూ వచ్చిందేమిటంటే గిరిజనులు అడవుల్లో కట్టెలు కట్టుకుని,మోపులుగా మోసుకొస్తూ,ఈ శిలాతోరణం దగ్గర మోపుల్ని ఆనించి,కొంచెం సేపు సేదతీరి తిరుమల కొండ వీధుల్లో తిరిగితిరిగి ఆ కట్టెల్ని అమ్ముకునేవారని! అత్యంత ప్రాచీనమైన శిలాతోరణాలు ప్రపంచంలో అమెరికాలోని ఉటా దగ్గరలోని ఇంద్రధనుస్సు లాంటి వంతెన,ఇంగ్లాండులో దాల్ద్రియాన్ స్పటిక శిలా సేతువు,మన శిలాతోరణం ప్రపంచ ప్రసిద్ధి చెందినాయి.

ఒకప్పుడు తిరుమల,తిరుపతి ప్రాంతాలన్నీ సముద్రంగా ఉండేవని,శిలాజాలైన ఫాజిల్స్ ని బట్టి శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు.ఈ తిరుమల శిలాతోరణం కూడా సముద్రపు ఆటుపోట్ల వల్ల ఏర్పడి ఉండొచ్చని శాస్త్రజ్ఞుల పరిశోధనా ఫలితాలు వెల్లడి చేస్తున్నాయి.

ఈ శిలాతోరణం 25 అడుగుల పొడుగు, 10 అడుగుల ఎత్తుతో ఉంది.ఈ శిలాతోరణంలో కొన్ని రాళ్ళు గరుత్మంతుడు,నామాలు,శంఖు చక్రం,ఏనుగు ,పాదాల ఆకారాల్లో వున్నాయి చూడండి సార్ అంటున్నారు మా గంగరాజు,చంద్ర.నిజమే కొన్ని ఆకారాలు అలాగే వున్నాయి.

శిలాతోరణంతో పాటు పక్కనే ఉన్న రాళ్ల పార్కు,చక్రతీర్థం చూపరులకు కనువిందు చేస్తున్నాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు.తిరుమలకి వచ్చేవారు వీటిని తిలకించటం తమ కార్యక్రమంలో తప్పనిసరి చేసుకోవాలి.ప్రకృతి చమత్కృతి ఎంతటి వింతనో గమనించాలి.

Read More
Next Story