తిరుమల కొండల్లో ఉల్లాసాల ‘పునర్జన్మ విమోచన తీర్థం’
దట్టమైన అడవిలో దుముకుతున్న జలపాతం. చిన్న కొండపై నుంచి మెలికలు తిరుగుతూ ఎన్ని వయ్యారాలు పోతోందో !. కింద ఉన్న నీటి గుండంలో పడి, పాపనాశనం ఏటిలోకి సాగుతోంది.
దట్టమైన అడవిలో దుముకుతున్న జలపాతం. చిన్న కొండపై నుంచి మెలికలు తిరుగుతూ ఎన్ని వయ్యారాలు పోతోందో !. కింద ఉన్న నీటి గుండంలో పడి, పాపనాశనం ఏటిలోకి సాగుతోంది. అదే ‘పునర్జన్మ విమోచన తీర్థం’. తిరుమల కొండల్లో పాపనాశనానికి సమీపాన నీటి గుండంలోకి దుమికే చిన్న జలపాతం ఇది.
పాత పాపనాశనం మీదుగా, పునర్జన్మ విమోచన తీర్థానికి శనివారం సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరాం. పిల్లల కోసం సరదాగా వేసిన ట్రెక్కింగ్ ఇది. తిరుపతిలోని అలిపిరిలో బయలుదేరి, తిరుమలలో పాపనాశనం డ్యాం వద్దకు వచ్చేసరికి సాయంత్రం అయిదున్నరవుతోంది.
డ్యాం పై నుంచి మా నడక మొదలైంది. డ్యాం దాటాక ఎడమ వైపున ఏటి పక్క నుంచే అడవిలో నడక సాగుతోంది. కాస్త దూరం వెళ్ళగానే కుడివైపున లోనికి చొచ్చుకుపోయిన ప్రాంతం. అది ఎలుగుబంట్ల నివాసం.
దాదాపు పది మంది పిల్లలు, ఆరుగురు పెద్ద వాళ్ళు. ఏడేళ్ళ నుంచి పదమూడేళ్ళ వయసున్న ఆడపిల్లలు, మగపిల్లలు. దారి పొడవునా పిల్లల మాటలు, సరదాగా కబుర్లు, చలోక్తులు. వాళ్ళ మాటలతో నడక అలుపు తెలియడం లేదు.
ఏటి పక్క నుంచి అడవిలో సన్నని నడకదారిలో సాగుతున్నాం. ఏటి పై నుంచి చల్లని గాలి వీస్తోంది. దట్టమైన అడవి మధ్యనుంచి పాత పాపనాశనం వైపు వెళుతున్నాం. డ్యాం కట్టక ముందు ఇక్కడి వరకు బస్సులు వచ్చేవి. ఏటి మధ్యలో ఉండే చెక్ డ్యాం ఇప్పుడు మునిగిపోయింది.
రాత్రికి ఇక్కడే మా బస. పాత పాపనాశనం వద్దకు వెళ్ళాం. అంతా పాడుపడి ఉంది. అప్పటి స్నానాల గదులు శిథిలమయ్యాయి. ఈ దిగువనే స్నానాల ఘట్టం. పై నుంచి నీళ్ళు దుముకుతున్నాయి. దుముకుతున్న ఆ నీటి ధార కిందకు చేరుతుంది. పిల్లలంతా ఎంత సరదాగా కేరింతలు కొడుతున్నారో! తిరిగి మునిగిపోయిన చెక్ డ్యాం సమీపానికి వచ్చేశాం.
ఏటి పక్కనే పెద్ద పెద్ద బండ రాళ్ళు. అడవికి, ఏటికి మధ్య మైదానం లాంటి చదునైన ప్రాంతం. అక్కడే టెంట్లు వేయడం మొదలైంది. పిల్లలంతా ఒకరొకరుగా ఏటిలోకి దూకుతున్నారు. పెద్ద వాళ్ళు కూడా ఏటిలో ఈదులాడుతున్నారు. ఏటిలో ఎన్ని ఈత విన్యాసాలో!
ఈత రాని ఒకరిద్దరు గట్టునే ఉండి ఆనందిస్తున్నారు. నేను కూడా ఏటిలోకి దిగేవాణ్ణే. కానీ, ఈ తడవ ఎందుకో దిగబుద్ది కావడం లేదు. రేపు అమ్మల దినోత్సవం. అమ్మ గురించి రాయకుండా వచ్చేశాననే బాధ. ఏటి పక్కన బండ రాళ్ళపై ఒంటరిగా కూర్చున్నాను.
పిల్లల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. పన్నెండేళ్ళ సాగర్ ఒకటే మాటల పుట్ట. టీవీ యాంకర్లానో, క్రికెట్ కామెంటేటర్ లానో ఎంత సేపైనా అలా మాట్లాడుతూనే ఉంటాడు.
సాగర్ శరీరాన్ని తుడుచుకుంటూ ‘ఇది నాకు ఫస్ట్ నైట్’ అన్నాడు. కింద కూర్చున్న నబాక తలొంచుకుని కిలకిలా నవ్వేశాడు. నబాకకు ఏమర్థం అయ్యిందో ఏమో! చుట్టూ ఉన్న మిగతా పిల్లల్లో ఒకరిద్దరు కూడా నవ్వేశారు. వాళ్ళెందుకు నవ్వుతున్నారో సాగర్ కు అర్థం కాలేదు. ‘‘నవ్వడానికి ఏముంది? ఇలా పాపనాశనం పైభాగాన రాత్రి పూట గడపడం ఇదే మొదటి సారి కదా’ అన్నాడు సాగర్ సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టు.
నీలాకాశంలో మెరిసిపోతున్న చుక్కలు. దూరంగా అర్ధ చంద్రాకారంలో చందమామ. చుట్టూ పచ్చని చెట్లతో నిండిన కొండలు. మధ్యలో మౌనంగా ప్రవహిస్తున్న ఏరు. చెవి ఒగ్గి వింటే తప్ప ఏటిలో అలల సవ్వడి వినిపించడం లేదు. తెల్లని వెన్నెలకు మెరిసిపోతున్న అలలు. పై నుంచి వీస్తున్న చల్లని గాలికి అవి కదలాడుతున్నాయి. ఆ ఏటిలో ఒంటరిగా మునిగాను. ఓహ్.. ఎంత వింతైన అనుభూతి! మొదటి మునకే ఇబ్బంది. ఆ తరువాత ఏటి నీటిలో ఎంత వెచ్చదనం, ఎంత హాయి! బైటికి రాబుద్ది కాలేదు.
రాత్రి భోజనాలకు ఉపక్రమించాం. పదింటికి అంతా పక్కలపైకి చేరి నిద్రకు సిద్ధమయ్యాం. పిల్లలు నిద్ర పోవడం లేదు. అడవిలో ఏటి పక్కన నీలాకాశం కింద ఒక రాత్రి గడపడం ఎంత బాగుందో వాళ్ళకు. కబుర్లు, మాటలు, పాటలు, ఆటలు, అంత్యాక్షరీలు; ఓహ్ ఒకటేమిటి! బాల్యం ఎంత మనోహరంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నాను.
పిల్లలికి నిద్ర పడితే కదా పడుకోడానికి ! కొండల మధ్య ఏటి పక్కన చలి మొదలైంది. కప్పుకున్న దుప్పటి చలిని ఆపడం లేదు. ఎప్పుడో మధ్య రాత్రి మధు నా దుప్పటి పైన ఏదో పట్టా తీసుకొచ్చి కప్పాడు. బైట చలి, లోపల వెచ్చదనం. నిద్ర వచ్చేసింది.
తెల్లవారుజామున రెండున్నరకే పిల్లల సందడి మొదలైంది. మా టెంట్లకు దగ్గరగా చలిమంట వేశారు. మరో అరగంట సేపు అలానే పడుకున్నా. నిద్ర పడితేగా! లేచి నేను కూడా చలి మంట దగ్గర కూర్చున్నాను. ఆ చలి మంట పక్కనే కూర్చుని ‘అడవి నుంచి అమ్మకు బహిరంగ లేఖ’ను సెల్ ఫోన్లో కంపోజ్ చేయడం మొదలు పెట్టాను.
సెల్ ఫోన్ లో మెసేజ్ లు రాయచ్చు కానీ, ఇలా కథనాలు రాయడం చాలా కష్టం. తెల్లారే వరకు అలా రాస్తూనే ఉన్నాను. అమ్మకు లేఖ రాస్తుంటే చీకట్లో కళ్ళు చెమర్చాయి. తెల్లారుతోంది. పిల్లలంతా మళ్ళీ ఏటిలోకి దూకారు.
టిఫిన్లు చేసి బయలుదేరడానికి సిద్ధమవుతున్నాం. ఆశ్చర్యంగా సెల్ సిగ్నల్స్ వచ్చాయి. అమ్మకు రాసిన లేఖను పంపించేశాను. పాత పాపనాశనం మీదుగా అడవిలో పునర్జన్మ విమోచన తీర్థం వైపు బయలుదేరాం.
ఇటు కొండ, అటు కొండ. మధ్యలో సన్నని లోయ. బండరాళ్ళ పైనుంచి ఎక్కుతూ, దిగుతూ సాగుతున్నాం. రాళ్ళ మధ్య నుంచి ఏరు ప్రవహిస్తోంది. రాళ్ళ పైన జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఏ మాత్రం జారినా నీళ్ళలో పడిపోతాం.
లోయంతా పచ్చగా ఉంది. కొండ అంచులు దగ్గరాగా వచ్చాయి. ఆ లోయలో చాలా చల్లగా ఉంది. ఏ మాత్రం ఎండ పొడ కనిపించడం లేదు. గంట నడకతో ‘పునర్జన్మ విమోచన తీర్థం’ వద్దకు వచ్చేశాం. ఇక ఏముంది పిల్లలంతా గుండంలోకి దూకి ఈదులాడారు.
కొండ పైనుంచి మెలికలు తిరుగుతూ జలపాతం గుండంలోకి వచ్చి పడుతోంది. జలపాతం పైనుంచి తాడుకట్టి గుండంలోకి వదిలారు. ఆ తాడు పట్టుకుని జలపాతం వెంట ఎక్కడం, మళ్ళీ ఆ తాడు పట్టుకుని అదే జలపాతం వెంట దిగడం ఎంత సాహసం! ఎంత సరదా! పిల్లల్లో చాలా మందికి ఇక్కడికి రావడం ఇదే తొలిసారి.
మొదట్లో ఎందుకో నాకు దిగబుద్ది కాలేదు. తరువాత జలపాతం వరకు ఈదుకుంటూ వెళ్ళి, ఒక మునక మునిగి వచ్చి గట్టునే కూర్చున్నాను. పిల్లలు పిలుచుకునే పేర్లు తమాషాగా ఉన్నాయి. ఒకడి పేరు నబాక అయితే, మరొకడి పేరు టొబాకొ. అహన్, సాగర్, జోషి, బేబి అక్క; ఇలా తమాషా తమాషాగా ముద్దు పేర్లు.
ఆ లోయలోనే వంటలు. భోజనాలవగానే ఒంటి గంటకు బయలు దేరి మళ్ళీ రాత్రి బస చేసిన ఏటి ఒడ్డు దగ్గరకు వచ్చాం. నీళ్ళు కనిపిస్తే చాలు పిల్లలికి పూనకం వచ్చేస్తుంది. మళ్ళీ ఏటిలోకి దూకుడే దూకుడు. బయలుదేరుదామన్నా ఏటి లోంచి రాబుద్ది కావడం లేదు.
మధ్యాహ్నం మూడవుతోంది. పిల్లలు అయిష్టంగానే బయలుదేరారు. అడవి లోంచి మళ్ళీ పాపనాశనం వద్దకు వచ్చేశాం. అక్కడి నుంచి వాహనాల్లో తిరుపతి చేరాం.
తిరుపతి నుంచి పాపనాశనం డ్యాం వరకు పాతిక కిలోమీటర్లు. పాపనాశనం నుంచి పునర్జన్మ విమోచన తీర్థం వరకు గంటన్నర నడక. మొత్తం యాభై కిలో మీటర్లు వాహన ప్రయాణం, మూడు గంటల నడక. పిల్లల్తో ఈ అడవి ప్రయాణం చాలా సరదాగా గడిచింది.