ఆయన అక్షరాలనే నమ్ముకున్నాడు, అక్షరాలనే శ్వాసించాడు
x

ఆయన అక్షరాలనే నమ్ముకున్నాడు, అక్షరాలనే శ్వాసించాడు

నవలా రచయిత, పాత్రికేయుడు, నాటక రచయిత, సినీ గేయ రచయిత, నిఘంటువుల నిర్మాత నాయుని కృష్ణ మూర్తి జయంతి నేడు


‘‘మీ రచనా శక్తికి, శైలికీ నా జోహార్లు. ఇంత గొప్ప వచనం ఈ మధ్యకాలంలో చదవలేదు’’ అంటూ నాయుని కృష్ణ మూర్తి వచన భాగవతం మొదటి భాగానికి బొమ్మలు వేయడానికి అంగీకరిస్తూ బాపు రాసిన ఉత్తరంలోని మాటలివి. కృష్ణ మూర్తి అడక్కుండానే ‘‘మిగతా భాగాలకు కూడా బొమ్మలు వేస్తాను పంపించండి’’ అన్నారు బాపు. నాయుని కృష్ణమూర్తి ఆధునిక వచనంలో రాసిన రామాయణ, భాగవతాలే కాదు, మహాభారతం మూల కథ ఆధారంగా చాలా సరళంగా, సులభ శైలిలో రాసిన ‘జయమ్’ నవల చాలా ప్రసిద్ధమైంది.


తెల్లని జుట్టు, తెల్లని గడ్డం, తెల్లని ఫ్యాంటుషర్టులో చిరునవ్వుతో ఆప్యాయమైన పలకరింపుతో ఒక తాత్వికుడిలా కనినిపించే నాయుని కృష్ణమూర్తి చిత్తూరు జిల్లా చౌడేపల్లెకు చెందిన కథకుడు, నవలాకారుడు, నాటక రచయిత, నిఘంటువుల నిర్మాత, సినీ గేయరచయిత మాత్రమే కాదు, అనేక పత్రికల్లో పనిచేసిన పాత్రికేయుడు, ‘స్నేహబాల’ సంపాదకుడు కూడా. గుర్రంకొండ మండలం నడించర్ల గ్రామంలో 1951 నవంబర్ 12న ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కృష్ణమూర్తి తన 67వ ఏట 2018 మార్చి 1న కన్నుమూశారు.

తన 22వ ఏట రాసిన ‘యామినీకుంతలాలు’ నవలకు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ఉగాది నవలల పోటీలో మూడవ బహుమతి లభించింది. ఉన్నత విలువలుగల పాత్రలు పడే సంఘర్షణతో అభ్యుదయ భావాలతో ఈ నవల సాగుతుంది. ఎన్ని సమస్యలు వచ్చినా జీవితం నుంచి పారిపోకూడదనే ఈ నవల సారాంశం.

నాయుని కృష్ణ మూర్తి జయమ్  వంటి  ప్రసిద్ధ రచనలు చేసింది చౌ డే పల్లె లో ని ఈ గెస్ట్ హౌస్ నుంచే.-

నాయుని కృష్ణ మూర్తి 'జయమ్' వంటి ప్రసిద్ధ రచనలు చేసింది చౌ డే పల్లె లో ని ఈ గెస్ట్ హౌస్ నుంచే.-


‘మనిషి గుర్రమురోరి మనిషీ’ , ‘ప్రలోభం’ నవలలు కూడా రాశారు. కృష్ణమూర్తి ముప్ఫై కథలు రాశారు. ఆయనలో కానీ, ఆయన రచనల్లో కానీ నిరాడంబరత్వమే తప్ప ఎక్కడా ఆవేశం కనిపించదు. పతనమవుతున్న కుటుంబ సంబంధాలు, విలువల పట్ల ఆవేదన కనిపిస్తుంది. వైవిధ్యం గల ఆయన కథల్లో ఏ సిద్ధాంతాల, దృక్పథాల ప్రభావం కనిపించదు. సందేశాలు, తీర్పులు చెప్పడం ఉండదు. అనుభవాల ఆధారంగానే ఆలోచింప చేసే వైవిధ్యభరితమైన కథలు ఆయనవి. ఎక్కడా గందరగోళం ఉండదు.


మానవ సంబంధాల్లో వచ్చే మార్పులతో పాటు, స్వీయానుభవంతో చేసిన పరిశీలనతో కుటుంబ సబంధాలను చిత్రించారు. సున్నితమైన హాస్యం, వ్యంగ్యం, అధిక్షేపణ ఉంటాయి. కథల వెనుకున్న కథను కూడా చెపుతారు.

ఇంగ్లీషు నేర్చుకునే తెలుగు విద్యార్థుల కోసం మూడు నిఘంటువులను నాయుని కృష్ణమూర్తి తయారు చేశారు. బొమ్మల ద్వారా గుర్తుపట్టడానికి తెలుగు-ఇంగ్లీషు బొమ్మల నిఘంటువు, తెలుగు-ఇంగ్లీషు సచిత్ర నిఘంటువును రూపొందించగా, మూడవదిగా తెలుగు-ఇంగ్లీషు విద్యార్థి నిఘంటువును తయారు చేశారు. తెలుగు పదాలు తెలిసిన విద్యార్థులు వాటిని ఇంగ్లీషులో ఏమంటారో తెలుసుకోవడానికి బొమ్మలతో ఈ నిఘంటువులను ఆధునిక అవసరాలకు అనుగుణంగా తయారు చేశారు. ఏ విశ్వవిద్యాలయాలో, ఏ పరిశోధనా సంస్థలో తయారు చేయవలసిన నిఘంటువుల నిర్మాణాన్ని, ఒక్కడుగా నాయుని కృష్ణమూర్తి భుజానికెత్తుకుని పూర్తి చేశారు.

‘మహర్షి’ సినిమాలో ఇళయరాజ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం’ పాటను రాసింది నాయుని కృష్ణమూర్తే. మరొక సినిమాకు కూడా పాట రాసినా, ఆ పాటను లతా మంగేష్కర్ పాడినా, ఆ సినిమా విడులకు నోచుకోలేదు.

నాయుని కృష్ణమూర్తికి బాగా పేరు తెచ్చింది ‘జయమ్’. మహాభారత మూల కథ ఆధారంగా తన సృజనాత్మకను జోడించి రాసిన నవల ఇది. వ్యాసుడి కాలంలో కౌరవులు, పాండవుల మధ్యజరిగిన ఘర్షణ నిజంగా జరిగిన చరిత్రగా కృష్ణమూర్తి విశ్వసిస్తారు. కురువంశం తన కళ్లముందే సర్వనాశనం కావడం పట్ల వ్యాకులత చెంది, వంశ నాశనానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ వ్యాసుడు ‘జయమ్’ పేరుతో కావ్యం రాస్తాడు. వ్యాసుడి తరువాత ఈ కావ్యాన్ని జనమేజయుడికి వైశంపాయనుడు ఎన్నో వివరణలు, పూర్వకథలు, శాస్త్రాలు జోడించి మహాభారతంగా వినిపిస్తాడు. దీంతో వ్యాసుడు రాసిన ‘జయమ్’ 8,800 శ్లోకాల నుంచి 24 వేల శ్లోకాలుగా పెరిగిపోతుంది. వేల సంవత్సరాల క్రమంలో పౌరాణికులు భారతాన్ని విపరీతంగా పెంచేశారు.

స్కాండినేవియన్ సాహితీ వేత్త సోరెన్ సోరెన్ సన్ 1883-94 మధ్య మహాభారతం నుంచి మూల కథను వేరు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఎనభై ఏళ్ల తరువాత గుజరాత్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ అహమ్మదాబాద్ బ్రాంచి డైరెక్టర్ ప్రొఫెసర్ కేశవరావు కె.శాస్త్రి కొన్నేళ్లపాటు శ్రమించి మహాభారతం నుంచి మూల కథ ‘జయమ్’ను వేరు చేసి ‘జయసంహితను’ ప్రచురించారు. పాండు రాజు మరణం తరువాత కుంతీదేవి కుమారులతో హస్తినకు వెళ్లడంతో ‘జయమ్’ కథ మొదలవుతుంది. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక పాండవులు హస్తినాపురానికి తిరిగి రావడంతో నవల పూర్తవుతుంది.

నాయుని కృష్ణ మూర్తి

నాయుని కృష్ణ మూర్తి


నాయుని కృష్ణమూర్తి అక్షరాలను నమ్ముకున్న వారే కాదు, ఆ అక్షరాల ను శ్వాసించిన ఆచరణ శీలి. చౌడేపల్లెలో అన్నదమ్ములతో కలిసి విజయవాణి ప్రింటింగ్ ప్రెస్ ను స్థాపించడమే కాదు, అక్కడి నుంచి రాష్ట్రంలోని విద్యార్థుల కోసం ‘మా బడి’ ‘పాఠశాల’ అనే విద్యావిషయక పత్రికలను కూడా తీసుకొచ్చారు. దేశమంతా 1991 లో చేపట్టిన సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమంలో భాగంగా, మన రాష్ట్రంలో ఎంపికైన చిత్తూరు, నెల్లూరుజిల్లాల్లోని నూతన అక్షరాస్యుల కోసం ‘వెలుగుబాట’ అన్న పత్రికను కూడా తీసుకొచ్చారు. ఈ పత్రికపైన 1995లో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ వారు డుక్యుమెంటరీని రూపొందించారు.


జిల్లా సాక్షరతా సమితి అకడమిక్ కమిటీ చైర్మన్ గా నాయుని కృష్ణమూర్తి పదిహేను సంవత్సరాలు పనిచేశారు. రాష్ట్ర లిటరరీ మిషన్ తో పాటు, కేంద్ర లిటరరీ మిషన్ లో కూడా సభ్యుడిగా వ్యవహరించారు. బహుముఖీయమైన ఆయన ప్రతిభకు తోడు, ఆయన మనుషులను ప్రేమిస్తాడు. ఆ ప్రేమే పునాదిగా ఆయన నలుగురు అన్నదమ్ముల కుటుంబ సభ్యులంతా కలిసి చౌడేపల్లెలో ఇప్పటికీ ఒకే ఇంట్లో ఉమ్మడిగా జీవించడం అరుదైన ఆదర్శం.







పుస్తకాలు మనల్ని ఎలా సేద తీరుస్తాయి, ఎలా సంతోషపెడతాయి, ఎలా కొత్త తెలివిడిని అందిస్తాయె చక్కగా చెబుతున్నారు నాదెళ్ల అనూరాధ


Read More
Next Story