అసెంబ్లీకి రాకపోతే రాజీనామా చేయాలని తులసి రెడ్డి
x

అసెంబ్లీకి రాకపోతే రాజీనామా చేయాలని తులసి రెడ్డి

ప్రతిపక్ష హోదా వివాదంపై తులసి రెడ్డి స్పందన. అసెంబ్లీకి హాజరు కావాలని లేకపోతే రాజీనామా చేయాలని జగన్‌కు సూచన.


నా గొంతు నొక్కెందుకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదు,అందుకే అసెంబ్లీకి వెళ్లడం లేదు అని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గపు శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం,అవివేకం, అజ్ఞానం, బాధ్యతారాహిత్యం పిరికితనం అని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మెన్ డాక్టర్ నర్రెడ్డీ తులసి రెడ్డి ధజమెత్తారు.

శుక్రవారం వేంపల్లి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ వ్యాఖ్యలు మూర్ఖత్వానికి పరాకాష్ట అన్నారు .ఈ వ్యాఖ్యలు సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే అన్నారు.

అసెంబ్లీ నియమ నిబంధనలు ,సాంప్రదాయాల ప్రకారం ఒక పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలి అంటే మొత్తం శాసనసభ సభ్యుల సంఖ్యలో 10 శాతం సభ్యులు ఆ పార్టీకి ఉండాలని ఈఅర్హత లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా రావడం సాధ్యం కాదని తులసిరెడ్డి అన్నారు. "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తము శాసనసభ్యుల సంఖ్య 175. అందులో 10 శాతం రావాలి . అంటే 18 మంది ఉండాలి.కానీ వైకాపా పార్టీకి 11 మంది ఉన్నారు.ఏడు మంది తక్కువ ఉన్నారు.కాబట్టి ఆ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా రాదు. జగన్ కు ప్రతిపక్ష నాయకుని హోదా రాదు. ఈ విషయం జగన్ కు తెలుసు.అయినా మంకు పట్టు పట్టడం అంటే పిల్ల చేస్టే అవుతుంది,"అని ఆయన అన్నారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే...

గతంలో 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున 26 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.రాష్ట్ర అసెంబ్లీ మొత్తం శాసనసభ్యుల సంఖ్య 294.అందులో 10% అంటే 29 మంది ఎమ్మెల్యేలు గెలవాలి.కానీ 26 మంది గెలిచారు.ముగ్గురు తక్కువ ఉన్నారు.అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు.ఆ పార్టీ నాయకుడైన పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు.అదేవిధంగా లోక్సభ సభ్యుల మొత్తం సంఖ్య 543.అందులో 10% అంటే 54 మంది.2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున 44 మంది గెలిచారు.2019లో 52 మంది గెలిచారు.అయినా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు.ఆ పార్టీ నాయకులకు ప్రతిపక్ష పార్టీ నాయకుల హోదా ఇవ్వలేదు.

పులివెందుల నియోజకవర్గ ప్రజలు తమ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. ముఖ్యమంత్రిగా కాదు.ప్రతిపక్ష నాయకుడిగా కాదు.ఈ వాస్తవాన్ని జగన్ గ్రహించాలి.అదేవిధంగా వైకాపా పార్టీకి చెందిన మిగతా ఎమ్మెల్యేలు కూడా ఆలోచించాలి.

ఎంతసేపు మాట్లాడాము అన్నది కాదు ముఖ్యం కాదు. ఏమి మాట్లాడాము అన్నది ముఖ్యం.తక్కువ సమయంలో సమర్థవంతంగా మాట్లాడేవాడే అసలైన నాయకుడు.


ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి,మిగతా పదిమంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్ళాలి.లేదా జగన్ కాకుండా మిగతా పదిమంది ఎమ్మెల్యేలైనా అసెంబ్లీకి వెళ్ళాలి.లేదా వైకాపాకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామా చేసి మిగతా వారికి ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించాలని, నియోజకవర్గ ప్రజలకు ప్రాతినిధ్యం లేకుండా చేయవద్దని తులసి రెడ్డి సూచించారు.

Read More
Next Story