
‘పసుపాకు’ నుంచి నూనె పిండిన తెలంగాణ మహిళలు...
నిజామాబాద్ ఎర్గట్ల మండలం గుమ్మిర్యాల్ మహిళల ప్రయోగం సక్సెస్...
వ్యవసాయం అంటే పెట్టుబడులు, నష్టాలు, అప్పులు అనే మాటలే ఎక్కువగా వినిపిస్తున్న ఈ రోజుల్లో…
పనికిరావని భావించిన పసుపు ఆకులే లక్షల ఆదాయానికి మార్గం అవుతాయంటే?
అది ఊహ కాదు. నిజామాబాద్ జిల్లా గుమ్మిర్యాల్‌లో మహిళలు సాధించిన నిజం.
పసుపు పంట కోసిన తర్వాత పొలాల్లో మిగిలిపోయే ఆకులు…
ఏళ్ల తరబడి రైతులకు అవి ఒక సమస్యే.
కుప్పలుగా పోసి తగలబెట్టి కాల్చేయడం, దాంతో గ్రామమంతా పొగ, కాలుష్యం.
అయితే ఇప్పుడు అదే ఆకులు నూనెగా మారి కాసుల పంటగా మారుతున్నాయి.
పసుపు… పరువు పంటగా మారిన వాస్తవం
పసుపు అంటే లాభాల పంటగా పేరుంది.
కానీ సాగు మొదలు ప్రాసెసింగ్ వరకు ఒక్క ఎకరాకు లక్ష రూపాయల వరకూ ఖర్చు.
అంత పెట్టుబడి పెట్టినా సరైన ధర రాక నష్టాలే మిగులుతున్న పరిస్థితి.
‘‘నష్టం వస్తుందని తెలిసినా… పక్క రైతు వేస్తున్నాడు కదా అని మేమూ వేస్తున్నాం.
పసుపు ఇప్పుడు మాకు పరువు పంటగా మారింది’’
అంటున్నారు గుమ్మిర్యాల్ రైతులు.
ఈ వాస్తవాన్ని దగ్గర నుంచి చూసిన గుమ్మిర్యాల్ స్వయం సహాయక సంఘ మహిళలు
ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
పసుపు రైతుల ఆదాయం పెరగాలి…
కాలుష్యం తగ్గాలి…
అదీ కొత్త పెట్టుబడి లేకుండానే.
వృధా ఆకులపై దృష్టి… పరిష్కారానికి బాట
పసుపు సాగులో అంతర పంటలుగా జొన్న, కంది సాగును ప్రోత్సహించినా
నష్టాలు పూర్తిగా తగ్గలేదు.
అప్పుడు మహిళల చూపు వెళ్లింది –
కాల్చేస్తున్న పసుపు ఆకుల మీదకు.
విదేశాల్లో పసుపు ఆకుల నూనెకు డిమాండ్ ఉందన్న సమాచారం తెలుసుకున్నారు.
ఐసిఐసిఐ ఫౌండేషన్ సహకారంతో
హైదరాబాద్ బోడుప్పల్‌లోని
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరొమాటిక్ ప్లాంట్స్ (CIMAP)
శాస్త్రవేత్తలను సంప్రదించారు.
పరీక్షల తర్వాత వచ్చిన ఫలితం ఆశ్చర్యకరం.
పసుపు ఆకుల్లో నూనె ఉంది… అది విలువైనదే!
ఆకుల నుంచి నూనె – దేశంలోనే తొలి అడుగు
సీమ్యాప్ డిస్టిలేషన్ యూనిట్‌లో
పసుపు ఆకుల నుంచి నూనెను వెలికితీశారు.
ఒక టన్ను ఆకులను ప్రాసెస్ చేస్తే
సుమారు 10 కిలోల నూనె లభిస్తోంది.
‘‘ఈ నూనెలో
alpha-Phellandrene, Terpinolene, Limonene వంటి విలువైన రసాయనాలు ఉన్నాయి.
ఫార్మా, ఫుడ్ ఇండస్ట్రీల్లో దీనికి మంచి డిమాండ్ ఉంది.
ముఖ్యంగా, పొలాల్లో ఆకులు కాల్చకపోవడంతో
కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వల్ల వచ్చే కాలుష్యం పూర్తిగా తగ్గింది’’
అని చెప్పారు
సీమ్యాప్ సీనియర్ శాస్త్రవేత్త కిరణ్‌బాబు.
ఈ సాంకేతికతను CSIR–Aroma Mission ప్రాజెక్ట్ ద్వారా రైతులకు అందించారు.
పసుపు కంటే ఆకులకే ఎక్కువ లాభం!
నిజామాబాద్ జిల్లా, గుమ్మిర్యాల్‌లో
రూ.15 లక్షల వ్యయంతో నూనె తీసే యంత్రాలను ఏర్పాటు చేశారు.
దీనిలో
రూ.12.5 లక్షలు – ఐసిఐసిఐ ఫౌండేషన్ గ్రాంట్,
మిగతా మొత్తం – మహిళా సంఘాల వాటా.
ప్రస్తుతం దాదాపు 400 మంది రైతుల నుంచి పసుపు ఆకులు సేకరిస్తున్నారు.
‘‘విదేశీ మార్కెట్లో ఈ నూనె ధర
కిలోకు రూ.12,000 వరకు ఉంది.
ఇది పసుపు గడ్డల కంటే ఎక్కువ ఆదాయం’’
అంటున్నారు
మణికంఠ స్వయం సహాయక సంఘ సభ్యులు సాయమ్మ, రాజవ్వ.
కాలుష్యం తగ్గింది… ఆదాయం పెరిగింది
ఒకప్పుడు పొలాల్లో పొగలు కక్కిన పసుపు ఆకులు
ఇప్పుడు గ్రామానికి సంపదగా మారాయి.
పనికిరావని భావించిన వ్యర్థమే
విలువ ఆధారిత ఉత్పత్తిగా మారింది.
తమ ఊరును కాలుష్యం నుంచి కాపాడటమే కాదు,
రైతులకు అదనపు ఆదాయం అందిస్తూ,
తామే స్వయం ఉపాధి సాధిస్తూ
దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు గుమ్మిర్యాల్ మహిళలు.
వ్యవసాయ విప్లవం అంటే
కొత్త విత్తనాలు కాదు…
కొత్త ఆలోచనలే అని
వీరు మరోసారి నిరూపించారు.

