ఉద్దెర మల్లయ్య
x

ఉద్దెర మల్లయ్య

ఆదివారం కథ. జూకంటి జగన్నాథం



–జూకంటి జగన్నాథం



సిరిసిల్ల పాత బస్టాండ్ కుడివైపు మూల మీద చైనా యుద్ధంలో ప్రాణ త్యాగం చేసిన బోనాల గ్రామానికి చెందిన కెప్టెన్ రఘునందన్ రావు విగ్రహం ప్రతిష్టించబడి ఉంది.ఆరు రోడ్ల కూడలిలో ఎంతకూ పూర్తికాని చీరను మగ్గం మీద నేస్తూ నేతన్న విగ్రహం అన్ని ఆందోళనలకు, నిరసనలకు సాక్షి భూతంగా కూర్చొని చూస్తుంది . ఎడమ వైపు ఈ మధ్యనే నిర్మించిన అమరవీరుల స్తూపం పక్కన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాలు ఎండకు వానకు చలికి చలించక నిలబడి ఉంటాయి. ఆ విగ్రహాలకు ముందు పండ్ల బండ్లు వరుసగా కొలువుదీరి ఉంటాయి. గత రెండు మూడు రోజులుగా ఆకాశం నుంచి వాన దేవత భూమితో మాట్లాడుతున్నట్టు ఒకటే ముసురు. అంతా గిజగిజగా ఉంది. ఉన్నవాళ్లు ఛత్రీలు పట్టుకొని నడుస్తుంటే, మరి కొందరు ప్లాస్టిక్ కవర్లు కప్పుకొని ఎవరి దారిలో వారు పోతున్నారు.

చుట్టుపక్కల గ్రామాల నుంచి బస్సులో వచ్చిన ప్రయాణికులు పెద్ద బజారులోకి వెళ్లే దారిలో మూలమలుపు తిరిగే దగ్గర ఎదురుగా ఇంటి గోడకు 'మల్లయ్య సైకిల్ టాక్స్' అని ఎర్రని అక్షరాల కింద, గంటకింత, రోజుకు ఇంత కిరాయి అని చూపరులను ఇట్టే ఆకర్షించేలా జాజు అక్షరాలతో రాసి ఉంది. . సిరిసిల్ల పట్టణంలో ఉన్న ఒకటి రెండు సైకిల్ టాక్స్ లలో మల్లయ్య సైకిల్ టాక్సే వెరి వెరీ ఫేమస్ అని చెప్పుకుంటారు . వరుసగా నిలపెట్టిన సైకిళ్ల పక్కన ఇనుప తట్టలో సైకిల్ ట్యూబ్ కు పంచర్లు వెతకడానికి నీళ్లు పోసి ఉన్నాయి. ఆ పక్కన సైకిళ్లకు గాలి కొట్టే పంపు గోడకు ఒరిగించి ఉన్నది. దాని పక్కన సైకిల్ రిపేర్ చేసే జహింకీర్ కూర్చోవడానికి చిన్న కర్ర స్టూలు, అటుపక్కన పంచర్లకు సొల్యూషన్ పెట్టి ,మేరకు కత్తిరించి రబ్బర్లు అతికించడానికి కత్తెర , సైకిల్ విప్పడానికి పానాలు ఒక డబ్బాలో వేసి ఉన్నాయి. వీటి అన్నిటినీ నిఘా పెట్టి చూడడానికి పక్కన ఒక టేబుల్ దానిమీద రిజిస్టర్ లోపలి కాగితాల మీద ఐదారు అడ్డం గీతలు కొట్టిన బుక్కూ, పెన్నూ ఉన్నాయి. వేసి ఉన్న కుర్చీలో ప్రతిరోజు ఉదయమే ఒకతను బీడీ తాగుతూ కూర్చొని ఉండేవాడు. కానీ ఈరోజు ఆ కుర్చీ ఖాళీగా ఉంది. ఎప్పటిలాగే ముందు పెద్ద చైన్ తో కట్టేసిన పది అట్లాస్ సైకిళ్లు స్టాండ్ వేసి కిరాయి కు సిద్ధంగా ఉన్నాయి .

ఇంటిముందు అందరూ గుమిగూడి ఉన్నారు. "ఏమైందట రాత్రి మంచిగనే ఉండే కదా " ఒకామె వచ్చి గుంపులో నిలబడి ఏమి జరిగిందో అని ఆరా తీస్తుంది . లోపలి నుంచి ఏడుపులు వినిపిస్తున్నాయి. "వాన పాడుగాను పొద్దుగాలనుంచి తెరిపి లేకుండా ఒక్క తీరుగా ఎటూ పోకుంట రాకుంటా పడుతుంది" మందిలో నుంచి ఒకామె అంది. నిలబడ్డ వారి కళ్ళు పొగతో మండుతున్నాయి. "ఓయ్ ఎవరయ్యా గా మూలకున్న కట్టెలు సరిగ్గా అంటుకున్నట్టు లేవు. జెర ఊది నిప్పు అయ్యేలా చూడుండ్రి" గట్టిగానే పురమాయించింది .

రెండు ఇళ్ల నడుము ఉన్న చిన్న సందులోనుంచి ఆడ, మగవారు పోయి చూసి బయటకు వస్తుంటే, చూడని వారు పక్కనుంచి లోపలికి పోతున్నారు. ఇంతలో ఒక నలుగురైదుగురు 50 ఏళ్ల వయసు పైన ఉన్నవాళ్లు ఇస్త్రీ పాయింటు షెర్ట్ లు వేసుకొని ఉద్యోగస్తులుగా కనబడుతున్నారు. వారిని చూసి మంది తొవ్వ ఇవ్వగా ఆందోళనగా సర్రు సర్రునా లోపలికి నడిచారు .

అందులో ఒక అతని పేరు రఘుపతి పద్మశాలి కాగా, ఇంకో అతని పేరు యూసుఫ్, ఎత్తుకు ఎత్తు ఆజానుబాహువుగా ఎర్రగా ఉన్న అతని పేరు ఆబిద్ హుస్సేన్ ,మరో అతని పేరు బొంగోని రాజలింగయ్య గౌడ్ తల వెంట్రుకలు పెద్దగా విరబోసుకుని ఉన్నాడు. వాళ్ల వెంట పొట్టిగా కాక అంత పొడవు కానటువంటి బక్క పల్చని వ్యక్తి పేరు బోనాల దేవయ్య ముదిరాజ్ కులస్తుడు. అప్పటికే ఒక్కొక్కరి కళ్ళు బాగా ఏడ్చినట్టు ఎర్రగా ఉన్నాయి. బాధతో సుడి పడిపోతున్నారు.

అందులో నుంచి రాజలింగయ్య ఒక్కసారి గొంతు ఎత్తి "వదినే అన్నకి ఏమైంది" తలుచుకుంటూ ఏడుస్తున్నాడు.

"ఏం చెప్పమంటరు సార్లూ రెండు రోజుల నుంచి తిన్న అన్నం కడుపులో పెట్టె పెట్టినట్టు అట్లాగే ఉంటుందని అన్నడు. సర్కార్ దవాకాన్లకు పోయి చూయించుకో అయ్యా అంటే ,ఏ ఏమి కాదు తియ్యి అని ఎంత చెప్పినా నా మాట పట్టించుకోలేదు రాత్రి తిని మంచిగనే పడుకున్నడు . తెల్లవారుజామున లేపితే కుయ్ లేదు కుట్కు లేదు పిలిస్తే పలకలేదు. ఏమైందో ఏమో తెల్లారేసరికి నా అయ్య ఇట్లా అయిపోయిండు" మల్లవ్వ దుఃఖాన్ని ఎల్ల పోసుకుంటూ చెప్పింది.

మల్లయ్య కొడుకు రాజయ్య దగ్గరికి యూసుఫ్ పోయి"ఔ రాజయ్య ఏర్పాట్లు అన్నీ అవుతున్నాయా? ఎవరు చూస్తున్నారు?" అడిగిండు. రాజయ్య యూసుఫ్ ను పట్టుకొని 'మామా అంటూ బొట బొటా కండ్ల నుంచి నీళ్లు కారంగా విలపించాడు. అన్ని ఏర్పాట్లను మా పెద్దత్త భర్త చూస్తున్నాడని ఆయన వైపు చూపించాడు.

మిగతా నలుగురు వెంట రాగా అల్లుడా మల్లన్నకు సంబంధించిన ఈ పది రోజుల ఖర్చు అంతా మేమే పెట్టుకుంటము అంటూ జేబులోంచి 50000 రూపాయలకట్ట తీసి ఆయన చేతిలో పెట్టారు. ఆయన కండ్ల నుంచి మౌనంగా కన్నీళ్లు వడుపుతూ పైసలు తీసుకొని, రెండు చేతులు ఎత్తి దండం పెట్టాడు .

ఐదు పది నిమిషాలు ఉండి మళ్లీ వస్తామని చెప్పి, వచ్చినంత వేగంగా ఎటో పోయారు. మల్లయ్య అంత్యక్రియలకు సంబంధించిన పనులు వేగవంతమయ్యాయి. తలారి వచ్చి పాడె కడుతున్నాడు. డప్పుల చప్పుడు చేస్తున్నారు. "ఎవరయ్యా జెర పక్కకు జరుగుండ్రి. బోరింగ్ కాడికి పోయి రాజయ్య స్నానం చేసి రావాలె " ఒక పెద్ద మనిషి గట్టిగానే చెప్పాడు. అందరూ పక్కకు జరిగి దారి ఇచ్చారు. బోరింగ్ దగ్గర స్నానం చేసి తడి బట్టలతోని కుండలో తెచ్చిన నీళ్లు మూలకు అంటుకున్న కట్టెల నిప్పుల మీద రాజయ్యతో పెట్టించారు. పెద్ద మనుషులు 'ఒక్కనాటితో తీరిపోయేదా ఈ ఎత కానీ ఇక కానీ తొందరగా' అంటున్నారు.

మల్లక్క తల్లి గారోళ్లు వచ్చిండ్రా పెద్ద ముత్తైదువ అడుగుతుంది. ఆ ఆ వచ్చిండ్రు మందిలో నుంచి ఎవరో జవాబు ఇచ్చారు . ముందటి వాకిట్లో కుర్చీ వేయిండ్రి. మల్లన్నకు ఆఖరి స్నానం చేపియ్యాలి . అనుడే ఆలస్యం లోపలికి నలుగురు పోయి మల్లయను ఎత్తుకొచ్చి కుర్చీలో కూర్చుండ పెట్టారు. "అరే మల్లన్న కొడుకు ఎటు పోయిండు ఆ గోరువెచ్చని నీళ్ల పటువ పట్టుకు రాపో" పెద్దమనిషి అన్నాడు. చప్పుడు ఛప్పుడు ఎవరో గట్టిగా చెప్పారు. ఆరు జతల డప్పుల చప్పుళ్లు జోరు మీద కొడుతుండ్రు. ఎవరో పెద్దమనిషి చేతిలో పెద్దమనిషి చావు సామాన్ల సంచి తీసుకొని వచ్చిండు. రాజయ్య వేడి నీళ్లు తీసుకువచ్చి మల్లయ్య నెత్తిమీద పోస్తుంటే మిగతావారు పెయ్యి రాస్తున్నారు. మల్లయ్య కాయిస్ పడే చార్ పంజా దోతి నడుము చుట్టూ గట్టిగా కట్టారు. భుజం మీద దుబ్బాక ఎర్ర గీతల తువ్వాల ఒకరు వేశారు .ఇంకొకరు మల్లన్నోళ్లు తిరుమన్ దార్లా విబూతిదార్లా అని అడిగాడు. ఇంతలో పాడే కట్టడం పూర్తి అయింది. లోపల మల్లవ్వ గొడగొడ ఏడువంగా తల్లిగారు తెచ్చిన ఒడిబియ్యాన్ని కొంగులో పోసి నడుముకు చుట్టి గట్టిగా కట్టారు .సిగలో చివరిసారి మల్లెపూల దండ పెట్టిండ్రి.

ఇంతలో బయటకు పోయిన సార్లు నలుగురు గప్ప గప్ప తాగిన వాసన రాగా లోపలికి వచ్చారు. 10 గజాల పెద్ద పెద్ద పొడుగైన బంతిపూల దండలు బుట్టిలో పెట్టుకొని తీసుకొచ్చారు. తలారి బంతిపూల బుట్టి తీసుకున్నాడు. ఈ మధ్యన మల్లయ్యను నలుగురు మోసుకొచ్చి పాడె మీద పడుకో పెట్టారు. తలారి మీది నుంచి బంతిపూల దండ మొత్తాన్ని చుట్టి దారం చివర్లను కట్టెలకు కట్టాడు.

అందరూ సంధిలోంచి బజారులోకి నడిచారు. మల్లవ్వ పెద్ద దర్వాజా దాటింది.గోవిందాగోవిందా అంటూ నలుగురు నాలుగు దిక్కుల పాడెను ఎత్తుకున్నారు. అందులో నుంచే ఒక పెద్ద మనిషి అరేయ్ గోవింద కాదురా శివా శివా.అనాలె చెప్పాడు. ముందట మల్లన్న కొడుకు రాజయ్య జనప దారాలతో కట్టిన ఉట్టి మీద పెట్టిన నిప్పుల కుండను పట్టుకొని నడుస్తున్నాడు . వాళ్ల బామ్మర్ది దండ రెక్క పట్టుకొని దీము చెప్పుకుంటూ నడిపిస్తున్నాడు. ఒకతను విభూతి పండు చేతితో రాసుకుంటూ వచ్చిన వారి నొసల్లకు మూడు గీతాలుగా పూస్తున్నాడు. తెల్లగా అందరి నొసళ్ళు ఎండకు మెరిసిపోతున్నాయి. డప్పులు ముందుకు కదిలాయి. వెనుక పాడె ఎత్తుకున్నోళ్లు ఇరుకుటం సంధిలో నుంచి పదిలంగా నడుస్తున్నారు. ఆ వెనుక మల్లమ్మ ఆడబిడ్డలు చుట్టాలు పక్కాలు వాడకట్టుల్లో ఊరి కులపోళ్ళు అందరూ కదిలారు. మల్లవ్వ 'ఓ అయ్యా నా గతి ఎట్లా' అని బిగ్గరగా ఏడుస్తుంది.

శవయాత్ర 'శివా శివా' ధ్వనుల మధ్య మెల్లగా కదిరింది. అంతసేపు దుఃఖాన్ని ఉగ్గ పట్టుకున్న రాజలింగయ్య" ఓ మల్లన్నా పోతున్నావే" దిక్కులు ప్రతిధ్వనించేలా ఏడుస్తున్నాడు. అందరూ ఎవరెవరు వస్తున్నారు అన్నట్టు వెనుకకు తిరిగి చూస్తున్నారు. అంతటితో ఆగకుండా రాజలింగయ్య "వదినే ఎంత పని మల్లన్న చేసిపాయె" అని నడి రోడ్డు మీదనే మల్లవ్వ కాళ్ళ మీద పడ్డాడు. ఎవరు ఎంత చెప్పినా కాళ్లు విడిచిపెడుతలేడు ఎవరినీ ముందుకు కదలనిస్తలేడు.

అంబేద్కర్ చౌరస్తా వచ్చింది. ఎవరో పదివేల పటాకల శేరు ముట్టించారు. టప టపా శబ్దాలు చేస్తూ పేలుతున్నాయి. గంధకం వాసన వాతావరణమంతా పైలాయించింది. మొగోళ్ళు తువ్వాళ్లతో, ఆడోళ్ళు కొంగులతో ముక్కులు మూసుకుంటున్నారు. ఎవరో సారు 50 రూపాయల నోటు డప్పు కొట్టే వాళ్ళ మధ్యలో మట్టిలో సుట్ట సుట్టి పెట్టాడు. 12 మంది డప్పులు కొట్టేవాళ్ళు రౌండ్ గా తిరుగుకుంటూ కాళ్ల గజ్జలు శృతిగా వినిపిస్తున్నాయి. దరువు మార్చి కొడుతున్నారు. అందులోంచి ఒక యువకుడు డప్పు కొట్టుకుంటూనే వంగి పంటితో నోటును అందుకున్నాడు.

ఈమధ్య బోనాల దేవయ్య వచ్చి రెండు చేతులా రెండు పొడుగాటి కంక కట్టెలను తీసుకొని నేర్పుగా ఒడుపుగా కర్ర సాము ఖాళి స్థలంలో తిరుగుకుంటూ చేస్తున్నాడు. నోట్లో రెండు చెయ్యిల వేళ్ళు పెట్టి విజిల్ కొడుతున్నారు. చుట్టాలు స్నేహితులు ఎంతమంది ఉన్నారో అంతకు మూడు రెట్లు జనం గుమి గూడారు . మల్లన్న కుటుంబ సభ్యుల ఏడుపు ఈ చప్పుళ్ల మధ్య పీలగా వినిపిస్తున్నది. ఇప్పటి లెక్క ఘంటసాల గీత శ్లోక తాత్పర్యాలు , వైకుంఠరథాలు ,ధామాలు అప్పుడు ఉండేవి కావు. మల్లన్న శవయాత్ర పెండ్లి బరాత్ కంటే వైభవంగా మెల్లగా ముందు నడుస్తున్నది . కంటె బొక్క నొప్పి పెట్టగా పాడే ఎత్తుకున్న వారు భుజాలు మార్చుకున్నారు .

డప్పులు కొట్టేవాళ్ళు దమ్ముకొచ్చారు. మెల్లగా చప్పుడు కొట్టుకుంటూ ముందుకు నడిచారు. శవయాత్ర మున్సిపల్ దాటి, గాంధీ చౌరస్తా వైపు కదిలింది. చౌరస్తా రాగానే చింతకుంట పోశెట్టి బ్యాండ్ తీన్మార్ చప్పుడు ఇద్దరు పట్టుకొని వచ్చి ఊరేగింపులో కలిశారు. చౌరస్తా రాగానే డప్పులు కొట్టేవాళ్ళు గుండ్రంగా తిరుగుకుంటూ, కాళ్ల గజ్జలకు లయబద్ధంగా దుముకుతున్నారు, చప్పుడు ప్రతిధ్వనిస్తుంది. తీన్మార్ వాళ్లు మధ్య కొచ్చి చప్పుడు కొడుతున్నారు. రాజలింగయ్య ఎక్కడికి వెళ్లి వచ్చిండేమో కానీ మధ్య కొచ్చి తన పొడవాటి వెంట్రుకలను విరబోసుకొని డ్యాన్స్ చేస్తున్నాడు. దేవయ్య సీసలోంచి గ్యాస్ నూనెను నోటి నిండా వంచుకొని అగ్గిపుల్ల గీకి ఉఫ్ అని ఊదాడు. మంట ఆకాశంలోకి బగ్గున లేచింది. ఒకవైపు తీన్మార్ సప్పుడు మరోవైపు డప్పుల దరువు వినసొంపుగా సాగుతుంది. చుట్టూ నాలుగైదు వేల మంది మల్లన్న శవయాత్రను ఇచ్చంత్రంగా చూస్తున్నారు. తెలిసినవారు మల్లయ్య బంగారి చావు చచ్చిండనుకుంటూ శవానికి రెండు చేతులా దూరం నుంచే దండం పెట్టుకుంటున్నారు.

రాజలింగయ్య తీన్మార్ డాన్స్ చెమటలు కక్కుకుంటూ ఇరాం లేకుండా చేస్తున్నాడు. బోనాల దేవయ్య కట్టెలతో రెండు చేతులా సాము సుతారంగా చేస్తుండు. అర్ధగంట అయింది. శవయాత్ర మాంచి ఊగులు ఊగుతున్నది. అయినా రాజలింగయ్య, దేవయ్యలు ఎంత సముదాయించి చెప్పినా ఆగుతలేరు ఎవరి మాట వినడంలేదు.

ఇది గమనించి ఆబిద్ వచ్చి ఇద్దరి చెరో రెక్క గట్టిగా పట్టుకొని బయటకు తీసుకొచ్చాడు. రఘుపతి దగ్గరికి వచ్చి వారికి రెండు మద్యం సీసాల ఆఫ్ లు, రెండు వాటర్ ప్యాకెట్లు ,రెండు ప్లాస్టిక్ గ్లాసులు, 100 గ్రాముల కారా పొట్లం ఇచ్చాడు. రాజలింగయ్య దేవయ్య వాటిని తీసుకొని పక్క సందులోకి పోయి ఇంటి గద్దెల మీద కూర్చొని తీరిగ్గా తాగుతున్నారు.

తీన్మార్ డప్పు చప్పుడు కొట్టే వాళ్లు బాగా తకాయించి అలసిపోయారు. శవ యాత్రను ముందుకు నడవనీయమని ఇంటి వాళ్ళు బతిమిలాడుతున్నారు. అగ్గి పట్టుకున్న మల్లయ్య కొడుకు ఎవరిని ఏమీ అనలేక బీరిపోయి చూస్తున్నాడు. తోటి ఉద్యోగులు ఆ ఇద్దరిని పక్కకు తీసుకపోయేసరికి నడక ముందుకు సాగింది.

సెస్ ఆఫీస్ దాటి పోలీస్ స్టేషన్ దగ్గర చప్పుడు ఆగింది. శవ యాత్ర నిశ్శబ్దంగా బాలికల ఉన్నత పాఠశాల మీదుగా ముందుకు సాగింది .తర్వాత చప్పుళ్ళు మళ్ళీ మొదలైయ్యాయి.

సిరిసిల్ల పట్టణంలో చనిపోతే దహనమైనా, ఖననమైనా మానేరు వాగులోనే చేస్తారు . మల్లయ్య అంతిమ యాత్ర ను కూడా వాగులోకి తీసుకుపోయే ముందు మామిడి చెట్టు నీడకు 'దింపుడు కళ్ళం ' కోసం శవాన్ని దించారు. మల్లవ్వ ఒడి బియ్యం కొంగుముడిని ఎవరో పెద్ద ముత్తయిదువ ఇప్పింది. బిడ్డలు అల్లుళ్ళు కొడుకు, కోడలు మనుమలు మనుమరాళ్లు ఒక్కొక్కరుగా మల్లయ్య కాళ్లకు మొక్కి, గొంతులో దుఃఖం ఎక్కివెక్కి రాగా పక్కకు తప్పుకుంటున్నారు .

ఎక్కడి నుంచి వచ్చారో కానీ సార్లు ఒక్కసారి మల్లయ్య శవం మీద పడి గోడు గోడునా ఏడుస్తున్నారు. తమకు మల్లయ్య కు ఉన్న నాలుగు దశాబ్దాల ఆత్మీయ అనుబంధాన్ని వైనవైనాలుగా తలుచుకొని తలుచుకొని దుఃఖిస్తున్నారు. ఆఖరి సారి చూద్దామనుకునే చుట్టాలకెవరికీ అవకాశం ఇవ్వడం లేదు. ఓ సార్లు జెర మల్లన్న ముఖం చూసుకోనిస్తారా ?లేదా? పక్కకు జరుగుండ్రి. శవం దగ్గరి నుంచి వచ్చి వదినే అంటూ మల్లవ్వ మీద పడి ఏడుస్తున్నారు. ఎవరో పెద్దమనిషి కొడుకు రాజయ్యను తీసుకువచ్చి మల్లయ్య చెవిలో 'నారాయణ' 'నారాయణ' అని ఐదుసార్లు పిలువమన్నారు. పిలుచుడు అయిపోగానే ,ఎవరో మల్లవ్వ మెడలో ఉన్న గుండ్ల పేరు లోంచి ఒక బంగారు గుండును తీసుకొచ్చి మల్లయ్య నోట్లో పెట్టారు. ముందు ఉన్నవాళ్లు వెనుకకు, వెనుక వాళ్ళు ముందుకు పాడె మోసేందుకు మారారు. భుజాల మీద ఎత్తుకొని' శివ శివా' అంటున్నారు.

నాగులో ఒక పాయ నీళ్లు పారుతున్నాయి. దాటి ముందుకు పోతే ఇసుక తిన్నె మీద బండెడు ఎండు కట్టెల తో కాడును పేర్చారు. ఎట్లా తెలిసిందో ,ఎవరు చెప్పారో కానీ సరైన సమయానికి వచ్చి కాటిపాపల వాళ్లు ఇనుప గంటలు ఊపుకుంటూ ప్రత్యేక ఆహార్యంతో ఏదో చదువుతున్నారు. గంగిరెద్దుల వాళ్లు మెడలో డోలు కొట్టుకుంటూ మల్లయ్య జీవిత విశేషాలు ఏకధాటిగా ఎత్తిపోస్తున్నారు. కుటుంబ సభ్యులు చుట్టాలు స్నేహితులు వెంట రాగా మల్లయ్య పాడెను ఎత్తుకొని నీటిపాయ దాటుతున్నారు.

అంతే రాజలింగయ్య ఎక్కడికి వెళ్లి వచ్చిండో తెలువదు. సరసర పోయి కాడు మీద పడుకొని మల్లన్నతో తాను కాలుతానని పట్టుపడుతున్నాడు. తలారి దిగమని ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. కాటిపాపల ,గంగిరెద్దుల వారి హంగు ఆర్భాటం లొల్లి ఎక్కడికో పోయింది. చప్పుళ్లు ఎక్కడికక్కడ అయిపోయాయి. ఏడ్చేవాళ్ళు చోద్యంగా చూస్తున్నారు.. కాడు మీద పడుకున్న రాజలింగయ్యను అందరూ వింతగా చూస్తూ లోపల్లోపల ఆడి పోసుకుంటూ తిట్టుకుంటున్నారు.

రాజలింగయ్య తనకు కొత్తగా ఉద్యోగం వచ్చినప్పుడు కరీంనగర్ నుంచి వచ్చి సిరిసిల్ల బస్టాండ్లో దిగగానే" ఊరూ ఎలాంటి పరిచయం డిపాజిట్ అడగకుండానే సైకిల్ కిరాయకు ఇచ్చినవే మల్లన్నా! నీది అవ్వల్ దర్జా రామసక్కనీ గుణమే" అంటూ దఫా దఫాలుగా వల్లించుకుంటూ కన్నీరు మున్నీరులా ఏడుస్తున్నాడు. మిగతా ఉద్యోగులు రాజన్నా దిగమని బతిమిలాడుతున్నారు. మల్లయ్య కొడుకు రాజయ్య మామా నీ బాంచను జెర దయ జూపి దిగవే అని వేడుకుంటున్నాడు.

తలారి రాజలింగయ్యను సుంకరి కట్టతో పొడుస్తూ దిగమని బెదిరిస్తున్నాడు . ఇటు మల్లయ్య కోసం ఏడ్చుడో,

అటు రాజలింగయ్య కోసం బాధపడుడో ఎవ్వరికి అర్థం కావడం లేదు .

చుట్టాలు, తోటి ఉద్యోగులు అందరూ బాధపడుతూ పిలుస్తుంటే రాజలింగయ్య సైకిల్ ఉద్దెరకు ఇచ్చినవే మల్లన్నా పోతున్నావే" రెడ్డబోయిన మల్లయ్య క్రమంగా ఎట్లా ఉద్దెర మల్లయ్య అయిన తీరు చెప్పకనే తెలియ చెప్తున్నాడు కళ్ళ నుంచి దారాపాతంగా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, రాజ లింగయ్య బలవంతంగా కాడు దిగాడు. ఇసుకలో బొర్రుకుంటూ రోధిస్తున్నాడు.


Read More
Next Story