జైన పురాణాల వెలుగులో కౌసల్యా, దశరథుల సంబంధం
x
Jain Ramayanam (Source: encyclopediaofjainism)

జైన పురాణాల వెలుగులో కౌసల్యా, దశరథుల సంబంధం

రామాయణంలో నిరుత్తరకాండ-15 జైన రామాయణం అంటే ఏమిటి? అది చెప్పే కథేమిటి?


మన పురాణ, ఇతిహాసకథలు పూర్తిగా మనవేననీ, మన నేల మీదే అవతరించాయనే భావన ఈరోజున మనలో చాలా బలంగా నాటుకుపోయింది. మనమూ, మన దేశమూ, మన మతమూ, మన సంస్కృతీ వగైరా సరిహద్దులు గట్టిపడి, అవి మన చూపులకు కూడా సరిహద్దులు ఏర్పరచడం దీనికి ప్రారంభమనిపిస్తుంది. అసలు సంగతేమిటంటే, ఇలాంటి కచ్చితమైన సరిహద్దులు ఏర్పడని కాలంనుంచే ఆయా పురాణ, ఇతిహాసకథలూ, లేదా కథాంశాలూ అనేక మూలలనుంచి వ్యాపిస్తూ, ఒకదానికొకటి ఇచ్చి పుచ్చుకుంటూ స్థానికతకు అనుగుణంగా రూపాంతరం చెందుతూవచ్చాయి. అలా వాటిమధ్య తేడాలతోపాటు ఎన్నో మౌలికమైన పోలికలూ కనిపిస్తాయి.

ప్రాచీన మెసపొటేమియా, ఈజిప్టు, గ్రీకు, సింధు నాగరికతలకు చెందిన పురాణకథలు, తాత్వికతలు, దేవీదేవతల మధ్య జరిగిన ఇలాంటి ఆదానప్రదానాల గురించి ఎంతోమంది పండితులు విస్తారంగా రాశారు. ఈ వ్యాసకర్త రచించిన ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’, ‘ఇవీ మన మూలాలు’ లో కూడా వాటి పరిశీలనను చూడవచ్చు.

ప్రస్తుతాంశానికి వస్తే, ఈరోజున ఒక దేశంగా సరిహద్దులు ఏర్పడిన ప్రదేశంలోని భిన్న మతాలు, భాషలు, సంస్కృతుల మధ్య కూడా ఇలాంటి ఆదానప్రదానాలే జరుగుతూవచ్చాయి. ఉదాహరణకు, రామకథ ఇతర దేశాలలో వ్యాప్తిలో ఉన్నట్టే; ఈ నేల మీద అవతరించిన జైన, బౌద్ధమతాలలో కూడా వ్యాప్తిలో ఉన్నట్టు ఇంతకుముందు చెప్పుకున్నాం. తరతరాలుగా జాతివారసత్వంలో భాగమైన రామకథకు వైదికధర్మాన్ని అనుసరించేవారేకాక, బౌద్ధులూ, జైనులూ కూడా వారసులేననీ, ఈ మూడు మతాల పూర్వీకులు ఒక్క కుదురులోంచి వచ్చినవారేననీ ఆరుద్ర తన ‘రాముడికి సీత ఏమవుతుంది’ అనే రచనలో అన్న సంగతిని కూడా (రామాయణంలో నిరుత్తరకాండ-13) ప్రస్తావించుకున్నాం.

ఆపైన, మన ప్రాచీనచరిత్రను అర్థం చేసుకోవాలంటే వైదిక, బౌద్ధమతాలకు అనుబంధాలైన పురాణ, ఇతిహాసాలతోపాటు జైన పురాణాలను, సంప్రదాయాలను కూడా అధ్యయనం చేయాలని ఆయనే మరోచోట అంటారు. అలాగే, జైనపురాణాలను వైదికార్యుల ఇతిహాసాలతో, బౌద్ధగాథలతో తులనాత్మకంగా పరిశీలిస్తే చాలా కొత్త వ్యాఖ్యానాలకు అవకాశాలు కలుగుతాయని, జైన పురాణాలు వైదికార్యుల అష్టాదశపురాణాలకు దగ్గరలో ఉంటాయని, రెండింటిలోనూ కొందరు వ్యక్తుల పేర్లు, చరిత్రలు సమానంగానే ఉంటాయని కూడా ఆయన అంటారు. ఇరవై నలుగురు జైన తీర్థంకరులలో ప్రథముడైన ఋషభుడి పేరును ఈ సందర్భంలో ఆయన ఉదహరిస్తూ, విష్ణువు ధరించిన ఇరవైరెండు లీలావతారాల్లో ఎనిమిదవ అవతారంగా భాగవతం ఇతనిని పేర్కొందనీ, విష్ణుపురాణంలోనూ ఆ పేరు కనిపిస్తుందనీ అంటారు.

ఆయనే చెప్పిన ప్రకారం, జైనగ్రంథాలలో ‘ఆదీశ్వర చరిత్ర’ ముఖ్యమైనది. ఇదే ఋషభనాథుని చరిత్రను విపులంగా చెబుతుంది. ఇది హేమచంద్రసూరి రచించిన ‘త్రిషష్టిశలాకాపురుషచరిత్ర’ అనే పదిపర్వాల పురాణంలో ప్రథమపర్వం. ఇందులోని ఏడవ పర్వంలోనే జైనరామాయణకథ ఉంది. ఈ ఋషభుని పేరు మరో ముఖ్యమైన సందర్భంలో కూడా ఈ వ్యాసాలలో ప్రస్తావనకు రాబోతోంది కనుక, ఆ పేరును గుర్తుపెట్టుకుని ముందుకు వెడదాం.

కౌసల్యను బంగారు పెట్టెలో ఉంచడం గురించి కిందటిసారి మనం చెప్పుకున్న కథనాన్ని, ‘పెట్టెలో దొరికిన దెవరు, సీతా, కౌసల్యా’ అనే శీర్షిక కింద ఆరుద్ర కూడా చర్చించారు. అసలీ పెట్టెలో పెట్టడం, లేదా పెట్టెలో దొరకడం గురించిన మూలాలు దిగంబర జైనుల రామాయణంలో ఉన్న సంగతిని ఆయన సీత గురించిన సందర్భంలో ఎత్తిచూపారు. కౌసల్య గురించి చెప్పుకుంటూ, ఇంకా పుట్టని సీత ప్రసక్తి తేవడం ఒకింత విషయాంతరమే కానీ, జైన, బౌద్ధరామాయణాలు; వాల్మీకి, వాల్మీకేతర వైదికరామాయణాల మధ్య పోలికల గురించి చెప్పుకుంటున్న సందర్భం కనుక అనివార్యమవుతోంది. దిగంబర జైన రామాయణ కథనం ఇలా ఉంటుంది:

రావణుడు పూర్వజన్మలో ‘సారసముచ్చయ’ దేశంలో వరదేవుడిగా పుట్టాడు. ఆ మరుసటి జన్మలో ‘సౌధర్మకల్పం’లో దేవమూర్తిగా జన్మించాడు. ఆ తర్వాత లంకాధిపతి అయిన పులస్త్యుడు, మేఘశ్రీ దంపతులకు కొడుకుగా ప్రభవించాడు. పెరిగి పెద్దయిన తర్వాత అతను ఒకరోజున తపస్సులో ఉన్న మణిమతి అనే ఓ అందగత్తెను చూశాడు. ఆమెను పొందాలనుకున్నాడు. మణిమతి ఆగ్రహించి, నీకే నేను కుమార్తెగా జన్మించి నిన్ను సంహరిస్తానని శపథం చేసింది. చనిపోయి రావణుని భార్య అయిన మండోదరి గర్భంలో ప్రవేశించింది. కొన్నాళ్ళకు మండోదరి ఆడబిడ్డను ప్రసవించింది. లంకలో అపశకునాలు పుట్టాయి. అందుకు ఆ బిడ్డే కారణమనుకుని ఆ బిడ్డను ఓ పెట్టెలో ఉంచి దానిని పారేయమని మారీచుడి చేతికిచ్చారు. మారీచుడు దానిని తీసుకెళ్లి మిథిలానగరంలోని ఉపవనానికి దగ్గరలో ఉన్న ఒక శ్మశానంలో పాతిపెట్టాడు. మిథిలాధిపతి అయిన జనకుడు యాగం చేయడం కోసం భూమిని పరీక్షిస్తుండగా ఆ పెట్టె బయటపడింది. అందులోని బిడ్డను జనకుడు తీసుకుని సీత అని పేరుపెట్టి తన భార్య వసుధాదేవికి అప్పగించాడు...

సీత పుట్టుక గురించి జైనుల్లోనే శ్వేతాంబరుల కథనం దీనికి భిన్నంగా ఉంటుంది. అందులో సీత జనకుడికీ, అతని భార్యకూ సహజంగానే జన్మిస్తుంది. అదలా ఉంచితే, ఆంధ్ర, తమిళ, కర్ణాటకప్రాంతాల్లో పూర్వం దిగంబర జైనశాఖ బలంగా వ్యాపించింది కనుక వాళ్ళ పురాణకథలన్నీ జనంలోకి వెళ్ళాయనీ, దక్షిణాది కవులు వాల్మీకి రామాయణాన్నే అనువదిస్తున్నా విధిగా జైనరామాయణ ఘట్టాలను తమ కావ్యాలలో చొప్పించక తప్పలేదనీ ఆరుద్ర అంటారు.

వాల్మీకి రామాయణానికి వస్తే, జనకుడు భూమి దున్నుతుండగా సీత అయోనిజగా పెట్టెలో కనబడినట్టు చెప్పింది కానీ, ఆ పెట్టె ఎక్కడినుంచి వచ్చింది, ఎలా వచ్చిందన్న ప్రశ్నలకు అందులో జవాబులు దొరకవని ఆయన అంటారు. బాలకాండలో సీత పుట్టుక గురించిన వివరణ ఎక్కడా కనబడదనీ, అయోధ్యాకాండ చివరిలో అనసూయకు సీత స్వయంగా తన కథ చెప్పుకుంటూ జనకుడు దున్నుతున్న భూమిని చీల్చుకుని తను వచ్చానంది తప్ప పెట్టెలో దొరికినట్టు చెప్పలేదనీ అంటారు. బ్రహ్మవైవర్త పురాణమూ, ఆనందరామాయణమూ కూడా ఈ పెట్టె కథను తీసుకున్నాయనీ, కాకపోతే ఆనందరామాయణం ఇదే కథను కౌసల్యకు కూడా పొడిగించిందనీ ఆరుద్ర అంటూ, ఆ రామాయణం గురించి మరికొన్ని వివరాలు ఇచ్చారు.

వాటి ప్రకారం, ఆనందరామాయణం మహారాష్ట్రలో పుట్టి ప్రాచుర్యం పొందింది. తనను కూడా వాల్మీకి చెప్పినదిగానూ, వందకోట్ల రామకథలలో భాగంగానూ అది చెప్పుకుంది. అందులోని కౌసల్య వివాహకథనే వావిలకొలను సుబ్బారావు గారు ‘కౌసల్యా పరిణయం’ పేరుతో ప్రబంధంగా రచించారు. అంతకంటె ముందే పండరి విఠలరావు అనే కవి కౌసల్యా పరిణయంతోపాటు మహారాష్ట్రలో ప్రాచుర్యంలో ఉన్న మరికొన్ని కథలను యక్షగానంగా రాశారు...

***

ఇలాగే బౌద్ధ రామాయణాలు; వాల్మీకి, వాల్మీకేతర రామాయణాల మధ్య గల తేడాలను, పోలికలను కూడా ఆరుద్ర తన పుస్తకంలో చర్చించారు. సందర్భానుసారం బౌద్ధరామాయణాంశాల గురించి కూడా చెప్పుకుందాం. వీటి గురించి ఇంతగా ప్రస్తావించడానికి కారణం, ఆరుద్ర పుస్తకాన్ని మీరు నేరుగా చదవి తెలుసుకోలేరనీ కాదు; కొందరు ఇప్పటికే చదివి ఉండరనీ కాదు; ‘కౌసల్య పేరును బట్టి మొదటే కోసలపుత్రిక అయినప్పుడు దశరథుడు కోసలరాజు ఎలా అయ్యా’డని ఈ వ్యాసపరంపర ప్రారంభంలో వేసుకున్న ప్రశ్నను సమాధానం దిశగా ఏ కొంచెమైనా ముందుకు నడిపించడానికి ఈ పూర్వరంగం తప్పనిసరి కనుకనే!

పై ప్రశ్నకు రెండు మార్గాలలో సమాధానాన్ని అన్వేషించే అవకాశముంది. మొదటిది, వాస్తవానికి కౌసల్యాదశరథులు ఒకే వంశానికి చెంది ఉండి, ఆ విధంగా వారి మధ్య దూరంగానో, దగ్గరగానో సోదరీ, సోదర సంబంధం ఉండవచ్చునా అన్నది; రెండవది, ఇంతకుముందు కొన్ని కథలను బట్టి చెప్పుకున్నట్టుగా కౌసల్య మొదటే కోసలరాణి కాగా, దశరథుడు ఆమెను పెళ్లాడి, కోసలరాజ్యానికి అల్లుడిగా ఆ రాజ్యాన్ని పొందాడా అన్నది!

అయితే, ఇక్కడ ముందే ఒక స్పష్టీకరణ అవసరం. ఇది పై ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషించే ప్రయత్నమే తప్ప ఇదే నిజమని నిర్ధారణ చేసే ప్రయత్నం కాదు. అసలు ఇలాంటి ఒక ప్రశ్నకు అవకాశముందని గుర్తించడమే ప్రస్తుతానికి ఇందులో కీలకం. గుర్తించిన తర్వాత ఎవరికి వారే సమాధానాన్ని అన్వేషించుకోవచ్చు.

ఆరుద్ర తన పుస్తకంలో, పైన చెప్పిన మొదటిమార్గమైన సోదరసోదరీసంబంధకోణాన్నే విశేషంగా చర్చించారు. ‘రాముడికి సీత ఏమవుతుంది’ అనే ప్రశ్నకు ఆయన అన్వేషించిన సమాధానం ఆ దిశగానే సాగుతుంది. ఇందుకోసమే ఆయన జైన, బౌద్ధరామాయణాంశాలను విస్తృతంగా ఉటంకించారు. ‘జైన గ్రంథాలలో తొలి వావివరరుసలు’ అనే శీర్షిక కింద ఆయన ప్రస్తావించిన విషయాలు ఇలా ఉంటాయి:

మన పురాణ, ఇతిహాసాల్లో కాలాన్ని యుగాలుగానూ, కల్పాలుగానూ చేసే విభజన లాంటిదే జైన మత గ్రంథాలలోనూ ఉంటుంది. వాటి ప్రకారం కాలచక్రపరిభ్రమణం రెండు మహత్తర యుగాల మీదుగా సాగుతుంది. కాలచక్రం కిందికి దిగడాన్ని చెప్పే మొదటి యుగాన్ని ‘అవసర్పిణి’ అంటారు; పైకి వెళ్ళే రెండవ యుగాన్ని ‘ఉత్సర్పిణి’ అంటారు. కాలచక్రానికి ఆరు కమ్ములు ఉంటాయి. వాటిని ‘అరము’లంటారు. అవసర్పిణి యుగంలో మంచివన్నీ క్రమంగా అంతరిస్తూ చెడ్డవాటికి చోటు ఇస్తాయి. ఉత్సర్పిణి యుగంలో దీనికి విరుద్ధంగా జరుగుతుంది. ఈ రెండు యుగాల మీదుగా కాలచక్రం ఒక పరిభ్రమణం ముగించడానికి ఇరవై కోటి కోటి ‘సాగరోపమ’ సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం జరుగుతున్నది అవసర్పిణి యుగంలోని అయిదవ అరం. ఇది 22వేల సంవత్సరాలు ఉంటుంది. మన పురాణ, ఇతిహాసాలు చెప్పే కృత, త్రేత, ద్వాపర, కలి అనే నాలుగు యుగాల చక్రభ్రమణం కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది.

జైనులకు ఉన్న 45 పవిత్రగ్రంథాలలో ‘జంబూద్వీప ప్రజ్ఞాప్తి’ అనేది ఒకటి. అందులో తొట్టతొలి అరం తాలూకు వర్ణన ఉంది. దాని ప్రకారం, అప్పుడు భారతక్షేత్రం చాలా మనోహరమైన దేశం. భూమి సమతలంగా ఉండేది. ఆ సత్యకాలంలో అందరూ దయాధర్మంతో ఉండేవారు, కల్పవృక్షచ్ఛాయలో జీవించేవారు. అది కోరినవన్నీ ఇచ్చేది. అందరూ ఆజానుబాహువులు గానూ, దృఢకాయులుగానూ ఉండేవారు. ఆనందంగా, తృప్తిగా గడిపేవారు. వాళ్ళ ఆయుర్దాయం లక్షలు, కోట్ల సంవత్సరాలు ఉండేది. మన పురాణాలు చెప్పే కృతయుగలక్షణాలు కూడా ఇలాగే ఉంటాయి. ఆపైన జైనగ్రంథాలు చెప్పే ఆ తొలి అరం కాలంలో జనాభా తక్కువగా ఉండేది. యవధాన్యం, చెరుకుగడలు పుష్కలంగా పందేవి. వాటినెవరూ తినేవారు కాదు...

తిననప్పుడు ఎందుకు పండించేవారన్న ప్రశ్నను అలా ఉంచితే, ప్రస్తుత సందర్భానికి మనకు అవసరమైన ముఖ్యవివరం ఏమిటంటే, ఆ కాలంలో మనుషులను యుగళాలుగా… అంటే జంటలుగా పిలిచేవారు. ఎందుకంటే, అందరికీ ఒక కొడుకూ, కూతురూ కవల బిడ్డలుగా పుట్టేవారు. వారు పెరిగి పెద్దయ్యాక భార్యాభర్తలయ్యేవారు!

సృష్టిలో ఇది సహజమని ఆరుద్ర అంటూ, రాబర్ట్ బ్రిఫాల్ట్ రాసిన ‘ది మదర్’ అనే పుస్తకం, తొలి సంపుటం నుంచి ఒక పేరాను ఉదహరిస్తారు. దాని ప్రకారం, ఆఫ్రికన్ రీడ్ బక్, జింకల్లో చిన్న జాతులు, ఎర్ర లేళ్ళు, ఆడపులులు సాధారణంగా ఆడ, మగ కవలలను ఈనతాయి. యుక్తవయసు రాగానే అవి జత కూడి సంతానాన్ని కంటాయి. సృష్టిలోని ఈ యుగళజీవితాన్ని గమనించే జైనులు తమ పౌరాణిక ఊహలను మలచుకుని ఉంటారని ఆరుద్ర అంటారు.

రెండవ అరం దగ్గరికి వచ్చేసరికి మంచివన్నీ అంతరించడం మొదలుపెట్టాయి. ఆజానుబాహుత్వమూ, ఆయుర్దాయమూ తగ్గుతూ వచ్చాయి. యుగళాల సంఖ్య పెరిగింది. అసూయా, ఆశా ప్రజల మనసులో ప్రవేశించాయి. కుటుంబాలు వృద్ధి చెందాయి. మూడవ అరం ముగిసేనాటికి ఏడుగురు కులకారులు ఉండేవారు. వాళ్ళే ఆయా కుటుంబాల మూలపురుషులు. వాళ్ళే యుగళాలకు నీతినియమాలను నిర్దేశించేవారు. అంటే, మనకు తెలిసిన మనుస్మృతి లాంటివి కూర్చేవారన్నమాట.

ఏడవ కులకారుడైన నాభి కొడుకే, మనం పైన ఒకసారి ఉదహరించుకున్న ఋషభుడు. అతనిది కశ్యపగోత్రం. అతనికోసం ఇంద్రుడు చెరుకుగడలు తెచ్చి ఇచ్చాడు. ఋషభుడు వాటిని ఆరగించాడు. ‘ఇక్షు’ అంటే సంస్కృతంలో చెరుకు. ఋషభుడు చెరుకుగడను తినడంవల్ల అతని వంశానికి ఇక్ష్వాకువంశమనే పేరు వచ్చింది...

భాగవతం ప్రకారం, విష్ణువు ధరించిన లీలావతారాలలో ఋషభుడు ఒకడని పైన అనుకున్నాం. మహాభారత, విష్ణుపురాణాల ప్రకారం, ఋషభుని తండ్రి నాభి జంబూద్వీప పాలకుడైన అగ్నీధ్రుని తొమ్మిదిమంది కొడుకులలో ఒకడు. అతని భార్య మేరుదేవి. నాభి తండ్రినుంచి జంబూద్వీపపాలనాధికారాన్ని పొందాడు. అలాగే కశ్యపుడు, ఇంద్రుడు కూడా మన పురాణ, ఇతిహాసప్రసిద్ధులే. అంతకన్నా విశేషంగా చెప్పుకోవలసింది, ఋషభుడిది ఇక్ష్వాకువంశం కావడం! దశరథుని మూలపురుషుల్లో ఇక్ష్వాకువు ఒకడు. అతని నుంచే ఇక్ష్వాకువంశమనే పేరు వచ్చింది. ఈ భూమి అంతా ఇక్ష్వాకులదని రామాయణం పదే పదే చెబుతుంది. ఈ జైన, వైదికపురాణాల మధ్య జరిగిన ఈ ఆదానప్రదానాలను గుర్తుంచుకుని ముందుకు వెడదాం.

భారతక్షేత్రంలోని ఆనాటి యుగళాలు అందరూ ఋషభుని రాజుగా ఎన్నుకున్నారు. అతడు 72 ముఖ్యమైన కళలను, శాస్త్రాలను; కమ్మరం, కుమ్మరం వంటి వృత్తివిద్యలను ప్రజలకు నేర్పాడు. స్త్రీలకు అవసరమైన 64 విద్యలను బోధించాడు. వాటిలో సంగీత, నృత్యాలు ఉన్నాయి. జైనపురాణాలు కమ్మరం, కుమ్మరం లాంటి వృత్తివిద్యలను గుర్తించడం ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన విషయం. ఈ వ్యాసకర్త పరిశీలన మేరకు రామాయణంలో ఈ గుర్తింపు దాదాపు కనబడదు.

అదలా ఉంచితే, ఋషభుడు కులాచారం ప్రకారం తన కవల సోదరి సుమంగళను పెళ్లి చేసుకున్నాడు. కవల సోదరుడు చిన్నప్పుడే మరణించిన సునంద అనే మరో యువతిని కూడా పెళ్లాడాడు. సుమంగళ వల్ల భరతుడు, బ్రాహ్మి; సునందవల్ల బాహుబలుడు, సుందరి అనే కవల కొడుకులూ, కూతుళ్లూ అతనికి కలిగారు. వారికి యుక్తవయసు వచ్చేసరికి ఒక తల్లి బిడ్డలు భార్యా,భర్తలు కావడంలోని అనర్థాన్ని ఋషభుడు గుర్తించి ఆ ఆచారాన్ని నిషేధించాడు. ఆపైన ఇంకో పెద్ద సంస్కరణను ప్రవేశపెట్టాడు. సుమంగళ వల్ల కలిగిన భరతునికి సునంద వల్ల కలిగిన సుందరినీ; బ్రాహ్మికి బాహుబలునీ ఇచ్చి పెళ్లి చేశాడు. అంటే, తండ్రి ఒకడే కానీ తల్లులు వేరయ్యారన్నమాట.

బౌద్ధవాఙ్మయంలోని ‘దశరథ జాతకం’ ఏకోదరులైన సీతారాములను భార్యాభర్తలుగా చెప్పింది కనుక, అది ఋషభుని సంస్కరణకన్నా ముందున్న ఆచారాన్ని చెబుతుందని ఆరుద్ర అంటారు. సీతారాములను సవతి తల్లుల బిడ్డలుగా చూపించే దూరప్రాచ్యదేశాల రామకథలు ఋషభుని తర్వాత రూపం సంతరించుకున్నవి కావచ్చని అంటారు.

అయితే, ‘రాముడికి సీత ఏమవుతుంది’ అనే తన రచనలో సీతారాముల సంబంధాన్ని మాత్రమే చర్చించారు తప్ప, కోసలరాజైన దశరథుడు, కోసల రాకుమారి అయిన కౌసల్య భార్యాభర్తలు ఎలా అయ్యారన్న ప్రశ్నలోకి వెళ్లలేదు. పైన చెప్పుకున్న ఋషభుని చరిత్ర వెలుగులో ఆ ప్రశ్నకు స్పష్టాస్పష్టంగా లేదా చూచాయగా ఏదైనా సమాధానం స్ఫురిస్తోందా?! ఇక్ష్వాకువంశానికి చెందిన దశరథుడు, కౌసల్యల సంబంధంలో; అదే వంశానికి చెందిన ఋషభుని చరిత్ర చెప్పే ఆచారం తొంగిచూస్తోందా?!

మిగతా విశేషాలు తర్వాత...



Read More
Next Story