వావాణం*
x
From “Le Magasin Pittoresque”, 1861 Le Magasin Pittoresque – Public Domain

వావాణం*

'మేధావుల మౌనం ' పై తిరుపతి పౌర చైతన్య వేదిక నిర్వహించిన రాష్ట్రస్థాయి కవితల పోటీ లో మొదటి బహుమతి పొందిన కవిత.


'నమ్మినానురా సిద్దా అంటే

నైసుగా అన్నీ అమ్మేస్తున్నాన్రా సిద్దా' అన్నట్టు

దోపిడీ కూటాల దొంగాటలో

దేశిం అడివావులు పడ్డ చెనిగ చేనై పోతున్నా

ఇట్టా బెల్లంగొట్టిన రాయిలా

మనమెట్టా వుండామో అంతుబట్టడం లేదే!

బడుగుల కూటి మడవల్ని తొక్కి

రంపులకై రంకెలేస్తున్న దొంగగొడ్లను మేపుతూ

అడవి పేగుల్ని చీరి ఆస్తి పోగేసుకుంటున్న

దుడ్లగూబలను ఊరేగిస్తూ

నీళ్లు పారే పాదుల్లో పగలు పారగడుతున్నా

నోళ్లు మెదపకపోడం ఎంత బగిసేట్లు మనికి?

నీతికి పుల్లంత ఊతంగా నిలబడ్డానిక్కూడా

ఎంత సిన్నతనం మనికి ?

ఎంతటి అద్దోనం మన్ది?

దేశిం తలగుడ్డ పడిపోకుండా

దేశాల ముందు నిల్చి నిజాలు మాట్లాడ్డానికి

ఎంత వారడా మనికి?

మన్సులై పుట్టినాక

వొక రవ్వైనా నీతిపాతి వుండద్దా ?

రూంతైనా అరువూ అర్తముండద్దా ?

తమలపాకు తొడిమంతన్నా తెగువుండద్దా?

అన్నిటికీ వావాణానికిపోతే ఎట్టా?

-పల్లిపట్టు నాగరాజు


*వావాణం అంటే జంకు, భయం

(పల్లెపట్టు నాగరాజు శ్రీ కాళహస్తి లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. ఆయన రాసిన 'యా లై పూడ్సిన్ ది' అన్న కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.)

Read More
Next Story