వాన
x

వాన

అంతర్జాతీయ కవితా దినోత్సవం సందర్భంగా వారాల ఆనంద్ కవిత


కంటి తలుపులు మెల్లగా తెరిచిన వేళ

ఆకాశం నా వైపు వంగి చూసింది

అక్కడినుంచి చుక్కలు చుక్కలుగా జారిన వాన

కేవలం చుక్కల రూపంలో కాదు,

ఆలోచనల రూపంలో

నాలోకి దిగింది.

ఒక చినుకు

ఒక జ్ఞాపకమై,

మరొక చినుకు

ఒక స్వరమై,

మెదడంతా నిండిపోయింది

ఇప్పుడు నేను వినేది

బయటి వాన కాదు,

లోపల మోగుతున్న

అలల చిట పట చిట పట గీతం.

అడుగులు వేసే ముందు

నేలని అడుగుతాను

“నన్ను భరిస్తావా?” అని…

ఇప్పుడు నడక కూడా

ఒక జాగ్రత్తగా మారింది,

ఒక తలకిందులుగా శీర్షాసన ప్రయత్నం చేస్తే

నా లోపల దాచుకున్న వాన

పొంగి బయటపడుతుందేమో!

అందుకే నన్ను క్షమించండి

ఇప్పుడే జారిన ఆ వాక్యాలు

అవి వట్టి మాటలు కావు

తడిసిన మనసు జార్చిన చుక్కలు

ఇప్పటి నేను

నిన్నటి నేను కాదు

ఎందుకంటే

నా తలలో ఇప్పుడు

వొట్టి వాన మాత్రమే కాదు

ఒక లోకమే కురుస్తోంది.

Read More
Next Story