వసంతం ఒంటరిగా రాదు!
x
image source: Vecteezy.com

వసంతం ఒంటరిగా రాదు!

నేటి మేటి కవిత


లోయలోని లోతుల్లోని

చిక్కటి చీకటిలా ఒంటరితనం!

ఒంటరి పక్షి ఎగిరే రెక్కల చాటున
దాక్కున్న వెచ్చని ఒంటరితనం!
ఎడారి కాక్టస్ ముల్లు చివరి
పదునైన ఎదురు చూపులా,
సముద్రానికి కలిగే
మరో సముద్రపు దాహంలా ఒంటరితనం!
దూరాన ఒంటి గుడిసెలో
రా రమ్మంటూ పిలిచే
వెలిగే దీపపు ఆలాపన లాంటి ఒంటరితనం!
***
రాత్రి ఏకాకి!
మనుషులు ఏకాకులు!
పగలు విడిగా ఏకాకి!
ఒంటరితనం నిర్దాక్షిణ్యంగా
తరిమే ఏకాకి ఈ లోకం!
***
అసలు ఉదయించే సూర్యుడెంత
ఒంటరో అడిగావా ఎన్నడైనా?
చంద్రుడికి కూడా ఆకాశం ఏమీ దగ్గర కాదు!
లక్షల కౌగిలింతల తరువాత కూడా
తీరానికి సముద్రమూ స్వంతం కాదు!
***
ఒంటరితనమే ఒక అంతులేని దాహం!
ఏకాకితనం !
నువ్వో, అతడో ఏకమై
మళ్ళీ ముక్కలైనతనం!
కలిసి ఉండలేని మనుషుల
గుబులు లాంటి ఒంటరితనం!
***
పైకి రాలేని మాట,
పాడలేని పాటల ఒంటరితనం!
రాయలేని కవిత్వంతో కవి పడే వేదన ఒంటరితనం!
***
చంద్రుడు,నక్షత్రాల
ఆవరణలో ఆకాశపు ఏకాకితనం!
పక్షులు,కుందేళ్ళు, మోదుగ పూవులు,
నదులు,తుపాకులు,పుస్తకాలు,
సూర్యోదయం వైపుగా వెన్నెల్లో వేసే పదఘట్టనలు!
నలువైపులా ప్రతిధ్వనించే అరుణరాగాలు!
ఇన్ని ఉన్నా ఒంటరి గాలుల్ని వీచే అరణ్యం!
అడవిని బంధించిన జైలు పాడే ఒంటరితనం!
ఎక్కడో నమ్మకద్రోహపు వెన్నుపోటు చేసిన
గాయాలతో ఏకాకిగా మిగిలిన అరణ్యం!
***
మనుషుల పగిలిన మొహాల్లో,
వికృతమైన గీతల్లో,గాజు కళ్ళల్లో,
తప్పించుకుంటున్న చూపుల్లో,
రాలుతున్న కన్నీటి చినుకుల్లో,
ఎండిన నవ్వుల్లో,విరిగిపోయే మాటల్లో
కౌగిలింతల్లో, కరచాలనాల్లో,
ఈడుస్తూన్న నడకల్లో ఒంటరితనం!
***
అలా వెళ్ళిపోతున్న మనిషి వీపు మీద,
ముందరి వైపు ముఖపు వెక్కిరింతలో,
ఛాతీ లోపల బోలుగా మిగిలిన హృదయం చేసే
గులకరాళ్ల చప్పుడు లాంటి ఖాళీ తనపు
గల గలల ఒంటరితనం!
మనిషిప్పుడు నిలువెల్లా ఒంటరితనం!
***
ఆ రోడ్డు మూలన పార్కులో
వాడు వెక్కి వెక్కి ఎందుకు
ఏడుస్తున్నాడో గుండె పగల గొట్టుకుని?
ఏం కావాలో వాడికి?
నీకేం తెలుసు?
వాడి ఒంటరితనానికే తెలుసు!
***
చూడటు!ఆ ఒంటరి సముద్రానికి మహా బింకం!
నదిని దాహం అడగడానికి!
ఆకాశం వైపు మోరెత్తి,
హోరెత్తి దుఃఖి స్తూనే ఉంటుంది!
తనని ఆశ్రయించిన,
తీరం వెంబడి దాహం తీరక ప్రేతాత్మల్లా నవ్వుతూ,
ఏడుస్తూ తిరుగుతున్న మనుషుల్ని
చూస్తూ భయపడి పోతుంది!
**
ఒంటరితనం ఇప్పుడొక యుద్ధం!
మనిషి లోపలా బయటా
యుద్ధం మిగిల్చిన ఒంటరితనం!
రాజ్యం మతపురుషాంగ మై వెన్నాడితే
ఆమెలకి ఎక్కడా తావే దొరకని ఒంటరితనం!
ఆధిపత్యకులవిషం నిన్ను
భూమికే పరాయిని చేసిన ఒంటరితనం!
మత ద్వేషం ఖండాంతరాలకు
తరిమేసిన ఒంటరితనం!
పితృస్వామ్యం నీ ఇంట్లోనే
నిన్ను బందీ చేసిన ఒంటరితనం!
***
యుద్ధంలో పసి పిల్లలకు
అమ్మపాలు దొరకని ఒంటరితనం!
బాల్యానికి ఆటలు దొరకని,
చదువుకోడానికి బడులు దొరకని,
ఉండడానికి ఇళ్ళు దొరకని,
ఆ శరణార్థి శిబిరాల శిశువుల ఒంటరి తనం!
మనిషిని సహస్ర శకలాలుగా
దిక్కుల్లోకి విసిరేసిన యుద్ధపు ఒంటరితనం!
ఒంటరితనమే ఒక యుద్ధం!
***
అసలు యుద్ధమే ఒంటరి ది!
దానికది తెలీదు!
***
ఎటు పోవాలో తెలీని బిక్కసచ్చిన తనం!
ఆమె /అతడు/వాళ్ళ దగ్గరికో వెళ్లి జోలె పట్టినా ఏమో?
ప్రేమ దొరకని మనుషులు,ప్రేమించడం తెలీని
మనుషులు కళ కళ లాడే ఇళ్లల్లో కాకుండా,
పూలు విరిసే తోటల్లో కాకుండా స్మశానాల్లో,
సమాధుల్లో ముడుచుకున్నారేమో అన్న భయం!
మధ్యలో చేయి వదిలేస్తారేమో అన్న భయం!
***
ఒంటరి చంద్రుడు, ఒంటరి ఆకాశం,
ఒంటరి సముద్రం, మరీ ఒంటరి ఎడారి!
ఒంటరి అరణ్యం!
ఒంటరి తుపాకీ!
ఒంటరి జైలు!
ఒంటరి వలస దుఃఖం!
ఒంటరి ఆమె - ఒంటరి అతను!
ఒంటరి అమ్మ - ఒంటరి నాన్న!
ఒంటరి పిల్లలు!
ఒంటరి పక్షులు!
ఒంటరి కుక్క!
ఒంటరి భూగోళం!
ఒంటరి అవమానం!
ఒంటరి ఆకలి!
ఒంటరి నిద్ర!
ఒంటరి కల!
ఒంటరి ప్రేమ!
***
చూడు!
ఒంటరితనం నీలోపలే ఉన్న
ఒక డ్రాకులా!
దానికి ఒంటరిగా చిక్కకోయి!
తెల్లరేకల్లా నీ రక్తంతో పాటు
నీ కలల్నీ పీల్చి పడేసి,
నిన్ను జీవశ్చవాన్ని చేసి వదులుతుంది!
తెలుసా నీకు?
అసలు చాలా సార్లు జీవితం -మృత్యువు
జుగల్బందీలై పగలబడి నవ్వుతాయి !
పో! కవీ
మేం ఒంటరి కాదు
నువ్వే ఒంటరి !
పో!
పోయి తోడు వెతుక్కో
అయితే
జీవితాన్ని లేదా మృత్యువుని అంటాయి-
చీకటి మార్మిక దారుల్లో
అదృశ్యమవుతూ కవి లోపల కలబడిపోతూ!
అప్పుడేం చేస్తావు నువ్వు?
***
ఇప్పుడిక మనిషి ఎటు పోవాలి చెప్పు?
ఏం చేయాలో, అదీ చెప్పు!
***
ఒంటరితనం ఏకాంతం అవుతే తప్ప,
ఒంటరితనం బలం అవుతే తప్ప,
ఒంటరితనం ప్రేమించే తనం అవుతే తప్ప,
చూడూ అడవి మళ్ళీ చిగురిస్తే తప్ప,
యుద్ధం ఒంటరి దైతే తప్ప!
***
ఓహ్! అప్పటిదాకా
ఈ ఒంటరి మనుషులు పాడే పాటలో
ఒంటరి మృత్యువు వెంటాడుతుంది!
జీవితమే అందని జీవితం
ఇక మృత్యువు పాలవుతుంది!
కానీ ఈ సారి,
వసంతం ఒంటరిగా మాత్రం రాదు!
పసిపిల్లల గోరీల మీద సామ్రాజ్యాన్ని కట్టి,
సమస్త లోకాన్ని ఒంటరిని చేసే
యుద్దోన్మాదిని వణికించే పదాలతో కవిత్వం రాసుకుని
మరీ పాడే కోయిలని వెంట పెట్టుకుని వస్తుంది!
చూడూ!
కోయిల భయం పుట్టేలా కూడా పాడగలదు!
మనిషీ, నువ్వు ఒంటరి కాదు!
నీ కోసం వసంతం వస్తుంది!
ఎదురు చూడు!


Read More
Next Story