వసంతం రాక ఆగదు...
ఆదివాసీలను పుట్టిన అడవుల నుంచి తరిమేసేందుకు సాగుతున్న ‘ఆఖరు యుద్దం’ మీద రమణాచారి కవిత...
-రమణాచారి
ఆఖరి యుద్ధమట..!
ఎవరిపై ఎవరు చేస్తోన్న యుద్ధమిది?
పచ్చని అడవిని కాపాడుతున్నదెవరు?
విధ్వంసం సృష్టిస్తున్నదెవరు?
ప్రజాస్వామ్యం ముసుగులో యుద్ధం అంటూ వికట్టహాసం చేస్తోన్నదెవరు?
ఆదివాసీ బిడ్డల
బతుకుల్ని ఛిద్రం చేస్తోన్నదెవరు?
ఆదివాసీలకు అండగా నిలిచిన యుద్ధవీరులను వెంటాడుతున్నదెవరు?
అడవినంతా రక్తసిక్తం చేస్తోన్నదెవరు?
ఈ దేశం కోసం...
ప్రాణాలను ఫణంగా పెట్టి
నిజమైన త్యాగానికి చిరునామాగా నిలిచింది ఆదివాసీలే కదా...
రక్త తర్పణం చేస్తూ
అడవి అడవినంతా కాపాడుతోంది
ఆదివాసీలే కదా...
సహజ వనరులన్నీ సమానంగా
అందరికీ దక్కాలని కోరుకునేది
ఆదివాసీలే కదా...
ఈ దేశంలో...
ఎవరి కోసం ఎవరు
రాసుకున్న రాజ్యాంగం ఇది?
పోనీ,
దాన్నేమన్నా నిక్కచ్చిగా అమలు చేస్తున్నారా?
మా అడవిలో
అడుగు పెట్టే హక్కేలేనపుడు
నరమేధం సృష్టించే హక్కెవడిచ్చాడు?
అడవి పొత్తిళ్ళలో
దాగివున్న సొత్తును కాజేయడానికి
కార్పోరేట్ల కోసం
హంతకులుగా మారుతోన్న కాలంలో బూటకపు పాలకులు సృష్టిస్తోన్న నరమేధమిది
ఆదివాసీలకు
యుద్ధం కొత్తేమీ కాదు
తరతరాలుగా చేస్తోంది యుద్ధమే కదా...
శిశిరం తర్వాత
వసంతం రాక మానదు కదా...
వీరులు చిందించిన రక్తం సాక్షిగా
రేపటి సూర్యోదయానికి
అరుణ కిరణాలు ప్రసరిస్తాయ్...
Next Story