వేసవిలో ఇల్లెలా ఉంటుంది...
ఇల్లు సీక్వెల్ కవిత - 5
ఇల్లు సీక్వెల్ కవిత - 5
వేసవిలో ఇల్లెలా ఉంటుంది...
-గీతాంజలి
ఇల్లు మొత్తం మల్లె పూవు అయిపోతుంది. ఇల్లు మగ్గిన మామిడి పండు లా ఘుమ ఘుమ లాడుతుంది.
ఇంటి వాకిలిలో గౌండ్ల నరసయ్య తెచ్చిన చల్లని తాటి ముంజే లా ఇల్లు నవ నవలాడుతుంది.
చల్లని గాలి కోసం అమ్మ వట్టి వేర్ల మీద నీళ్లు చల్లితే వచ్చే వాసనతో ఇంటి ఊపిరికి హాయిగా ఉంటుంది.
పెరట్లో కోయిల ఉగాదిని కూస్తుంది.
వేసవి సెలవుల్లో నీకు రాని ప్రేమలేఖ నిన్ను ఏడిపిస్తుంది.
వేసవి రాత్రి నిద్ర పుచ్చడానికి చందమామ నిన్ను డాబా మీదికి లాక్కె ళ్లుతుంది.
ఊరి చెరువులో ఈత కొట్టి వచ్చిన నీకు బావి నీళ్లతో ఇల్లు మళ్లీ స్నానం చేయిస్తుంది.
వర్షం కురవక ఎండిన చేలు అమ్మ కంటి నీరై ప్రవహిస్తే ...ఇల్లు తన చీర కొంగుతో తుడుస్తుంది.
పంట కు అప్పుచేసిన వలసవెళుతున్న నాన్నకి ఇల్లు కన్నీటితో వీడ్కోలు చెబుతుంది.
వేసవికి వచ్చిన బంధువుల కోసం ఇల్లు మరింత విశాలమవుతుంది.
వేసవిలో ఇల్లు ఊరి పిల్లలందరికీ ఆటస్థలం అయి పోతుంది.
వేసవి పగలు.. ఇల్లు సూర్యుడిలా చమటలు పట్టిస్తే.. రాత్రి చంద్రుడిలా చల్ల బడుతుంది.
వేసవిలో ఇల్లు చల్లారని కుంపటిలా వేడెక్కిపోతుంది.
వేసవిలో ఉరగాయకి పగిలిన పచ్చి మామిడికాయల వాసనతో ఇల్లు పులుపెక్కిపోతుంది.
వేసవిలో ఇల్లు బొండు మల్లెల మాలై అమ్మ వాలు జడలో వేలాడుతుంది.
వేసవి రాత్రిలో ఇల్లు రేడియో నుంచి బినాకా గీత్ మాలాని మధురమైన తేనెలా తనలోకి నింపుకుంటుంది.
ఇల్లు వేసవిలో ప్రేయసి జ్ఞాపకం లో ... నువ్వు బెంగ పడ్డం చూస్తూ నవ్వుకుంటుంది. కిటికీ లోంచి నీ గదిలోకి వెన్నెలని ఒంపమని చంద్రుణ్ణి వేడుకుంటుంది. నువ్వప్పుడు..వెన్నెల్లో నీ గుండెని ముంచి ఆమె కోసం కవిత్వం రాస్తావు.. కిటికీ నీతో రాయిస్తుంది.
ఇల్లు నిన్ను కవిని చేస్తుంది!
మొత్తానికి ...
వేసవిలో ఇల్లు..
చెరువులోకి చూసుకుంటూ చెమ్మ బారిన ఏటి వొడ్డులా..
దిగులుగా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.