
తలవంచని గాన సరస్వతి తల వాల్చిన వేళ
ఒక నాటి ప్రఖ్యాత నేపథ్య గాయని రావు బాలసరస్వతీ దేవి (97) అక్టోబర్ 15న హైదరాబాద్ లో చనిపోయారు.
చల్లని కొండగాలికి ఏటిలో కదలాడే అలల్లాగా ఆమె పాట సాగిపోతుంది. మనసు దూది పింజలై గాలిలో తేలిపోతుంది. నాలుగేళ్ళ చిరు ప్రాయంలో మొదలెట్టిన ఆ గానం, ఇప్పటికి లలితంగానే సాగుతోంది. ఆమె పాటకు వయసు కూడా తలవంచింది. తన పేరులోనే సరస్వతిని ఇముడ్చుకున్నారు రావు బాలసరస్వతి దేవి.
బుధవారం ఉదయం తన 98వ ఏట హైదరాబాదులో కన్నుమూసిన రావు బాలసరస్వతి దేవి, 2009 జులై 13 సోమవారం తిరుపతికి వచ్చిన సందర్భంగా తన గాన ప్రస్థానాన్ని ఇలా పంచుకున్నారు.
‘‘మా ఊరు గుంటూరు. ఇక్కడ మాకు లీలా మహల్ అనే డ్రామా థియేటర్ ఉండేది. మా నాన్న పార్థసారథి రావు గారికి సంగీత జ్ఞానం ఉండేది. వీణ, గిటార్ బాగా వాయించేవారు. మూడు సంవత్సరాల వయసులో వారితో కూర్చుని పాటలు, పద్యాలు వినేదాన్ని. దాంతో నాకు గాన కళ అబ్బింది.
కపిలవాయి రామనాథ శాస్త్రి గారు మా నాన్నగారికి సన్నిహితులు. ఆయన పాడిన గ్రామ్ ఫోన్ రికార్డులు మా ఇంట్లో ఉండేవి. వాటిని వినడం వల్ల నాకు సంగీత జ్ఞానం అబ్బింది. కానీ చదువు మాత్రం వంటబట్టలేదు. స్కూలుకు వెళ్ళకుండా పాడుతూ కూర్చునే దాన్ని.
రామనాథ శాస్త్రి గారు ఒక సారి గుంటూరులో డ్రామా వేశారు. ‘నమస్తే నా ప్రాణ నాథా’ అంటూ పాడుతున్నారు. అప్పుడు నా వయసు నాలుగు సంవత్సరాలు. ఆ పాట నాకొచ్చని, నేను కూడా పాడతానని మా నాన్న గారి దగ్గర మారాం చేశాను. అది గమనించిన శాస్త్రి గారు వెంటనే స్టేజి దిగి వచ్చి అసలు విషయం కనుక్కున్నారు. పాడతానంటే వద్దనకూడదని, మానాన్న గారికి నచ్చచెప్పి నన్ను స్టేజి పైకి తీసుకెళ్ళారు. అక్కడ నుంచి మొదలైంది నా పాటల ప్రస్థానం.
హెచ్ ఎం.వి. కంపెనీ వారు 1934లో చిన్న పిల్లల పాటలను రికార్డు చేస్తున్నారు. చిన్న పిల్లలు పాడితే బాగుంటుందని కొప్పరపు సుబ్బారావు గారు మానాన్న గారిని అడిగారు. ముందు హార్మోనియం తీసుకుని వాయిస్తూ నన్ను పాడమన్నారు. నా పాట వారికెంతో నచ్చింది.
ఓగిరాల రామచంద్రరావు గారు హార్మోనియం వాయిస్తుంటే, నన్ను వంటరిగా పాడమన్నారు. ఆ పాటను హెచ్ఎంవి వారు రికార్డు చేశారు. మరో పాటను కూడా పాడాను. అప్పుడు నా వయసు ఆరు సంవత్సరాలు. దక్షిణాదిలో ఆ వయసులో ఎవరూ రికార్డింగుకు పాడలేదు.
పన్నెండు సంవత్సరాల వయసు పిల్లలతో సి.పుల్లయ్య గారు సతీ అనుసూయ సినిమా తీస్తున్నారు. ఆయన మా ఇంటికి వచ్చి, నన్ను సినిమాలో నటింపచేయటానికి మా నాన్న గారిని అడిగారు. అందుకాయన ఒప్పుకోవడంతో నాచేత గంగ వేషం వేయించారు. ఆ సినిమాలో నా పాటను నేనే పాడుకున్నాను. అప్పుడు నా వయసు ఎనిమిది సంవత్సరాలు.
ఆ బాల నటుల్లో అందరి కంటే నేనే చిన్న దాన్ని. ఆ సమయంలోనే కె.సుబ్రమణ్యం గారి దర్శకత్వంలో బాలయోగిని సినిమా తీస్తున్నారు. ఆ సినిమా అంతా నాపైనే నడుస్తుంది. ఆ సినిమా బాగా విజయవంతం అయ్యింది. బంగారు పతకం కూడా వచ్చింది. దాంతోనే నాకు మంచి గాయనిగా పేరొచ్చింది. అక్కడితో మా కుటుంబం గుంటూరు నుంచి మద్రాసుకు మారింది.
ఆ రోజుల్లో ఎం.ఆర్. త్యాగరాజన్ భాగవతార్ పెద్ద నటులు. నా గొంతు విని, నాకు సంగీతం నేర్పించే బాధ్యతను ఆయన తలకెత్తుకున్నారు. సుబ్బయ్యగారి దగ్గర కర్ణాటక సంగీతాన్ని మూడు సంవత్సరాలు నేర్పించారు. కర్ణాటక సంగీతజ్ఞుల లాగా గట్టిగా పాడడం నాకిష్టముండదు. లలితంగా పాడతానని నా పై అపవాదు. అలా పాడమంటేనే నాకిష్టం.
కె.ఎల్.సైగల్ పాటలంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నతనంలో ఆయన పాటలను ఎక్కువగా వినేదాన్ని. ఆయన విధానాన్నే అనుసరించేదాన్ని. సంగీతానికి ఒక పునాది కావాలి. సంగీత దర్శకులు నా గొంతుకు అనుగుణంగా మార్చుకుంటేనే పాడగలను. కొందరు సంగీత దర్శకులు కంపోజ్ చేసి ఇలాగే పాడాలని వత్తిడి చేయటం నాకిష్టముండేది కాదు. నేనలా పాడలేను.
నా పదహారవ ఏట కోలంకి రాజా వారితో నా వివాహమైంది. పెళ్ళితో నా పాటలు ఆగిపోయాయి. అలా నాలుగేళ్ళు పాటలు పాడడం మానేయాల్సి వచ్చింది. పాటలు పాడకుండా పూర్తిగా బందీ అయిపోయాను. పాటలు పాడిన డబ్బులతోనే పోషణ జరగాలని లేదు. నా చేత పాడించాలని చాలా మంది ఆయనపై వత్తిడి తెచ్చారు. స్వప్నసుందరి సినిమాతో మళ్ళీ పాడడం మొదలు పెట్టాను. అంతే, ఇహ వెనక్కి తిరిగి చూడలేదు.
మా నాన్న గారు నన్ను బొంబాయి తీసుకెళ్ళి, వసంత దేశాయ్ వద్ద హిందూ స్థానీ సంగీతం నేర్పించారు. ఆ సంగీతంలో సంవత్సరం పాటు వాయిస్ మాడ్చులేషన్ ను, మెళకువలను నేర్చుకున్నాను. అంత శ్రమపడితేనే ఇంత దాకా వచ్చాను. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, సింహళి భాషల్లో చాలా పాటలు పాడాను.
నౌషాద్ దగ్గర పాడాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. అదృష్టం ఒక రోజు నా తలుపు తట్టింది. నౌషాదే నా దగ్గరకు ఒక మనిషిని పంపించారు. నేను పాడిన రికార్డును ఆయన తెప్పించుకున్నారు. నా పాట బాగుందని నన్ను పిలిపించారు. నౌషాద్ సంగీత దర్శకత్వంలో ‘ఉదన్ కటౌలా’ సినిమాను హిందీ, తమిళ భాషల్లో ఒకే సారి తీస్తున్నారు.
హిందీలో పాడడానికి లతామంగేష్కర్ ను ఎంపిక చేయగా, తమిళంలో నన్ను ఎంపిక చేశారు. తొలుత నేను రెండు పాటలు పాడాను. చాలా గొప్పగా ఉన్నాయని అంతా మెచ్చుకున్నారు. ఆ పాటలను ఆ తరువాత హిందీలో లతా చేత పాడించారు. నేను పాడితే లత పాడనన్నారట. ఆ మాటే నౌషాద్ నాతో చెప్పారు. దాంతో నేను వచ్చేశాను. నేను పాడిన రెండు తమిళ పాటలు తప్ప అన్ని పాట లను లతా చేత నౌషాద్ పాడించాల్సి వచ్చింది. చివరికి తమిళంలో పాటలు కూడా.
కృష్ణ పిక్చర్స్ వారు అమ్మలక్కలు సినిమా తీస్తున్నారు. దానికి సుబ్బరామన్ సంగీత దర్శకులు. నా చేత ఒక పాట పాడించారు. వారికి చాలా బాగా నచ్చింది. ఆ సినిమా నిర్మాత సన్నిహితురాలైన పెరినాయకి కూడా పాడతారు. నా చేత పాడించడంతో ఆమెకు కోపమొచ్చింది. తానుండగా వేరే వారిచేత ఎలా పాడిస్తారని ఆగ్రహించిందట. దాంతో ఆయనకు కోపమొచ్చింది.
ఆ పాట పాడే దమ్ము ధైర్యం మరెవరికీ లేదని అందరి ముందర తేల్చిచెప్పారు. బాలసరస్వతితో కాకుండా ఆ పాట ఎవరితో పాడించినా ఆ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా మానేస్తానన్నారు. నేను ఫోన్ చేసి సుబ్బరామన్ గారిని ఇంటికి పిలిపించాను. అలా చేసి చెడ్డపేరు తెచ్చుకోవద్దని నచ్చచెప్పాను. ఎంతో నచ్చచెప్పాక ఆయన అందుకు అంగీకరించారు.
ఆ పాటను పెరినాయకి చేత పాడించారు. చాలా కాలం తరువాత నాకు తెలిసింది ఆ పాట సాకి పెరినాయకిది కాదని, అంతకు ముందు నా చేత పాడించిన సాకీనే ఆ పాటకు అతికించారని. అది ఆమె గమనించలేకపోయింది. సుబ్బరామన్ పట్టుదలను చూసి ఆశ్చర్యమేసింది.
ఆ రోజుల్లో పాట పాడే చివరి వరకు ఎవరు పాడాలన్నది అనుమానమే. ఏ పాట ఎవరు పాడితే బాగుండేదో ఎన్నుకునేవారు. పాడలేని పాట ఆ గొంతులో ఇమడదు. ఆ పాటపాడగలుగుతానా అన్నది గాయకులే నిర్ణయించుకోవాలి. తమిళులు సంగీత ప్రియులు. నిజం చెప్పాలంటే సంగీతం వారి సొత్తు. ఎంత చిన్నవారైనా బాగా పాడితే ప్రాణం ఇస్తారు.
ఇప్పటి సినిమా సంగీతం గురించి చెప్పాలంటే కోట్లు ఖర్చుపెడుతున్నారు. కానీ, సంగీతంపైన, భాష పైన శ్రద్ధ చూపించడం లేదు. తెలుగులో ఎంత మంది గాయకులున్నా కానీ, బొంబాయి నుంచి ఉదిత్ నారాయణ్ లాంటి వారి చేత పాడిస్తున్నారు.
వారికి మన భాష రాదు. ఉచ్చారణ సరిగా ఉండదు. ‘నీకోసం’ అని ఉచ్చరించడానికి బదులు ‘నికొసం’ అని అంటారు. ‘బాగుందా’ అనడానికి బదులు ‘బగుంద’ అంటారు. ఎలా ఉచ్చరించాలో నిజానికి అతనికి తెలియదు. ఇలా ఉచ్చరించడం తప్పని తెలుగు వాళ్ళు చెప్పాలి. పాటలో కొంత భాగం ఈ రోజు రికార్డు చేస్తే, మరి కొంత భాగం మరి కొన్ని రోజులాగాక చేస్తున్నారు. దాంతో అర్థం పర్థం లేకుండా పోతోంది.
ఈ రోజుల్లో కూడా కీరవాణి, ఇళయరాజా లాంటి వారు సంగీతం సమకూరిస్తే బాగుంటుంది. మేం పాడే రోజుల్లో దేవులపల్లి కృష్ణ శాస్త్రి, ఆరుద్ర, కొసరాజు, శ్రీశ్రీ వంటి వారు దగ్గర కూర్చుని ఇలా ఉచ్చరించాలని చెప్పేవారు.’’ అంటూ తన విహంగావలోకన్నాన్నిలా ముగించారు.