28న కారా సాహిత్య విమర్శ మీద వివిన మూర్తి ప్రసంగం
x

28న కారా సాహిత్య విమర్శ మీద వివిన మూర్తి ప్రసంగం

తొలికథతోనే కాళీపట్నం రామారావు కంటపడిన రచయిత వివిన మూర్తి. ఆయన కాళీ పట్నం రామారావు సాహిత్యం మీద ప్రసంగించనున్నారు.


ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అభ్యుదయ సాహిత్య విమర్శ -31 వ విడత గా సాహిత్య విమర్శ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నది.


2024 జనవరి 28 2024 ఆదివారం ఉదయం 10.15గంటలకు జరిగే ఈ అంతర్జాల సదస్సులో ‘కారా గారి సాహిత్య విమర్శ’ అనే అంశం మీద ప్రముఖ రచయిత వివిన మూర్తి ప్రసంగిస్తారు.

కార్యక్రమానికి వల్లూరు శివప్రసాద్ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ అరసం, అధ్యక్షత వహిస్తారు.


ఫేస్ బుక్, యూట్యూబ్ లైవ్ 10.15కు ప్రారంభించాల్సి ఉన్నందున 10 నిమిషాలు ముందుగా దిగువ లింక్ ద్వారా మీటింగ్ లో పాల్గొనాలని నిర్వహాకులు కోరుతున్నారు.

ZOOM MEETING

Time: Jan 28, 2024 10:15 AM Mumbai, Kolkata, New Delhi

Join Zoom Meeting

https://us06web.zoom.us/j/87552763159

Meeting ID: 875 5276 3159

కాళీ పట్నం రామారావు గురించి

కారా మాస్టారుగా పిలువబడే కాళీ పట్నం రామారావు 1924, నవంబర్ న శ్రీకాకుళం లో జన్మించారు. శ్రీకాకుళంలో S.S.L.C వరకు చదివాడు. భీమిలిలో సెకెండరి గ్రేడ్ ట్రయినింగ్ స్కూలులో ఉపాధ్యాయ శిక్షణ పొందాడు. 1943 నుండి 1946 వరకూ నాలుగైదు చోట్ల కొలువులు చేసినా స్థిరముగా ఇమడగలిగింది మాత్రం ఉపాద్యాయవృత్తిలో. 1948 నుండి 31 ఏళ్ళు ఒకే ఎయిడెడ్ హైస్కుల్ లో ఒకేస్థాయి ఉద్యోగము. కాళీపట్నం రామారావు 2021జూన్ లో 97వ యేట చనిపోయారు.

ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే కధలు రాయడం ప్రారంభించారు. 1943 నుంచి 1972 దాకా కాళీపట్నం రామారావు రాసిన కథలు 43. 1992 తర్వాత కేవలం రెండు కథలు మాత్రం రాశారు. అయితే,1963 వచ్చిన ‘తీర్పు’ కథతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. 1966లో వచ్చిన ’యజ్ఞం’ కథ ఆయన్ని రచయితగా ఉన్నత శిఖరాలకు చేర్చింది. ఈ యజ్ఞo కధతో కలిపి ‘యజ్ఞoతో తొమ్మిది కధలు’ అనే ఓ కధా సంపుటిని 1971లో ప్రచురించారు. దానికి 1995లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన రాసిన కథలు కొన్ని ఇంగ్లీష్, రష్యా బాషలలోకి కూడా అనువాదమయ్యాయి

కాళీపట్నం రామారావు కేవలం కధలు రాయడమే కాకుండా తెలుగు రచయితలు రాసిన కధలన్నిటినీ ఓ చోట చేర్చి భద్రపరచాలని భావించారు. ఆ లక్ష్యం కోసం ఆయన ఎంతో శ్రమించి శ్రీకాకుళంలో ‘కధానిలయం’ అనే ఓ భవనాన్ని నిర్మించారు. తన వద్ద ఉన్న డబ్బు, అవార్డుల ద్వారా వచ్చిన డబ్బును అంతా కధా నిలయానికే ఖర్చు చేశారు. ఆ తరువాత దానిలో ఉండే ప్రతీ పుస్తకాన్ని డిజిటైజ్ చేసి kathanilayam.com అనే వెబ్‌సైట్‌ ద్వారా తెలుగు సాహిత్యాభిమానులందరికీ అందుబాటులోకి తెచ్చారు.

కారా మాస్టారి గురించి రమాసుందరి ఇలా రాశారు.

ఒక కాలంలో, ఒక ప్రాంతాన్ని ఆవహించిన సంక్షోభాలు, రణాలు రచయిత వ్యక్తిత్వం మీద, రచనల మీద తప్పక ప్రభావం చూపుతాయి. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కాళీపట్నం రామారావు మాష్టారి సాహితీ ప్రయాణం ఆ పరిమితిని శైశవ దశలోనే దాటి సామాజికోద్రేకాలను అద్దుకొంటూ సాగి, ఆనాడు ఉత్తరాంధ్రలోని కొనసాగుతున్న ఉద్యమాలకు అనుసంధానమయ్యి పరిపక్వతను సంతరించుకొంది.

“మధ్యతరగతి మానసిక రుగ్మతలను ఎక్కువ చేసి చూపించిన” కధలుగా ఆయనే స్వయంగా చెప్పుకొన్న 48-55 మధ్య కధల్లో కూడా అంతర్లీనంగా ప్రాభవం కోల్పోతున్న బ్రాహ్మణ మధ్య తరగతి కుటుంబాల బంధాలను శాసిస్తున్న ఆర్ధిక సంబంధాల విశ్లేషణ ఉంది. ఈ కాలంలో ఈయన రాసిన “పెంచిన మమకారం”, “అభిమానాలు” లాంటి కధలలో ఆయన బీజ రూపంలో తడిమిన అంశాలు తరువాత కాలంలో ఆయన రాసిన కధల్లో వేయి ఊడల మహా వృక్షాల్లాగా విజృంభించాయి.

62-72 మధ్య కాలంలో ఉత్తరాంధ్రలో వచ్చిన ఉడుకు రామారావు గారి కలాన్ని పదును పెట్టినట్లుగా తోస్తుంది. ఉద్యమాలు ఈ కలాన్ని ఆవహించాయా లేక ఇలాంటి కధలు ఉద్యమాలను ఉత్తేజపరిచాయా అన్నంతగా పెనవేసుకొని ఆయన సాహిత్యప్రయాణం సాగినట్లు అనిపిస్తుంది. ఈ కాలంలో ఈయన రాసిన కధల్లో గాఢత బాగా చిక్కబడింది. వ్యక్తి నుండి వ్యవస్థకు ఈయన సాహిత్య ప్రయాణం ఈ కాలంలోనే జరిగింది. ‘ఆదివారం’, ‘చావు’, ‘ఆర్తి’, ‘కుట్ర’, ‘శాంతి’, ‘జీవధార’, ‘భయం’, ‘నో రూమ్’, ‘హింస’ కధలు ఈ కాలంలోనే వెలువడ్డాయి.

రామారావుగారి కధల్లో ఎక్కువ కధల ముగింపులు పరిష్కారాన్ని ప్రత్యక్షంగా సూచించవు. పరిష్కారం చెప్పక పోయినా సమాజంలో ఉన్న దరిద్రం, ఆకలి ఇంకా చాలా సామాజిక రుగ్మతల పట్ల ద్వేషాన్ని కలిగించే పని చేయటం ప్రజా సాహిత్యకారుల కనీస కర్తవ్యం. కధలకు ఉండాల్సిన ఈ సామాజిక ప్రయోజనం కారాగారి చివరి కధల్లో వంద శాతం నెరవేరిందని నిర్ద్వంద్వం గా చెప్పవచ్చు. తమవి కాని జీవితాల్లోకి వెళ్ళి కధను పండించటం అంత చిన్న విషయమేమీ కాదు. రచయితలు డీక్లాసిఫై అవ్వాలని ఆ నాడు విరసం ఇచ్చిన పిలుపును స్వాగతించారు రామారావుగారు.

72 తరువాత ఆయన కధలు రాయటం మానేశారు. (92 లో సంకల్పం కధ రాశారు) ఎందుకు రాయలేదు అన్న ప్రశ్నకు ఒక దగ్గర “వూరికే కధ రాయటం ఎంతసేపు? కానీ ప్రయోజనం ఏమిటి? అని ప్రశ్నించుకొంటే అలవోకగా రాయలేక పోతున్నాను” అన్నారు. పదుల్లో గొప్ప కధలు రాసిన వ్యక్తికి కలం సాగక పోవటానికి చాలా సహేతుకమైన సందిగ్ధత ఇది. ప్రయోజనం లేని బఠానీ కధలు రాయలేక పోవటం వలన, వర్తమాన సమాజంలోని రాజకీయ సంక్లిష్టతను సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవటం వలన .. ప్రజల కోసం నిజాయితీగా రాయాలనుకొన్న రచయితలు అందరూ ఎక్కడో అక్కడ ఆగిపోయే పరిస్థితే సహజమే అయినప్పటికీ ఈ విరామం సుధీర్ఘం. అయితే ఆయన కాలం కంటే కూడా ముందుకు వెళ్ళి తన చుట్టూ ఆవహించిన సమాజాన్ని అంచనా వేయగలిగారు అనిపిస్తుంది. చూసిన సంఘటనల నుండి తనకు గల స్థిరమైన ప్రాపంచిక దృక్పధం వలన కలిగే చైతన్యం.. ఆ చైతన్యం అంతస్సారంగా స్రవించిన కధలివి. పాత్రల నమూనాల్లోనూ, సంఘటనల్లోనూ, ఆలోచనా రీతుల్లోనూ, వైరుధ్యాల్లోనూ, ఘర్షణలలోనూ ఆయన కలం ఇప్పటి పరిస్థితులకు సారూప్యత ఉన్న సృజనను అందించింది. అది ఆనాటి తరానికే కాదు, ఈ తరం చదువరుల వ్యక్తిత్వ నిర్మాణానికి కూడా రక్తమాంసాలు ఇచ్చిందని అనటానికి ఏ మాత్రం సందేహించనవసరం లేదు. తరువాత ఇంకొన్ని తరాల రచనల మీద ఈయన ముద్ర గాఢంగా పడింది.”

వక్త వివిన మూర్తి గురించి:


ఫోటో: ఈమాట సౌజన్యం


ఆయన గొప్ప రచయిత, సాహిత్య విమర్శకుడు. వివిన మూర్తి పూర్తి పేరు వోలేటి వెంకట నరసింహమూర్తి. ఆయన కధా జీవితం మొదలు కావడం వెనక ఆసక్తికరమయిన ఉదంతాన్ని ఒక చోట దాసరి అమరేంద్ర ఇలా రాశారు.

“1970ల తొలి సంవత్సరాలలో అటు పద్యాలు ఇటు కథలూ రాయడం కొనసాగించారు మూర్తి, కానీ ప్రచురణకు ప్రయత్నాలు చెయ్యలేదు. రాత వైఫల్య చిహ్నమన్న భావన ఒక పక్కన, ప్రచురణ అన్నది నా వంటి పల్లెటూరి మనిషికి చెందదన్న భావన మరోపక్కన – మొత్తానికి ఆయన ప్రచురణ గురించి పట్టించుకోలేదు. 1975లో ఆయన ఒకే ఒక వారపు వ్యవధిలో రాసిన తొమ్మిది ఋక్కుల కథలు సహచరి రామలక్ష్మి కంటబడగా ఆమె అందులోని ‘రొట్టెముక్క’ కథను ప్రచురణకు పంపారు. 1975లో ప్రచురితమైన ఆ కథ పాఠకుల దృష్టికి వెళ్లింది.”అందువల్ల వివిన మూర్తి కథా జీవితానికి అయిదు దశాబ్దాల చరిత్ర ఉంది. ఆయన ఇప్పటిదాకా వాల్‌ పేపర్‌, ప్రవాహం, దిశ, తీర్థపురాళ్లు, జగన్నాటకం, కథా ప్రహేళిక అన్న ఆరు కథాసంపుటాలు ప్రచురించారు.


Read More
Next Story