లెనిన్ నేడు లేడు.. జనంలో ఉన్నాడు చూడు..
రష్యా విప్లవకారుడు వ్లాదిమిర్ ఇలిచ్ లెనిన్ గురించి రాసిన కవిత.
ఇదే అదను లెనిన్ కథను
రచించెదను నేను
లెనిన్ బ్రతుకు జనం కొరకు
ధ్వనించెదను నేడు
మనోవేదన నాలోన
నశించెనని కాదు
విశాలమగు విషాద గుహ
వసించితిని నేడు
లెనిన్ కథాక్రమం సదా
జపించితిని నేను
విషాదాశ్రు తుషారాల
నిషా నాకు లేదు
లెనిన్ నేడు లేడూ? చూడు
జనంలో ఉన్నాడు
లెనిన్ వేడి లెనిన్ వాడి
జగం నాడి, ధమని
లెనిన్ శాంతి లెనిన్ కాంతి
లెనిన్ మనకు ద్యుమణి
కామ్రేడ్ లెనిన్ ఛత్రం, ప్రేమ
సామ్రాజ్యానికి చిహ్నం
కామ్రేడ్ లెనిన్ క్షాత్రం శాత్రవ
దుర్మార్గాల లవిత్రం
లెనిన్ పరాకాష్ట లెనిన్
లెనిన్ మన పరాక్రమం
కామ్రేడ్ లెనిన్ ఆయుధం
మన ఆసరా, మన జ్ఞానం
లెనిన్ దృష్టి లెనిన్ సృష్టి
లెనిన్ మన విధానం
లెనిన్ లెనిన్ లెనిన్ లెనిన్
లెనిన్ మన ప్రమాణం
లెనిన్ మనం మనం లెనిన్
లెనిన్ మన ప్రయాణం
నీలో నాలో నీతో నాతో
లెనిన్ మన ప్రవాహం
ప్రజలు నౌకలు
పొడినేల అడ్డం కాదు
ఇప్పుడులో జీవిస్తూ మనం
ఈ నౌకను పట్టిన తుప్పును విదిలించి
పడవ చెక్కలకి అంటుకున్న
సున్నపు గుల్లలు డుల్లించి
తుప్పు వదిలించి
తుపానులను జయించి
సూర్యకాంతికి సమీపంగా
దించి లంగరు
నౌకాయాన ప్రయాసం
పెరిగిన గడ్డాల నాచు
సముద్రపు చెత్త
పరిహరించి పరిశుభ్రంగా స్నానం చేద్దాం
లెనిన్లో స్నానం చేసి
పునీతుణ్ణవుతున్నాను ;
విప్లవ సముద్రంలో
ఇంకా ఇంకా దూరానికి
ఈ పడవ నడుపుతున్నాను
అయినా ఏం కవిత్వం ఇది
అమాయక బాలుడు కావ్యం అంటే
భయపడినట్లు
భయపడుతున్నాను ఈ అక్షరాలు లిఖించడానికి
కిరీటధారి లెనిన్
అతనికి సముచితమైనదేనా
ఈ నా కవిత్వం ?
లెనిన్ కి తగ్గ
కవిత్వం ధ్వనించాలంటే
అనంతాకాశాన్ని చుంబించే
అతని కిరీటాన్ని తాకాలంటే
ఈ నాశక్తిలేని వాక్కులు
ఆ మానవుణ్ణి అర్ధం చేసుకోవద్దూ
ఆ ప్రదీప్త విశాల లలాటానికి నా మాటలు
అడ్డుపడే తెరలు కాకూడదు
అధికార లాంఛనాలంటే
అసహ్యం నాకు;
ప్రభుత్వం పురమాయించిందని
పద్యం రాయలేను నేను
లెనిన్ నా కనుపాప
క్షుద్ర కావ్యంతో అవమానిస్తానా?
హృద్రక్తం ఉప్పొంగి రాస్తున్నాను
అంతరాత్మ శాసనాన్ని
అంగీకరిస్తున్నాను.
ఇది నా విధి
ఈ నా ధర్మ నిర్వర్తిస్తున్నాను.
మాస్కో సమస్తం
గడ్డ కట్టిన రాత్రి
గజ గజ వణికింది
గజ్జె కట్టిన ధాత్రి
గణ గణ మ్రోగింది
కారు హారన్ల మ్రోత
విద్యుద్దీపాల కూత
విద్యుద్దీపాల రాత్రి
వెలుతురు జాగారం చేస్తోంది
ఎక్కడనుంచి వచ్చాడు?
ఎవరాయన?
ఏం చేశాడు?
ఏమిటీ జనసమ్మర్దం?
ఎవరికింత మర్యాద?
జ్ఞాపకాల ఖజానాలోంచి
ఒక్కొక్క మాటనే తీస్తున్నాను
గొంతుక మాత్రం పెగలదు
నోటిదాకా వచ్చిన
మాటలు దిగజారుతున్నాయి
స్తంభించిన శబ్ద ప్రపంచం
మాటల ఫ్యాక్టరీ పని చెయ్యదు
అతణ్ణి స్పష్టంగా వర్ణించడానికి
అగపడవేం మాటలు?
వారాని కేడురోజులు మనకి
రోజు కిరవై నాలుగు గంటలు
వాడుకో, మానుకో అంతే :
అంతే జీవితం
హఠాత్తుగా వస్తుంది మృత్యువు
అడక్కుండా తీసుకుపోతుంది
గడియారాన్ని బద్దలు చేసుకొని
కాలం ప్రవహిస్తే
పంచాంగాల ఆవరణ దాటి
కస్లం పరుగెత్తితే
" అహో! అదోశకం " అంటాం :
" ఓహో : అదోయుగం" అంటాం
రత్రిపడగానే నిద్రిస్తాం
పగ లేవో పనులు
నలుపుని తెలుపు చేస్తాం
సోమరితనాన్ని సమర్ధిస్తాం :
కానీ ఒకానొకనాడు మనకోసం
చరిత్ర గమనాన్ని శాసిస్తే
" అడుగో ఒక ప్రవక్త " అంటాం
" చూడరా ఒక ప్రతిభాశాలి " అంటాం
మనం పెద్ద పరుగులకు పోము
పిలవనిదే కదలం
పెళ్ళాలని ప్రేమిస్తాం
స్తబ్దుగా జీవిస్తాం
శరీరం ఆత్మా ఒక్క లయకు
స్పందించే మహానుభావుడు వస్తే
" క్షత్రవర్చస్వి " అంటాం ;
" దైవ ప్రసాది " అంటాం ;
" వాడెపో మగవా " డంటాం ;
" వాడొకో మొనగా " డంటాం :
అది మామూలు పద్దతి
తెలివీ కాదు మూర్ఖం కాదు
అర్ధంలేని మాటలు
మంచులా కరిగిపోయే మాటలు
ఈ నిర్జీవపు గుడ్లలోంచి
భావాలను పొదగలేము
మామూలు ఊహలతో
మహత్వాన్ని కొలవలేము
చేతులూ మెదడూ చాలవు
అతణ్ణి తెలుసుకోవడానికి
ఈ కొలతలతోనా లెనిన్
ఎవరని నిర్ణయించేది !!
మూలం : మయకోవ్ స్కియ్
తెలుగు : శ్రీ శ్రీ