పాఠకుడిని అక్షరాల వెనక పరిగెత్తించే పుస్తకం
x

పాఠకుడిని అక్షరాల వెనక పరిగెత్తించే పుస్తకం

రాఘవ ‘వనపర్తి ఒడిలో’ పుస్తక సమీక్ష


ఈ మధ్య చదివిన పుస్తకాలలో గొప్ప పుస్తకం రాఘవశర్మగారి "వనపర్తి ఒడిలో". కాదు కాదు నా చేత చదివించిన పుస్తకం. పుస్తకం అంతా చదివించే శిల్పము, శైలి, మధురమైన మరపురాని తిరిగిరాని జ్ఞాపకాలు. చేదు,విషగుళికలాంటి ఆనాటి అట్టడుగు ప్రజల జీవితాలను మన కళ్ళకు కట్టి, మన హృదయాన్ని కదిలించి దిగుళ్లలోకి నెట్టిన పుస్తకం. అంతేకాదు మేధావుల, తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర, ఉక్కు ఉద్యమాలను గురించి , రాజకీయ నాయకుల గురించి ఈ పుస్తకం అరచేతిలో అరటిపండులా వివరించింది.

ఎన్నో ప్రాంతాలను, చారిత్రక సంఘటనలను పరిచయం చేసింది. ఎంతమందిని గుర్తు చేసిందో! రజాకార్ల లో పనిచేసే పాన్ డబ్బా నడిపే అక్బర్, రేడియో మెకానిక్ సలాం, రజానగరం సంత మానవ విషాదం, చుట్టూ చేరిన వికృత మనుషుల గుంపు అరుపులు మనసును పిండేస్తాయి. పొట్ట కూటి కోసం జీవితాన్ని హింసించుకుంటున్న మహిళల జీవితాలు, ఆ మహిళకు చేయూతనిచ్చి రక్షించాల్సింది పోయి,చుట్టు చేరి పశువుల్లా కేరింతలతో ఆనందించిన మనుషుల గురించి(ఛీ,ఛీ వీళ్ళని పశువులతో పోల్చకూడదు. పోల్చితే వాటిని అవమానించడమే) హోటల్ నడిపే ఖయ్యూమ్, గౌరమ్మ ఆమె భర్త పాకిస్తాన్ వెళ్లడం (1965 లో భారత్ పాకిస్తాన్ యుద్ధం వలన) వీసాలు పాస్పోర్ట్ లేక పుట్టిన దేశం రాలేక అక్కడే స్థిరపడటం చనిపోవడం. కమ్మరి కృష్ణయ్య, తుకారం జట్కా బండి, పుట్నాల బట్టీలో బుజ్జప్ప, కేశవులు. ఇంట్లో సహాయకరాలు, మంగలి దాయమ్మ, ఆమె కొడుకు తుల్జారాం, రంగాచారి, గుండాచారి, నరసింహాచారి కంఠీరవఆచారి, చెల్లెమ్మ టీచర్ గారు ఇలా ఎందరో ఎందరో వ్యక్తుల జీవితాల గురించి చదివి, పుస్తకం మూసిన తర్వాత కూడా మనల్ని వెంటాడుతుంటారు.

అంతేనా రెండు మతాల స్నేహవారధులు, తరతరాల సామరస్యానికి చెరగని చిహ్నాలైన పీర్ల గుట్ట, తిరుమలయ్య గుట్టల గురించి, జగదీష్, రామాటాకీస్ లగురించి, 1868లో నిర్మించిన పురాతన గుండు బావి(ఈ బావి భలే ఉంది) దాని చరిత్ర, మైసమ్మ దేవాలయం, చెట్ల మధ్యలో బాలాజీ మఠం ఆర్ఎస్ఎస్ శాఖ, వేణుగోపాలస్వామి గుడి బడిగా ఉపయోగపడటం, శాస్త్రి గారి తెలుగు లో క్రికెట్ కామెంట్రీ, భారత్ చైనా యుద్ధం, ప్యాలెస్ లో విన్న గ్రామ ఫోన్ రికార్డులు పిల్ల సైన్యాల ఆటపాటలు. ఒకటేమిటి ప్రతి సంఘటన మన జీవితంలో జరుగుతున్నట్లుగా పండించారు.

ఈ పుస్తకం చదవక ముందు వనపర్తి అంటే విశాఖ వైపు అని, కోటను చూడాలని అనుకునేదాన్ని. అటు కాదని పాలమూరు వైపు అక్కడకు వెళ్ళకుండానే రాఘవశర్మగారు కోటను చూపించారు. రాఘవ శర్మ గారికి, "వనపర్తి ఒడిలో"కి మూలమైన రాణి శంకరమ్మ 1985లో నిర్మించిన ప్యాలెస్ గురించి మాట్లాడుకోకపోతే ఈ సమీక్షకి న్యాయం లేదు.

చివరి సంస్థానాధీశుడు రాజా రామేశ్వరరావు నిజాం నిరంకుశ పాలనలో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా 1946-51 లో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటానికి ఆర్థిక సహాయం అందించిన ఆదర్శవాది. ప్యాలెస్ లో పాలిటెక్నిక్ స్థాపనకు నెహ్రూని ఒప్పించిన, ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు "రామేశ్వరరావు జీతాలు చెల్లించ లేకపోతే" అని మెలిక పెట్టారు. జీతాలు చెల్లించని రోజు ప్యాలెస్ సహా కాలేజీ మొత్తాన్ని పరిహారం లేకుండా ప్రభుత్వానికి అప్పగించేస్తా అని స్వయంగా రాసి, జై తెలంగాణ ఉద్యమం వల్ల జీతాలు చెల్లించలేక, 1970 లో తాను కాంగ్రెస్ ఎంపీ,కోర్టు లో వేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ప్యాలెస్ తో సహా కాలేజీ మొత్తాన్ని ప్రభుత్వానికి అప్పగించాడు. అలా రాసి ఇవ్వడం భలే అనిపించింది.

ప్యాలెస్ లన్ని ప్రజల ఆస్తులే. కానీ ఎంతమంది సంస్థానాధీశులు పరిహారం లేకుండా అప్పగించారు? 1959 అక్టోబర్ 11వ తేదీన నాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు 149 కిలోమీటర్లు నాలుగు గంటలు కంకర దుమ్ము ధూళిలో ప్రయాణించి ప్యాలెస్ లో "కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కాలేజి" ని ప్రారంభించారు. అయితే దీనిలో ఉద్యోగులు విద్యార్థులు అందరూ ఆంధ్ర రాయలసీమ ప్రాంతం వారే. ఎక్కువమంది ఆచారులే. తెలంగాణకు బంట్రోతు,స్వీపర్ ఉద్యోగాలే.

వనపర్తి ప్యాలెస్ రాజరికానికి చిహ్నం అయితే వనపర్తి కోట్నీస్ డాక్టర్ బాలకృష్ణయ్య ప్రజా పక్షానికి చిహ్నం. కమ్యూనిస్టుగా, ప్రజల డాక్టర్ గా ఉన్న బాలకృష్ణయ్య గారికి ఇద్దరు భార్యలు, 16 మంది సంతానం ఉండటం. ముక్కుపచ్చలారని పిల్లలను ఎన్కౌంటర్ల పేరుతో చంపుతున్నప్పుడు మాట్లాడకపోవడం అస్సలు నచ్చలేదు.

చెన్నారెడ్డి నాయకత్వంలో జై తెలంగాణ ఉద్యమం మొదలయ్యి గుంటూరు గో బ్యాక్, గోంగూర గో బ్యాక్, పుంటి కూర జిందాబాద్, గోంగూర ఆవకాయ గో బ్యాక్ లాంటి నినాదాలు తెలంగాణ ప్రజల ఆవేదన ఆత్మాభిమానం నుంచి వచ్చినవే. ఈ ఉద్యమంలో 400 మంది పైగా ఆహుతి అయ్యారు. "జై ఆంధ్ర" ఉద్యమంలో మరి కొంతమంది, విశాఖ ఉక్కు ఉద్యమం ఇంకొంతమంది. అన్ని ఉద్యమాలు గాడిద తప్పినవి. ఈ ఉద్యమాలన్నిట్లోనూ పాలిటెక్నిక్ విద్యార్థుల పాత్ర మరువలేనిది.

రాఘవశర్మ గారు వాళ్ళ అమ్మ గురించి చెబుతూ మన అమ్మలంతా శాస్త్రవేత్తలు. మన అమ్మలు అమ్మమ్మలు బామ్మలు అవ్వలు స్త్రీమూర్తులైన వారి పూర్వీకులంతా శాస్త్రవేత్తలే. వేలాది సంవత్సరాలుగా వారి ప్రయోగాల ఫలితమే మనం ఈరోజు తింటున్న రుచికరమైన ఆహారం అని రాఘవ శర్మ గారు స్త్రీల వైపు నిలబడి అద్భుతంగా చెప్పారు.

ఈ పుస్తకం నిండా ఇలాంటివి చాలా ఉన్నాయి. అద్భుతమైనపదాలు, వేయిన్ లో మిషన్ గన్ రెయిన్ లాంటి వాక్య ప్రయోగాలు ఎన్నో! దుర్గాబాయి వాళ్ళ అమ్మకు చదువు చెప్పినట్లుగా రాఘవశర్మగారు సైకిల్ నేర్చుకున్నాక చూసి వాళ్ళ నాన్న సైకిల్ నేర్చుకున్నాడట.

హరగోపాల్ గారు అన్నట్లు రాఘవ శర్మ గారి పేరు వెనుక మన పేరు పెట్టుకుంటూ పోతే ఇది మన బాల్య జ్ఞాపకాలే అవుతాయి. చెట్లెక్కడం, ఇంకు పిల్లర్,కపిల తోలడం, ఆ బావుల దగ్గరకు వెళ్ళగానే దూరంగా నడుస్తూ కాదు పరిగెత్తడం. మా ఊర్లో ఉన్న నాలుగు ఊరబావులు,మా ఊరి నాయుడు చెరువు కట్టపై ఉన్న మూడు పెద్ద బావులు అన్ని గుర్తుకొస్తున్నాయి. చిన్నప్పటి మాయని మచ్చలు తడిమి చూసుకోవడం, కోతికొమ్మచ్చి, బిల్లంగోడు, చావుతప్పిన నా ఈత సరదా, మా నాన్న అట్లాస్ సైకిల్.ఎవరన్నా అడుగుతారని దాన్ని గేదెలపాకులో దాయటం. హరికథలు బుర్రకథలు తోలుబొమ్మలాటలు ఇప్పుడు జరుగుతున్నట్లుగా గుర్తుకొస్తున్నాయి.

"ట్రెండింగ్ తెలుగు న్యూస్ డాట్ కామ్"లో "వనపర్తి ఒడిలో" భాగాలుగా వస్తున్నప్పుడు సరిహద్దులు దాటి వచ్చిన స్పందనలు, ఆ వ్యక్తులకు సంబంధించిన వారు తమ వారందరినీ గుర్తు చేసుకోవడం, ఒకరితో మరొకరు మాట్లాడుకోవడాలు, హరగోపాల్, వకుళాభరణం రామకృష్ణ గారి ముందుమాటలు, యం. రాఘవాచారి గారి వెనుక మాటలు ఈ పుస్తకానికి వన్నె తెచ్చాయి.

వనపర్తి ప్యాలెస్ లేకపోతే రాఘవశర్మ గారికి ఇంత అందమైన సాహసమైన జీవితం ఉండేది కాదేమో? రాఘవశర్మ గారు ఇంత అద్భుతంగా రాయకపోతే వనపర్తి కోటకు ఇంత అద్భుతమైన అందం ఉండేది కాదేమో? మన అందరికీ ఈ కోట గురించి, ఆనాటి చరిత్ర గురించి తెలిసేది కాదేమో? రెండు ఒకదానితో ఒకటి అల్లుకుపోయి మనల్ని అక్షరాల వెంట పరిగెత్తిస్తాయి. పరిగెత్తి మళ్లీ వెనక్కి వచ్చి దానికి సంబంధించిన ఫోటోలను అణువణువు మన కళ్ళు పరిశోధిస్తాయి. రాఘవ శర్మగారు ఇన్ని పాత ఫోటోలన్నింటినీ ఎలా సేకరించారు ఆశ్చర్యంగా ఉంది. దాదాపు 80 ఏళ్ల చరిత్రని, పేర్లను సంఘటనను గుర్తించుకొని రాయడం మామూలు విషయం కాదు. పుస్తకం కూడా అందంగా అద్భుతంగా 151 పేజీలతో 150 రూపాయలతో అందరికీ అందుబాటులో ఉంది. ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా చదువుతారు కదూ! పుస్తకం ఓ సారి చేతిలోకి తీసుకోండి. పుస్తకమే మిమ్మల్ని చదివిస్తోంది.

Read More
Next Story