సంక్షేమ పథకాలు మాత్రమే చాలవు, ప్రజలకు స్వేచ్ఛ కూడా కావాలి
x

సంక్షేమ పథకాలు మాత్రమే చాలవు, ప్రజలకు స్వేచ్ఛ కూడా కావాలి

కన్నెగంటి రవి విశ్లేషణ: ఎన్నికల ప్రక్రియలో తెలుగు రాష్ట్రాలు మెల్లమెల్లగా బహుళ పార్టీలు పోటీ పడే పద్ధతి నుండీ రెండు కూటములు పోటీపడే వ్యవస్థగా మారిపోతున్నాయి.


భారత ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో తెలుగు రాష్ట్రాలు మెల్లమెల్లగా బహుళ పార్టీలు పోటీ పడే పద్ధతి నుండీ రెండు కూటములు పోటీపడే వ్యవస్థగా మారిపోతున్నాయి. కూటముల బయట ఉండే రాజకీయ పార్టీలు క్రమంగా ఉనికిని కోల్పోతున్నాయి. 2023 నవంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 2024 మే లో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.

ముఖ్యంగా ఈసారి జరిగిన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, వాటి ఫలితాలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు సరైన జవాబులు వెతుక్కుంటేనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ పరిణామాలను అర్థం చేసుకోవడం తేలిక అవుతుంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్ పేరుతో రెండు రాష్ట్రాలుగా విభజనకు గురయ్యాక, 2014-2019 మధ్య ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కు అవకాశం ఇచ్చిన ప్రజలు, 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 175 స్థానాలలో ఆయనకు కేవలం 23 స్థానాలు మాత్రమే ఇచ్చి, 151 స్థానాలతో జగన్ కు పట్టం కట్టారు. కానీ ఐదేళ్లు తిరిగే సరికి ఈ సారి జగన్ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే ఇచ్చి , టిడిపి , జనసేన , బీజేపీ కూటమికి 164 స్థానాలను కట్టబెట్టారు.

నిజానికి, ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు కొత్త మొహం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో మొదటి సారి NT రామారావు ప్రభుత్వాన్ని కూల్చి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినా, 1999-2004 మధ్య రెండోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి, ఆయన అనుసరించిన ఆర్ధిక విధానాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి గా కాకుండా, రాష్ట్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా తనను తాను అభివర్ణించుకున్న విధానం ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు సుపరిచితమే.

అ కాలంలో ప్రపంచ బ్యాంకు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేసిన ముఖ్యమంత్రిగా, అంగన్‌వాడీ ఉద్యోగులు సహా, తమ హక్కుల కోసం ఉద్యమాలు చేసిన ప్రజలపై తీవ్ర నిర్బంధాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రిగా, రాష్ట్రంలో అత్యధిక ఎన్కౌంటర్లు సాగించిన ముఖ్యమంత్రిగా, ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆల్విన్ కంపెనీని మూసేసి, నిజాం షుగర్స్‌ను మూసేసి, స్కూల్స్ లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా, విద్యా వాలంటీర్ పేరుతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రభుత్వ కార్యాలయాలలో ఖాళీలను భర్తీ చేయకుండా, కాంట్రాక్ట్ వ్యవస్థను పెంచి పోషించి, విద్యుత్ ఛార్జీలు పెంచి, ట్రాన్స్ కో , డిస్కం లను ప్రైవేట్ పరం చేయాలని ఉద్దేశించి,ఆయన ముందుకు తెచ్చిన విద్యుత్ రంగ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ఆ పోరాటాలపై ఆయన ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో ముగ్గురు యువకులు చనిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సాగించిన ప్రజా వ్యతిరేక పాలన ఫలితంగానే, 2004, 2009 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన వరుసగా రెండు సార్లు ఓడిపోయారు.

కానీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 లో ప్రజలు గతంలో ముఖ్యమంత్రిగా ఆయనకున్న అనుభవాన్ని విశ్వసించి, ఇచ్చిన విజయంతో, మూడవసారి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టినా, ఐదేళ్ల లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. కొత్త రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి నమూనా తయారీలో ఆయన చేసిన తప్పులు, రాజధాని పేరుతో అమరావతి చుట్టూ మాత్రమే ఆయన చేసిన విన్యాసాలు, జన్మ భూమి కమిటీల పేరుతో ఆయన తన స్వంత పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన ప్రాధాన్యత, వాటి పని తీరు చంద్రబాబు పట్ల ప్రజలలో అసంతృప్తి పెంచాయనడంలో సందేహం లేదు.

అందుకే 2019 లో ఆంధ్ర పదేశ్ ప్రజలు జగన్ కు రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు అప్పగించారు. నవ రత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలను ఆయన ప్రారంభించారు. ఈ పథకాల క్రింద పేద, మధ్య తరగతి కుటుంబాల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా నగదు బదిలీ చేసే పద్ధతిని ఆయన అమలు చేశారు. గత అయిదేళ్లలో 4.2 l లక్షల కోట్లకు పైగా నిధులను సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టినట్లు ఆయన ప్రభుత్వం చెప్పుకున్నది. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల పేరుతో పాలనను ప్రజల ముంగిట్లోకి తీసుకు వచ్చారు.

అమ్మ ఓడి, విద్యా దీవెన పథకాలు, ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన సహా , ప్రభుత్వ రంగంలో ప్రాధమిక,హైస్కూల్ విద్యను బలోపేతం చేయడానికి కొన్ని చర్యలు చేపట్టారు. ప్రీమియం భారం రైతులపై వేయకుండా , పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నెలవారీ పెన్షన్ మొత్తాలను క్రమంగా పెంచుతూ మొదటి తారీఖునే లబ్ధి దారులకు అందేలా చూశారు. ఇవన్నీ తప్పకుండా పేద కుటుంబాలకు మేలు చేసే పథకాలే. మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళల చేతుల్లోకి రాష్ట్ర బడ్జెట్ నుండీ కొన్నయినా, అదనపు నిధులు ప్రవహించాయి. సంక్షేమ పథకాల అమలులో దీనిని కొత్త ధోరణిగా చెప్పవచ్చు. అయినా 2024 ఎన్నికలో ప్రజలు YSRCP పార్టీని ఓడించారు. కారణమేమిటి ?

దీనికి జవాబు, ఎన్నికలలో ఓటమి తరువాత ముఖ్యమంత్రి జగన్ మీడియా ముందు మాట్లాడిన విషయాలలో దొరుకుతుంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులైన కుటుంబాల సంఖ్యలు ప్రస్తావిస్తూ ఆయన పడిన ఆవేదన , ప్రజల పట్ల ఆయన ధోరణికి అద్దం పట్టింది. సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రజలను, తనకు ఓట్లు వేసే ఓటర్లుగా ఆయన లెక్క వేసుకున్నాడు.

తన మిగిలిన పరిపాలన ఎలా ఉన్నా, ఇతర వర్గాల ప్రజలు అసంతృప్తి చెందినా, సంక్షేమ పథకాల లబ్ధిదారులు మాత్రం తప్పకుండా తనకే ఓట్లు వేస్తారని నమ్ముకున్నాడు. తన పార్టీ MLA లు, నాయకులు ప్రజలతో ఎంత అమానవీయంగా, అమర్యాదగా, దౌర్జన్యంగా వ్యవహరించినా, వారిని క్షమించి, సంక్షేమ పథకాల నిధులకు బటన్ నొక్కిన తననే ప్రజలు గుర్తుంచుకుని ఓట్లేస్తారని ఆయన భావించారు. నగదు బదిలీ పథకాలు అమలు చేస్తే సరిపోతుంది, మిగిలిన రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు,, ఉపాధి పెంపు కార్యక్రమాలు చేపట్టకపోయినా సరిపోతుంది అనుకున్నారు.

సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు అలా ఆలోచించరు. ప్రజా పక్ష పాతులు ఎవరూ కూడా జగన్ లాగా ఆలోచించరు. సంక్షేమ పథకాల నిధులన్నీ, ప్రభుత్వ ఖజానా నుండే వస్తున్నాయనీ, ఎవరూ తమ జేబు నుండీ , అధికార పార్టీ కార్యాలయం నుండీ ఇవ్వడం లేదనీ, సంక్షేమ పథకాలపై తమకు హక్కు ఉందనీ ప్రజలు భావిస్తారు. సంక్షేమ పథకాలంటే, ఉచితంగా డబ్బులు పంచే పథకాలుగా చూసి వ్యతిరేకించే వాళ్ళ గురించి, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ, సంక్షేమ పథకాల లబ్ధిదారులను కేవలం ఓటర్లుగా భావించే ప్రభుత్వాల గురించి సీరియస్ గా పట్టించుకోవాలి. విమర్శించాలి. సంక్షేమ పథకాల విషయంలో జగన్ లాంటి ధోరణి చాలా మంది నాయకులకు ఉంది. చాలా రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు ఉంది. ఇది ఎంత మాత్రమూ ప్రజాస్వామిక స్వభావం కాదు. రాజరిక లక్షణం.

ప్రజలు స్వతహాగా స్వేచ్ఛను కోరుకుంటారు. తమ పట్ల అందరూ మర్యాదగా వ్యవహరించాలని కోరుకుంటారు. తాము పేద వాళ్ళం కావచ్చు కానీ, బిచ్చగాళ్ళం కాదని భావిస్తారు. ఎన్నికలలో హామీ ఇచ్చినవి, రాజ్యాంగ పరంగా, చట్ట పరంగా హక్కుగా తమకు రావలసినవి ప్రభుత్వాలు మంజూరు చేయాలి తప్ప, వాటిని తామేదో దయతో అందిస్తున్నట్లుగా పాలకులు ఫోజులు పెట్టకూడదని కోరుకుంటారు.

నిజానికి చంద్రబాబు ఆలోచనా విధానం పేద ప్రజలకు అందించే ఉచిత పథకాలకు, సబ్సిడీ పథకాలకు వ్యతిరేకమైనది. ఆయన గత ఆలోచనల ప్రకారం- వ్యవసాయం కంటే, ఆధునిక పెట్టుబడిదారీ విధానం ప్రజలకు ఉపాధి కల్పిస్తుందని ఆయన నమ్ముతారు. ప్రభుత్వ రంగం కంటే, ప్రైవేట్ రంగం సమర్ధంగా పని చేస్తుందని ఆయన భావన. కంప్యూటర్ సైన్స్ ఉంటే చాలు, ఇక ఏ సామాజిక శాస్త్రం అక్కర లేదని ఆయన విశ్వాసం. ఆయన గత మూడు సార్లు ముఖ్యమంత్రిగా అలాగే వాదించారు. ప్రకటించారు . అమలు చేశారు.

గతంలో ఆయన హయాంలో హైదరాబాద్ హైటెక్ సిటీ కి ఇచ్చిన ప్రాధాన్యత, అందులో ఉపాధి పొందిన కొంతమంది ఆధిపత్య కులాల, మధ్యతరగతి, ఉన్నత తరగతి యువతీ యువకుల భావాలు, ఆయన పట్ల భక్తి ధోరణి , మనకు బహిరంగంగా కనిపిస్తుంటాయి కానీ, మిగిలిన అన్ని ఉపాధి రంగాలూ దెబ్బ తిన్న విషయం లోతు గా పరిశీలించిన వారికి అర్థమవుతుంది. రాజధాని నగరం పేరుతో లక్ష ఎకరాల సాగు భూములను ఆయన రియల్ ఎస్టేట్ గా మళ్లించిన పద్ధతి ,ఆయన ఆలోచనా ధోరణికి నిదర్శనం. కానీ ప్రజలు అటువంటి ఆలోచనలు కలిగిన చంద్రబాబుకే ఓట్లు వేసి మళ్ళీ గెలిపించడం , ఆ రాష్ట్ర ప్రజలకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడాన్ని కూడా సూచిస్తుంది.

కానీ గత 20 ఏళ్లలో ఆయనలో వచ్చిన మార్పు ఏమిటంటే, గతంలో తాను తప్పు పట్టిన సంక్షేమ పథకాలను ఇప్పుడు టీడీపీ మానిఫెస్టోలో పెట్టి ప్రచారం చేయడం, జగన్ అమలు చేస్తున్న పథకాలకు డబ్బుల రూపంలో మరింత పెంచి, పథకాలను ప్రకటించడం. అలాగే గత ప్రభుత్వ కాలంలో మొదలైన గ్రామ, వార్డు సచివాలయాలను కొనసాగిస్తామని ప్రకటించడం. ఇది మంచి లక్షణమే. తప్పక ప్రజలకు ఉపయోగపడే అంశమే.

గత కాలపు విషయాలను కూడా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం చేపట్టబోయే వ్యక్తులు, పార్టీలు , తమ పాత తప్పులను పునరావృతం చేయకుండా చూసుకోవాలి. తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. రాష్ట్రంలో భూమి లాంటి సహజ వనరులను జాగ్రత్తగా వాడుకోవాలి. గ్రామ సచివాలయం లాంటి స్థానిక సంస్థలను బలోపేతం చేసి ప్రజలకు సేవలు అందించాలి. విశాఖ ఉక్కు లాంటి ప్రభుత్వ రంగ సంస్థల ను కాపాడుకోవాలి. పోలవరం లో ముంపుకు గురి అవుతున్న ఆదివాసీలను కాపాడుకోవాలి. రాష్ట్రంలో కౌలు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలి. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలి.

Read More
Next Story