ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటే ఎవరు? ఆయన అధికారాలేంటి?
x

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటే ఎవరు? ఆయన అధికారాలేంటి?

ఆపద్ధర్మ ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో మనం తరచుగా వినే మాట ఇది. అసలు ఆపద్ధర్మ ప్రభుత్వం అంటే? దాని బాధ్యతలు ఏంటి? ఆపద్ధర్మ ప్రభుత్వం గురించి రాజ్యాంగం ఏమంటుంది?


ఆపద్ధర్మ ముఖ్యమంత్రి.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మనం తరచుగా వినే మాట ఇది. కానీ అసలు ఈ ఆపద్ధర్మ సీఎం అంటే ఎవరు? వాళ్ల బాధ్యతలు ఏంటి? అనే విషయం చాలా మందికి తెలియదు. ఆపద్ధర్మ సీఎం అంటే సీఎం రాజీనామా చేసిన సందర్భంగా ఆ బాధ్యతలను స్వీకరించి వ్యక్తి అని చాలా మంది భావిస్తున్నాంటారు. అది కూడా వాస్తవమే అయినా.. రాజ్యాంగం ప్రకారం మాత్రం ఆపద్ధర్మ సీఎం ఎంపిక జరిగే సమయం వేరే ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న లోక్‌సభ లేదా శాసనసభ కాల పరిమితి ముగియక ముందే రద్దు అయితే ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు శాంతి భద్రతలను, అన్ని శాఖల పనితీరును పర్యవేక్షిస్తుంటూ కావాల్సిన చర్యలు తీసుకునే వ్యక్తినే ఆపద్ధర్మ సీఎం, ఆపద్ధర్మ పీఎం అంటారు.

పాలనాపరంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సభలు రద్దయిన తర్వాత అప్పటి వరకు ఉన్న ప్రధాన లేదా సీఎం.. ఆపద్ధర్మ కర్తలుగా కొనసాగుతారు. ఈ మేరకు వారికి కేంద్ర స్థాయిలో రాష్ట్రపతి, రాష్ట్ర స్థాయిలో గవర్నర్ విజ్ఞప్తి చేస్తారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎంపిక పూర్తయిన తర్వాత అప్పటి వరకు మంత్రులుగా చలామణి అయిన వారు తమతమ పదవుల్లోనే కొనసాగుతూ కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తమ పదవుల నుంచి తప్పుకుంటారు. ఒకవేళ పీఎం లేదా సీఎం.. ఆపద్ధర్మ కర్త బాధ్యతలు తీసుకోలేని స్థితిలో ఉంటే ఆ బాధ్యతలను కేంద్రస్థాయిలో రాష్ట్రపతి, రాష్ట్ర స్థాయిలో గవర్నర్ చేపడతారు. కొన్ని సందర్భాల్లో వారు సమర్థులైన ఇతర వ్యక్తులను కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది. అదే విధంగా సభలు రద్దయిన సమయంలో కొనసాగే ప్రభుత్వాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వం అని పిలుస్తారు.

రాజ్యాంగంలో లేని ఆపద్ధర్మ కర్త

దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం, ఆపద్ధర్మ పీఎం, ఆపద్ధర్మ సీఎం అనే కాన్సెప్ట్ అసలు మన రాజ్యాంగంలోనే లేదన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఈ అంశాల గురించి భారతదేశ రాజ్యాంగంలో ప్రస్తావన కూడా లేదు. వీటితో పాటు ఉప ముఖ్యమంత్రి, ఉప ప్రధాన మంత్రి వంటి పదవులను కూడా మన రాజ్యాంగం ప్రస్తావించలేదు. ఈ విషయం మేము చెప్తున్నది కాదు. న్యాయనిపుణులు చెప్తున్నది. ఇది మన రాజ్యాంగంలో లేకపోయినప్పటికి ఆపద్ధర్మ ప్రభుత్వం అనేది ఒక సాంప్రదాయంలో వస్తుందని వారు వివరించారు.

ఆ అధికారం లేదు

ఆపద్ధర్మ పీఎం లేదా సీఎంగా కొనసాగుతున్న వారికి ప్రత్యేక అధికారాలు ఏమీ ఉండవు. పైగా ఉన్న అధికారాల్లో కూడా చాలా వరకు మినహాయించబడతాయి. అసాధారణ, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వారు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సాధారణంగా వారు విధానపరమైన నిర్ణయాలు ఏవీ తీసుకోలేరు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలను అసలే తీసుకోకూడదు. రోజువారీ వ్యవహారాలు, కార్యకాలాపాలకు సంబంధించి మాత్రమే నిర్ణయాలు తీసుకునే అధికారం వారికి ఉంటుంది. బడ్జెట్ తయారీ, ఆర్డినెన్స్‌ల తయారీ, పన్నుల తగ్గింపు, పెంపు, ప్రాజెక్ట్‌ల ప్రకటన, నామినేటెడ్ పదవుల భర్తీ, ఉన్నతాధికారుల బదిలీ వంటి ఏ నిర్ణయం వారి చేతుల్లో ఉండదు. వీటికి సంబంధించిన అన్ని నిర్ణయాలను కొత్తగా ఏర్పడే ప్రభుత్వమే తీసుకుంటుంది. ఒకవేళ ఆపద్ధర్మ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందులో న్యాయస్థానలు జోక్యం చేసుకోవచ్చు. ఇటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి.

మరోమాటలో చెప్పాలంటే.. ఆపద్ధర్మ సీఎం, ప్రభుత్వం అనేది స్కూల్స్‌లో టీచర్ బయటకు వెళ్తూ క్లాస్‌కు ఒక మానిటర్‌ను నియమించే మానిటర్ పోస్ట్ వంటిది. వారు క్లాస్‌ను సవ్యంగా ఉండేలా చూసుకునే బాధ్యత కలిగి ఉన్నా.. ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోలేరు. కేవలం ఎవరూ గొడవ చేయకుండా మాత్రమే చూసుకోగలరు. ఆపద్ధర్మ ప్రభుత్వం కూడా ఒకవిధంగా అలానే పనిచేస్తుంది. పేరుకు ఆపద్ధర్మ ప్రభుత్వమే అయినా ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఈ ప్రభుత్వానికి ఉండదు.

తొలిసారి ఎప్పుడంటే..

ఆపద్ధర్మ ప్రభుత్వ ప్రస్తావన మన దేశంలో తొలిసారి 1975లో జరిగింది. 1974లో డాక్టర్ జయప్రకాష్ నారాయణ.. ఎన్నికల సంస్కరణలపై జస్టిస్ వీఎం తర్కుండే నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 1975లో తొలిసారి ఆపద్ధర్మ ప్రభుత్వం అనే కాన్సెప్ట్‌ను ప్రస్తావించింది. ఎన్నికల సమయంలో ఉండే ప్రభుత్వం కేవలం ఆపద్ధర్మ ప్రభుత్వంగానే బాధ్యతలు నిర్వర్తించేలా చూడాల్సిన అవసరం ఉందంటూ ఈ కమిటీ సిఫార్సు చేసింది. ఆ తర్వాత 1989లో అప్పటి న్యాయశాఖ మంత్రి దినేష్ గోస్వామి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ.. ఆపద్ధర్మ ప్రభుత్వం విషయంలో తర్కకుండే కమిటీ సిఫార్సును వ్యతిరేకించింది.

తొలి ఆపద్ధర్మ ప్రభుత్వం ఆయనదే

మన దేశంలో తొలిసారి 1979లో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటయింది. అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఈ మేరకు తొలి అధికారిక ప్రకటన చేశారు. ఆ ప్రకటనలోనే ఆపద్ధర్మ ప్రభుత్వం కొత్త విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అప్పటి ప్రధాని చరణ్ సింగ్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని, దీనిపై రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేదని అన్నారు. ఆ తర్వాతే ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఆర్థిక సహాయం, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ హోదా వంటి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

1991లో ఆనాటి ప్రధాని చంద్రశేఖర్ కూడా ఇదే విధంగా న్యాయవ్యవస్థలో పలు బదిలీలు చేపట్టారు. ఈ బదిలీలపై అప్పటి ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తి చేసింది. కానీ ఎన్నికల సంఘాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అప్పటి పార్లమెంటు చివరి రోజున ఎంపీలకు పెన్షన్ జారీ విషయంలో తీసుకొచ్చిన బిల్లు తీవ్ర వివాదంగా మారింది. ఈ బిల్లును నాటి రాష్ట్రపతి వెంకటరామన్ కూడా ఆమోదించలేదు.

1997లోని ఐకే గుజ్రాల్ నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం అయితే ఏకంగా గవర్నర్ల నియామకాలనే చేపట్టింది. పంజాబ్‌లో రూ.కోట్ల రుణాలను మాఫీ చేసింది. వాజ్‌పేయ్ నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయాలనే తీసుకుంది. రాష్ట్రపతి అభిప్రాయాలతో కూడా వాజ్‌పేయ్ ప్రభుత్వం విభేదించింది.

Read More
Next Story